ప్రొఫెసర్ శేషయ్య పెళ్లి ఎలా జరిగిందంటే….: ప్రొఫెసర్ రాచపాళెం జ్ఞాపకాలు


(పౌరహక్కుల ఉద్యమనేత ప్రొఫెసర్ శేషయ్య నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఒక ఆసుప్రతిలో కోవిడ్ తో  మరణించారు. మంచి మిత్రుడు, మానవతావాది, పేదల పక్షపాతి ప్రొఫెసర్ శేషయ్య గురించి అనంతపురం ఎస్ కె యూనివర్శిటీ విశ్రాంత అధ్యాపకుడు, ప్రొఫెసర్ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి జ్ఞాపకాలు) 


నేను 1977ఆగష్ట 25న అనంతపురంలోని అప్పటి అటానమస్ పిజి సెంటర్ లో తెలుగు లెక్చరర్ గా చేరాను. అప్పట్లో అన్నిశాఖల పరీక్షలు ఒకేసారి జరిగేవి. ఒకరోజు ఎకనమిక్స్ డిపార్టుమెంటులో జరిగే పరీక్షల్లో రఘునాథ శర్మగారు ,నేను ఒకే గదిలో ఇన్విజిలేటర్ లుగా చేస్తున్నాము. శేషయ్య గారు బి. ఎల్ ఫైనల్ పరీక్షలు రాస్తున్నారు .పరీక్ష రాస్తూ రెండుగంటల తర్వాత బయటికి వచ్చి మళ్ళీ హాల్లోకి వెళ్ళారు. అప్పుడు చూశాను ఆయన్ని.ఆరూపం నామనసులో ముద్రపడింది.
తర్వాత మూడు నాలుగేళ్ళు గడిచిపోయాయి.ఒకరోజు నేను యూనివర్శిటీ బస్సులో టౌన్ నుండి యూనివర్శిటీకి వెళ్ళుతున్నాను. శేషయ్య నాపక్క సీటులో కూర్చున్నారు. నేను అరుణతార పత్రిక చదువుకుంటూ పక్కన ఎవరు కూర్చున్నదీ గమనించలేదు. బస్సు యూనివర్శిటీ దగ్గరికి వచ్చేటప్పుడు మీరు అరుణతార పత్రిక రెగ్యులర్ గా చదువుతారా సార్ అని శేషయ్య పలకరించారు. అప్పుడు చూశాను ఆయన్ని.
ప్రొఫసర్ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
అరే మనవిద్యార్థికదా అనుకొని ఏం చేస్తున్నారు అని అడిగాను.అప్పుడే జరిగిన ఇంటర్వ్యూల్లో ఎస్ కె యు లా డిపార్టుమెంటు లో లెక్చరర్ గా చేరినానని చెప్పారు. అలా మా స్నేహం మొలకెత్తింది. ఆతర్వాత ఆయన ప్రతిరోజూ క్లాసు తీసుకోవడం ,నేరుగా నాదగ్గరికి వచ్చేసేవారు. మేము కలిసి తిరగడం మొదలుపెట్టాము.
అప్పుడు సాయినగర్ లో అంబేద్కర్ భవన్ పక్కనే కామర్స్ ప్రొఫెసర్ సుబ్బిరెడ్డి గారు కట్టించిన నాలుగు పోర్షన్ల ఇంటిలో నేను ,ఎల్. వేణుగోపాలరెడ్డి(ఎంబియె)నాగేశ్వరరావు ,భాస్కరరావు(ఎకనామిక్స్) తలా ఒక పోర్షన్ లో ఉండేవాళ్ళం. భాస్కరరావు శ్రీమతికి రెసిడెన్సియల్ స్కూల్లో ఉద్యోగం రావడంతో ఆయన ఇల్లు ఖాళీ చేశారు. శేషయ్య ఆఇంట్లో చేరారు. మాస్నేహం మరింత దగ్గరైంది. అలా కొన్నేళ్ళు కలి‌సి ఉన్నాం. శేషయ్య గారి అవ్వ ఒకామె ఆయనతో పాటు ఉండేది. ఆమె మాకు కూడా పెద్దదిక్కుగా ఉండేది. ఆమెను శేషయ్య జేజీ అని పిలిచేవారు. తర్వాత శశికళ శేషయ్య జీవిత భాగస్వాములయ్యారు.అనంతపురంలో డిఇఓఆఫీసు సందులో అనుకుంటాను,లేదా దాని పక్కసందులోనో బృందావనం లాడ్జి ఉండేది. అందులో నాలుగో అంతస్తులోని హాలులో వారికి ఆదర్శవివాహం జరిగింది.
కులాంతరవివాహం. సంప్రదాయేతరవివాహం. నేను పెళ్ళి సమావేశానికి అధ్యక్షుడిని. త్రిపురనేని మధుసూదనరావు గారు వక్త. హాలు పట్టనంతజనం వచ్చారు.యూనివర్శిటీ అధ్యాపకులు చాలామంది వచ్చారు. నేను అప్పటికి ఆధునికుడుగా మారే దశలో ఉన్నాను. పూర్తిగా మారలేదు. కులాంతర వివాహాలపట్ల అప్పటికే సుముఖత కుదిరింది. అధ్యక్షుడుగా నాకు తెలిసిన కొన్ని మాటలు చెప్పి త్రిపురనేనిని మాట్లాడమన్నాను. ఆయనను తిరుపతిలో చాలాసార్లు నేను విన్నాను.ఆఅనుభవముంది.సంప్రదాయాలను చీల్చిచెండాడడంలో మేటి. ఆయన లేచి వివాహవ్యవస్థను గురించి ,వివాహవ్యవస్థలో స్త్రీ స్థానాన్ని గురించి పదిమాటలు కఠినంగా అన్నారు. ఆయన మాటలు నచ్చక ఆపెళ్ళిని చూడడానికి వచ్చిన సంప్రదాయవాదులు కొందరు లేచి వెళ్ళిపోయారు. త్రిపురనేని ఏమీ చలించలేదు. మాశశి, మాశేషయ్య లపెళ్ళి.
ఇది విప్లవవివాహం .ఇష్టమున్న వాళ్ళు ఉండండి ,ఇష్టంలేని వాళ్ళు వెళ్ళిపోండి అన్నారు. ఒకగంటసేపు అనర్గళంగా మాట్లాడి జనాన్ని నిలబెట్టారు.తర్వాత శశి శేషయ్య లు పెళ్ళి ప్రమాణాలు చదివారు. పెళ్ళి ముగిసింది. అది నాకు కొత్త అనూభూతి. అప్పుడు నేను నాభార్య ఇంటికి వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాం.మాపిల్లల పెళ్ళి విషయంలో మేము జోక్యం చేసుకోరాదు ,వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి అని అనుకున్నాం. ఆరకంగా శశికళా శేషయ్య లు మాకు ఆదర్శప్రాయులయ్యారు.తర్వాత అరుణ్ పుట్టాడు.మాపిల్లలకు శశీశేషయ్యలూ ,అరుణ్ కు నేనూ మా ఆవిడా అత్తామామలమయ్యాం.
ప్రజ్ఞ సురేష్ (పౌరహక్కుల నేత)
ప్రొఫెసర్ శేషయంయ అభిమానంతో పలకరిస్తారు. ఓపికతో సందేహాలను నివృత్తి చేస్తారు. దళిత సమస్యలు, రాజ్యాంగ అంశాలను చక్కగా బోధిస్తారు.సమకాలీన రాజకీయ, ఆర్థిక, సాంఘిక అంశాల పట్ల, ప్రగతిశీల ప్రజాతంత్ర భావాలతో పరిశీలిస్తారు.సమాజంలో మనుషులు సమానత్వ ప్రాతిపదికగా ఉండాలని ఆశిస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడు ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటారు. గ్రామాల్లో ఉన్న భూస్వామ్య పెత్తందారీ తనాన్ని నిరసిస్తారు.
ఎక్కడ రాజ్యహింస ఉన్న దాన్ని ప్రతిఘటిస్తారు. రాజ్య యంత్రాంగం ద్వారా కలిగే వ్యక్తుల, సమూహాల సమస్యలను అంకితభావంతో, నిబద్ధతతో న్యాయస్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తారు.సామాన్య పౌరుల పక్షాన నిలబడి, వారి హక్కులకై నిరంతరం తపన పడే మానవతామూర్తి ప్రొఫెసర్ శేషయ్య.
సౌరపు గోవిందరాజులు
1978-80 సంవత్సరంలో అప్పటి పి.జి.సెంటర్ ,నేటి
S K యూనివర్సిటిలో మేము సమకాలికులం. ప్రొ. శేషయ్య
బిఎల్ లో  నేను ఎమ్మెే తెలుగు చదువుతున్నాం. ఒకే హాస్టల్లో ఉంటూ ఉన్నాం. ఆయన స్నేహ శీలి. ఇదే మమ్మల్ని స్నేహితులుగా మార్చింది.
ఆ రోజుల్లోనే ఆయన చాలా సాదాసీదాగ,నిరాడంబరంగా ఉండేవారు.ఐతే ఎప్పూడూ ఏదో ఆలోచనలో నిమగ్నమై ఉండేవారు.ఆయన ఆశయం లక్ష్యం సిద్ధాంతం సదా సమాజ హితమే!అక్కడే లా చదివి అక్కడనే ఉద్యోగం పొందడం యూనివర్శిటి చేసుకున్న అదృష్టం.పౌర హక్కులకోసం
అవిశ్రాంతంగా పోరాడిన మహోన్నతమైన వ్యక్తిని కోల్పోవడం ముఖ్యంగా మన జిల్లావాసులమైన మనకు తీరనిలోటు.