జిహెచ్ ఎంసి ఎన్నికల్లో తెలంగాణ నిరుద్యోగాలు యాక్టివ్ గా బిజెపికి ప్రచారం చేశారని,బిజెపి గెలుపుకోస కృషి చేశారనే వార్తలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం లో కదలిక మొదలయింది. ఏఏ వర్గాలు బిజెపి వైపు వోటు వేసి ఉంటాయో వాటిని మచ్చిన చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ వర్గాలలో తెలంగాణ నిరుద్యోగ వర్గం ఒకటి. వీళ్లని శాంతింప చేసేందుకు తొందర్లో 50 వేల ఖాళీలనుభర్తీ చేసేందుకు వేగంగా చర్యలు మొదలయ్యాయి.
తొందరగా నాగార్జు సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక వుండటంతో,మరికొన్ని కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉండటంతో జాప్యం లేకుండా వివిధ శాఖల్లోని ఖాళీలను గుర్తించి భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఎందుకంటే, జిహెచ్ ఎంసి ఓటమి తర్వాత మరొక ఓటమి ఏదురయితే మీడియా వచ్చే టిఆర్ ఎస్ వెళ్లి పోతావుందని ముందస్తు తీర్పు ఇచ్చే ప్రమాదం ఉంది. ఇది ఓటర్లు సైకాలజీ మీద పని చేసి టిఆర్ ఎస్ ని వోడిపోయే పార్టీ గా భావిస్తే ప్రమాదం. అందువల్ల మూడో వరస పరాజయం ఎదురు కాకుండా ఉండేందుకు కెసిఆర్ చర్యలు మొదలుపెట్టారు. ఇందులో కీలకమయినది ఉద్యోగాల భర్తీ.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, వివిధ శాఖలలోని ఖాళీల వివరాలను సేకరించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు , ముఖ్య కార్యదర్శులు మరియు కార్యదర్శులతో సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, 50 వేల పోస్టులను భర్తీ చేయాలన్న ముఖ్యమంత్రి గారి ప్రకటనకు అనుగుణంగా, అన్ని శాఖలు ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలను సమర్పించాలని ఆదేశించారు.
అధికారులు ఖాళీల వివరాలను నిర్ణీత ప్రోఫార్మాలో సమర్పించాలని ఆదేశించారు.
ఈ వివరాలను క్రోడీకరించి గౌరవనీయ ముఖ్యమంత్రి కి సమర్పించవలసి ఉన్నదిన అన్నారు. నియామకాల ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
అవసరమైన మార్పులు మరియు సంస్కరణలను తీసుకురావడం ద్వారా నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు.
వివిధ శాఖలలో ని ఖాళీలను భర్తీ చేయడానికి సరైన మెకానిజాన్ని అమలు చేస్తామని అన్నారు.
ఈ సమావేశంలో డి.జి.పి. మహేందర్ రెడ్డి , ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు చిత్రా రామచంద్రన్, శాంతి కుమారి, రాణి కుముదిని, ముఖ్య కార్యదర్శులు సునీల్ శర్మ, రజత్ కుమార్ , జయేష్ రంజన్ , రవి గుప్తా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.