( రాఘవ శర్మ )
పొలాలన్నీ క్రమంగా మాయమవుతున్నాయి.పచ్చని చేలన్నీ బీళ్ళుగా తయారవుతున్నాయి. వ్యవసాయ బావులు, వంకలు, కసాలు, కాలువలు ఒకటొకటిగా పూడిపోతున్నాయి. పంటల స్థానంలో ముళ్ళ చెట్లు, సర్వేరాళ్ళు మొలకెత్తుతున్నాయి.
తిరుపతికి దక్షిణ శివార్లలోని ఉల్లిపట్టిడ ప్రాంతంలో 1980 నుంచి ఇది కొట్టవచ్చినట్టుగా కనిపించిన మార్పు. అప్పటివరకు ఆ ప్రాంతంలో మాదే చివరి ఇల్లు.
ముత్యాలరెడ్డిపల్లె పంచాయతీ ఆఫీసు దాటాక మా ఇల్లు తప్ప ఇక ఎవరిళ్లూ లేవు. ఏదైనా వాహనం వస్తోందంటే అది మా ఇంటికనే అర్థం.
మా ఇంటి పక్కన ఉన్నట్టుండి సుబ్బారెడ్డి అనే ఓ పెద్ద ఆసామి ప్రత్యక్ష మయ్యాడు. గంజి పెట్టి ఇస్త్రీ చేసిన పెద్ద జరీఅంచు తెల్లని పంచె, లాల్చీ ధరించేవాడు. గుండ్రటి ముఖం. చెవుల వద్ద జులపాల వరకు తాకిన పెద్ద పెద్ద బుంగ మీసాలు. అందుకే అందరూ అతన్ని మీసాల సుబ్బారెడ్డి అనే వారు.ఆరడుగుల ఆజానుబాహుడు.
ఎస్వీ రంగారావు లాగా గంభీరమైన ఆకారం. కానీ, గొంతులో లేని గంభీరత. నాలుగు వేల రూపాయలకు మా పక్కనే ఇరవై సెంట్ల కయ్య కొన్నాడు. చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి ఆవరణ అంతా కొబ్బరి చెట్లు నాటాడు. మధ్యలో ఒక పెద్ద భవనాన్ని కట్టాడు.
దిగూరులో కానీ, ఎగూరులో కానీ ఇంత పెద్ద భవనం లేదు. కాంపౌండులో అర్దచంద్రాకారంగా రోడ్డు వేశాడు. పడవలాంటి తెల్లని పొడవాటి కారు కొన్నాడు.
కాంపౌండులోకి ఒక వైపు నుంచి లోపలికి వస్తే, మరొక వైపునుంచి బైటికి వెళ్ళడానికి రెండు పెద్ద పెద్ద గేట్లు పెట్టాడు.ఇంటి ముందు పెద్ద పేమ్ కుర్చీ వేసుకుని, వెనక్కి ముందుకి ఊగుతూ కూర్చునేవాడు.
రైతులంతా ఒకరొకరుగా అతని ముందు చేతులు కట్టుకుని నుంచోవడం మొదలు పెట్టారు.తరతరాలుగా లోకానికి తిండి పెట్టి తలెత్తుకుని తిరిగిన రైతులు వాళ్ళు.
కోతకొచ్చి వాలిపోయిన వరికంకుల్లా అతని ముందు తలలు ఒంచుకుని నిలుచుంటున్నారు. తమ భూములు కొనుక్కోమని ప్రాధేయపడుతున్నారు!
ఉల్లిపట్టిడ ఊరు ఊరంతా హతీరాంజీ మఠం భూములే. ఇక్కడ పొలాలు కూడా ఆ మఠానివే. ఈ భూములన్నీ మఠానికి ఆకాశం నుంచి ఊడిపడినవి కావు. వారసులు లేకనో, హతీరాంజీ బాబాజీ పైన భక్తి తోనో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు మఠానికి దానం చేసినవే. కౌలుకు వ్యవసాయం చేసుకోడానికి ఆ భూములన్నీ హతీరాంజీ మఠం రైతులకిచ్చినవే. మఠం నిబంధనం ప్రకారం ఇళ్ళు మాత్రం కట్టకూడదు.
రైతుల దగ్గర మేం కయ్య కొని పెంకుటిల్లు కట్టేశాక మఠం వాళ్ళొచ్చి అభ్యంతరం చెప్పారు. ఇల్లు కట్టేసి ఇంట్లో చేరిపోయాక వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదని డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు.వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు.రైతులు భూములను కొనేవారులేరు. ఎందుకంటే అవి మఠం భూములు కనుక.
పాకాల దగ్గర ఉన్న రమణయ్య గారి పల్లె నుంచి వచ్చిన సుబ్బారెడ్డి ఆ సమయంలో రైతులకు ఆపద్భాంధవుడిలా కనిపించాడు. అతనికి భూములు అమ్మడానికి రైతులు పోటీ పడ్డారు.రైతుల పంటలు దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతో సుబ్బారెడ్డి పంట పండింది.
భూములు అమ్మాక రైతుల చేతుల్లో కొంత కాలం వరకు డబ్బులు ఆడాయి. భూములు అమ్ముకున్న రైతులు తొలుత మురిసిపోయారు. మురిపెంగా చూసుకున్న భూములు, పంటలు దారిద్య్రం ముందు కనిపిం చలేదు.
బోద ఇళ్ళు కాస్తా మిద్దె ఇళ్ళు అయిపోయాయి.కొందరు డబ్బులు దాచుకుని తిరుపతిలో ఏదో ఒక పనిపాటలకు అలవాటుపడ్డారు. కొందరు ఉన్న డబ్బు జల్సా చేసి అడ్రస్ లేకుండా పోయారు. కొందరు భవన నిర్మాణ కూలీలుగా మారారు.ఒకరిద్దరు మేస్త్రీలుగా మిగిలారు.
ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మీసాల సుబ్బారెడ్డి మార్గదర్శకుడయ్యాడు.మఠం భూముల్లో మొలిచిన సర్వే రాళ్ళు పోయి, పెద్ద పెద్ద ఇళ్ళు వెలుస్తున్నాయి. మాతో సహా ఇళ్ళు కట్టిన 14 మంది పైన హథీరాంజీ మఠం వారు కోర్టులో కేసు వేశారు. వారిలో సుబ్బారెడ్డి కూడా ఉన్నాడు. కోర్టు తీర్పు వచ్చింది.
ఎకరాకు లక్ష రూపాయల చొప్పున మఠం వారికి మార్కెట్ విలువ కట్టేసి, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. మఠం భూమి కాస్తా పక్కా పట్టా భూమి అయిపోయింది. అయితే అప్పటికే రైతుల చేతిలో ఉన్న ఎకరాలెకరాలు సుబ్బారెడ్డి పరమయ్యాయి.
సుబ్బారెడ్డికి భూములు అమ్మని కొందరు రైతులు మాత్రం కొంత భూమిని వేరే వారికి అమ్మేశారు. వచ్చిన డబ్బును మఠానికి కట్టేసి మిగిలిన భూమిని పట్టా చేయించుకున్నారు.
తరతరాలుగా మఠం భూముల్లో ఇళ్ళు కట్టుకున్న పాత తరం మాత్రం అలా కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోలే కపోయింది.
ఊరు ఊరంతా మఠం భూములే. ఆ సమస్య ఇప్పటికీ అలాగే ఉంది.మఠం వారు రిజిస్ట్రేషన్ చేయకపోతే పక్కా పట్టా కాదు. ఇల్లు కట్టాలంటే ప్లాన్ రాదు. బ్యాంకు రుణాలు రావు.
ఈ ప్రాంతానికి రాక ముందు పాకాల దగ్గర ఉన్న రమణయ్యగారి పల్లె నుంచి సుబ్బారెడ్డి అదృష్టాన్ని వెతుక్కుంటూ తిరుపతి వచ్చాడు. తిరుపతిలో ఒక నాన్వెజిటేరియన్ హోటల్ పెట్టాడు. పెద్దగా గిట్టుబాటు అయినట్టు లేదు.
ఆహార్యంలో పెద్ద భూస్వామి గా, మా ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కొత్త అవతారమెత్తాడు. అది బాగా కలిసొచ్చింది. అతని దశ తిరిగింది. సుబ్బారెడ్డి చదువు ఎలిమెంటరీ స్కూల్ దాటలేదు. ఆయన భార్య పీయూసీ(ఇంటర్మీడియట్) వరకు చదువుకుంది.వారిది పెద్దలను ఎదిరించి చేసుకున్న ప్రేమ వివాహం.
ఆమె చాలా హుందాగా వ్యవహరించేది. ఒక అతను ఓ రోజు వాళ్ళింటికి వచ్చి తాను పెళ్ళి చేసుకోవాల ని, సాయం చేయమని కోరాడు. కష్టపడి సంపాదించి పెళ్ళి చేసుకోవాలికానీ, ఇలా అడుక్కుని పెళ్ళి చేసుకుంటే ఏం గౌరవం ఉంటుంది అని ఆమె ప్రశ్నించింది.
దాంతో అతను వెళ్ళిపోయాడు. సుబ్బారెడ్డికి పెద్దగా చదువు లేకపోయినా డబ్బు లెక్కలు ఎక్కడా తప్ప లేదు. ఎప్పుడూ కాగితాల్లో లేక్కలేసుకున్న పాపాన పోలేదు.
తిరుపతి దక్షిణ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సుబ్బా రెడ్డే మార్గదర్శకుడు. ఉల్లిపట్టెడలో ఓ వ్యక్తి నాటుసారా వ్యాపారం చేసేవాడు.
ఒకసారి ఎక్సైజ్ పోలీసుల చేత చిక్కి చావు దెబ్బలు తిన్నాడు.బైటికి వచ్చాక ఆ వ్యాపారం ఇక లాభం లేదనుకు న్నాడు. ఆ వ్యక్తి కూడా సుబ్బారెడ్డిని ఆదర్శంగా తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టాడు.
సుబ్బారెడ్డిలా కాకుండా అడుగడుగునా మోసాలు ప్రాక్టీస్ చేశాడు.భూమి యజమానికి వెయ్యి రూపాయల అడ్వాన్స్ ఇచ్చి పదివేలు ఇచ్చినట్టు రాయించుకునే వాడు. భూ యజమాని అమ్మ కూడదనుకుంటే తీసుకున్న అడ్వాన్స్ కు రెట్టింపు ఇవ్వాల్సి వచ్చేది.
వెయ్యి రూపాయల అడ్వాన్స్ కు ఇరవై వేల రూపాయలు తిరిగి ఇ వాల్సి వచ్చేది. విధిలేక చాలా మంది తమ భూములను అతనికి అమ్మేసి మోసపోయారు.
ఈ ప్రాంతంలో ఇలాంటి బ్రోకర్లు చాలా మంది వెలిశారు.ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే చాలు రాబందుల్లా వాలిపోయి ఊపిరి ఆడనిచ్చే వారు కాదు.భూ యజమానిని తప్పుడు అగ్రిమెంట్లతో ఇరికించేసేవారు.
బ్రోకర్‌కు తప్ప స్వతంత్రంగా అమ్ముకోలేని స్థితికి తెచ్చేసేవారు. ఇప్పటికీ ఎవరైనా తమ ప్లాటు అమ్ము కోవాలంటే ఈ బ్రోకర్లు చుట్టుముట్టే స్తారు.కో కొల్లలుగా జరిగిన రియల్ ఎస్టేట్ మోసాలకు ఈ ప్రాంతం సజీవ సాక్ష్యంగా మిగిలింది. సుబ్బారెడ్డి రైతుల వద్ద కారు చౌకగా భూములను కొని ఎక్కువ ధరకు అమ్ముకున్నాడే కానీ, ఎప్పుడూ తప్పుడు అగ్రిమెంట్లు చేసుకోలేదు.
మోసపూరితంగా తక్కువ అ డ్వాన్స్ ఇచ్చి ఎక్కువ ఇచ్చినట్టు రాయించుకోలేదు. ఈ ప్రాంతంలో ఇలా తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నాడు.
సుబ్బారెడ్డికి సినిమా వాళ్ళతో సంబంధాలు ఏర్పడ్డాయి. సుబ్బారెడ్డి ఇంట్లో మోహన్ బాబు నటించిన మూగవాని పగ సినిమా షూటింగ్ జరిగింది. అందులో గిరి బాబు కూడా నటించాడు.ఆ సినిమాలో పక్కన ఉన్న మా ఇల్లు కూడా కనిపించింది.
ఆ తరువాత కొన్నాళ్ళకు మా ఇంట్లో, వాళ్ళింట్లో కలిపి నిప్పులాంటి ఆడది అన్న సినిమా షూటింగ్ జరిగింది. విజయ శాంతి ప్రధాన పాత్ర. ఆ సినిమా వేరే పేరుతో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యింది. సినిమా షూటింగ్ కాదు కానీ, మాకు ‘సినిమా; చూపించారు.
సినిమానటుల్ని చూడడానికి పెద్ద ఎత్తున వచ్చిన జనం మా మొక్కలన్నీ తొక్కేశారు. టీటీడీ ఉద్యోగుల కోసం 1984లో తిరుపతికి దక్షిణాన వైకుంఠపురం కాలనీ వెలిసింది.
సుబ్బారెడ్డి మా పక్కన కట్టిన ఇల్లు అమ్మేసి వైకుంఠపురం పడమర వైపున నాలుగు పోర్షన్లలో మరో పెద్ద ఇల్లు కట్టాడు. ఇక్కడ తొలిరోజుల్లో సుబ్బారెడ్డి కి సాగినంతగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆ తరువాత సాగ లేదు. రాబందులు ఎక్కువై పోయాయి. భూములకు ధరలు ఒక్క సారిగా పెరిగే సరికి మిగిలిన రైతులు జాగ్రత్త పడ్డారు.
దాంతో సుబ్బారెడ్డి వేరే వ్యాపారాలకు మళ్ళాడు. తరువాత సింగపూర్ వెళ్ళి వచ్చాడు. పెద్ద పెద్ద సేట్లతో ఏవో వ్యాపార లావాదేవీలు నిర్వహించాడు. కానీ, అవేమిటో బైట పడలేదు. వ్యాపారంలో ఏమైందో తెలియదు కానీ, ఇస్కాన్‌లో హరే రామా హరే కృష్ణ భక్తుడయ్యాడు. అసలే ఆరడుగుల పొడవైన మనిషి.
వారితో పాటు ఎగిరి ఎగిరి గంతులేస్తూ భజనలు చేశాడు. ఆ తరువాత వరదయ్యపాళెం దగ్గర ఉన్న కల్కి భగవాన్ని ఆశ్రయించి, ఆయనకు పరమ భక్తుడయ్యాడు.
ఒక రోజు అర్ధరాత్రి సుబ్బారెడ్డి భార్య అకస్మాత్తుగా మరణించింది. మేం ఎవ్వరం ఆమె శవాన్ని చూసే అవకాశం లేకుండా పోయింది. తెల్లవారక ముందే ఆమె శవాన్ని రమణయ్య గారి పల్లెకు తీసుకెళ్ళి అంత్యక్రియలు నిర్వహించాడు.
భార్యకు పెద్ద సమాధి కట్టాడు. వైరాగ్యం వచ్చింది. భక్తిలో పడిపోయాడు. కొన్నాళ్ళకు సుబ్బారెడ్డి పోయాడన్న వార్త వచ్చింది.
ఇప్పుడు సుబ్బారెడ్డి లేడు.ఆయన రుచి చూపించిన రియల్ ఎస్టేట్ వ్యాపార రాబందులు మాత్రం ఈ ప్రాంతం పైన వాలే ఉన్నాయి.
(సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ చైనా ఆహ్వానం మేరకు భారత – చైనా మిత్రమండలి తరపున 2015 లో ఆ దేశంలో పర్యటించారు. ఆ పర్యటనానుభవాలతో ‘ ఓ కొత్త బంగారు లోకం ‘ అన్న పుస్తకాన్ని రాసారు. చిత్తూరు జిల్లా సాహితీ దిగ్గ జాల గురించి తన సంపాదకత్వంలో _’ సాహితీ సౌ గంధం ‘ అన్న పుస్తకాన్ని వెలువరించారు. కోస్తా జిల్లాల్లో పుట్టి, తెలంగాణా లో పెరిగి, రాయలసీమ ( తిరుపతి ) లో స్థిరపడ్డారు)
తిరుపతి జ్ఞాపకాలు-14 ఇక్కడ చదవండి
https://trendingtelugunews.com/uncategorized/pushpa-vilapam-karunasri-jandhyala-papaiah-sastri/
Good news