జలపాతం వొంపుసొంపులు చూడాలంటే… తిరుపతి పక్కనే ఉన్న రామతీర్థం రావాలి

(భూమన్ )
తిరుపతికి 20 కి.మీ దూరంలో రామచంద్రాపురం మండలం గంగిరెడ్డి పల్లెకు పడమటి వైపున అయిదు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే రామతీర్థం అనే అద్భుతమయిన ప్రదేశం చేరుకోవచ్చు. అక్కడ ఒక అందమయిన జలపాతం ఉంది.
ఇది తిరుపతికి చాలా దగ్గరలోనే ఉన్నా దీని గురించి చాలామందికి తెలియదు.నాకూ తెలియదు. అనుకోకుండా మొన్నామధ్య ఒక మిత్రుడు చెబితే వెళ్లి చూడాలనిపించింది. ఈ ప్రదేశం గురించి ఆయన చెప్పాక  ప్రయాణం వాయిదా వేయాలని పించలేదు. బయలుదేరాను.
ఆశ్చర్యం, ప్రదేశానికి వెళ్ళేదారిలోనే  మనం చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఆదారి పొడుగునా అలాంటి ప్రకృతి ఉంది. అక్కడి చేరుకోగానే బ్రహ్మండమయిన చెరువు కనిపిస్తుంది. జలపాతం నీళ్లన్నీ ఈ చెరువులోకి చేరి ఏర్పడిన అద్భుతమయిన జలాశయమిది.
ఈ చెరువును ఇక్కడి ప్రజలు గుండాల చెరువు అని పిలుస్తారు. ఈ జలపాతం నేరుగా దూకకుండా కుడివైపుకు తిరిగి ఉంటుంది. ఇదొక వింత.  మేం మరింత ఫైకి ఎక్కేందుకు జలపాతం దారి పట్టాం. పక్కనే దారులున్నా, జలపాతం పక్కనుంచే ఎక్కుతూ ఎగబాగుతూ వెళ్లాలనుకున్నాం.

 

ఈ ప్రవాహం పొడవునా వేల సంఖ్యలో చేపలుకనిపిస్తాయి.  ప్రజలు చాలా మంది ఫిష్ థెరపీ పేరుతో వేలు ఖర్చుచేసుకుంటూ ఉంటారు. ఇలాంటికి చోటికి వస్తే ఈ సుందరమయిన ప్రకృతిలో ఉచితంగా ఫిష్ థెరపీ లభిస్తుంది. ఇక్కడొక అయిదు నిమిషాలు చేపలతో గడిపి మళ్లీ మా ట్రెకింగ్ మొదలుపెట్టాం.
ఈ సారి జలపాతంలో పాములు కూడ కనిపించాయి. అవన్నీ ప్రవాహంలో కొట్టుకొచ్చినట్లు అనిపించింది. ఇలా జలపాతం దారిపట్టుకుని కొండశిఖరం మీదకు చేరకున్నాం. అక్కడంతా సమతల ప్రదేశం ఉంది. జలపాతాన్నిసౌందర్యాన్ని వర్ణించనలవికాదు. వయ్యారాలు వొలకబోసేందుకు మనముందు ఈ జలపాతం వొంపులు తిరుగుతున్నదా అనేంతగా మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది.
ఈ జలపాతం,అక్కడి సెలయేర్ల వయ్యారాలు,నీళ్లు దూకుతున్న శబ్దాలు, చుట్టుపక్కల చెట్ల మీది నుంచి వచ్చే పక్షుల కలిసి మనకు మత్తెక్కించే పర్యావరణం సృష్టిస్తాయి.
పైన ఒక రెండుకిలోమీటర్లు దూరం నడుకుంటూ ప్రకృతి సౌందర్యం ఆస్వాదిస్తూ వెళ్తున్నామా… అక్కడక్కడ కొన్ని అడుగుజాడలు కనిపించాయి. చిరుతపులి అడుగుల్లాగా కనిపించాయి. అది దాడిచేస్తే ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా లేం కాబట్టి, అక్కడికి మా ట్రెక్ ఆపేసి వెనుదిరిగాం.
అయితే, ఇది అసాధారణమయిన అనుభవం. రామజలపాతం మంత్రుముగ్ధుల్ని చేసేస్తుందంటే నమ్మండి. తిరుపతికి కూతవేస్తే వినబడేంత దూరాన ఇంతకాలం మాకు తెలియకుండా ఉందంటే ఆశ్చర్యం మేస్తుంది.
ఇక్కడి నుంచి ఇంకొంత దూరం పోతే, రాయల చెరువు వస్తుంది. పేరులో దీని గొప్పదనం ఉంది. ఇది శ్రీకృష్ణ దేవరాయలు తవ్వించిన చెరువు. తిరుపతి సమీపంలో ఉన్న మరొక అద్భతం రాయలచెరువు. దీని గురించి మరొక సారి చెబుతాను. ప్రస్తుతం రామతీర్థానికి పరిమితం అవుదాం.
ఈ తీర్థాన్ని సందర్శించే అవకాశం నాకు కేవలం కరోనా లాక్ డౌన్ వల్లే వచ్చింది. లాక్ డౌన్ కాలాన్ని ఇలా ట్రెకింగ్ కోసం వినియోగించాను.  తిరుపతి చుట్టూరు సుమారు 250 దాకా ఇలాంటి అందమయిన ప్రదేశాలున్నాయని తెలిసింది. వీటన్నింటిని శోధించే పనిలో ఉన్నానిపుడు.
ఒక చిన్నమాట. ప్రకృతికి నష్టం లేకుండా ఈ ప్రదేశాలను ట్రెకర్స్ కి అనుకూలంగా మారిస్తే, ఇక్కడి టూరిజం అద్భుతంగా అభివద్ధి అవుతుంది. ఇవన్నీ ఇంటీరియర్ ఫారెస్టు కాదు. కాబట్టి ఇక్కడికి ట్రెకర్స్ ను అనుమతించడం వల్ల ప్రకృతిలో అలజడికి గురవుతుందని భయపడాల్సిన పనీ లేదు. ఇలాంటి ఏర్పాట్ల వల్ల ప్రకృతి అందాలను ఆస్వాదించడమే కాదు, ఇలాంటి ప్రకృతి సంపదను కాపాడుకోవాలనే స్పృహ కూడా ప్రజల్లో వస్తుంది. అంతకు మించి పర్యావరణ విద్య ఏముంటుంది?
కాబట్టి ఇటువంటి ప్రదేశాలను పర్యాటకఅనుకూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. దీనికోసం ట్రెకర్స్ క్లబ్లు, ఇతర  సంఘాలు ప్రభుత్వం మీద వత్తిడి తీసుకురావాలి. మనం ఇప్పటికే నగరాలకు పరిమితమయిపోయి, జలపాతాలు ఎలా ఉంటాయో తెలియకుండా, పక్షుల కిలాకిలా రావాలు వినకుండా, అరణ్యంలో వాతావరణం ఎలా ఉంటుందో తెలియకుండా, అక్కడ జంతువులు ఎలా సంచరిస్తుంటాయో,మనుషుల్ని చూసినపుడు అవి ఎలా పారిపోతాయో కళ్లార చూడకుండా జీవిస్తున్నాం. ఇలాంటి అరుదైన అవకాశం తిరుపతి వాసులకు అతి చేరువలో ఉంది. ప్రభుత్వం అనుకంటే  దేశ ప్రజలందరికి చౌకగా వీటిని సందర్శించే అవకాశం కల్పించవచ్చు.

 

(భూమన్ , ప్రకృతి ప్రేమికుడు, తిరుపతి )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *