నవంబర్ 26 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఎందుకంటే…

(*పి. ప్రసాద్ (పీపీ),కే. పొలారి)
అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు పట్టి చూస్తే చాలు. మోడీ షా ప్రభుత్వం నేడు రద్దు చేసిన కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు ఎలా వుంటాయో, తెలుసు కోవడానికి కూడా ఒక్క ఉదాహరణ సరిపోతుంది. అలా తెలుసుకుంటే, బ్రిటీష్ ప్రభుత్వం నాటి కంటే, కొత్త లేబర్ కోడ్లు అమలులోకి వచ్చాక మోడీ షా ప్రభుత్వ పాలనలో మున్ముందు మరింత ప్రమాదకర పరిస్తితి భారత కార్మిక వర్గానికీ ఎదురు కానున్నదని అర్థమవుతుంది. అదేమిటో చూద్దాం.
భారత కార్మికవర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల ప్రస్థానం 1923 లో ప్రారంభం అయ్యింది. మరో మూడేళ్లు నిండితే నూరేళ్ల నిండుతుంది.
ఆ ఏడాది బ్రిటీష్ ప్రభుత్వం కార్మికుల నష్ట పరిహారం చట్టం (WC ACT) తెచ్చింది. మూడేళ్ల తర్వాత 1926 లో “ట్రేడ్ యూనియన్ చట్టం” (TU ACT) తెచ్చింది. పదేళ్ల తర్వాత 1936 లో “జీతాల చెల్లింపు చట్టం” (PW ACT) తెచ్చింది. పదేళ్ల తర్వాత 1946 లో ఇండస్ట్రియల్ ఎంప్లాయ్ మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ చట్టం (IESO ACT) తెచ్చింది.
ఆ మరుసటి ఏడాది 1947లో “పారిశ్రామిక వివాదాల చట్టం” (ID ACT) తెచ్చింది. ఈ ఐదు కార్మిక చట్టాలు బ్రిటీష్ వలస పాలన లో వచ్చినవే. (1947 ID చట్టం నెహ్రూ ప్రభుత్వం తెచ్చిందనే సందేహం రావచ్చు. అది అధికార మార్పిడి కంటే ఐదు నెలల ముందు 47 మార్చి నెలలో తెచ్చింది) ఈ ఐదు కార్మిక చట్టాలు ప్రాధాన్యత గలవే.
ఇందులో ఏదీ ఒక్కొక్క “రంగం” కార్మికులకు వర్తించే సెక్టార్ వారీ చట్టం కాదు. మొత్తం కార్మిక వర్గానికి వర్తించే కార్మిక చట్టాలివి.
ఫాక్టరీలలో భారతదేశ కార్మికులు ప్రమాదాలలో మరణిస్తే, బ్రిటీష్ కాపిటలిస్ట్ వర్గం అమానుషంగా శవాన్ని ఈడ్చి అవతల పడేసే కాలంలో మొదటి చట్టమైన “ప్రమాద నష్ట పరిహారం చట్టం” వచ్చింది.
యూనియన్ పెట్టుకునే హక్కు చట్టపరంగా లేని కాలంలో రెండో చట్టమైన “TU ACT” వచ్చింది. వర్కర్లు చేసిన పనికి సైతం జీతభత్యాల చెల్లింపు కి భద్రత లేని కాలంలో మూడో చట్టమైన “PW ACT” వచ్చింది. ఉద్యోగ భద్రత లేని కాలంలో నాలుగో చట్ట మైన ESO ACT వచ్చింది.
అన్నింటి కంటే మించి పెట్టుబడిదార్ల తో కార్మికులకు వచ్చిన వివాదాల పరిష్కారం కోసం ఐదవ చట్టమైన ID ACT ఉనికిలోకి వచ్చింది. ఈ ఐదు కార్మిక చట్టాలు బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో వచ్చినవే.
1947 లో అధికార మార్పిడి తర్వాత నెహ్రూ సర్కార్ నుండి నిన్న మొన్నటి వరకూ తెచ్చిన అనేక కార్మిక చట్టాల్ని కూడా కలిపితే మొత్తం 44 కార్మిక చట్టాలకు చేరింది. వాటిలో నాలుగు కార్మిక చట్టాల్ని రద్దుచేసి, వాటి స్థానంలో “వేజ్ కోడ్” ను 2019 లో మోడీ ప్రభుత్వం తెచ్చింది.
ఈ కరోనా కాలంలో 9 కార్మిక చట్టాల్ని రద్దు చేసి ఒక లేబర్ కోడ్ ని; మరో 13 కార్మిక చట్టాల్ని రద్దు చేసి ఒక లేబర్ కోడ్ ని; మరో మూడు కార్మిక చట్టాల్ని రద్దు చేసి ఒక లేబర్ కోడ్ ని మోడీ షా ప్రభుత్వం తెచ్చింది.
అంటే, మొత్తం 44 కార్మిక చట్టాలలో 4 ప్లస్ 9 ప్లస్ 13 ప్లస్ 3 కలిసి ఇప్పటికి 29 చట్టాలకు మోడీ షా ప్రభుత్వం కరోనా కాలంలో మంగళం పాడింది.
బ్రిటీష్ వలస ప్రభుత్వం ఇండియా నుండి నిస్క్రమణ కి కేవలం ఐదు నెలల ముందు ఆమోదించిన ID ACT లో “D” అనే ఓ అక్షరానికి ప్రాధాన్యత వుంది. అది కార్మిక వర్గానికీ బ్రిటీష్ ప్రభుత్వం కంటే, మోడీ షా ప్రభుత్వం ప్రమాదకరం అనే నగ్న సత్యాన్ని చాటుతుంది.
పైన పేర్కొన్న ఐదింటిలో రెండవ, నాల్గవ, ఐదవ చట్టాలు మూడింటిని రద్దు చేసి మోడీ ప్రభుత్వం కొత్తగా “పారిశ్రామిక సంబంధాల కోడ్” (INDUSTRIAL RELATIONS CODE) ని తెచ్చింది.
ఈ కోడ్ కి ఇలా నామకరణంలోనే ఒక ఫాసిస్టు రాజకీయ దుర్నీతి దాగి వుంది. ఇందులోనే నాటి బ్రిటీష్ వలస ప్రభుత్వం కంటే నేటి మోడీ షా ప్రభుత్వం మరింత ఎక్కువ కార్మిక వ్యతిరేకమైనదిగా తేలిగ్గా అర్థమవుతుంది.
INDUSTIAL DISPUTES ACT (ID ACT) ని తెలుగులో పారిశ్రామిక వివాదాల చట్టం అంటారు. దీనర్థం పారిశ్రామిక రంగంలో పరస్పర విరుద్దమైన రెండు వర్గాలు ఉంటాయనే భౌతిక వాస్తవాన్ని నాటి బ్రిటీష్ ప్రభుత్వం అంగీకరించడం గమనార్హం.
వాటి మధ్య వివాదాలు ఉంటాయనే చేదు నిజాన్ని సైతం అది గుర్తించింది. వాటిని గుర్తించి పరిష్కారం కోసం తెచ్చిందే ID ACT.
అదే విధంగా, ID ACT కంటే 21 ఏళ్ళు ముందే 1926 లో బ్రిటీష్ ప్రభుత్వం తెచ్చిన TU ACT లో కూడా TU అనే పదాలను బ్రిటీష్ ప్రభుత్వం నామకరణం చేయడం గమనార్హం.
లేబర్ యూనియన్ కి బదులు ట్రేడ్ యూనియన్ అని వారే వర్గం ప్రాచుర్యం లోకి తెచ్చిన కుటిల వ్యూహం గూర్చి మరో సందర్భంగా చర్చించు కోవచ్చును. కానీ ఈ వర్గమే కార్మిక సంఘాలకు ఏ ట్రేడ్ యూనియన్లు గా పేరు పేట్టి ప్రచారం చేసిందో, అదే ట్రేడ్ యూనియన్ల పేరుతో ఉన్న ఒక లేబర్ చట్టాన్ని కూడా మాయం చేసింది.
ఒకవైపు 1947 చట్టం లోని “వివాదాలు” అనే పదాన్ని గానీ, మరోవైపు 1926 చట్టం పేరులోని “ట్రేడ్ యూనియన్ల” అనే పదాన్ని గానీ లేకుండా కొత్త కోడ్ లో మోడీ ప్రభుత్వం జాగ్రత్త పడింది. దానికి ముద్దు గా “సంబంధాలు” అని కొత్తగా నామకరణం చేయడం గమనార్హం. “ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్” అని కొత్త కోడ్ కి పేరు పెట్టడంలో దాగిన కుట్రను అర్థం చేసుకోవాల్సి ఉంది.
