10 సెప్టెంబరు సీమ సాహితీ దత్తపుత్రుడు,శ్రీ చిలుకూరి నారాయణరావు జయంతి సందర్భంగా రాసినది.
(డాక్టర్ అప్పిరెడ్డి హరినాథ రెడ్డి)
చిలుకూరి నారాయణరావుని ప్రత్యేకించి తెలుగు సాహిత్య ,సాంస్కృతిక రంగాల వారికి పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపు “లక్షపుటలకు పైగా, 200 పైబడి విలువైన పుస్తకాలను” తెలుగు సమాజానికి అందించాడు.
తెలుగు భాషా సాహిత్యరంగాలకు ఆధునిక కాలంలో కృషి చేసిన వారిలో చిలుకూరి తర్వాతే మరెవరైనా అనిపిస్తుంది. తెలుగులో తొలిసారి డాక్టోరల్ సైద్ధాంతిక వ్యాసం సమర్పించి పిహెచ్.డి పట్టా అందుకున్న తొలి తెలుగు పండితుడాయన. అన్నిప్రక్రియలలో ఆయనకు ప్రవేశం ఉంది. తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటి నుంచి లక్ష తెలుగు వాళ్ల సామెతలను సేకరించారు. అవి నేటికి అముద్రితంగా మిగిలాయి. వ్యవహరిక భాషలో నాటకాలు రాసారు. తెలుగు భాషపై దాదాపు మూడువేల పుటల పరిశోధనా గ్రంథం వెలువరించారు. ఇలా అయన కృషి ఎంతో వైవిధ్యంగా సాగింది.
రాయలసీమ ప్రాంత ప్రజలు ప్రత్యేకించి చిరకాలం స్మరించదగ్గ మహనీయుడు చిలుకూరి. వేరే దేశాలలో పుట్టి సీమలో ఉంటూ సేవ చేసిన థామస్ మన్రో, సి.పి బ్రౌన్ తదితరులందరో కనిపిస్తారు. తెలుగు నేలపై పుట్టి సీమకోసం పాటు పడిన వారు ఉన్నారు. అలాంటి కోవలో చిలుకూరి ఎన్నదగినవారు.
దత్త మండలం అని హీనంగా పిలువబడే ఈ ప్రాంతానికి 1928 నవంబర్ 18 న నంద్యాల ఆంధ్ర మహాసభలలో భాగంగా సాగిన ప్రథమ దత్తమండలాల సభలో ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ ప్రాంతాన్ని రాయలసీమ అనే నామకరణం చేయాలని ప్రతిపాదించి, తీర్మానం చేయించాడు. 1800 నుండి 1928 దాకా దత్తగా సాగిన మన పేరును 128 సంవత్సరాల తర్వాత రాయలసీమ గా రూపుదిద్దుకోవడానికి కారకుడయ్యాడు.
ఉత్తరాంధ్ర లోని విశాఖ వద్ద పొందూరు సమీపాన అనందపురంలో 1890 సెప్టెంబరు 10 న జన్మించారు. 1927 లలో అనంతపురము ఆర్ట్స్ కళాశాలలో ఆంధ్రభాషా విభాగం ఆచార్యుడిగా ఉద్యోగంలో చేరి తాను, తన కుటుంబం ఇక్కడే స్థిరపడ్డారు. 1951జూన్ 22 న తనువు చాలించాడు.
అనంతపురం చెరువు నేపథ్యంగా “ముసలమ్మ మరణం” ఇతివృత్తాన్ని గేయంగా రాసాడు. సీమ చారిత్రక, సాంస్కృతిక వైభవం చాటే దత్త గేయం రాసాడు. 1929 లలో ప్రారంభమైన “శ్రీ కృషదేవరాయ విద్యా పరిషత్తు” వ్యవస్థాపక సభ్యులు గా రాయల పై విశేష కృషి చేసాడు. సీమ సాంస్కృతికోద్యమానికి పరిషత్తు పక్షాన గొప్ప కృషి చేసాడు. సీమ తాళపత్రాలు, శాసనాలు వెలుగులోకి తీసుకొచ్చారు. గుంతకల్లు సమీపంలోని జొన్నగిరి వద్ద “అశోకశాసనాలను” పరిష్కరించారు. “అనంతపురము గ్రామనామాల” పై ఆయన రాసిన వ్యాసం పరిశోధనా సిద్దాంత గ్రంథం స్థాయి ఉంది.ఆంధ్రభాషా చరిత్రము రెండు సంపుటాల్లో రాశారు.ద్రవిడభాషామీదాయనచేసినప్రసంగాలు An Introduction to Dravidian Philology గావచ్చాయి.
రాయలసీమలో వ్యవహారిక నాటకం, పాట- గేయం, జానపదం, చరిత్ర, పరిశోధన తదితర ఆధునిక ప్రక్రియల వికాసానికి ఆయనకృషి వెలకట్టలేనిది.
ఇవి కూాడా చదవండి
- HMT వాచ్ ని మర్చిపోగలమా?, బెంగుళూరులో ఆ జ్ఞాపకాల ఖజానా
- 1857కు ముందే బ్రిటిష్ పాలనకు తలవంచనన్న కర్నూలు నవాబు
- తాను గుడ్ బై చెప్పినా, సినిమాలు భానుమతిని వదల్లేదు
సీమ సాంస్కృతిక దత్తపుత్రుడు అని ఇక్కడ పుట్టని కారణంగ అనాలే కానీ… ఆయన నిజమైన సీమ ముద్దు బిడ్డే. అయన జీవితంలో మూడు భాగాలు ఇక్కడే నడిచింది.
చిలుకూరి స్ఫూర్తిని సీమ బుద్దిజీవులుగా ముందుకు తీసుకపోవడమే మనముందున్న కర్తవ్యం.
డా.అవధానం నాగరాజరావు, అనంతపురము చిలుకూరి పై పరిశోధన చేసారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో మలయనూరులో జన్మించి బెంగుళూరు విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖలో ఆచార్యులుగా పని చేసి అక్కడే స్థిరపడిన ఆచార్య జి.యస్ మోహన్ చిలుకూరి మనవడు.
(డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి, పరిశోధకుడు, రచయిత,అనంతపురం, సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత)