తెలుగు నాట మావనతా వాదం ప్రచారం చేసిన కోగంటి రాధాకృష్ణమూర్తి జయంతి నేడు

( చందమూరి నరసింహారెడ్డి)
తెలుగు నాట ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త. కవి రాజుగా పిలువబడే ‘త్రిపురనేని రామస్వామి ప్రభావితుడై  హేతువాదం, మానవతావాదం (Humanism) వైపు జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి కోగంటి రాధాకృష్ణమూర్తి.
రష్యాలో స్టాలిన్ విధానాలు ప్రపంచంలో  మార్క్సిజం పరిపూర్ణత మీద అనుమానాలు రేకెత్తించాయి. పేరు మోసిన కమ్యూనిస్టుల మార్క్సిజం నుంచి దూరంగా జరిగారు. భారతదేశంలో కూడా ఎమ్ ఎన్ రాయ్ వంటి వారు మార్క్సిజానికి ప్రత్యామ్నాయం వెదకడం మొదలుపెట్టారు. దానితో  ప్రపంచంలోని తాత్విక ధోరణులు ఏవీ సమగ్రంగా లేవని, మనిషికి ప్రాముఖ్యం ఇచ్చి  మానవీయ విలువలను ప్రోత్సహించే తత్వశాస్త్రం అవసరమనే భావన 1950 దశకంలో మొదలయింది. దాన్నుంచి వచ్చిన ఆలోచనా విధానమే హ్యూమనిజం. భారతదేశంలో ఈ వాదాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన తత్వవేత్త మానబేంద్ర నాథ్ రాయ్ (ఎమ్ ఎన్ రాయ్  22 మార్చి1887-25జనవరి 1954). రాయ్ తొలినుంచి ఆంధ్రమేధావులను బాగా ఆకట్టుకుంటూనే ఉన్నారు. 1934లోనే ఆయనను నెల్లూరు  జిల్లాలో జరిగిన ఒక రైతు మహాసభకు పిలిచారు. అప్పటినుంచి ఆంధ్రలో రాయ్ ఆలోచరణ దోరణి బాగా ప్రబలింది.ఎంతో మంది మేధావులు, కవులు రచయితలు రాయ్ అనుచరులయ్యారు. తెలుగు నాట రాయ్ ప్రభావం తెలుసుకోవాలంటే ఈ బ్లాగ్ చదవండి.   ఆయన భావాలను ప్రచారం చేసేందుకు పత్రికలు స్థాపించిన వారు కూడా ఉన్నారు. రాయ్ ఆలోచనలతో ప్రభావితుడయి మానవతా వాదిగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవడమే వాటికోసం ప్రతికస్థాపించిన  ఉదాత్త వ్యక్తి కోగంటి రాధాకృష్ణమూర్తి.
రాధాకృష్ణమూర్తి ప్రముఖ రచయిత, సంపాదకుడు, హేతువాది. తెనాలి నుంచి నలంద ప్రచురణల సంస్థను నడిపారు.
కోగంటి రాధాకృష్ణమూర్తి గుంటూరు జిల్లా, తెనాలి ప్రాంతపు కూచిపూడి గ్రామంలో 1914 సెప్టెంబర్‌ 18న జన్మించారు. గుంటూరు ఏసీ కళాశాలలో బి.ఏ. పట్టభ్రదులైన కోగంటి వారు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి ‘విశారద’, ‘ప్రచారక’ ఉత్తీర్ణులయ్యారు. విద్యార్ధి దశలోనే భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యకర్తగా పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.
తెలుగునాట పేర్కొనదగిన తొలితరం రాడికల్‌ హ్యూమనిస్టులలో కోగంటి రాధాకృష్ణమూర్తి ఒకరు. తాత్విక విషయాల పట్ల అభిమానం, అభిరుచి మెండుగా ఉన్న రాధాకృష్ణమూర్తి తనకు తటస్థపడిన ప్రతి అంశాన్ని శ్రద్ధగా పరిశీలించే వారు.
హేతువాదులైన గోపీచంద్‌, జి.వి.కృష్ణారావు, ఆవుల గోపాల కృష్ణమూర్తి వంటి వారి సహచర్యం వల్ల తరచుగా సాహితీ సమాలోచనల్లో పాల్గొనేవారు.
1937 నుంచి మానవేంద్రనాథ్‌రాయ్‌(ఎం.ఎన్.రాయ్) భావాలతో ఉత్తేజం పొందారు. 1940లో రాయ్‌ స్థాపించిన రాడికల్‌ డెమోక్రటిక్‌ పార్టీలో చేరారు. 1941లో ఆంధ్ర రాష్ట్రంలో రాడికల్‌ డెమోక్రటిక్‌ పార్టీని తెనాలిలో స్థాపించడంలో కోగంటి రాధాకృష్ణమూర్తి విశేషంగా కృషి చేసారు.
ఎం.ఎన్.రాయ్ 1936 లో ప్రారంభించిన ఇండిపెండెంట్ ఇండియా పత్రిక చదివి ఆంధ్రా యూనివర్శిటీ వైస్ చాన్సలర్ కట్టమంచి, లైబ్రేరియన్ అబ్బూరి రామకృష్ణారావు మానవవాదులయ్యారు. కూచిపూడిలో కోగంటి సుబ్రమణ్యం కోగంటి రాధాకృష్ణమూర్తి లీగ్ ఆఫ్ రాడికల్ కాంగ్రెస్ మెన్ స్థాపించారు. 1940లో తెనాలి రత్నాటాకీస్ లో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ మొదటి సభ జరిగింది. త్రిపురనేని గోపీచంద్ రాయ్ రచనలు అనువదించారు. ఆవులగోపాలకృష్ణమూర్తి గుత్తికొండ నరహరి ఖాజామియా లాంటి ఎందరో ఉద్యమంలో చేరారు. రాడికల్ విహారి ఆంధ్రాలేబర్ లాంటి పత్రికలు నడిచాయి. 1948లో రాడికల్ హ్యూమనిస్ట్ మూవ్ మెంట్ గా పేరుమారింది.
ఎమ్.ఎన్.రాయ్ పెట్టిన రాడికల్ డెమోక్రటిక్ పార్టీ ప్రతి రాష్ట్రంలోనూ మేథావులు, కొందరు ఉపాధ్యాయులను, అడ్వకేట్లను, డాక్టర్లను ఆకర్షించింది. రాయ్ తన మేథా సంపత్తిని వినియోగించి స్టడీ కాంపులు పెట్టి రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, ప్రణాళిక పాఠాలు చెప్పారు. ఆయనతోపాటు మరికొందరు మేథావులు సమర్థవంతంగా స్టడీ కాంపులు నిర్వహించారు. కలకత్తా, డెహ్రాడూన్, ముస్సోరి, స్టడీక్యాంపులు కొన్ని వందలమందిని ఆరితేరిన సుశిక్షితులుగా చేశాయి.
1948లో రాడికల్‌ డెమోక్రటిక్‌ పార్టీని రాయ్‌ రద్దు చేశారు. రాడికల్‌ హ్యూమనిస్టు ఉద్యమాన్ని ప్రారంభించారు. రాధాకృష్ణమూర్తి, ఏజీకే, రావిపూడి వెంకటాద్రి, జి.వి.కృష్ణారావు మొదలైనవారు ఉద్యమ స్ఫూర్తితో రచనలు చేస్తూ వచ్చారు. హేతువాద, మానవవాద భావాల ప్రచారానికై ప్రారంభించిన విహారి, రాడికల్‌, సమీక్ష వంటి పత్రికలకు రాధాకృష్ణమూర్తి కొంతకాలం సంపాదకత్వం వహించారు.
ఆసక్తితో, పట్టుదలతో ఆ సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారు. తనకు అర్థమైన విషయాలను ఇతరులకు అర్థమయ్యే టట్లు రాయడం కోగంటి రాధాకృష్ణమూర్తి విశిష్ట గుణం. విమర్శించడంలో, విశ్లేషించడంలో, వివరించడంలో ఆయనది ఒక ప్రత్యేకమైన మార్గం. వారి రచనలన్నీ సామాన్యులు సైతం సులభంగా అర్థం చేసుకోదగినవే.
రాధాకృష్ణమూర్తి అనువదించిన ఎం.ఎన్.రాయ్ వ్యాసాలు ఒక హేతువాద వాచకం అంటారు. 1945 నుంచి 1969 వరకు నలందా ప్రెస్‌, నలందా పబ్లిషర్స్‌ ప్రజాపరిషత్తుఅభివృద్ధి కి రాధాకృష్ణమూర్తి కృషిచేశారు. ప్రముఖ హేతువాది
1943 లో ఇండియాలో విప్లవం 1997 లో మార్క్సిజం- రాడికలిజం 1978 లో ఎం.ఎన్.రాయ్ జీవితం-సిద్ధాంతం ఇండియా భవిష్యత్తు
మల్లెపూలు (కథాసంపుటి)
గాంధీమార్గం
మార్క్సిజం-కమ్యూనిజం-చరిత్ర నేర్పిన గుణపాఠం మొదలైనవి ఆయన ఇతర స్వతంత్ర రచనలు. ప్రపంచ రికార్డులు, ప్రపంచ నాటికలు, న్యాయాన్యాయాలు, రాయ్‌ వ్యాసాలు, జవహర్‌లాల్‌ నెహ్రూ, నూతన రాజ్యాంగ చట్టం మొదలైనవి ఆయన అనువాద రచనలు.
ఎం.వి.రామమూర్తి అధ్యక్షతన 1977లో ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రచురణల సంస్థ తరఫున ప్రథమ ప్రచురణగా రాధాకృష్ణమూర్తి ఉద్గ్రంథం ‘ఎం.ఎన్‌.రాయ్‌ జీవితం-సిద్ధాంతం’ వెలువడింది. రాయ్‌ జీవితాన్ని 47 అధ్యాయాలలో, 432 పేజీలలో చక్కగా వివరించారు.
మానవవాదానికి హేతువాదం పట్టుగొమ్మకాబట్టి మానవవాదులంతా హేతువాదాన్నీ ప్రచారం చేస్తున్నారు. తాను స్వేచ్ఛగా భావించిన అంశాలను ఇతరులమీద బలవంతంగా రుద్దటమే నియంతృత్వం. వర్గంపేరుతో స్టాలిన్, జాతిపేరుతో హిట్లర్, మతం పేరుతో ఖొమైనీ ఇలా నియంతృత్వమే చేశారని మానవవాదుల వాదన. నీతి, న్యాయం కులమతాలను బట్టి కాకుండా మానవులందరికీ వర్తించేదిగా ఉండాలి. వ్యక్తి స్వేచ్ఛను సమష్టి కోసం బలి చేయకూడదు. ప్రజాస్వామ్యమంటే నాయకులు కాదు ప్రజలే తమకు తాము స్వాములుగా ఉండటం అన్న రాడికల్‌ హ్యూమనిస్టు ఉద్యమాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన వ్యక్తుల్లో రాధాకృష్ణమూర్తి ఒకరు.
రాడికల్‌ హ్యూమనిస్టు.ఏ ఇజాన్నీ హీనంగా నిరసించడటం తన అభిమతం కాదు. ఏ సిద్ధాంతానికీ సమగ్రత ఆపాదించరాదనీ, ప్రతి సిద్ధాంతంలోని మంచిని స్వీకరిస్తూ ముందుకు సాగటమే వివేకవంతుల లక్షణమన్న కోగంటి రాధాకృష్ణమూర్తి 1987 జనవరి 3న మరణించారు.
Chandamuri Narasimhareddy

(చందమూరి నరసింహారెడ్ది, సీనియర్ జర్నలిస్టు, ఖాసాసుబ్బారావ్ గ్రామీణ జర్నలిజం అవార్డు గ్రహీత)