(ఇఫ్టూప్రసాద్-పిపి,ఢిల్లీ హర్యానా సింఘు సరిహద్దు నుంచి)
దేశంలో ఫాసిజం నానాటికీ వేళ్లూనుకునే వేళ, బ్రూట్ మెజార్టీతో విశృంఖల రీతిలో పార్లమెంటు ద్వారా ఫాసిస్టు చట్టాలు చేస్తున్న వేళ, అడపా దడపా తలెత్తే ప్రజాతంత్ర ఉద్యమాల్ని ఉక్కుపాదం తో క్రూరంగా అణిచివేస్తున్న వేళ, ఉద్యమ శక్తుల్ని నిరంకుశ నల్ల చట్టాల క్రింద నిరవధికంగా జైళ్లల్లో కుక్కుతున్న వేళ, ఎడారిలో ఒయాసిస్సు వలే తలెత్తిన తాజా ఢిల్లీ రైతాంగ ముట్టడికి నేటికి (16-12-2020కి) 21 వ రోజు. ఈరోజు ఈ ముట్టడి ప్రాంతం హర్యానా పానిపట్ సమీపంలో జాతీయ రహదారి నెంబ 44 మీద ఉన్న సింఘు (Singhu)నేల మీద అడుగు పెట్టడం మాకు గర్వంగా ఉంది.
అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరపున సుధాకర్, కృష్ణమూర్తి లతో పాటు AP సీపీఐ ఎం.ఎల్. న్యూ డేమోక్రసీ రాష్ట్ర కమిటీ తరపున నేను కలిసి మొత్తం ముగ్గురం ఐదు రోజుల పర్యటనకు సిద్ధపడి ఢిల్లీ వచ్చాము. ఐదు నిన్న రాత్రి ట్రైన్ లో దిగి ఢిల్లీ పార్టీ నేతలు సాయంతో గతరాత్రి ఢిల్లీలో బస చేసాం. గత 10 రోజుల నుండి ఈ రైతాంగ ఉద్యమ ప్రాంతంలో ఉంటున్న తెలంగాణ రాష్ట్ర AIKMS ఉపాధ్యక్షులు రాయల చంద్ర శేఖర్ సాయం తో ఈరోజు ఉదయం 10 గంటలకు సింఘు బోర్డర్ వద్ద రైతాంగ పోరాట ప్రాంతంలోకి అడుగు పెట్టాం.
సరిగ్గా ఎనిమిదేండ్ల కృతం ఇదే రోజు నిర్భయ సంఘటన జరిగింది. అది పౌర ప్రతిఘటనకు ఒక ప్రతీకగా నిలిచింది. తిరిగి ఏడాది క్రితం కూడా ఇదే రోజు పౌరసత్వ చట్టం పై ఢిల్లీ లో జామియా ఇస్లామీయా విశ్వవిద్యాలయం విద్యార్థి ప్రతిఘటన జరిగింది. అది కూడా ప్రతిఘటనకు ఒక ప్రతీకగా నిలిచింది. వర్తమాన భారతదేశ చరిత్రలో ఇలా ప్రతిఘటనలకు ఒక ప్రతీకగా పేరొందిన డిసెంబర్ 16 వ తేదీనే మేము ఈ పోరాట ప్రాంత సందర్శన చేయడం మాకు మరింత గర్వాంగా ఉంది. మళ్లీ కలుద్దాం.