టిటిడి ఉన్నత స్థాయి నియామకాల మీద బిబిసి ఆసక్తికర విశ్లేషణ

తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) బోర్డు కీలక పదవుల్లో దళితులకు అవకాశం ఇవ్వరా? అని బిబిసి- తెలుగు వెబ్ సైట్ ఒక ఆసక్తికరమయిన,ఆలోచన రేకెత్తించే ప్రశ్నవేస్తూ వ్యాసం ప్రచురించింది. నిజానికి తెలుగు పత్రికల్లో  ఎపుడూ ఇలాంటి విశ్లేషణ రాలేదు. టిటిిడి నియామకాలకు సంబంధించి ఎపుడూ ఈ ప్రశ్న తెలుగు నాట చర్చనీయాంశం కాలేదు.
టిటిడి బోర్డు చరిత్రలో ఉన్నత పదవుల్లో ఎపుడూ అధికారంలో ఉన్న పార్టీ వారినో, ఇతర ఉన్నత కులాల వారినో నియమిస్తున్నారు తప్ప దళితులను పూర్తిగా విస్మరిస్తున్నారని బిబిసి చెంప చెల్లు మనిపించే వ్యాసం రాసింది.
అంతేకాదు, ఒకే ఒక్క సారి ఎన్టీరామారావు  ఒక ఎస్ సి అధికారిని  రెండో స్థానికికి నియమిస్తే, అక్కడున్న అయ్యవార్లు,అధికారులు కూడబలుక్కుని ఈ ఐఎ ఎస్ అధికారిని వచ్చిన రైల్లోనే వాపసు పంపించిన విషయాన్నికూడా బిబిసి రాసి, టిిటిడి పాలకమండలిలో  డబ్బున్న వాళ్లకు, ప్రముఖులకు ఎలాంటి ప్రాముఖ్యం ఇచ్చిందో వెల్లడించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో టీటీడీ బోర్డు  చైర్మన్ పోస్టు గానీ, పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన  ఈవో, జేఈవో, డిప్యూటీ ఈవో వంటి కీలక పదవులు గానీ ఎస్సీ వర్గాలకు చెందినవారికి ఎప్పుడూ దక్కని విషయాన్నివెలుగులోకి తెచ్చింది.
పోయిన వారంలో టీటీడీ కార్యనిర్వాహణాధికారిగా సీనియర్ ఐఎఎస్ అధికారి  కేఎస్ జవహార్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాసం రావడం విశేషం.
మంచి ఆఫీసర్ గా పేరున్న డాక్టర్ జవహర్ రెడ్డి  టిటిడి 27వ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముఖ్యమంత్రి కులానికి చెందిన వ్యక్తి. జవహర్ రెడ్డి మీద ఎక్కుపెట్టకపోయినా,  రూలింగ్ పార్టీ నేత కులానికి చెందిన ఐఎఎస్ అధికారిని టిటిడి ఇవొ ని చేయడం చాలా రోజులుగా వస్తున్నదని, దళితులలో ఎవరినీ ఈ పదవికి అర్హుడుగా చూడకపోవడాన్ని బిబిసి-తెలుగు వెలుగులోకి తెచ్చింది.
ప్రతి ముఖ్యమంత్రి ఒకటిరెండుదఫాలు  తన కులం అధికారిని టిటిడి ఇవొ చేయడానికి ఏ మాత్రం వెనకాడరు.  ఇప్పటికే టీటీడీ పాలక మండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. అదనపు ఈవోగా ఏవీ ధర్మారెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఈయన ఇలా తిరుపతి పోస్టింగుకు కావడం ఇది మూడోసారో నాలుగోసారో. ఆయన కోసంటిటిడి తలుపులు ఎపుడూ తెర్చుకునే వుంటాయి. నిజానికి ఆయన కేంద్ర సర్వీసు అధికారి. ఆ మాత్రం పనులు చేసేందుకు ఆంధ్రలో అధికారులే లేరా? ఇలాంటి కీలక బాధ్యతలు నిర్వర్తించేందుకు ఢిల్లీ నుంచి అధికారిని పట్టుకురావాలా?
 టిటిడిలోని అనేక కీలక పదవులలో రెడ్డి కులానికి చెందిన వారే ఉంటున్నారని ఒక పోస్టు వైరలవుతున్న సమయంలో బిబిసి-తెలుగు చేసిన ఈ విశ్లేషణ చిన్న కలకలం సృష్టించింది.
వైసిపి ప్రభుత్వంలోనే కాదు, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వమున్నా ఇదే తంతే జరిగింది.
బిబిసి విశ్లేషణలోని ముఖ్యాంశాలు:
టీటీడీ బోర్డు ఏర్పడి తొమ్మిది దశాబ్దాలు కావస్తోంది. బ్రిటీష్ హయంలో పాలకమండలిని ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకూ 50 మంది టీటీడీకి చైర్మన్లుగా పనిచేశారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీకి 50వ చైర్మన్. ఇక ఇప్పటివరకూ ఆలయానికి 26 మంది ఈవోలుగా పనిచేశారు. ఇప్పటి వరకూ ఈ రెండు కీలక పదవుల్లో ఎస్సీలకు అవకాశం దక్కనేలేదు. అంతేకాదు, అదనపు ఈవో స్థానంలో కూడా దళితులకు చోటు దక్కలేదు. ఒకే ఒక్కసారి ఒక ప్రయత్నం జరిగింది. అదే కార్యరూపం దాల్చకుండా అడ్డుకున్నారు.
ప్రస్తుతం తిరుపతి ఎంపీ స్థానం  ఎస్సీ రిజర్వుడుగా ఉంది. అయినప్పటికీ ఆ పార్లమెంట్ స్థానంలోని ప్రధాన ఆలయంలో ఎస్సీలకు తగిన అవకాశాలు రావడం లేదు.టిటిడిలో  తిరుపతి ఎంపి హోదా ఏమిటి?
1987-90 మధ్య కాలంలో తిరుమల జేఈవోగా ఆనాటి ఎన్టీఆర్ ప్రభుత్వం భూతలింగం అనే ఐఏఎస్ అధికారికి అవకాశం ఇచ్చింది. అయితే, ఆయన బాధ్యతలు స్వీకరించకుండా అప్పుడు కొందరు అడ్డుకున్నారు.
“భూతలింగం హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్నారు. ఉదయం రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఆయన బాధ్యతల స్వీకరణకు తిరుమల వెళ్లారు. కానీ, ఆయనకు బాధ్యతలు అప్పగించేందుకు నాటి ఈవో గా ఉన్న వెంకటపతిరాజు అంగీకరించలేదు. దానికి ప్రధాన కారణం అర్చకుల అభ్యంతరాలు.
Kandarapu Murali
“దళిత అధికారికి చేతికి కంకణం కట్టడం మా వల్ల కాదని నాటి అర్చకులు ససేమీరా అని చెప్పేశారు. ఇతర సంప్రదాయాల ప్రకారం జేఈవోకి గౌరవ మర్యాదలు కల్పించడానికి వారంతా నిరాకరించారు. ఈ పరిస్థితుల్లో ఆయన్ని విధుల్లో చేర్చుకోవడం తన వల్ల కాదని ఈవో తేల్చి చెప్పేశారు. చివరకు ఆయన్ని మళ్లీ ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ వచ్చిన ట్రైన్‌లోనే సాయంత్రానికే తిరిగి వెనక్కి పంపించేసిన అనుభవం ఉంది” అని టిటిడి కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకుడు  కందాళ మురళి బిబిసికి చెప్పారు.
విజయనగరసామ్రాజ్యం పతనమయినప్పటినుంచి  1801 జూలై1 దాకా తిరుమల ఆలయం  ముస్లిం పాలకులో చేతిలో ఉంది. కొంత కాలం గొల్కొండ నవాబుల పాలనలో ఉండింది. ఔరంగజేబు దక్కన్ మీద దాడి జరిపి గోల్కొండ రాజ్యాన్ని పతనం చేసినపుడు ఇక్కడ రెండు ముస్లిం రాజ్యాలు ఏర్పడ్డాయి. అవి: నైజాం, కర్నాటక రాజ్యాలు. అపుడు తిరుపతి కర్నాటక నవాబుల కిందికిపోయింది. నాలుగో ఆంగ్లో-మైసూర్ యుద్ధం (1799) తర్వాత 1801 జూలై 31 తిరుమల తిరుపతి దేవస్థానం  ఈస్టిండియా కంపెనీ పూర్తి పాలనలోకి వచ్చింది.
 1801లో ఈస్టిండియా కంపెనీ చేతికి వచ్చేటప్పటికి తిరుపతి అర్కాట్ (అర్కాట్ అనేది తమిళ మాట ఆర్ అంటే ఆరు,కాడు అంటే అడవి). ఆరు అడవుల ప్రాంతమే అర్కాట్) నవాబు చేతిలో ఉండింది.  అర్కాట్ రాజ్యం ఉత్తర డివిజన్ లో తిరుపతి ఉండింది. 1801లో ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం ఉత్తర భాగాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేసి దాని పేరు నార్త్ ఆర్కాట్ జిల్లా అని నామకరణం చేసింది.
1799లో బ్రిటిష్ వాళ్లకు, కర్నాటక నవాబులకు మధ్య నాలుగో మైసూర్ యుద్ధం జరిగింది.
అపుడు బ్రిటిష్ వాళ్లు అర్కాట్ నవాబు మీద కప్పం కోసం మరింత వత్తిడి పెంచారు. దానికి తోడు నవాబు ఉమ్దుద్,  మైసూర్ గవర్నమెంట్ తో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా  కలసి కుట్ర చేస్తున్నాడని చెబుతూ  కొన్ని ఉత్తరాలను బ్రిటిష్ వాళ్లు బయటపెట్టారు.  అప్పటికే అర్కాటు నవాబు మంచాన పడ్డాడు. ఆగ్రహంతో ఉన్న బ్రిటిష్ వారితో పోరాడే శక్తి లేదు. సంధికి అంగీకరించాడు. ఆయితే, ఈ ఒప్పందం అమలులోకి వచ్చేలోపు ఆయన చనిపోయాడు.
సింహాసనం వారసత్వం తీసుకున్న కుమారుడు అలీ హుసేన్  ఈ ఒప్పందలోని షరుతులను తిరస్కరించాడు.దీనితో కంపెనీ ప్రభుత్వానికి మళ్లీ   కోపం వచ్చింది. హుసేన్ ను తొలగించి నవాబు సోదరుడు అజిమ్ ఉల్ ఉమారాను నవాబుగా ప్రకటించారు.
ఆయన 1801లో బ్రిటిష్ వాళ్లిచ్చే స్టయిఫండ్ తీసుకుని రాజ్యాన్ని బ్రిటిష్ కు అప్పగించాడు. అలా కర్నాటక సింహాసనం పూర్తిగా  తూర్పు ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చింది. దీనితో పాటు తిరుమల,తిరుపతి ప్రాంతం పూర్తిగా ఇంగ్లీష్ పాలనలోకి వచ్చింది. తిరుమల ఆలయ పాలన 1843 దాకా ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వ పాలనలో ఉండింది. ఆయన జనవరి లో బ్రిటిష్ ప్రభుత్వం ఆలయ వ్యవహారాలనుంచి తప్పుకోండని  కంపెనీ ప్రభుత్వాన్ని ఆదేశిచింది. ఆపుడు ఆలయ పాలనని హధీరామ్ మఠం చేతిలో పెట్టారు.
1932లో ఆలయ పరిపాలనని హధీరామ్ మహంతుల చేతినుంచి వెనక్కి తీసుకుని ఒక బోర్డుకు అప్పగించారు. అదే టిటిడి. 1936 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో టీటీడీ వ్యవహారాలు సాగుతున్నాయి.
“1956 నుంచి ఐఏఎస్ అధికారిని టీటీడీ ఈవోగా నియమిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఆ అవకాశం వస్తోంది. ఈవోకి తోడుగా మరో ఇద్దరు సంయుక్త కార్యనిర్వహణాధికారులు (జీఈవో) ఉంటారు. ఆ పోస్టులకు కూడా కొన్నిసార్లు ఐఏఎస్ అధికారులకు అవకాశం ఇస్తుంటారు. అత్యధిక సందర్భాల్లో గ్రూప్-1 అధికారులు విధుల్లో ఉంటారు. ఈ మూడు పోస్టుల్లో ఎస్సీలకు ఇంతవరకూ అవకాశం (దళితులకు) దక్కలేదు. ఎస్సీలకు అవకాశం ఇచ్చిన ఆ ఒక్క సందర్భంలో వచ్చిన ప్రతిఘటనతో ఆ తర్వాత ప్రభుత్వాలు అలాంటి ప్రతిపాదనలు విరమించుకున్నట్టు కనిపిస్తోందని స్థానికులు అంటున్నారు. టీటీడీ చైర్మన్ పదవికి చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు పోటీ పడుతుంటారు. ఆ చైర్మన్ గిరీ కోసం నేతలు సుదీర్ఘకాలం ఎదురుచూడటం సాధారణమే. అయితే, ఈ పోస్టుకు ఆశావహుల జాబితాలో ఎస్సీ నేతల పేర్లు పెద్దగా వినబడవు. ఇటీవల కాలంలోనైతే అలాంటి ఆనవాళ్లు కూడా లేవు,” అని బిబిసి వ్యాఖ్యానించింది.
టీటీడీ పాలకమండలి సభ్యుల్లో కూడా ఎస్సీలకు అరకొరగానే అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుత పాలకమండలిలో 36 మంది సభ్యులు ఉంటే, అందులో ఎస్సీలు ఇద్దరే.
ప్రభుత్వం అన్ని పదవులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చేసిన చట్టాల ప్రకారం ఆరుగురు ఎస్సీలకు, నలుగురు ఎస్టీలకు చోటు దక్కాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం అందుకు భిన్నంగా పరిస్థితి ఉందని తిరుపతికి చెందిన ఎస్సీ ఉద్యోగుల సంఘం నాయకుడు ప్రశాంత్ కుమార్ వ్యాఖ్యానించారు.
“టీటీడీ చైర్మన్ పదవుల కోసం కాకపోయినా, బోర్డు సభ్య పదవుల కోసం చాలామంది ఆశావహులుంటారు. కానీ వారికి అవకాశం రావడం లేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన బడా బాబులను పిలిచి పదవులు ఇస్తున్నారు గానీ రాష్ట్రానికి చెందిన ఎస్సీలకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదన్నది ప్రభుత్వం చెప్పడం లేదు. ఎస్టీలను ఎందుకు విస్మరించారనే దానికి సమాధానం కూడా లేదు. ఇది పూర్తిగా వివక్షకు తార్కాణం. ఎస్సీ, ఎస్టీల గురించి ఎన్ని మాటలు చెప్పినా, చిన్నచూపు ఏ స్థాయిలో ఉందో ఈ వ్యవహారం చాటుతుంది” అంటూ ప్రశాంత్ కుమార్ బిబిసి కి తెలిపారు.
‘దళిత గోవిందం విగ్రహాలు మూలన పడ్డాయి…
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కరణాకర్ రెడ్డి బోర్డు ఛెయిర్మన్ గా ఉన్నపుడు  దళిత గోవిందం పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. వేంకటేశ్వర స్వామిని దళితులకు చేరువ చేయడమే తమ లక్ష్యమని ఆ సందర్భంగా ప్రకటించారు.
అయితే దళిత గోవిందం పేరుతో ఎస్సీ పేటలకు ఉత్సవ విగ్రహాలను కాకుండా డమ్మీ విగ్రహాలు తీసుకెళ్లారంటూ అప్పట్లో ఆందోళనలు కూడా జరిగాయి.
దళిత పేటల్లో పూజలందుకున్న తర్వాత ఆ విగ్రహాలు తీసుకొచ్చి స్టోర్ రూమ్‌ల్లో మూలనపడేయడంతో కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసనలు కూడా చేపట్టారు.
“తిరుమలో నేటికీ వివిధ రూపాల్లో కుల వివక్ష కొనసాగుతూనే ఉంది. ప్రసాదం తయారీలో బ్రాహ్మణులు మినహా మిగిలిన వారికి అవకాశం లేదు. ఆ ప్రసాదాలను తరలించే కార్మికులు మాత్రం దళితులుంటారు. కానీ తయారీ విషయంలో మాత్రం ఆంక్షలున్నాయి. ఇతర అనేక అంశాలలో కింది స్థాయి సిబ్బంది పట్ల వివక్ష ఉన్నట్టు పలు సందర్భాల్లో వెలుగులోకి వచ్చింది. మేము ఆందోళనలు కూడా చేశాము. కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల విషయంలో కూడా ఇలాంటి వివక్ష ఉంది. కేరళ వంటి రాష్ట్రాల్లో అర్చకులుగా ఎస్సీలకు అవకాశం ఇస్తుంటే మన దగ్గర ఇలాంటి పరిస్థితి సరికాదు. ప్రభుత్వాలు చొరవ చూపితే ఫలితం వస్తుంది. అధికారులలో కూడా అందరికీ అవకాశం కల్పించేందుకు ప్రయత్నం చేయాలి” అని ఆ సంఘం నాయకుడు ఆండ్ర మాల్యాద్రి బీబీసీతో చెప్పారు