పశుపతినాథ దేవాలయం అనగానే మనకు నేపాల్ గుర్తుకొస్తుంది. ఇది చాలా పేరున్న ఆలయం. రాజధాని ఖట్మాండ్ ఈశాన్యాన అయిదారు కిలోమీటర్ల దూరాన భాగ్మతి నది ఒడ్డున అంటుంది ఈ ఆలయం.
భారతదేశంలో ఇలాంటి ఆలయం ఎక్కడా లేదని చాలా మంది అనుకుంటారు.
మన దేశంలో శివాలయాలకు కొరత లేదు. అయితే ఒక పశుపతి నాథుడిగా ఆలయాలు లేవు. అయితే, అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలోని లింగాలబండపై ఉంది.
రాయదుర్గం – బళ్లారి రోడ్డు మార్గానికితూర్పున, పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో లింగాలబండ ఉంది. సుమారు 200 అడుగుల ఎత్తైన అతి పెద్ద బండపై పశుపతి ఆలయం ఉంది.
సామాన్యంగా శివాలయాల్లో శివుడి లింగానికి ఎదురుగా కొద్ది దూరంలో శివుడి వాహనం నంది విగ్రహం ఉంటుంది. అయితే ఇక్కడి మూలవిరాట్ విభిన్నమైనది, విశిష్టమైనది.
ఒకే రాతిపై మధ్య లింగం, నాల్గువైపులా నాలుగు నంది శిల్పాలు ఉండి అవి నాలుగు దిక్కులను చూస్తుంటాయి. ఇది దేశంలో శైవమత సిద్ధాంతం ఆచరణలో ఒక విలక్షణ ప్రయోగంగా భావించవచ్చు.ఈశాన్య దిక్కున చూస్తున్నట్టుండే శివున్ని చతుర్ముఖుడు , పంచముఖుడంటారు.
భారత దేశంలో గల ఏకైక పశుపతి నాథుని ఆలయం ఇది. ఆలయ ద్వారానికి ఇరువైపులా శంకరాచార్యులుమరియు ఆయన శిశ్యుని చిత్రాలు ఉన్నాయి. శంకరాచార్యులు ఈ ఆలయాన్ని నిర్మించారని స్థానికులు చెపుతారు. అయితే ఆలయ ఆవరణలో నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి శాసనాలు, ఆధారాలు లేవు. కర్ణాటక రాష్ట్రంలోని ‘చింతిని’ వద్ద గల విరకణత మఠంలో ఈ ఆలయానికి సంబంధించిన సమాచారం ఉందని స్థానికులు చెపుతారు.
కర్నాటకతో పాటు సమీపానఉన్న ఆంద్రప్రాంతాలనుకూడా క్రీ. 6వ శతాబ్దం నుంచి 12 వశతాబ్దం వరకు చాళుక్యలు పరిపాలనతో ఉండిందని, ఈ ఆరుదైన ఆలయాన్ని 12 శతాబ్దంలో పశ్చిమచాళుక్యులు నిర్మించి ఉండవచ్చని రాష్ట్ర పురాతత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆలయంలో కొన్ని చోట్ల విజయనగర రాజుల శిల్ప శైలిలో గారతో చేసిన శిల్పాలుకూడా కనిపిస్తాయి. అంటే విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయాన్ని పునురుద్ధరించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఆ కాలంలో పశుపతిని పూజించే శైవ మతం బహుళ ప్రచారంలో ఉండేది. కాలముఖ శైవులు, ఆచార్యులు ఉండేవారు. అప్పటికే రాయదుర్గం ప్రాంతంలో బౌద్ధ మరియు జైన మత ప్రభావం అధికంగా ఉండేది. ఇక్కడికి సమీపంలో ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం సిద్ధాపుర గ్రామం వద్ద గల బ్రహ్మగిరి కొండ వద్ద బౌద్ద మత ప్రచారంలో భాగంగా ఆశోక చక్రవర్తి శాసనాలు వేయించాడు.
1984 సంవత్సరంలో లింగాలబండ పక్కన ఉన్న గట్టి మల్లప్ప కొండపై పశువుల కాపరికి మట్టి ముంతలో సుమారు 300 బంగారు నాణేలు దొరికాయి. లింగాల బండలో మూల విరాట్ అడుగు భాగాన నిధులున్నాయని రెండు, మూడుసార్లు దుండుగులు పశుపతి విగ్రహాన్ని పక్కకు జరిపి తవ్వకాలు జరిపారు. పార్వతి, కాళీమాత విగ్రహాలు ధ్వంసం చేశారు. విశిష్టమైన, అరుదైన పశుపతి నాథుని ఆలయం గురించి కేంద్ర రాష్ట్ర పురావస్తుశాఖ ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోక పోవడం విచారకరం.
కొండకు సమీపంలోని చదం గ్రామస్తులే ఆలయ పోషణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి పనులు చేపట్టారు. పురావస్తు శాస్త్రవేత్తల సూచనలు పాటించక శాస్త్రీయత లోపించడంతో పూర్వం నిర్మించబడిన
ప్రాకారపు నలుదిక్కుల గల నంది మరియు గోపుర కలశ భాగం నిర్మాణంలో ఆధునికత చోటు చేసుకుంది. ఆలయ గోడలకు గల
శంకరచార్యుల చిత్రాలకు శాస్త్రీయ పద్ధతిలో పెయింట్ చేయక పోవడంలో వాస్తవికత కనుమరుగవుతోంది.
ఆలయ ఆవరణ అంతటా అడుగు భాగం బండపై సిమెంట్ ప్లాస్టరింగ్ చేయడానికి శివలింగం ఉన్న గుళ్లు మూసుకుపోయాయి. ఆధునిక నిర్మాణాల వల్ల ప్రాచీన చారిత్రక విలువలు, శిల్పాలు, చిత్రాలుకనుమరుగవుతున్నాయి. ఆలయ ధ్వజస్తంభం వద్ద నీటి ట్యాంకు ఏర్పాటు చేయడం వల్ల ఆలయ సహజ సౌందర్యం కనుమరుగైంది.
ఆలయ అభివృద్ధిలో పురావస్తు జీర్ణోద్ధారణ,శాస్త్రీయ పద్ధతులు పాటించక పోవడం వల్ల విశిష్టమైన పశుపతినాథుని ఆలయం తన పురావస్తు, చారిత్రక విలువలను కోల్పోతోంది.
పశుపతినాధునిఆలయ సందర్శనకు తగిన రోడ్డు మార్గం లేదు. శివరాత్రి సందర్భంగా ఆలయంలో విశేషపూజలు జరుగుతాయి. గత ఏడాది గర్భగుడికి నూతన గోపుర కలశంఏర్పాటుచేశారు. భారత ప్రధాని నరేంద్రమోడీ నేపాల్ పర్యటనలో ఖాట్మండులోని పశుపతినాథుని ఆలయాన్ని దర్శించినప్పుడు మన దేశంలో కూడా రాయదుర్గం వద్ద ఏకైక పశుపతినాథుని ఆలయం ఉందని తెలుసుకుని ఆశ్చర్య పోయారట. తాను ఆ ఆలయాన్ని
సందర్శించాలని ఉందని కోరికను ఆయన వ్యక్తపరిచారని చెబుతారు.
దేశంలో అరుదైన ఏకైక పశుపతి నాథుని ఆలయాన్ని శాస్త్రీయ పద్ధతిలోఅభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలపై ఉంది. దీనిని పర్యాటక దర్శనీయ క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం దేవాదాయ, పర్యాటక శాఖలపై ఉంది.
(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత)