ఏ పక్షం నుంచి రిగ్గింగ్ ఆరోపణ లేని GHMC ఎన్నికలు

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
పది రోజుల కిందట జరిగిన హైదరాబాద్ పురపాలక ఎన్నికలలో ప్రలోభాలు, శుష్క వాగ్దానాల వంటి సహజ ఆరోపణలతో పాటు నేడు అత్యంత తక్కువ పోలింగ్ జరిగిందనే అసహజ ఆరోపణలు ఉన్నాయి. వాటిని పక్కకు పెడితే, రిగ్గింగ్ ఆరోపణ ఏ పక్షం నుండి దాదాపు లేదనే చెప్పాలి. దీన్నిబట్టి సహజమైన ప్రలోభాలు, ప్రభావాలు, తీవ్ర భావోద్వేగాలకు గురి కావడం తప్పిస్తే, స్థూలంగా ఓటర్లు తమ మనస్సుకి నచ్చి లేదా మెచ్చి ఇచ్చిన తీర్పుగానే భావించాలి.
ఈ తీర్పు ప్రత్యేకత ఫాసిస్టు రాజకీయ శకుల వైపు ప్రజల ఆదరణ అనూహ్యంగా పెరగడం. ఇదెలా జరిగిందనేది ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తుల్ని వేధించే ఒక ప్రశ్న.
గత ఎన్నికల నాటికి బీజేపీ ఈ స్థాయిలో ఫాసిస్తీకరణ చెందలేదు. అప్పుడు దానికి 4 స్థానాలు వచ్చాయి. అప్పటితో పోల్చితే ఈ నాలుగేళ్లలో బీజేపీ మరింత ఎక్కువ ఫాసిస్టీకరణ చెందింది. అదే బీజేపీ పార్టీకి నేడు 44 స్థానాలు వచ్చాయి. ఇక్కడ ఒక తర్కం (లాజిక్) వుంది. తక్కువ ఫాసిస్టీకరణ చెందిన కాలంలో తక్కువ స్థానాలు వచ్చాయి. ఎక్కువ ఫాసిస్టీకరణ చెందిన కాలంలో ఎక్కువ స్థానాలు వచ్చాయి. అదే బీజేపీ, అదే హైదరాబాద్ నగరం. అదే ఓటర్లు.  నాలుగేళ్ల వ్యవధి లో ఎందుకిలా జరిగింది? ఇదో ప్రశ్న. ఈ లాజిక్ ప్రకారం నేడు సామాన్య ఓటర్లే ఫాసిజం మద్దతుదార్లుగా మారినట్లు భావించాల్సి ఉంటుంది. ఇది చారిత్రిక (Unhistorical) తర్కం మాత్రమే. ఒకవేళ ఈ లాజిక్ ను ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తులు విశ్వసిస్తే, వారికి ప్రజల మీద అవిశ్వాసం ఏర్పడి, చారిత్రిక తిరోగమన రాజకీయ శక్తుల లక్ష్యాలకు తమకు తెలియకుండానే ఉపయోగపడతాయి.
పైన పేర్కొన్న లాజిక్ గతితర్కం కాదు. ఆధిభౌతిక వాద తర్కం మాత్రమే. అది ఆచరణలో దోపిడీ వర్గాలకే లభిస్తుందని గతితార్కిక భౌతికవాదం చెబుతుంది. ఈ తీర్పుపై ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తులు ఇలాంటి ఆదిభౌతికవాడ ధోరణికి గురి కారాదు. తెలిసో తెలియకో అట్టి భావనలకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ చిన్న ప్రయత్నం.
పై తీర్పు ఆకాశంలో నుండి హఠాత్తుగా వూడిపడింది కాదు. గాలిలొ పుట్టింది కూడా కాదు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోక పోయినా ఓటర్ల మనస్సుల్లో నుండి ఉత్పన్నమైన తీర్పే. ఆ ఓటర్ల మనస్సులు ఏ ఏ ప్రభావాలకు గురైనవో మరో చర్చనీయాంశం. ఇప్పుడు అది ముఖ్యం కాదు. అది అప్రస్తుత అంశం. ఓటర్లు బ్యాలెట్ పత్రం పై ఇష్టపడి బీజేపీ కి ఆమోద ముద్ర వేయకుండా వెలువడ్డ తీర్పు కాదు. అది ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తుల్ని దిగ్భ్రాంతికి గురి చేయడమే ప్రస్తుత చర్చనీయాంశం.
తాజా తీర్పు ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తులను దిగ్భ్రాతికి గురి చేస్తున్నట్లు గత 24 గంటల్లో వివిధ వర్గాల నుండి వినిపిస్తున్న విభిన్న వ్యక్తీకరణల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. అది ప్రజాతంత్ర, వామపక్ష, లౌకిక, విప్లవ శక్తులకు తగదని చెప్పడమే ఈ ప్రయత్నం వెనక ఉద్దేశ్యం.
ఒకవేళ ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తులు పై తీర్పు పట్ల “దిగ్భ్రాంతి”, “విభ్రాంతి”, “దిగ్భ్రమ”, “విభ్రమ” లకు గురి కావడమంటే, ఆచరణలో అవి షాక్ తింటున్నాయని అర్థం. అవి వారిలో ప్రత్యేక మానసిక స్థితిని ఏర్పరుస్తుంది. అట్టి మానసిక స్థితికి రాజకీయ యుద్ధాలలో ప్రాధాన్యత వుంది. ప్రజలు సాగించే ప్రతి భౌతిక యుద్దానికి ముందు మానసిక యుద్దస్తితి కూడా విధిగా వుంటుంది. అట్టి మానసిక స్థితి ని ప్రజలలో పెంపొందించడం ప్రజల పక్షాన నాయకత్వం వహించే రాజకీయ శక్తుల విధి. ఐతే, అంతకంటే ముందుగా ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తులలో కూడా అట్టి రాజకీయ, మానసిక యుద్ధ సంసిద్ధస్థితి విధిగా అవసరమవుతుంది. దానిని కోల్పోతే, రాజకీయ నిరాయుధ శక్తులుగా అవి మారతాయి. అదే జరిగితే, ఆచరణలో మున్ముందు క్రింది రెండు ప్రతికూల పరిణామాలకి దారి తీసే ప్రమాదం వుంది.
మొదటి పరిణామంలోకి వద్దాం. తాజా హైదరాబాద్ ఎన్నికల తీర్పు వల్ల ఫాసిస్టు రాజకీయ శక్తులు నేడు ఎంతటి లాభపడ్డాయో, తీర్పు తర్వాత ప్రజాతంత్ర శక్తుల్లో ఏర్పడే నిస్పృహ వల్ల అవి అంత కంటే ఎక్కువగా లాభపడతాయి. ఫాసిస్టు రాజకీయ శక్తులకు బ్యాలెట్ ప్రక్రియలో ఓటర్ల ద్వారా తొలి విజయం లభిస్తే, ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తుల మానసిక స్థితి ద్వారా మలి విజయం లభిస్తుంది. ఫాసిస్టు రాజకీయ శక్తులకి ఇలా లభించిన డబుల్ విజయాల్ని క్రింది విధంగా కూడా చెప్పొచ్చు. తమ ఫాసిస్టు రాజనీతితో ప్రజల్ని (ఓటర్లని) మభ్యపెట్టి ఎన్నికల్లో గెలుచుకోవడం వాటి తొలి విజయం. ప్రజలిచ్చిన తీర్పు వార్త విని, ప్రజల పక్షాన పనిచేసే తమ బద్ద రాజకీయ ప్రత్యర్థి శక్తులు “దిగ్భ్రాంతి” కి గురై, అవి రాజకీయంగా పైన పేర్కొన్న మానసిక స్థితిలో పడటం ఫాసిస్టు రాజకీయ శక్తులకి చేకూరే మలి విజయం. ఫాసిస్టు రాజకీయ శక్తులకు తొలి విజయాన్ని అందించిన సాధారణ ఓటర్లు రాజకీయ నేరస్థులు కారు, కాజాలరు. కానీ ఫాసిస్టు రాజకీయ శక్తులకు మలి విజయాన్ని అందించే ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తులు మాత్రం చరిత్రలో రాజకీయ నేరస్తులుగా మిగిలిపోతారు. ఇది లాజిక్ కోసం చెప్పేది కాదు. గత చరిత్ర బోధించిన వాస్తవం.
. ఇక రెండో పరిణామం గూర్చి వద్దాం. ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తులలో ఒకవేళ పైన పేర్కొన్న “మానసిక స్థితి” ఏర్పడితే, అది అక్కడే ఆగదు. ఆచరణలో అది బిజెపి కి ఓట్లు వేసిన ఓటర్ల మీద “వ్యతిరేకత” గా కూడా మారుతుంది. (ఇక ఓటర్లను ప్రజలుగా సంబోధిస్తా) అది ఒకింత ముదిరితే, ప్రజల పట్ల “జెలసీ” రూపం కూడా తీసుకోవచ్చు. బీజేపీ ఫాసిస్టు చర్యలు మున్ముందు పెరిగే క్రమంలో “చీ చీ, ఈ ఫాసిస్టు రాజకీయ చర్యలు అన్నింటికీ నిన్నటి పాడు తీర్పు ఇచ్చిన ప్రజలే కారకులు” అని ప్రజల్ని వారు ఆడిపోసుకోవచ్చు. వారి కళ్ళకు ఓటర్లు “ఫాసిజం మద్దతు దార్లు” గా కూడా కనిపించే అవకాశం ఉంది. అట్టి ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తుల మనస్సుల్లో “ఈ ప్రజల్ని నమ్ముకొని మనం ఫాసిజాన్ని ఎలా ఓడించగలం?” అనే సందేహం కూడా కలగవచ్చు. “ప్రజలు దుర్భలులు” అనే మానసిక భావనకు ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తులు గురికావచ్చు. తద్వారా అవే నిజానికి “రాజకీయ దర్భల శక్తులు” గా మారొచ్చు. ఇది ఊహాజనితంగా చెప్పేది కాదు. ఇది గత చరిత్ర బోధించిందే.
ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తుల్లో ఒకముఖ్య విభాగమైన కమ్యూనిస్టులు కూడా ఒకవేళ అట్టి మానసిక దుర్బల స్థితికి గురైతే, చరిత్ర క్షమించదు. (ఇది కమ్యూనిష్టులందరికీ వర్తించే సార్వత్రిక సూత్రం కాదు, తాజా తీర్పు పట్ల దిగ్భ్రాంతికి గురై, ప్రజలను చిన్నచూపు చూసే కమ్యూనిస్టులకు మాత్రమే ఇది వర్తిస్తుంది)
ఇక్కడ మరోమాట చెప్పాలి. ఇలా బీజేపీ వంటి ఫాసిస్టు రాజకీయ శక్తులకు ఇలా ఓటు వేసి గెలిపించిన ప్రజల పట్ల, ఒకవేళ కమ్యూనిస్టుల్లో కూడా ఎవరికైనా నిజంగానే ఇలాంటి చిన్నచూపు కలిగితే, ఆ నిర్దిష్ట సమయంలో కమ్యునిజం వారి దృష్టిలో మరింత ఉత్తమ పవిత్రమైన సిద్ధాంతంగా కూడా కనిపిస్తుంది. ఆ కమ్యునిజాన్ని నమ్మి నిలబడ్డ తమను తాము మహోన్నతులుగా ఊహించు కుంటారు. తమదృష్టిలో తాము మరింత రాజకీయ పవిత్రులుగా కూడా మారిపోతారు. అట్టి పవిత్ర కమ్యునిస్టు పార్టీలను బలపరచని ఓటర్లు మరింత అపవిత్రులుగా కూడా వారి కళ్ళకి కనిపిస్తారు. వారు నేడు గురయ్యే దిగ్భ్రాంతి లేదా విభ్రాంతి లేదా విభ్రమ లేదా దిగ్భ్రమ అనివార్యంగా వారిని ప్రజలకు మరింత… మరింత… దూరం చేస్తూనే పోతుంది. చరిత్రలో వారు ఊహాజనిత సోషలిస్టు లుగా మాత్రమే మిగిలి పోతారు.
ఖురాన్ లో ఒక సూక్తి వుంది. కొండ వద్దకు మహమ్మద్ వెళ్ళాలి. మహమ్మద్ వద్దకు కొండ రాదు. ఔను మరి! ప్రజల వద్దకి కమ్యూనిష్టులు వెళ్ళాలి. కమ్యూనిస్టుల వద్దకు ప్రజలు వెతుక్కుంటూ రారు. కొండకూ, మహమ్మద్ కూ మధ్య బంధం నిలబడాలంటే ఆ బాధ్యత కొండది కాదు. మహమ్మద్ మీదే వుంటుంది. కమ్యూనిస్టులకూ ప్రజలకూ మధ్య అనుబంధం కొనసాగాలంటే, బలపడాలంటే, ఆ బాధ్యత ప్రజలది కాదు. అది ముమ్మాటికీ కమ్యూనిస్టుల మీదే వుంటుంది. అట్టి కర్తవ్య సందేశాన్ని ఇచ్చేదే తాజా హైదరాబాద్ ఎన్నికల తీర్పు!
ఫాసిస్టు రాజకీయ శక్తులకు చేకూరిన తాజా తీర్పు వంటి విజయాలు స్తిరమైనవి కాదు. ఈ నిజాన్ని చరిత్ర పదేపదే నిరూపించింది. తాజా ఢిల్లీ రైతాంగ ముట్టడి అండుకొక నిదర్శనంగా నిలుస్తోంది. నేటి రైతాంగ ప్రతిఘటనోద్యమ శక్తులు నిన్న మోడీ ప్రభుత్వ ఎన్నిక పట్ల ఎగిరి గంతేసినవే. మనం నిన్ననే ప్రపంచ వ్యాప్త ప్రేరణాత్మక దృశ్యం ఒకదాన్ని చూసాం. ఢిల్లీ రైతాంగ పోరుకు మద్దతుగా ప్రవాస భారతీయ విద్యాధిక యువత నిన్న న్యూ యార్క్, లండన్, టొరంటో, వాంకోవర్, కొలంబియా, సిడ్నీ వంటి విశ్వ నగరాల్లో ఉవ్వెత్తున ఎగిసి పడ్డ దృశ్యాల్ని చూసాం. 2014లో ఇదే ఢిల్లీలో, ఇదే మోడీ ప్రధాని గా పట్టాభిషేకం సందర్భంగా, ఇదే విద్యాధిక యువత, ఇదే నగరాలలో ఇంత కంటే మించి అంబర చుంబిత సంబరాలు చేసుకున్న నిజాన్ని మరిచి పోరాదు.
ఇవేవీ శాశ్వత, సుస్థిర విజయాలు కాదు. ఏ ప్రజలు తామున్న భౌతిక పరిస్థితులలో ఫాసిస్టు రాజకీయ శక్తులకు నేడు పట్టం కట్టారో, తిరిగి అదే ప్రజలు అదే ఫాసిస్టు రాజకీయ శక్తుల్ని మట్టి గరిపిస్తారు. అదే ప్రజల మహిమ! అదే చరిత్ర మహాత్మ్యం! అనూహ్యమైన తాజా ఢిల్లీ ముట్టడి అందుకొక చిన్న ఉదాహరణ! దక్షిణాది కంటే ముందే, ఏ ఉత్తరాది ప్రజలు గతంలో ఫాసిస్టు రాజకీయ శక్తులకు పట్టం కట్టారో, అదే ప్రజలు నేడు ఏకంగా ఢిల్లీ ముట్టడికి దిగడం గమనార్హం. ప్రజల పట్ల ఏర్పడే విశ్వాసానికి ఇది చిన్న మచ్చు తునక మాత్రమే. ఈ వెలుగులో దిగ్భ్రాతికి గురి కాకుండా ఫాసిస్టు రాజకీయ శక్తుల్ని రాజకీయంగా మున్ముందు మట్టి గరిపించే లక్ష్యానికి ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తులు అంకితం కావాలి. అందుకు హైదరాబాద్ ఎన్నికల తీర్పు ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తులకు, ముఖ్యంగా కమ్యునిస్టు శక్తులకు ఒక కనువిప్పు కావాలని ఆశిద్దాం.
కమ్యూనిస్టులకు గతితార్కిక భౌతికవాద సిద్దాంతం ఒక రాజకీయ మార్గదర్శి. విధిగా గుర్తు తెచ్చుకునే మార్క్స్ మాట వుంది. ప్రజల జీవితాన్ని వారి చైతన్యం నిర్ణయించదు. వారి జీవితమే వారి చైతన్యాన్ని నిర్ణయిస్తుంది. జీవితమంటే, స్థూలంగా నాటి భౌతిక స్థితిగతులు. వాటికి లోబడిందే స్తూలంగా నాటి ప్రజల జీవితం. తాము జీవిస్తున్న పరిస్తితుల్లో నుండే ప్రజలు స్పందిస్తారు. నేడు హైదరాబాద్ ఓటర్ల నుండి వ్యక్తమైన ప్రతిస్పందన కూడా దానికి అతీతంగా చూసేది కాదు. తాము నేడు జీవిస్తున్న భౌతిక స్థితిగతుల నుండే నేటి హైదరాబాద్ ప్రజలు ఓటింగ్ సరళిని చూడాలి. ఫాసిస్టు రాజకీయ శక్తుల పట్ల ప్రజల ఆదరణ నేడు ఎందుకు కలిగిందన్నదే కమ్యూనిస్టుల సమీక్షాంశం కావాలి. తాము వారికి ఎందుకు చేరువ కాలేక పోయామన్నదే వారు రాజకీయ గుణపాఠంగా తీసుకోవాలి. అంతే తప్ప, ప్రజల తీర్పు పట్ల వారు దిగ్భ్రాంతి కి గురై, పైగా ప్రజల్ని చిన్నచూపుతో చూసే చారిత్రిక నేరంచేయరాదు. నేడు కమ్యూనిస్టులకు హైదరాబాద్ ప్రజలు తమ తీర్పు ద్వారా ఇచ్చిన రాజకీయ సందేశమిదే.

 

(ఇందులో వ్యక్త పరిచిన అభిప్రాయం రచయిత వ్యక్తిగతం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *