తాజా రైతాంగ ప్రతిఘటన నేర్పుతున్న కొత్త పాఠాలు.

(ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
ఈ రోజు 12-12-2020 నాటి హిందూ దినపత్రికలో ఓ రైటప్ చదివి స్పందించి రాస్తున్నది. అది మన మనస్సులను ఢిల్లీ సరిహద్దుల్లోకి తీసుకెళ్తుంది. ఐతే మన మనస్సులకు కొంత పదును పెడితే, ఢిల్లీ నుండి చరిత్ర పుటల్లోకి తీసుకెళ్తుంది. అక్కడ కూడా ఆగకుండా రేపటి కొత్త చరిత్ర నిర్మాణం వైపుకు కూడా మనల్ని పరుగెత్తిస్తోంది.
హిందూ లో writeup శీర్షిక పేరు “FRIENDSHIP BLOOMS ACROSS BARRICADES HERE”. అది సింఘు సరిహద్దు లో రైతాంగ ముట్టడి చోటు నుండి HEMANI BHANDARI అను పాత్రికేయుడి ప్రత్యక్ష కథనం. అది ఈరోజు హిందూ పేపర్ లో 9వ పేజీలో ప్రచురితమైనది.
దానిని ఎవరైనా మిత్రులు తెలుగులోకి అనువదించి సోషల్ మీడియా లో పోస్ట్ చేయగలిగితే మంచిది. దాని నుండి కొన్ని ముఖ్య వాక్యాలు క్రింద ఉదహరిస్తున్నా.
పై పాత్రికేయుడు అక్కడ డ్యూటీ చేస్తున్న పోలీస్ ఉన్నత అధికారుల్ని కూడా కలిశారు. ఈ సమస్యపై మీరు ఏ పక్షం వైపు అని అడిగిన విలేఖరి ప్రశ్నలకు బహిరంగంగా తమ అభిప్రాయాలు చెప్పడానికి పోలీసు అధికారులు నిరాకరించారు. ఐనా కొంత మంది పోలీస్ అధికారులతో సహ పోలీసులు పై విలేఖరి తో తమ మనస్సుల్లో దాగిన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.
పై పాత్రికేయుడికి రైతులు చెప్పిన మాటల్ని ఆయన కింది విధంగా ఉదహరించారు.
“పోలీస్ అధికారులు మా స్వంత పిల్లల వంటి వాళ్లు. ఇక్కడ వాళ్ళు కేవలం తమ డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళు (పోలీస్ వర్గాలు) ఇక్కడ మాకు (రైతులు) ఎలాంటి అపకారం చేయడం లేదు. మేము కూడా వారిని ఏమీ అనడం లేదు. వారిలో కొందరు మా భోజన శాలలలోకి వచ్చి తింటున్నారు. మేము వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.”
మరో రైతు విలేకరితో క్రింది విధంగా మాట్లాడాడు.
“నాకు పారా మిలటరీ లో కూడా బందువులు ఉన్నారు. వారికి పరిస్తితి తెలుసు. వారు అందుకే ఈ వివాదం త్వరగా పరిష్కారం కావాలని కోరుతున్నారు.”
మరో రైతు ఇలా అన్నాడు.
“రైతు, సైనికుడు ఓకే పళ్లెం (కంచం) లో తమ గ్రామంలోని ఇళ్ళల్లో తింటారు. వారిలో ఒక కొడుకు రైతు కాగా, మరోకొడుకు సైనికుడు”.
ఒక పోలీస్ కానిస్టేబుల్ నవంబర్ 26 నుండి ఇక్కడే డ్యూటీ లో వున్నాడు. తన తండ్రి హర్యానాలో ఒక వూరి లో రైతు. అతడు విలేకరి తో క్రింది విధంగా మాట్లాడాడు.
“మేము (పోలీస్ వర్గాలు) నిరాకరిస్తున్నప్పుటికీ, వాళ్ళు (రైతులు) మమ్మల్ని మంచి నీరు, టీ త్రాగండని బలవంతం చేస్తున్నారు. తమ భోజన శాలలలో వాళ్ళు ఏది వడ్డిస్తున్నా, దాన్ని తీసుకొని మా వద్దకు వచ్చి మమ్మల్ని కూడా తీసుకోవాలని వాళ్ళు నిత్యం అడుగుతున్నారు.”
ఒక సీనియర్ పోలీస్ అధికారి పై విలేఖరితో కింది విధంగా వ్యాఖ్యానించారు.
“తమ పోరాటం అధికారంలో వున్న వాళ్ళ మీద తప్ప, పోలీస్ మీద కాదని రైతు మాకు చెప్పాడు”.
అన్నింటి కంటే ముఖ్యంగా పై పాత్రికేయుడు అద్భుతమైన సందశాత్మక వాక్యంతో తన write-up ను క్రింది విధంగా ముగించారు.
“అక్కడ బారికేడ్లు కదలికను నియంత్రించుటకు వున్నాయి. అవిశ్వాసానికి అవి ప్రతీకగా లేవు”
మిత్రులారా,
ముట్టడి ప్రాంత వాస్తవ స్థితికి అద్దంపట్టే కదనాలివి. ఇందులో దాగిన కొన్ని నిజాలు చెప్పాలి.
ఇండియన్ ఆర్మీ, పారా మిలటరీ విభాగాలలో పంజాబ్, హర్యానా నుండి సాపేక్షికంగా అధిక సంఖ్యలో రిక్రూట్ మెంట్ వుంటుంది. దేశ జనాభాలో పై రాష్ట్రాల జనాభా శాతంతో పోల్చితే వీరి సంఖ్య కొన్ని రెట్లు ఎక్కువే వుంటుంది. పైగా సాధారణ సైనికుల వరకే పరిమితం కాదు. వివిధ హోదా అధికారుల శాతం కూడా ఎక్కువ. ఇది గమనార్హం.
ఈ రైతాంగ ఉద్యమ కాలంలో పై రెండు రాష్ట్రాలకు చెందిన అనేక మంది రిటైర్డ్ సైనిక అధికారులు తమ మెడల్స్ ను వాపసు ఇచ్చారు. ఇది మరో గమనార్హ అంశం.
బ్లూ స్టార్ పేరిట అమృత్ సర్ స్వర్ణ దేవాలయం మీద 1984 లో ఇందరా గాంధీ ప్రభుత్వం సైనిక దాడికి దిగింది. దానికి ప్రతీకార ప్రతిస్పందన తెలిసిందే. జీతం ప్రాతిపదికగా నిర్వర్తించే వృత్తిదర్మం కంటే, తమ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ప్రవృత్తిధర్మాన్ని నిర్వర్తించే సాంప్రదాయం పంజాబ్ ప్రజల్లో ఎక్కువ. ఇది మరో నేపథ్య గమనార్హ అంశం.
నేడు భారత సైన్యంలో తీవ్ర అసంతృప్తి వుంది. ఇది మరో నేపథ్య గమనార్హ అంశం.
ఈ నేపథ్యంలో మోడీ షా ప్రభుత్వానికి గల పరిమితుల్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఒకవేళ రైతాంగ ప్రతిఘటనను అది జలియన్ వాలా బాగ్ తరహా నెత్తుటి మడుగుల పాలు చేసే ఫాసిస్టు వ్యూహం పన్నాలంటే, ఈ తరహా స్థితి కొంత స్పీడ్ బ్రేక్స్ గా మారవచ్చునేమో!
చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే, కొన్ని ఉజ్వల ఘటనలు చూడొచ్చు. 1930లో పెషావర్ లో బ్రిటీష్ వలస పాలనపై ప్రజా తిరుగుబాటు జరిగింది. దాని అణచివేత కోసం పంపబడ్డ సైన్యాలు ప్రజల మీద కాల్పులు జరపడానికి నిరాకరించాయి. (ప్రజలు ముస్లిములు కాగా, సైనిక బలగాలు హిందువులు. ఐనా బ్రిటీష్ పాచిక పారలేదు) 1946లో బొంబాయిలో రాయల్ నేవీ సిబ్బంది స్వాతంత్ర్యం సాధనకై తిరుగుబాటు చేసింది. దాని అణచివేత కోసం బ్రిటీష్ ప్రభుత్వం చేత పాంపబడ్డ సైన్యాలు కూడా తమ సాటి ప్రజల మీద కాల్పులు జరప నిరాకరించాయి.
రష్యా కార్మికవర్గ విప్లవంలో సైనికుల పాత్ర వింటుంటే, అది కలయా, వైష్ణవ మాయయా అనే భ్రాంతికి గురవుతాం. చరిత్రలో అది ఇకముందు ఎన్నటికీ పునరావృతం కాదనే భావం కలుగుతుంది. ఆ చరిత్ర పునరావృతం కాదని దోపిడీ పాలక వర్గాలు కలలు కంటే కననిద్దాం. కానీ ప్రజల మీద విశ్వాసం వున్న చారిత్రిక పురోగమన శక్తుల దృష్టిలో అవి కలలు కారాదు.
మానవుడు మహనీయుడు. ప్రజలే చరిత్ర నిర్మాతలు. నేడు మన కళ్ళకు అసంభవంగా, దుస్సాధ్యంగా, దుర్లభంగా కనిపించే ఎన్నో, ఎన్నెన్నో అసాధ్యాలను సైతం సమయం వస్తే అవలీలగా సుసాధ్యం చేసి కొత్త చరిత్రను రేపు శ్రామిక, కార్మిక వర్గాలు సృష్టిస్తాయి. ఒక నెల క్రితం మన మనస్సులో ఊహకు లేదా అంచానాకు సైతం రాని ఆశాజనకమైన ఒక కొత్త రాజకీయ వాతావరణo నేడు ఏర్పడటం అందుకు ఒక మంచి ఉదాహరణ! గతం అనేది ఎప్పటికీ గతంగానే మిగిలిపోదు. అది కొత్త అనుభవాల వెలుగులో కొత్త బలంతో కొత్త విప్లవ స్పూర్తితో రేపటి కొత్త విప్లవ చరిత్రకు పురుడు పోసే సందర్భాలు కూడా చరిత్రలో సంభవించే అవకాశం వుంటుంది. అట్టి ఆశతో నేటి ప్రతిఘటనా పోరాటాల్ని ముందుకు తీసుకెళ్లే కృషిలో పాలు పంచుకుందాం.
రష్యా విప్లవంలో కార్మిక, కర్షక, సైనిక ఐక్యత కై బొల్షివిక్ పార్టీ ఇచ్చిన నినాదం చరిత్ర పురావస్తు శాల (మ్యూజియం) లో ప్రదర్శించే అంశంకాదు. అది పీడిత, తాడిత బాధిత ప్రజల హృదయ క్షేత్రంలో తిరిగి జన్మ ఎత్తి వర్ధిల్లుతుందని ఆశిద్దాం. అట్టి ఆశల్ని కలిగిస్తున్న ఢిల్లీ నగర సరిహద్దుల మీద ఆశ పెట్టుకుందాం.
సిద్ధాంత జ్ఞానం పుస్తకాల్లో సమగ్రంగా దొరకదు. అది ప్రజా ఉద్యమ క్షేత్రాల్లో దొరుకుతుంది. అదిగో, ఢిల్లీ సరిహద్దుల్లో ప్రజా ముట్టడి క్షేత్రంలో వాటి బీజాలు మొలకెత్తుతున్నాయి. మనం చరిత్ర గ్రంధాల్లో చదివి నేర్చిన సిద్ధాంతాలకు పదును పెట్టే రంపాలు, పదును రాళ్ళు అక్కడ దొరుకుతాయి. అక్కడ దొరికే సాన రాళ్లతో మనం గ్రంధాల్లో చదివిన సిద్ధాంత పరిజ్ఞానానికి పదును పెట్టుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *