నివార్ వర్షాలతో…కడప జిల్లా గుంజను నదికి వరదలు…

(టి.లక్ష్మీనారాయణ)
ఉగ్రరూపం దాల్చిన “నివర్ తుఫాన్” వల్ల కురుస్తున్న భారీ వర్షాల మూలంగా నాలుగైదేళ్ళుగా ఎండిపోయిన కడప జిల్లా కోడూరు ప్రాంతంలోని గుంజను నది నీటి ప్రవాహంతో కళకళలాడుతున్న విడియోలను మిత్రులు పంపించారు. వాటిని వీక్షించి మహదానందం పొందాను.
కోడూరు ప్రాంతంలో నెలకొన్న కరవు వల్ల వ్యవసాయానికి నీటి సమస్యే కాదు, త్రాగు నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదో ఈనెల 22, 23 తేదీలలో పర్యటించిన సందర్భంలో కళ్ళారా చూశాను.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో గుంజన ప్రవహించడంతో భూగర్భజలాలు పెరుగుతాయి. ఒక ఏడాదిపాటు నీటి సమస్య ఉండదని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రాజంపేట, కోడూరు ప్రాంతాల దప్పిక తీర్చే గాలేరు – నగరి రెండవ దశ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ అలసత్వాన్ని, వివక్షతను ప్రశ్నిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నవంబరు 22న కోడూరులో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నాను. 23వ తేదీన జెట్టివారిపల్లి, కె.కందులవారిపల్లి(నా స్వగ్రామం), మండల కేంద్రమైన చిట్వేలికి వెళ్ళి పలువురు బంధు మిత్రులను కలిసిన సందర్భంలో కరవు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకొన్నాను. కరవు పరిస్థితులను స్వయంగా పరిశీలించాను.
ఐదేళ్ళుగా కరవు ఆ ప్రాంతాన్ని వెంటాడుతున్నది. శేషాచలం అటవీ ప్రాంతంలో పుట్టి కోడూరు, చిట్వేలి, పెనగలూరు మండలాల్లో ప్రవహిస్తూ పెన్నా నదికి ఉపనది అయిన చెయ్యేరులో కలిసే గుంజన ఏరు ఎండిపోయింది. వట్టిపోయిన గుంజన దృశ్యాలను చూసినప్పుడు ఆ నదీమతల్లి రోధన వినిపించింది. గుండె బరువెక్కింది.
చిట్వేలి ఉన్నత పాఠశాలలో చదువు కోవడానికి మా వూరి నుండి ఐదు కి.మీ. దూరం కాలినడకన వెళ్ళేవాడిని. ఇంటి దగ్గర నుండి క్యారియర్ లో మధ్యాహ్న భోజనం తీసుకెళ్ళేవాడిని. మా హైస్కూల్ కు సమీపంలోనే గుంజన ఏరు ఉన్నది. ఆ కాలంలో(1968-73) గుంజనలో ఎప్పుడూ నీళ్ళు ఉండేవి. నా సహవిద్యార్థులతో కలిసి వెళ్ళి గంజనలోని నున్నటి రాళ్ళపై కూర్చొని కబుర్లు చెప్పుకొంటూ మధ్యాహ్న భోజనాన్ని ఆరగించేవారం. ఆ ఏటి నీళ్ళు చాలా రుచికరంగా ఉండేవి.
గుంజన నది ప్రతి ఏడాది వర్షాకాలంలో చాలా రోజులు ప్రవహించేది. ఒక సంవత్సరం ఉధృతంగా ప్రవహించింది. కి.మీ. దూరంలో ఉన్న మా ఇంటి వరకు పోలాల మీదుగా వరద నీరు ప్రవహించింది. అప్పుడు వారం రోజులు ఏరు దాటలేక స్కూలుకు వెళ్ళని మధురానుభూతి నా మనస్సులో పదిలంగా ఉన్నది. అలాంటి గుంజన నది నేటి దుస్థితిని ప్రత్యక్షంగా వీక్షించినప్పుడు గత స్మృతులు కళ్ళముందు కదలాడాయి. వారం తిరక్క ముందే నివర్ తుఫాన్ పర్యవసానంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల గుంజన ప్రవహించి, ప్రజల్లో ఆనందాన్ని నింపింది.
చిన్ననీటి వనరుల వ్యవస్థలో చెరువులే ముఖ్యభూమిక పోషిస్తాయి. తరతరాలుగా నీటి వనరులను సమకూర్చిన చెరువుల్లో సర్కారు తుమ్మ / ముళ్ళకంప ఏపుగా పెరిగి పోయింది. నగిరిపాడు చెరువును చూశాను. అది ఒకనాటి చెరువేనా! అన్న అనుమానం వచ్చింది. ఆ చెరువుకు ప్రభుత్వం మరమ్మత్తులు చేయక పోవడం వల్ల ఇప్పుడు నీళ్ళు వచ్చి చేరినా నిలబెట్టుకోలేని దుస్థితి ఎదురైయ్యిందని నగరిపాడు గ్రామ పంచాయితీ మాజీ సర్పంచ్ మలిశెట్టి రాహుల్ ఫోన్ లో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. గుండాలేరు నీటితో యల్లమరాజు చెరువు కళకళలాడుతున్న దృశ్యాలను వీడియోలో చూశాను. మిగిలిన చెరువులు, కుంటలు నిండి పచ్చటి పంట పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందన్న ఆకాంక్ష బలపడింది.
నాలుగైదేళ్ళు వరుసగా వర్షాలు పడక పోవడంతో ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు ఇంకి పోయాయి. సారవంతమైన పొలాలు బీడు భూములుగా మారిపోయాయి. వందేళ్ళు ఆదాయాన్ని సమకూర్చుతాయన్న కొండంత ఆశతో కన్నబిడ్డల్లా పెంచుకొన్న మామి చెట్లు నిరాశే మిగిల్చాయి.
వెంకటరాజుపల్లిలో 22వ తేదీ రాత్రి బసచేసి, ఉదయాన్నే నా సహచర కామ్రేడ్ మలిశెట్టి రాహుల్ తో కలిసి వారి మామిడి తోటకెళ్ళా. మామిడి, నిమ్మ, సపోటా చెట్ల మధ్య కలియ తిరిగి, వివరాలను అడిగి తెలుసుకొన్నాను.
ఆ పొలంలో పాడుబడి ఉన్న కట్టుడు బావిని, ప్రస్తుతం వినియోగంలో ఉన్న బోరుబావిని చూశాను. ఆ ప్రక్క పొలంలో చెంగయ్య అనే రైతు 850 అడుగుల లోతు బోరు బావి త్రవ్విస్తే చుక్కనీరు పడలేదని రాహుల్ చెప్పాడు.
ఒకనాటి కట్టుడు బావుల స్థానంలో బోరు బావులొచ్చాయి. కట్టుడు బావుల వినియోగ కాలంలో 50 – 100 అడుగుల లోతులో భూగర్భ జలాలు దొరికేవి. యాభై ఏళ్ళ క్రితం, నా చిన్నతనంలో కట్టుడు బావుల నుండి ఎద్దుల సహాయంతో కపిలదోలి, బొక్కెనలను ఉపయోగించి నీటిని తోడి సేద్యం చేసే వారు. నేటి బోరు బావుల కాలంలో 800 నుండి 1000 అడుగుల లోతైన బోర్లు వేసినా భూగర్భ జలాల జాడ తెలియని దుస్థితి నెలకొన్నది. ఒకవేళ పడ్డాయని సంతోషించినా, అవి రెండు మూడు నెలలకే ఇంకిపోతాయేమోనన్న మానసిక ఆందోళనతోనే రైతులు సేద్యాన్ని కొనసాగిస్తూ బ్రతుకు పోరు చేస్తున్నారు. ఒక బోరువేస్తే నీళ్ళు పడకకపోతే, రెండు, మూడు, నాలుగు, ఇలా బోర్లు తవ్వించుకోవడానికి అప్పుల మీద అప్పులు చేసి, అప్పుల ఊబిలో కూరుకపోయి దిక్కుతోచని స్థితిలోకి రైతులు నెట్టివేయబడుతున్నారు.
దాహం తీర్చుతుందనుకొన్న గాలేరు – నగరి సుజల స్రవంతికి ముప్పయి రెండేళ్ళ వయస్సు దాటి పోతున్నది. గాలేరు – నగరి ప్రాజెక్టులో అంతర్భాగంగా 26.7 టీయంసీల సామర్థ్యంతో నిర్మించబడిన గండికోట జలాశయం వల్ల వనగూడే ప్రయోజనాలు కడప జిల్లా పశ్చిమ ప్రాంతానికే పరిమితమా! అన్న అనుమానాల చరిత్ర పునరావృతం అవుతున్నది. గాలేరు – నగరి ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణం, గండికోట ఎత్తిపోతల పథకం (పైడిపాళెం), గండికోట – చిత్రావతి ఎత్తిపోతల పథకం, గండికోట – చిత్రావతి – హంద్రీ నీవా ప్రధాన కాలువ అనుసంధాన పథకమంటూ మరొక ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడానికి పరిపాలనానుమతి, నిథుల మంజూరు చేయడంతో ఈ తరహా అనుమానాలు బలపడుతున్నాయి.
ఈ పూర్వరంగంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికే కోడూరులో రైతు సంఘం సదస్సు నిర్వహించింది. ఆ ప్రాంతం పట్ల ప్రకృతి దయతలచింది. ప్రజలకు తాత్కాలికంగా ఉపశమనం లభించింది. పాలకులు తామనుసరిస్తున్న వివక్షతతో కూడుకొన్న వైఖరికి స్వస్తి చెప్పి సత్వరం గాలేరు – నగరి సుజల స్రవంతి రెండవ దశ నిర్మాణాన్ని చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. అప్పుడే ఆ ప్రాంతాన్ని శాశ్వతంగా కరవు నుండి విముక్తి చేయవచ్చు.

T Lakshminarayan

 

(టి.లక్ష్మీనారాయణ,సామాజిక ఉద్యమకారుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *