భారత్ బంద్ , కార్పొరేట్ వ్యవస్థ మీద రైతుల తిరుగుబాటు

(ఇఫ్టూ ప్రసాద్ పిపి)
బడా కార్పోరేట్ వ్యవస్థపై భారతదేశ రైతాంగం ఈ విధంగా పోరాడుతుందని కొన్నాళ్ల క్రితం వరకూ బహుశా రాజకీయ పండితుల్లో సైతం ఎవరూ వూహించి వుండక పోవచ్చు. రైతులంటే భూస్వామ్య వ్యవస్థ పై పోరాడే వర్గమనీ, కార్మికులంటే దనస్వామ్య వ్యవస్థ పై పోరాడే వర్గమనీ ఇప్పటి వరకూ నేర్చుకున్న రాజకీయ పరిజ్ఞానం. రైతాంగానికి వర్గశతృవులు గ్రామీణ ప్రాంతాల్లో వుంటారనీ; కార్మిక వర్గానికి వర్గశత్రువులు పట్టణ ప్రాంతాల్లో వుంటారనీ ఇప్పటి వరకూ గ్రంధాల్లో చదివిన సిద్ధాంత జ్ఞానం. తాము దున్నుకునే భూమి పరిరక్షణ కోసం, తద్వారా తమ భుక్తి కోసం, తమ చెంతనే వుండి, పెత్తనం చేసే తమ వర్గ శత్రువులపై తిరగబడే ప్రాథమిక రాజకీయ చైతన్యాన్ని తొలుత తమ వూరిలోనే రైతాంగంలో కలిగించాల్సి వుంటుందని ఇంతవరకూ నేర్చుకున్న రాజకీయ పరిజ్ఞానం. కార్మిక వర్గం మాత్రమే పట్టణాల్లోని బూర్జువా వర్గాన్ని ముంచెత్తి స్తంభింప జేస్తుందని కూడా నేర్చుకున్న బోధనా జ్ఞానమే. ఇది ఏమిటో గానీ, రైతాంగం నేడు ఢిల్లీని ముట్టడించి బడా కార్పోరేట్ వర్గాన్ని (సారంలో బూర్జువా వర్గం) వణికిస్తోంది.
వర్తమాన చరిత్ర నూతన పాఠాలు బోధిస్తోంది. గత చరిత్రలో నేర్చుకున్న బోధనా జ్ఞానానికీ, వర్తమాన చరిత్ర నేర్పుతున్న జ్ఞాన సాధనకూ మధ్య ఈ వైరుధ్యం ఎందుకు వచ్చిందో నేటి పరిశోధనాత్మక అంశం (సబ్జెక్టు) గా మారాల్సి వుంటుందేమో! ఔను మరి! ఒక సందర్భంలో “PRACTICE IS GREEN, THEORY IS GRAY” అని లెనిన్ అనడం గుర్తుకు వస్తుంది. ఆచరణ పచ్చనిదైతే, సిద్దాంతం బూడిద వర్ణం వంటిదని అర్థం. ఇంకా చెప్పాలంటే, సిద్దాంతం కంటే ఆచరణే గొప్పదని అర్థం. ఔను మరి, ఆచరణ నుండి సిద్దాంతం పుడుతుంది. అది ఆచరణకు దిక్సూచిగా మారుతుంది. సిద్ధాంతానికి తల్లి వంటి ఆచరణే తిరిగి తన బిడ్డ (సిద్దాంతం) కి అవసరమైన దిద్దుబాట్లు కూడా చేస్తుంది. ఔను మరి, ప్రజా విప్లవ కార్యాచరణ క్షేత్రంలోనే సిద్దాంతం జన్మిస్తుంది. అట్టి సిద్ధాంతానికి అవసరమైన మార్పుల్ని కూడా తిరిగి ప్రజా విప్లవ కార్యాచరణ క్షేత్రమే సుసాధ్యం చేస్తుంది. ఢిల్లీ ముట్టడికి దిగిన వర్తమాన రైతాంగ పోరాటం కూడా బహుశా కొత్త రాజకీయ పాఠాల్ని బోధిస్తోందేమో! సిద్ధాంత సూత్రాలకు తగిన కొత్తదిద్దుబాట్లు చేస్తుందేమో! మున్ముందు అది ఏ విధమైన రాజకీయ సిద్ధాంత పాఠాల్ని బోధిస్తోందో, ఏ ఏ పాఠాల్ని నేర్చుకోవాల్సిన చారిత్రిక అవశ్యకతను కల్పిస్తుందో రేపటి చరిత్రకు వదిలేద్దాం.
44 కార్మిక చట్టాల్ని, అందులో భాగంగా ప్రస్తుతానికి 29 కార్మిక చట్టాల్ని రద్దు చేసిన దుర్మార్గం పై నేడు కోట్లాది కార్మికవర్గం సమరశీల నిరసన ఆందోళనల బాట పట్టింది. పెట్టుబడిదారీ వర్గం చేతుల్లో నిరంతర ప్రత్యక్ష బాధిత వర్గమైన కార్మిక వర్గం కంటే ఈ దేశ రైతాంగం అదే కార్పోరేట్ వ్యవస్థ పై పోరులో కనీసం ఒక్కసారైనా ఇలా ముందడుగు వేస్తుందని వూహించలేనిది. ఇప్పుడు ఢిల్లీని ముట్టడించిన రైతాంగ పోరాటం కార్మిక వర్గానికీ కూడా ఓ కొత్త పోరాట స్ఫూర్తి ని ఇస్తోంది. ఇది వర్తమాన భారతదేశ చరిత్రలో ఓ కొత్త రాజకీయ పాఠం.
చారిత్రికంగా పెట్టుబడిని అంతిమంగా ఓడించేది కార్మిక వర్గమే అన్న మార్క్స్, ఎంగెల్స్ సూత్రం తిరుగు లేనిది. దాన్ని విశ్వసిస్తూనే, నేటి ప్రత్యేక/ నిర్దిష్ట చారిత్రిక దశలో కార్మిక వర్గానికి కూడా రైతాంగం విప్లవ స్ఫూర్తిని ఇస్తున్న ప్రత్యేకతను గుర్తించాల్సిన రాజకీయ ఆవశ్యకత ముందుకొచ్చింది
తాజా ఢిల్లీ ముట్టడి ఎన్నో ఎన్నెన్నో బాధిత వర్గాలు, ఉప వర్గాలు, తెగలు, సామాజిక సముదాయాలకు కూడా కొత్త విశ్వాసాన్ని కలిగిస్తోంది. అది ఫాసిస్టు రాజకీయ శక్తుల చేతుల్లో ధ్వంసమై పోతున్న అనేక పాజిటివ్ వ్యవస్థల పునరుద్దరణ లక్ష్యాలకు కొత్త ఆశ కలిగిస్తోంది. విచ్చిన్నమై పోతున్న ఫెడరల్ వ్యవస్తను కాపాడుకునే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల దింపుడు కళ్ళెం ఆశలకు కూడా నేడు ఊపిరి పోస్తోంది. కోట్లాది మంది రవాణా రంగ కార్మికుల మెడలకు ఉరిత్రాడు వంటి రోడ్డు రవాణా భద్రత చట్టం, కోట్లాది మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టలు కొట్టే విధానం, ఆర్టికల్ 370 రద్దు, కనీస లౌకిక విలువలకు కూడా మంగళం పాడే నూతన విద్యా విధానం, ఉపా చట్టం, NIA కోరలు విస్తరించిన విధానం, సీబీఐ, ఆర్బీఐ, కాగ్ వంటి స్వతంత్ర్య సంస్థల్ని దిగ జార్చిన తీరు, పెద్ద నొట్ల రద్దు, GST, ముఖ్యంగా విశృంఖల ప్రైవేటీకరణ, DA రద్దు ఒక్కటేమిటి, ఇదీ అదీ కాదు, అన్నింటా ఫాసిజం సర్వ వ్యాపిత ధోరణి గా నేడు మారుతున్నది. ఈ అన్ని రకాల బాధిత వర్గాలకు నేడు ఢిల్లీ రైతాంగ ముట్టడి కొత్త ఆశల్ని కల్పిస్తోంది. ఇది అండాసెల్ లో మగ్గిపోతున్న GN సాయిబాబా నుండి వరవరరావు గారి వంటి భీమా కొరెగాం నిర్బందితుల విడుదల కోసం పోరాడే ఉద్యమ శక్తుల వరకూ కొత్త ఉద్యమ స్ఫూర్తిని కూడా అందిస్తోంది. అందుకే నేటి రైతాంగ పోరాటం రైతాంగం కోసమే పరిమితం కాదు. దీనికి అండదండలు ఇవ్వడం దేశ ప్రజలందరి కనీస కర్తవ్యం.
రేపటి భారత్ బంద్ చాలా కీలకమైనది. రేపు 8న బంద్ ద్వారా ఇది పంజాబ్, హర్యానా రైతాంగ పోరాటం కాదనీ, ఇది యావత్తు భారత రైతాంగ పోరాటమనీ నిరూపించాల్సిన కర్తవ్యం అందరిపై ఉంది. ఇది కేవలం రైతాంగ పోరాటం మాత్రమే కాదనీ, దేశ ప్రజల ఉమ్మడి పోరాటంగా నిరూపించాలి. ఇవన్నీ ఒక ఎత్తు కాగా, చరిత్రలో నిలిచి పోనున్న 9వ తేదీ మరో ఎత్తు.
ఢిల్లీ ని రైతాంగం ముట్టడి చేయక ముందే రెండుసార్లు చర్చలు జరిగాయి. ముట్టడి తర్వాత డిసెంబర్ 1, 3, 5 లలో మూడుసార్లు జరిగాయి. ఐదో సారి చర్చలు ఎల్లుండి 9వ తేదీన జరగనున్నాయి. ఇంత వరకు 5సార్లు జరిగిన చర్చలు వేరు. రేపటి భారత్ బంద్ మరునాడు 9న ఆరవ సారి చర్చలు వేరు. నేడు మోడీ ప్రభుత్వం ఎదుట రెండే రెండు పరిష్కార మార్గాలు వుంటాయి.
ఒకవేళ రైతు ఉద్యమ కార్యాచరణ కమిటీ ఇప్పటి వలెనే ఎల్లుండి చర్చల్లో కూడా దృఢమైన వైఖరిని ప్రదర్శిస్తే, ఈ కింది రెండే రెండు పరిష్కార మార్గాలలో ఏదో ఒక మార్గం ఎంపిక చేసుకోవాలి.
మొదటిది, రైతాంగ ఉద్యమ డిమాండ్లకు తలవంచి మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు అంగీకరించడం. (ఇదే జరిగితే లేబర్ కోడ్లు, రోడ్డు భద్రతా చట్టం, ఉపా, ఆర్టికల్ 370 వంటి ఫాసిస్టు చట్టాల రద్దుకు కూడా అది అనివార్యంగా దారి తీస్తుందని గమనంలో వుంచు కోవాలి)
రెండవది, ఢిల్లీ ముట్టడిలో వున్న రైతాంగం మీద ఫాసిస్టు నిర్బంధ కాండకు బరి తెగించడం. ఒకవేళ అదే జరిగితే, నూరేళ్ల క్రితం నాటి జలియన్ వాలా బాగ్ తిరిగి దేశ రాజధానిలో పునరావృతం కావచ్చు. నాటి జలియాన్ వాలా బాగ్ పంజాబ్ నేల మీదే జరిగింది. నేడు అదే పంజాబ్ రైతాంగ చొరవతో జరిగే దేశవ్యాప్త రైతాంగ పోరాటాన్ని అపర బ్రిటీష్ డయ్యర్ గా మారి మోడీ ప్రభుత్వం కూడా అలాగే నెత్తుటి మడుగులో ముంచెత్తే దుస్సాహసానికి ఓడిగడుతుందా? దానికి జవాబు చరిత్ర ఏమి చెబుతుందో ఎల్లుండి 9వ తేదీ చెబుతుంది.
గడ్డకట్టే చలిలో ఢిల్లీ ముట్టడి చేస్తున్న రైతాంగం ఒంటరి శక్తి కాదని రేపటి బంద్ జయప్రదం ద్వారా నిరూపిద్దాం. మోడీ ప్రభుత్వం వైపు అంబానీ ఆడానీ వంటి ప్రపంచ సంపన్న బడా కార్పోరేట్ సంస్థలు వున్నాయి. అంత తేలిగ్గా చట్టాల రద్దుకి అంగీకరించక పోవచ్చు. అందుకే బంద్ ను ఒక రాజకీయ సవాల్ గా తీసుకొని జయప్రదం చేద్దాం. రేపటి 8వ తేదీ భారత్ బంద్ ను బట్టి ఎల్లుండి 9వ తేదీ పరిణామాలు వుంటాయి. మన కోసం, స్వేచ్చ కోసం, అందరి కోసం పోరాడే అన్నదాతల పోరాటాన్ని నెత్తుటి మడుగుల పాలు కానివ్వకుండా రేపటి భారత్ బంద్ జయప్రదం కోసం మన సర్వ శక్తుల్ని కేంద్రీకరిద్దాం.

 

(ఇందులో వ్యక్తీకరించిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *