గుమ్మపాలు ఎపుడైనా తాగారా, ఇంతకీ ‘గుమ్మపాలు’ అంటే ఏమిటో తెలుసా?

ఘంటసాల పాట ‘వినరా వినరా నరుడా…’  (గోవుల గోపన్న 1968) గుర్తుందా? అందులో గోమాత ‘ కమ్మనయిన గుమ్మపాలు కడివెలతో ఇస్తున్నా…’ నంటుంది. పశ్చిమగోదావరి జిల్లా కవిటంలో ఈ గుమ్మపాల గమ్మత్తు గురించిన  జ్ఞాపకాలు…
(పరకాల సూర్యమోహన్)
ఇప్పుడు ఆనాటి పలప దొడ్డి, ఆ గడ్డి వాములు, ఆ ఆవులు, గేదెలు, చెంగుచెంగున గంతులేసే ఆ లేగ దూడలు లేకపోవచ్చు. మాలాగా పిచ్చి అల్లర్లు చేసే ఆకతాయి కుర్రకారు వుండకపోవచ్చు.
కానీ ఆ పలపదొడ్డి  మా పిల్లల జీవితాల్లో, మా పెద్దల జీవితాల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
అది మాకు చిన్నతనాల్లో పెద్ద ఆట స్థలం అయితే మా కుటుంబానికి అది వెన్నెముక లాంటిది. ఆ పలపదొడ్డిలోని పాడి సంపద, అరటి చెట్లు, రకరకాల పాదులు,తీగల నుంచి లభించే దిగుబడి మా కుటుంబ పొషణకు ఎంతో సాయపడేది. అంటే అరటి కాయలు, పొట్లకాయలు, చిక్కుడు కాయలు, బచ్చలికూర పుష్కలంగా పండేవి. పలపదొడ్డి భూమిలో నిక్షిప్తమై వుండే మరో పంట గురించి రానున్న ఎపిసోడ్లో వివరిస్తాను.
మా బాబయ్యలు ఎప్పుడో గానీ సంతకు వెళ్ళే వారు కాదు.రోజూవారి వంటకు కావల్సిన కూరలు పెరటిలోనే పండుతోంటే పొరుగూళ్లో సంతకు వెళ్ళవలసిన అవసరం ఏముంటుంది?
అనుకోకుండా హఠాత్తుగా బంధువులు దిగినా ఎవరూ కంగారు పడేవాళ్ళు కాదు. వెంటనే పలపదొడ్డిలోకి వెళ్ళి అరటి చెట్టుకు వేలాడే గెలలో నుంచి ఓ నాలుగు అరటి కాయలు, ఇంత బచ్చలి తీగ కోసుకు వస్తే చాలు. వంట పూర్తి అయినట్టే.

 

కనుచూపు మేరవరకూ పచ్చని పంటచేలతో కనువిందుచేసే కవిటం!
ఆ నాటి, మా చిన్ననాటి ఆ దృశ్యాలు మా మనసుల్లో అలా వుండిపోయాయి. వాటిని తలుచుకుంటే చాలు ఇప్పటికీ కళ్ళముందు ఇట్టే ప్రత్యక్ష మవుతాయి.
పొద్దున్నే మా బుల్లి అబ్బాయి బాబయ్య తళతళా మెరిసే ఇత్తడి పాలచెంబుతో పలపదొడ్లోకి పాలు పితకడానికి వెళ్ళే వాడు. ఖాళీ చెంబే ఓ రెండు కిలోల బరువు వుంటుంది. అది రెండున్నర శేర్ల పాలచెంబు. అంటే రెండు లీటర్ల పై చిలుకే అందులో పాలు పడతాయి.

మోహన రాగాలు-5


ఆవులు గేదెల పాలు పితకడం ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. అలవాటైన వాళ్ళు అలవోకగా పాలుపితికేవాళ్ళు. మా చిన్నతనాల్లో మాకు అదోక వింత దృశ్యం. కళ్ళు అప్పగించి , నోరు వెళ్ళబెట్టి అలా చూస్తూ వుండిపోయేవాళ్ళం.
అయితే పాలు పితకడం మా బాబయ్యకి బాగా అలవాటైన విద్య. ముందుగా పాలు పితకబోయే ఆవు దగ్గరకు వెళ్ళి ఒక చేత్తో పాలచెంబు పట్టుకుని చెంబులోవున్న గోరువెచ్చని నీళ్ళతో పొదుగుల్ని బాగా శుభ్రంగా కడిగి , ఆ తరువాత పొదుగులకీ, చేతులకీ వెన్న రాసుకునే వాడు.
ఆవు దగ్గర రెండు మోకాళ్ళ మధ్య ఒడుపుగా పెట్టుకుని పాలు పితికే ఇత్తడి చెంబు ఇదే. దీని బరువే దాదాపుగా రెండు కిలోలు వుంటుంది.
రెండు మోకాళ్ళ మధ్య పాల చెంబుని వడుపుగా, జారిపోకుండా పెట్టుకుని , బొటన వేలు, చూపుడు వేళ్ళ మధ్య పొదుగును పట్టుకుని పాలు పితుకు తోంటే ఆ పొదుగలోంచి పాలు ఖాళీ పాలచెంబులో చుయ్ చుయ్ మంటూ సన్నని ధారగా పడేవి.
మేము ఆ దృశ్యాన్ని అలా చూస్తూ వుండిపోయేవాళ్ళం. “వురేయ్, ఇలా వచ్చి పొదుగు దగ్గర నోరు తెరు” అనేవాడు. నోరు తెరవగానే నోట్లోకి పాలుపడేలా పితికేవాడు.ఆ పాలు గోరు వెచ్చగా , కమ్మగా వుండేవి. వాటిని గుమ్మపాలు అని పిలిచేవాళ్ళు. ఒక్కోసారి మా మొహమంతా పాలు చిందేవి. అదో వింత అనుభూతి.
మా బాబయ్య కళ్ళు పెద్దవి చేసి ఈ గుమ్మపాలు ఒంటికి ఎంత మంచిదో తెలుసా అనేవాడు .
ఆ రోజులు మళ్ళీ రానేరావు. పాల చెంబు నిండగానే ఇంటికి తీసుకుని వెళ్ళి పెద్దపాత్రలో ఒంపి ఇంకా పాలు పితకడానికి మళ్ళీ పలపదొడ్డికి బయలుదేరే వాడు.
ఈ లోగా మా పెద్దత్తయ్య, పిన్నిలు పాలు కాచేవారు. పొద్దున్నే పిల్లలందరికీ పాలు ఇచ్చేవాళ్ళు. ఏ పిల్లాడికైనా జలుబు చేస్తే పాలలో మిరియాల పొడి వేసి వేడివేడిగా పాలు తాగమనేవాళ్ళు.
పాలు చల్లారిన తర్వాత తోడు పెట్టేవాళ్ళు.
మాకు భోజనాల్లో ఎప్పుడూ గెడ్డ పెరుగే. పెరుగు మీద దళసరి మీగడను కుండలోకి తీసి రెండు మూడు రోజుల కొకసారి కవ్వంతో చిలికి వెన్నని ముద్దలు ముద్దలుగా తీసి కాచేవారు. అలా వచ్చిన నెయ్యి ఘుమఘుమ లాడుతూ వుండేది. మూకుడు లో అడగున వుండే గోకుడులో పంచదార కలుపుకుని తినేవాళ్ళం.
ఆవకాయ అన్నం తింటోంటే అప్పుడే తీసిన వెన్న వేసేవాళ్ళు. వెన్న నంచుకుంటూ ఆవకాయ అన్నం తింటూంటే భలే మజగా వుండేది.
ఇప్పుడు అరుదుగా కనిపించే ఈ మరచెంబు మా చిన్నతనాల్లో విరివిరిగా కనిపించేది. ప్రయాణాల్లో ఇందులోనే మంచినీళ్ళు తీసుకువెళ్ళేవారు.
ఆవులు గేదెల సంపద ఉన్నప్పుడు వాటిల్లో ఏదోఒకటి చూడు కట్టేది. సాధారణంగా 7-8 నెలలు పాలు ఇచ్చిన ఆవు సంతానవృద్ధికి సిద్ధం అవుతుంది.
అది చూలు కట్టి, ఈనే దశకు వచ్చే వరకూ వాటిని యజమానులు చాలా జాగ్రత్తగా చూసుకునేవారు, ప్రత్యేకమైన దాణా పెట్టేవారు. ఆవుల సాధారణంగా రాత్రి వేళ ఈనుతాయి.
ఈనిన తరువాత ఉలవలనీళ్ళ పట్టించేవారు.అలా చేస్తే దాని గర్భాశయం శుభ్రపడుతుందట. ఇంక ఉదయం పాలు పితికే వారు. ఆ పాలు మామూలుగా కాక బాగా చిక్కగా కొంచం పచ్చగా వుంటాయి. వాటినే జున్ను పాలు అంటారు. ఆ పాలతో వండే జున్ను ఒక అపురూపమైన మధురమైన వంటకం.
ఆ చిక్కటి పాలలో రెండు రెట్లు మామూలు పాలు కలిపి, ఆ తరువాత దానిలో బెల్లం, మిరియాల పొడి కలిపి పెద్ద గిన్నెలో పోసి దానిని డేసా లో వుంచి ఆవిరి మీద ఉడకపెట్టేవారు. అది పాత్రలో వుడికి గట్టిగా అయ్యేది. పైన మిరియాల పొడి తెట్టులా వుండేది. గరిటె తో తీసి పెద్దపెద్ద ముక్కల్లా వడ్డించే వాళ్ళు. తింటే తప్ప దాని రుచిని మాటల్లో వర్ణించడం చాలా కష్టం. ఈ నాటి పట్టణ వాస నవ నాగరిక బతుకుల్లో ఈ అపూర్వ వంటకం గురించి ఎంత మందికి తెలుసు?
నా పెళ్లి అయిన కొత్తల్లో ఒక సారి మా ఆవిడ వసంతని తీసుకొని కాకినాడ నుంచి కవిటం వచ్చాను.
కవిటంలో విరగకాసిన బొప్పాయి
మేము వస్తున్నామని జున్ను వండారు. కంచాల్లో పెద్దపెద్ద అన్నం కెరడు అంత వడ్డించారు. నా పక్కనే పాణి కూచున్నాడు. వాడి కంచంలో వడ్డించిన జున్ను సైజు చెప్పొద్దూ ఇంకొంచం పెద్దదిగానే వుంది.అది చూసి మా ఆవిడ బిత్తర పోయి, నోరు వెళ్ళబెట్టి, వెర్రి చూపులు చూడటం మొదలుపెట్టింది.
“ఏమండీ, అదంతా పాణి ఒక్కడే తినేస్తాడా” అని నా చెవిలో రహస్యంగా అంది. “చూస్తూ వుండు” అన్నాను నవ్వుతూ. ఈలోగా పాణి ఆ జున్నంతా శుభ్రంగా లాగించేసాడు.
ఒక మనిషి అంత జున్ను తినడం జీవితంలో మొదటి సారిగా చూసానని నా బస్తీ భార్య వ్యాఖ్యానించింది.
“మీరంతా బకాసురుడుకి బంధువులు” అని తీర్మానించింది. ఆ రోజుల్లో మా తిండి పుష్టి అలావుండేది.
ఇదే ఒకనాటి మా ప్రఖ్యాత పలపుదొడ్డి. ఆస్తుల పంపకాల్లో ఇది మా బుల్లి అబ్బాయి బాబయ్యకి వాటాగా వచ్చింది. దానిని నివాస యోగ్యంగా మార్చుకున్నారు.
మా పలపదొడ్డిలో వున్న ఆవుల్ని గేదెల్నీ ఒక పాలేడు రోజూ కాలవ గట్టు దగ్గరికి తోలుకు వెళ్ళి అక్కడ ఎండుగడ్డితో వాటి ఒళ్ళంతా శుభ్రంగా తోమేవాడు.  మేము కూడా ఆ ఆవుల వెనకాలే వెళ్ళే వాళ్ళం. కాలువ నీళ్ళలో ఆ పశువుల్ని ఎండు గడ్డితో చిట్టాడు కడుగుతూంటే మేము గేదెల మీద కూచునే వాళ్ళం.
దూడలు కడిగే కాలువరేవుని బండిరేవు అనేవారు, అక్కడే ఎడ్లబండ్లు కూడా కడిగేవారు. ఊరు మొత్తం పశువులన్నీ అక్కడే కడిగే వారు. చూడటాని అన్నీ ఒకేలా కనిపించేవి. కానీ ఆశ్చర్యంగా మన ఆవులు గేదెలు ఏవో చిట్టాడి బాగా తెలుసు.
అలాంటి రోజులు మళ్ళీ వస్తాయా?
ఆవులు, గేదెలు పేడ ని విసర్జిస్తాయి. ఆ పేడని సాధారణ మలం కింద తీసి పారేయడానికి వీలులేదు. ఈ పేడ వుపయోగాలు చెప్పలేనన్ని. వీటితో పిడకలు తయారు చేసేవారు. వీటి తయారీ చూడటానికి అసహ్యంగా అనిపించేది. కానీ ఈ రోజుల్లో నవనాగరిక ప్రపంచానికి అసలు పిడకలు అంటే ఏమిటో వాటిని ఎలా తయారుచేస్తారో వాటి వుపయోగాలేమిటో తెలుసా అని నా సందేహం.
రెండుమూడు రోజుల పేడ ఒకేచోట పోగుచేసి దానిలో తగుమాత్రం నీళ్లు పోసి, ఆ పేడముద్దని ధాన్యం పొట్టు లో దొల్లించేవారు అల్లా చేస్తే పేడ ఎక్కువగా చేతికి అంటుకోదు.
ఎండిన పిడకలు
పొలాల్లో ధాన్యం నూర్చి నప్పుడు ధాన్యం ఎగరపోయగా వచ్చే గడ్డి తునకలు, పొల్లు ధాన్యం పొట్టుని ఇలా పిడకలకు వాడేవారు, పిడకలు సాధారణంగా గోడలకు కొట్టి పలుచగా బిళ్ళలుగా అద్దేవారు. అలాగే కొబ్బరి, తాటి చెట్లు కి అద్దేవారు.
ఇంటిలో అందరికి వేడినీళ్ళు కాయడానికి సందులో ఒకచోట పొయ్యి మీద రాగి డేశాలో నీళ్ళు కాచే వాళ్ళు. పొయ్యి లోకి తాటి, కొబ్బరి మట్టలు, పిడకలు వాడేవారు. ఆ పిడకలు బాగా మండి తెల్లని బూడిద గా అయ్యేది. మేము ఆ బూడిద నిఎడమచేతిలో పోసుకుని వేళ్ళతో అద్దుకుని పళ్ళు తోముకునే వాళ్ళం.ఆ బూడిద ని ‘కచిక’ అనేవారు.
ప్రతి రోజూ తెలతెలవారుతూ వుండగా ఆడవాళ్ళు ఇంటిముందు కళ్ళాపి జల్లి అందమైన ముగ్గులు పెట్టేవారు. ముగ్గులు పెట్టడానికి ముందు బాల్చీలో పేడకలిపిన నీళ్ళని చల్లేవారు. సంక్రాంతి వస్తోందంటే ప్రతి ఇంటిముందూ రంగురంగుల ముగ్గులు వాటి మధ్యలో బంతి ఆకారంలో గొబ్బెమ్మలు ఆ గొబ్బెమ్మల మీద మందార, బంతి పువ్వులు ఎంతో చూడ ముచ్చటగా సాక్షాత్కరిస్తూ వుంటాయి. ఇంతకీ ఆ గొబ్బేమ్మలు ఏమిటో తెలుసా? అవి పేడముద్దలు.

(పరకాల సూర్యమోహన్ సీనియర్ జర్నలిస్టు. పూర్వం ఇండియన్ ఎక్స్ ప్రెస్, ది హిందూ పత్రికలలో పనిచేశారు. సొంతవూరు పశ్చిమ గోదావరి జిల్లా కవిటం. స్థిరపడింది చెన్నైలో )

 

మోహనరాగాలు-4  ఇక్కడ చదవండి

https://trendingtelugunews.com/top-stories/features/kavitam-villaga-rituals-of-brahmin-family-gokarnam-serving-liquid-dish-bowl/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *