ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తే వార్త కాదా?: అంబటి ఆగ్రహం

తాడేపల్లి:  ఒక ముఖ్యమంత్రి సుప్రీం చీఫ్ జస్టీస్ కు లేఖ రాస్తే.. దానిని నొక్కేయడం పత్రికా స్వేచ్ఛేనా? ఇంత ప్రధానమైన వార్తను రామోజీరావు, రాధాకృష్ణలు నొక్కివేయడం వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే  అంబటి రాంబాబు  ఆగ్రహించారు. జాతీయ మీడియాకు ప్రధానమైన వార్త  ఏపీలో ఓ సెక్షన్ మీడియాకు ఎందుకు అప్రధానమైంది,  నిజాలు రాయలేని ఆ పత్రికలను ఎందుకు చదవాలని ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు.
అంబటి రాంబాబు విలేకరుల సమావేశంలో ఇంకా ఏమన్నారంటే..
1. మూడు రోజుల క్రితం ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం గారు ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తారని ప్రభుత్వం తరఫున మీడియాకు ముందే సమాచారం ఇచ్చి, ఆహ్వానిస్తే.. ఎలక్ర్టానిక్ మీడియాకు సంబంధించి 15-16 టీవీ ఛానెళ్ళు, ప్రింట్ మీడియా వాళ్ళంతా మీడియా సమావేశానికి హాజరయ్యారు. ఆ మీడియా సమావేశంలో ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ బాబ్డే గారికి రాసిన ఉత్తరాన్ని ఆయన వెలుగులోకి తెచ్చారు. ఇందులో సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జిగా పనిచేస్తున్న జస్టీస్ రమణగారు ఏవిధంగా ఇంటర్ ఫియర్ అవుతున్నారనే దానిపైనా, ఆయన జూనియర్ దమ్మాలపాటి శ్రీనివాస్ కు అనుకూలంగా జడ్జిమెంట్లు ఇచ్చిన పరంపర, వారితో కలిసి రాజధాని భూములు కొనుగోలు విషయాలపై రాసిన ఆ లేఖను బహిర్గతం చేశారు.
2. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాతోపాటు దేశ ప్రజలను, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను ఇక్కడ ఆశ్చర్యపరిచింది ఏమిటంటే.. కెమెరాలు అన్నీ వచ్చాయి గానీ, ఎవరు కూడా లైవ్ చూపించే ప్రయత్నం చేయలేదు. తర్వాత కూడా ఈ వార్తను ప్రసారం చేయలేదు. కొన్ని పత్రికలైతే, ముఖ్యంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇది అసలు వార్తాంశమే కాదన్నట్టు ఆ వార్తను నిలువరించారు. నొక్కేశారు, మింగేశారు. ఎందుకు ఆ విషయాన్ని నొక్కేశారు.. అని ప్రజలు, మేము ఆలోచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో మీడియా పరిస్థితిని గత కొంతకాలంగా చూస్తునే ఉన్నాం. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిగారి హయాంలో కూడా ఆ రెండు పత్రికలు ఏ విధంగా రాతలు రాశాయో చూశాం. అందుకే వైయస్ఆర్ గారు ఆ రెండు పత్రికలను మేం నమ్మం అని బహిరంగంగా ప్రకటించారు. అప్పట్లో స్ట్రింగర్లుగా ఉన్నవారు కొంతమంది అర్థాంతరంగా ఇప్పుడు పత్రికాధిపతులుగా మారడం కూడా జరిగింది.
3. మీడియావారు పత్రికా స్వేచ్ఛ అని మాట్లాడుతుంటారు. అసలు పత్రికా స్వేచ్ఛ అంటే ఏమిటి..?. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలోనే సర్వోన్నత న్యాయ స్థానం చీఫ్ జస్టీస్ కు ఆధారాలతో కూడిన లేఖ రాస్తే.. దానిని ప్రచురించకపోవడం, టీవీల్లో చూపించకపోవడం పత్రికా స్వేచ్ఛ అవుతుందా..? లేదా పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించటం అవుతుందా..? విజ్ఞులైన మీరే ఆలోచించండి.
– అయితే, జాతీయ పత్రికలకు సంబంధించి అన్నీ కూడా ఈ విషయాన్ని ప్రధానమైన అంశంగా భావించి ప్రచురించాయి, జాతీయ న్యూస్ ఛానెళ్ళు కూడా టెలీ కాస్ట్ చేశాయి. మన రాష్ట్రంలో మాత్రం తెలుగు ఛానెళ్ళు చూపించలేదు. పత్రికలు రాయలేదు, ఎందుకు..?
– జాతీయ మీడియాకు చెందిన పలు ఇంగ్లీషు, హిందీ పత్రికలు, పొరుగు రాష్ట్రానికి చెందిన తెలుగు పత్రికలు, జాతీయ టీవీ ఛానెళ్ళు ప్రసారం చేసిన వార్తను ఆంధ్రప్రదేశ్ లోని ఒక సెక్షన్ మీడియా ఎందుకు నొక్కేశారు..? ఇది ప్రజాస్వామ్యంలో హర్షించదగినదా..?
– ఒక ముఖ్యమంత్రి కొంతమంది జడ్జిల మీద కంప్లైంట్ చేస్తే.. ఆ వార్తను ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికాధిపతులైన రామోజీ రావు, రాధాకృష్ణ ఎందుకు నొక్కి వేస్తున్నారు. దీని వెనుక ఏమి కుట్ర ఉన్నది..? ఎవ‌రు దీని వెనుకాల ఉండి ఈ నాట‌కం ఆడిస్తున్నారు.?
– ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికే కుట్రలు చేస్తున్నారని, ముఖ్యమంత్రి జగన్ గారు ఏదైతే చెప్పారో.. అందులో రామోజీరావు, రాధాకృష్ణలు కూడా భాగస్వాములై ఈ కుట్రలు చేస్తున్నారా..?
7.పత్రికా స్వేచ్ఛ అంటే కొందర్ని కాపాడటానికి కానేకాదు. చంద్రబాబు నాయుడును అర్థాంతరంగా అధికారంలోకి తీసుకురావడం కోసం చేసే కుట్రలు పత్రికా స్వేచ్ఛలో భాగం కాదు. ఇప్పటికైనా ఆ పత్రికలు వాస్తవాలను గమనించి, నిజమైన వార్తలను ప్రజలకు అందించాలి.