మార్క్స్ ఒక సందర్భంలో తమ మిత్రుడికి రాసిన లేఖలో “వర్గాలు” వర్గ పోరాటాలు” తాను కనిపెట్టినవి కాదని, వాటిని తన కంటే ముందు ఈ  పండిత వర్గమే గుర్తించిందని అంటాడు. ఔను మరి! ఈ వర్గం వాటి ఉనికిని గుర్తించింది. అంతే కాకుండా అట్టి పరస్పర విరుద్ధమైన రెండు వర్గాల (పెట్టుబడిదారీ వర్గం & కార్మిక వర్గం) మధ్య వర్గ పోరాటాల ఉనికిని కూడా గుర్తించింది.
వాటి పరిష్కారం కోసం కొన్ని చట్టాలు, ట్రిబ్యునల్స్, లేబర్ కోర్టులు వంటి సంస్కరణలను కూడా తెచ్చింది. 1830-40 దశాబ్దాలలో చార్టిస్ట్ ఉద్యమం పేరిట ఇంగ్లీష్ కార్మికవర్గ వీరోచిత పోరాటాల ఫలితంగా బ్రిటీష్ బూర్జువా వర్గం, దానికి ప్రాతినిధ్యం వహించే బ్రిటీష్ బూర్జువా ప్రభుత్వాలు పైన పేర్కొన్న వర్గాల ఉనికిని చట్టపరంగానే అంగీకరించడం గమనార్హం.
అదే బ్రిటీష్ ప్రభుత్వం తన వలసలలో కూడా కార్మికవర్గం పోరాడిన సందర్భాల్లో వర్గాల ఉనికిని గుర్తించక తప్పలేదు. కానీ నేడు మోడీ షా ప్రభుత్వం మాత్రం వర్గాల ఉనికిని గుర్తించ నిరాకరిస్తుంది. అందుకే అది వ్యూహాత్మకంగా గతంలోని INDUSTRIAL DISPUTES స్థానంలో INDUSTRIAL RELATIONS గా మార్పు చేసింది.
ఇంతవరకూ కార్మికులు, పెట్టుబడిదారులు పరస్పర విరుద్ధమైన రెండు వర్గాలు గా మాటల్లో అంగీకరిస్తూనే, ఆచరణలో పెట్టుబడిదారీ వర్గపు కొమ్ము కాసే విధానాన్ని బ్రిటీష్ ప్రభుత్వం నుండి నిన్న మొన్నటి వరకూ వివిధ  ప్రభుత్వాలు అనుసరిస్తూ వచ్చాయి.
ఇక నుండి ఈ కనీస గుర్తింపుకు కూడా కొత్త కోడ్ లో అవకాశం లేదు. ఎందుకంటే, కార్మికులకు పెట్టుబడిదారులు శత్రువులు కారని ఈ కొత్త లేబర్ కోడ్ నిర్వచిస్తుంది. వారి మధ్య సోదర సంబంధాలు గా అది భావిస్తుంది. అందుకే నూతన కోడ్ కి “పారిశ్రామిక సంబంధాల కోడ్” గా నామకరణం చేసింది.
ఒక్కమాటలో చెప్పాలంటే, ఓ వైపు వర్గాలఉనికిని మాటల్లో గుర్తిస్తూనే, వర్గదోపిడీని చేతల్లో పటిష్టం చేయడం బూర్జువా ప్రజాస్వామిక విధానం. దానికి భిన్నంగా మాటల్లో సైతం వర్గాల ఉనికిని గుర్తించ నిరాకరిస్తూ, కార్మిక వర్గం పై నగ్నమైన దాడికి దిగడం ఫాసిజం యొక్క విధానం.
అందుకే 1947 కి ముందు బ్రిటీష్ ప్రభుత్వం అవలంబించిన పారిశ్రామిక విధానాల కంటే, రేపటి నుండి లేబర్ కోడ్ల ద్వారా మోడీ షా ప్రభుత్వం అవలంబించనున్న కొత్త పారిశ్రామిక విధానాలు కార్మిక వర్గానికీ మరింత ఎక్కువ ప్రమాదకరమైనవి. ఈ నేపథ్య స్థితిలో రేపటి సార్వత్రిక సమ్మె కి గల రాజకీయ ప్రాధాన్యత సహజంగా ఎక్కువ వుంటుంది.
(*పి. ప్రసాద్ (పీపీ)అధ్యక్షులు,కే. పొలారి ప్రధాన కార్యదర్శి,ఏపీ రాష్ట్ర కమిటీ, India Federation of Trade Unions IFTU)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *