తిరుపతి ‘మధ్యంతర’ రాజకీయం, బిజెపితో దోస్తీకి టీడీపీ ఆరాటం!

నడ్డాతో టీడీపీ నేతల రాయబారం?

(చందమూరి నరసింహారెడ్డి)

తిరుపతి లోక్ సభ స్థానానికి మధ్యంతర వస్తుండటంతో బీజేపీకి దగ్గరవడానికి తెలుగుదేశం పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.
ఈ నియోజకవర్గానికి  ప్రాతినిధ్యం వహించిన వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాకు గురై మరణించడంతో మధ్యంతర ఎన్నిక వస్తున్నది.
ఈ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది.
ఈ సీటును ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా బిజెపికి ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2019లో ఎన్నికల్లో టీడీపీ , బిజెపి విడివిడిగా పోటీచేశాయి. ఫలితంగా ఇద్దరూ ఓటమి చవిచూశారు.
ఎన్నికల అనంతరం టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. తెలుగు దేశం నుంచి వలసలు జోరందుకున్నాయి. రాజ్యసభ సభ్యులు సైతం బిజెపిలో చేరిపోయారు. బిజెపి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉంది. రాష్ట్రంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న టిడిపి కి ఈ పరిస్థితి లో కేంద్రం అండ అవసరమని భావిస్తున్నారు.
టీడీపీ ఒంటరిగా పోటీచేసినా ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే బిజెపికి ఈ సీటును ఆఫర్ చేయటం ద్వారా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఎన్నో ప్రయోజనాలు ఆశిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఉప ఎన్నిక లో అయినా కలసి పోటీచేస్తే రాజకీయంగా పరిస్థితి మారిపోతుందన్నది చంద్రబాబు ఎత్తుగడ. చంద్రబాబు అండ్ కోపై పలు అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు సీఎం జగన్ దూకుడు చూపిస్తున్నారు. జగన్ దూకుడు కు ఎలాగైనా కళ్లెం వేయాలని టిడిపి భావిస్తోంది.
సమస్యల నుంచి గట్టెక్కేందుకే చంద్రబాబు తిరుపతి లోక్ సభ సీటు ప్రతిపాదనను బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఓ కీలక నేత ద్వారా చేరవేశారని చెబుతున్నారు.
అయితే దీనిపై ఇప్పటివరకూ బిజెపి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని చెబుతున్నారు.బిజెపి, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలపై అధికారంలో ఉండగా చంద్రబాబు అండ్ టీమ్ చేసిన విమర్శలు పక్కన పెట్టి కలుస్తారా లేదా తెలియాలి. వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని, టీడీపీ ని దెబ్బ తీసి రాష్ట్రంలో పార్టీ బలాన్ని పెంచుకోవడానికి , ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాదేనని నిరూపించుకొనేందుకు ఒంటరిగా పోటీ చేస్తారా చూడాలిమరి.దీని మీద బిజెపి రాజ్యసభ్యుడు జివిఎల్ నరసింహారావు వ్యాక్య చిత్రంగా ఉంది. ఒక టివిలో ఆయన ఈస్పందన ఇది:
“బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు కాళ్లావేళ్లా పడుతున్నారని నాకు కూడా తెలిసింది. మొన్నటి 2019 ఎన్నికల సమయంలో దేశంలో ఎవరూ అంత నీచమైన విమర్శలు చేయనంతగా….చంద్రబాబు బీజేపీ పైనా, ప్రధాని మోడీ గారిపైనా చేసిన విషయం మనమంతా చూశాం… అయితే గతంలో ఆ పార్టీతో పొత్తులు మాకు చెడ్డ పేరు తెచ్చాయి…. బీజేపీకి ఎంతో నష్టం వాటిల్లింది కనుక…. మేము భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ పార్టీతో పొత్తు లేకుండా సొంతంగా ఎదగాలని ప్రయత్నం చేయబోతున్నాం అని సమాధానమిచ్చారు.”
టీడీపీ ,బిజెపి మళ్లీ కలసి పనిచేస్తారా చూడాలి.