ముఖ్యమంత్రి జగన్ బిసి కార్పొరేషన్లు ప్రకటించిన 24గంట్లోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన బిసిఅస్త్రం ప్రయోగించారు. బిసిలు దూరంగా కాకుండా ఉండేందుకు ఆయన పార్టీ పునర్నిర్మాణంలో బిసిలకు పెద్ద పీట వేశారు. రాష్ట్రంలో చాన్నాళ్ల తర్వాత బిసి వోట్లకు పోటీ మొదలయింది. ఎపుడో 2009 ఎన్నికల ముందుకు సామాజిక న్యాయం పేరుతో రాష్టంలో బిసిలను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్, టిడిపి పోటీ పడ్డాయి.ఎన్నికల మ్యానిఫెస్టోలలో బిసిల గురించి గొప్ప వాగ్దానాలు చేశాయి. కనీసం వందకుతగ్గకుండా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు కేటాయించాయి. దీనికి కారణం అపుడు చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ సామాజిక న్యాయం అజండాతో ముందుకు రావడమే. అయితే, ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం ఓడిపోవడంతో ఎన్నికల నినాదంగా ‘సామాాజిక న్యాయం’ కూడా ఓడిపోయింది. చిరంజీవి ఈ గొడవంతా వదిలేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. అలా సామాజిక న్యాయ చరిత్ర ముగిసింది. 2014, 2019 ఎవరూ ఆ మాటే వాడలేదు. మోదీ రాకతో ఆ అధ్యాయం ముగిసింది.ఇపుడు ఉన్నట్లు ఆంధ్రలో మళ్లీ బిసి రాజకీయాలు మొదలయ్యాయి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పార్టీ పునర్నిర్మాణంలో బిసిలో ప్రాధాన్యం (60 శాతం పోస్టులు) ఇస్తూ చంద్రబాబు నాయుడు జాబితా ప్రకటించారు. ఈ సందర్భంగా టిడిపి అందించిన నోట్ ఇది:
టిడిపికి పూర్వవైభమే లక్ష్యం
తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తన అమ్ములపొదిలోంచి చంద్రబాబు తాజాగా అచ్చెనాస్త్రం ప్రయోగించారు.
తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా టెక్కలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని నియామించారు.
2019ఓటమి అనంతరం పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. అందరి తెలుగుదేశాన్ని కొందరిదని కోట్లు కుమ్మరించి జగన్‌రెడ్డి చేసిన విషప్రచారాన్ని తిప్పికొడుతూ కుల,మత,ప్రాంత సమీకరణాలతో తెలుగుదేశం పునర్నిర్మాణానికి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
వెనక నుంచి ముందుకు ..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమైన 1982 నుంచీ తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచారు వెనకబడిన తరగతులకు చెందిన నేతలు. కోట్లాది మంది బీసీల అభిమానంతో తెలుగుదేశం అధికారంలోకొచ్చింది. బీసీ నియోజవర్గాలన్నీ తెలుగుదేశం కంచుకోటలుగా మారాయి. సంప్రదాయ బీసీ ఓటుబ్యాంకు తెలుగుదేశానిది.. యోధానుయోధులైన బీసీ నేతలు టిడిపిలో అగ్రస్థానాలలో వున్నారు. తెలుగురాష్ట్రాల టిడిపి అధ్యక్షులిద్దరూ బీసీలే. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వెనకబడిన తరగతులకు చెందిన బలమైన నేత అచ్చెన్నాయుడికి ఏపీ టిడిపి అధ్యక్ష బాధ్యతలు అప్పగించి పార్టీని ముందుండి నడిపే నాయకుడిగా నిలిపారు చంద్రబాబు.
కింజరాపు కుటుంబానికి పగ్గాలు…
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో పార్టీలోకొచ్చిన .. కింజరాపు ఎర్రన్నాయుడు..అనంతరం రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన సోదరుడు కింజరాపు అచ్చెన్నాయుడు, తనయుడు రామ్మోహన్నాయుడు, కుమార్తె భవానీలు కింజరాపు కుటుంబం .అంటే తెలుగుదేశం కుటుంబం అన్నంత అంకితభావంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.
2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జోరులోనూ టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా, శ్రీకాకుళం నుంచి ఎంపీగా రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా భవానీ విజయం సాధించి తెలుగుదేశం సత్తా చాటారు. తెలుగుదేశం పార్టీని, కార్యకర్తల్ని కుటుంబంగా భావించి..ప్రజాసేవకే తమ జీవితాలు అంకితం చేసిన ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడికి ఏపీ టిడిపి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టడంతో పార్టీలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.
అసెంబ్లీలో వినిపించే తొలిగొంతు ఆయనదే…
అసెంబ్లీలో అచ్చెన్నాయుడు స్వరం వింటేనే వణికిపోయేంతగా భయపడ్డారు జగన్‌రెడ్డి. టిడిఎల్పీ ఉపనేతగా, టెక్కలి ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంతోపాటు రాష్ట్ర ప్రజల సమస్యలపై సర్కారుని నిలదీసేవారు అచ్చెన్న. అచ్చెన్నాయుడు ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వ పెద్దలు ఈఎస్ఐ స్కామంటూ తప్పుడు కేసులు పెట్టి, అక్రమంగా అరెస్ట్ చేయించారు. ఆపరేషన్ జరిగిన అచ్చెన్నని వందల కిలోమీటర్లు తరలించి.. జైలులో నిర్బంధించాలని ఎన్నో కుట్రలు చేశారు. వంద రోజులపాటు తిప్పారు. చివరికి కరోనా కూడా అంటించేశారు. అచ్చెన్నాయుడు అదరలేదు, బెదరలేదు. దర్యాప్తు అధికారులు కూడా ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడికి రూపాయి కూడా లబ్ధి చేకూరలేదని ప్రకటించారు. చివరికి వైఎస్సార్సీపీకి చెందిన కార్మికశాఖా మంత్రి గుమ్మనూరు జయరాం తాము అచ్చెన్నాయుడిని ఈ కేసులో ఇరికించామని బహిరంగంగానే ప్రకటించారు. బెయిల్‌పై బయటకొచ్చాక “ప్రభుత్వం తప్పులు నిలదీయడమే నేను చేసిన తప్పయితే! ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా నేను నిలదీస్తూనే వుంటాను. సర్కారు అవినీతిని ప్రశ్నించడమే నేరమైతే ఎన్ని అక్రమకేసులు పెట్టినా నేను ప్రశ్నిస్తూనే వుంటాను. నిజాయితీ నా ధైర్యం. సత్యం నా ఆయుధం. ప్రజాక్షేమమే నా లక్ష్యం“ అని ప్రకటించిన అచ్చెన్న జగన్‌రెడ్డి కుట్రలు, కుతంత్రాలకు లొంగేది లేదని తేల్చి చెప్పేశారు. ఎన్ని ఒత్తిడులు ఎదురైనా తట్టుకుని పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తున్న అచ్చెన్నని పార్టీ అధ్యక్షుడిగా నియమించారు చంద్రబాబు.
ఒక నియామకం ..చాలా ప్రయోజనాలు
ఉత్తరాంధ్ర తెలుగుదేశం కంచుకోటగా వుండేది. మూడురాజధానుల పేరుతో జగన్‌రెడ్డి ఆడుతున్న కపటనాటకాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తించారు. ఇదే సమయంలో జగన్‌రెడ్డి ప్రభుత్వానికి అసెంబ్లీలోనూ, బయటా ప్రజాసమస్యలపై నిలదీస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఉత్తరాంధ్ర రాజకీయ ఉద్ధండుడు అచ్చెన్నాయుడిని చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా ఏపీ టిడిపి అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. టిడిపి హయాంలో ఉత్తరాంధ్రకి గుండెలాంటి విశాఖని ఐటీ, వాణిజ్యరాజధానిగా చంద్రబాబు తీర్చిదిద్దారు. అటువంటి విశాఖని పరిపాలనా రాజధానిపేరుతో భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చేశారు జగన్‌రెడ్డి. దీనిని అడ్డుకునేందుకు రాష్ట్రపార్టీ తరఫున, ఉత్తరాంధ్ర నుంచే అధ్యక్షుడిని ఎంపిక చేయడం చాలా మంచి నిర్ణయమని నేతలు అంటున్నారు. ఉత్తరాంధ్ర బిసిల గడ్డ.. బిసిల నుంచే పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేయడం ద్వారా బీసీలంతా పార్టీకి గతంలో మాదిరిగానే వెన్నుదన్నుగా నిలవనున్నారు. తాజా మాజీ టిడిపి అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు కూడా ఉత్తరాంధ్రకి చెందిన బీసీ నేత. అధ్యక్షపదవికి అదే ప్రాంతం నుంచి అదే బీసీల నుంచి ఎంపిక చేసి చంద్రబాబు మంచి పనిచేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే తెలుగుదేశం కేడర్, కింజరాపు అభిమానుల్లో అచ్చెన్నాయుడిని అన్యాయంగా కేసుల్లో ఇరికించారనే, కావాలనే జగన్‌రెడ్డి వేధించారనే ముద్ర బలంగా పడింది. అవినీతి మరక అంటని అచ్చెన్నాయుడిని ఏపీ టిడిపి అధ్యక్షుడిని చేయడం ద్వారా వేధింపులకు లొంగే పార్టీ కాదని, నిక్కచ్చిగల నేతలకే పార్టీ బాధ్యతలు అప్పగించామని తెలుగుదేశం చాటింది.
తెలుగుదేశం బడుగుబలహీనవర్గాల పార్టీ
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు జగన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి , పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. రాష్ట్రంలో ఐదుప్రాంతాలకు ఐదుగురు రెడ్లు ఇన్చార్జులు. పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జి రెడ్డి..ఇలా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలక స్థానాలన్నీ రెడ్డి సామాజికవర్గం వారితో నిండిపోయింది. టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, జేఈవో ధర్మారెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో 850 కీలక పదవుల్లో రెడ్డి సామాజికవర్గ నేతలే ఆశీసులనయ్యారు. దీంతో ఇది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కాదు..రెడ్డి పార్టీ అని సామాన్య జనానికి కూడా అర్థమైపోయింది. పార్టీ, ప్రభుత్వ పదవులు రెడ్లకు కట్టబెట్టడం ఒక్కటే కాదు ..బీసీల నిధులు కాజేయడం, బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం రెడ్డి పార్టీకి ఓ అలవాటైపోయింది. ఇప్పటివరకూ బీసీలపై 169 తప్పుడు కేసులు పెట్టారు. ఇందులో 24 మంది బీసీ నేతలున్నారు. తన సామాజికవర్గ కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు జగన్‌రెడ్డి బీసీ కార్పొరేషన్ నుంచి వేలకోట్లు నిధులు ఎత్తుకెళ్లారు. రెడ్డి పార్టీ ఇంతగా బీసీలను టార్గెట్ చేస్తుంటే.. తెలుగుదేశం పార్టీ బడుగుబలహీనవర్గాలకు అండగా నిలబడింది. టిడిపి పార్లమెంటరీ యూనిట్ అధ్యక్షులలో 50శాతం మంది పదవులు బిసి వర్గాలకు కేటాయించారు. పొలిట్‌బ్యూరోలోనూ బీసీలకు పెద్దపీట వేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర టిడిపి అధ్యక్షులుగా బీసీ నేతలనే ఎంపిక చేశారు.