పౌరహక్కుల నేత ప్రొఫెషర్ శేషయ్య మృతి

ప్రముఖ పౌరహక్కుల నేత ప్రొఫెసర్ శేషయ్య  తీవ్ర అనారోగ్యంతోహైదరాబాద్ AIG ఆసుపత్రి లో మరణించారు.  ఆయన మరణవార్తని   పౌరహక్కుల సంఘం నేతలు ఎన్  నారాయణరావు, (ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం తెలంగాణ), చిలుకా చంద్రశేఖర్ (ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం,ఆంధ్రప్రదేశ్) ఒక ప్రకటనలో తెలిపారు.
 ఆయన రాష్ట్ర విప్లవవిద్యార్థి ఉద్యమంతో ముఖ్యంగా పౌరహక్కుల ఉద్యమం ఎంతో అనుబంధం ఉన్న వ్యక్తి. ప్రొఫెసర్ శేషయ్య ప్రస్తుతం పౌర హక్కుల సంఘం  తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ గా ఉంటున్నారు.
కోవిడ్ సోకి తీవ్ర అనారోగ్యానికి గురై 24 సెప్టెంబర్,2020 నుండి అనంతపురం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ వచ్చారు. ఆరోగ్యం మెరుగు కానందున అక్కడి డాక్టర్ల సలహా మేరకు, శనివారం రాత్రి హైదరాబాద్ కు తీసుకువచ్చారు.   హైదరాబాద్, గచ్చిబౌలి లోని ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రోఏంట్రాలజి(Asian Institute of Gastroentrology)లో అడ్మిట్ అయినారు.అప్పటి నుండి ప్రొఫెసర్ శేషయ్య  వెంటిలేటర్ పైనే ఉన్నారు.  ఆయన పరిస్థితి ఈరోజు వరకు ఇంకా విషమంగానే ఉండింది. చివరకు రాత్రి 8.30 మరణించారని వారు ప్రకటనలో పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన శేషయ్య అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీలో  బిఎల్ చేశారు. ఆరోజుల్లో ఆయన ఆర్ ఎస్ యు లో క్రియాశీలంగా ఉన్నారు. ఎమర్జన్సీ ఎత్తేశాక అనంతపురం లో జరిగిన మొదటి ఆర్ ఎస్ యు సభల్లో క్రీయశీల పాత్ర పోషించారు. తర్వాత ఎం.లా చదివేందుకు తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీలో చేరాాడు. అపుడు అక్కడ విద్యార్థులసమీకరణలో కీలకపాత్ర పోషించారు. యూనివర్శిటీ సమస్యల మీద పోరాడారు.మెస్ వర్కర్లు యూనివర్శిటీ ఉద్యోగుల గుర్తించాలని పోరాటం చేసి విజయ సాధించారు. ఆ రోజు ల్లో ఆయన డి బ్లాక్ రూం నెంబర్ 38 (D.38) విద్యార్థి ఉద్యమాల కేంద్రంగా ఉండింది. తర్వాత ఆయనక్కడే పిహెచ్ డిచేసి అనంతపురం విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గా చేసి ప్రొఫెసర్ అయ్యారు. ఆయన విశ్వవిద్యాలయంలో తిరుగులేని విద్యార్థినాయకుడయ్యారు. ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిగా ఉండేవారు. తనకున్న ఆస్తమాను లెక్క చేయకుండా విద్యార్తులను, యువకులను సమీకరించే పని లో ఉండే వారు.
ఆయన మరణ వార్త జీర్తించుకోలేకపోతున్నా: రాచపాళెం
మా కుటుంబ మిత్రుడు ఆచార్య శేషయ్య మరణం నాకు జీర్ణం చేసుకోలేనిదని విశ్రాంత ఆచార్యులు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.శేషయ్య గారు మేము ఒకేభవనంలో రెండు పోర్షన్లలో ఏడేళ్ళు కలిసి ఉన్నాం. ఆయనకు శశికళతో జరిగిన ఆదర్శవివాహానికి త్రిపురనేని మధుసూదనరావు గారు ,నేను నిర్వాహకులుగా వ్యవహరించాం. మా అమ్మాయికీ అబ్బాయికీ శశికళా శేషయ్య లు అత్తామామలు. వారి కుమారుడు అరుణ్ కు నేను ,నాభార్య అత్తామామలం. నేను 1977లో యస్.కె.యు.లో లెక్చరర్ గా చేరినప్పుడు ఆయన బి ఎల్ విద్యార్థిగా ఉన్నారు. తిరుపతిలో ఎం ఎల్ చేసి ఎస్ కె యు కు లెక్చరర్ గా వచ్చారు. అప్పటినుంచీ నాకు ఆత్మీయుడైన స్నేహితుడయ్యాడు శేషయ్య గారు. నన్ను ఒక సీనియర్ గా ఆయన గౌరవించేవారు. నేను ఆయనను గొప్ప మార్క్సిస్టు గా గౌరవించేవాడిని. ఇద్దరమూ అనేక సభల్లో కలిసి పాల్గొన్నాం. ఆయన మరణం మాకుటుంబానికి పెద్ద విషాదం. మేమందరమూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మాచెల్లెలు శశి ఈ దుఃఖంనుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం.