క్రికెట్ కామెంటరీ చరిత్ర, కామెంటరీ లేకపోతే “కిక్కు” లేదు (1)

(సిఎస్ సలీమ్ బాషా)
కామెంటరీ (వ్యాఖ్యానం) లేకుండా క్రికెట్ ని ఎంజాయ్ చేయగలమా? కచ్చితంగా చేయలేము. కేవలం టీవీలో క్రికెట్ చూడగలుగుతాం. అంతే! ఒకప్పుడు రేడియోలో క్రికెట్ కామెంటరీ వినడం తప్ప మరో మార్గం లేదు. కాలక్రమేణ టీవీ వచ్చిన తర్వాత క్రికెట్ ని చూడగలుగుతున్నాం కూడా. అయినా సరే టీవీ లో కూడా కామెంట్రీ లేకపోతే క్రికెట్ చూడలేము. అది ఉప్పులేని పప్పు లాగా ఉంటుంది. క్రికెట్ ఆట జరుగుతున్నప్పుడు మాత్రమే కాకుండా, ఆట అయిపోయిన తర్వాత ప్రముఖ క్రికెటర్ ల తో చర్చలు, మాటకు ముందు కూడా వ్యాఖ్యానాలు ఇప్పుడు పరిపాటి.
టీవీ రాకముందు(కొన్నిసార్లు వచ్చిన తర్వాత కూడా) రేడియోలో కామెంట్రీ వినడం ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్! టీవీ ప్రత్యక్ష ప్రసారం చూస్తూ వినడం కన్నా అదే బాగుండేది. రేడియో చుట్టూ అందరూ చేరి కామెంట్రీ వినే అనుభవం ఇప్పటి వాళ్ళకి లేదు. కామెంట్రీ వినడంలో ఒక మజా ఉండేది. ఇప్పుడు కామెంట్రీ సెల్ ఫోన్లలో వినగలుగుతున్నాం. ఒకప్పుడు క్రికెట్ కామెంట్రీ ఇంగ్లీష్ లో హిందీలో ప్రసారమయ్యేది. ఇప్పుడు టీవీ లో తెలుగులో కూడా వ్యాఖ్యానం వినే అవకాశం ఉంది.
Suresh Saraiya (facebook picture)
60,70 దశకాల్లో క్రికెట్లో కామెంట్రీ వినడం మాకు బలే బాగుండేది. 1969 లో అనుకుంటా నేను మొదటిసారి ఇంగ్లీషులో కామెంట్రీ వినడం. అది బిల్ లారీ సారధ్యంలో వచ్చిన ఆస్ట్రేలియా జట్టుతో ముంబై లో ఇండియా ఆడిన టెస్ట్ మ్యాచ్. (తర్వాత బిల్ లారీ కూడా వ్యాఖ్యాతగా మారడం విశేషం. అంతేకాకుండా 1971 లో జరిగిన మొదటి వన్డే ఇంటర్నేషనల్ కి కూడా ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహించాడు. ఆస్ట్రేలియాను గెలిపించాడు కూడా. దీని గురించి మరో సారి తెలుసుకుందాం) ఆ మ్యాచ్లో సురేష్ సరయ్యా కామెంట్రీ విన్నాము. ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. అనర్గళంగా సాగిన సురేష్ సరయ్యా కామెంట్రీ అర్థం కాకపోయినా సరే విన బుద్ధి అయ్యేది. తర్వాత అర్థమైంది అనుకోండి అది వేరే విషయం. ఇంగ్లీష్ లో అంత వేగంగా, లయబద్ధంగా ఉండేది సురేష్ సరయ్యా కామెంటరీ. కాకతాళీయంగా అది సురేశ్ సరయ్యా కి కూడా మొదటి టెస్ట్ మ్యాచ్ అని తర్వాత తెలిసింది. ఇక అప్పట్లో సురేష్ మా అభిమాన కామెంటేటర్ అయ్యాడు. అదే సమయం లో అతనితో పాటు అనంత్ సెటల్వాడ్ కామెంటరీ విని ముగ్ధులమయ్యాము. దరిమిలా అతనికి కూడా అభిమానులమయ్యాము.
సురేష్ సరయ్యా గల గల పారే నది లాంటి వాడయితే. అనంత్ సెటల్వాడ్ గంభీరమైన సముద్రం లాంటి వాడు. వారిద్దరి కాంబినేషన్ లో ఉన్న మజా వింటేనే తెలుస్తుంది. ఇద్దరూ నువ్వా నేనా అని పోటీ పడేవారు. అప్పట్లో వెస్టిండీస్ వచ్చినప్పుడు ఆట కన్నా వారిద్దరి కామెంట్రీ కోసం చాలామంది రేడియోకి అతుక్కుపోయే వారు అంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో నేను స్కూల్ ఎగ్గొట్టి అర్థం కాని కామెంట్రీ అద్భుతమైన గొంతుల్లో పలుకుతుంటే వినటం ఒక గొప్ప అనుభూతి. వారిద్దరికీ ఆట పై ఉన్న ప్రేమ, పరిజ్ఞానం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆట గురించి తెలియని వాళ్ళకి కూడా అరటిపండు ఒలిచి నట్లు వ్యాఖ్యానించడం వారికే చెల్లు.
అప్పట్లో వీరిద్దరూ కాకలు తీరిన కామెంటేటర్లు. వీరితో పాటు క్రికెట్ వ్యాఖ్యానానికి వన్నె తెచ్చిన కొంతమంది వ్యాఖ్యాతల గురించి, ఇంకా హిందీ కామెంటేటర్ ల గురించి మరొకసారి తెలుసుకుందాం.
Saleem Basha CS

(సిఎస్ సలీం బాషా స్పోర్ట్స జర్నలిస్టు,  కమ్యూనికేషన్ స్కిల్స్ నిపుణుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *