విద్యుత్తు మీటర్లు బిగిస్తే మరొక ఉద్యమం: రైతు నాయకుల హెచ్చరిక

నగదు బదిలీ పేరుతో  వ్యవసాయ కరెంటు సరఫరా కు మీటర్లు బిగించాలని ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్ని నిర్ణయానికి వ్యతిరేకంగా మరొక విద్యత్ ఉద్యమం చేపట్టాలని పలువురు ప్రతిపక్షనాయకులు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో మొదటి సారి కరెంటు ఉద్యమం 2000 జూలై -ఆగస్టు నెలలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకువస్తున్న విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా వచ్చింది. హైదరాబాద్ బషీర్ బాగ్ రైతులు  మీద పోలీసులు కాల్పులు జరిపారు. ఇందులో కొంతమంది రైతులు కూడా చనిపోయారు.
విద్యుత్ సంస్కరణలు-వ్యవసాయానికి ఉచిత విద్యుత్ స్థానంలో నగదు బదిలీ పథకం’ అంశంపై విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆదివారం చర్చా వేదికను నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ దేశంలో కరోనా కేసుల ఉధృతికి మోదీనే కారణమని, ఈ పరిస్థితిని అడ్డు పెట్టుకుని బలవంతంగా విద్యుత్తు సంస్కరణలను అమలు చేయాలని చూస్తున్నారని అది తగదని అన్నారు.
‘ప్రజలంతా దయనీయమైన దుస్థితిలో ఉంటే వ్యవసాయ మీటర్లు, విద్యుత్తు సంస్కరణలు సబబుకాదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలను బలహీన పరిచాలనే ఒక అజెండాతో ముందుకు పోతున్నది.  తక్షణమే విద్యుత్తు మీటర్ల బిగింపును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. దీనికి విడుదల  చేసిన జివొ నెంబర్ 22 ఉపసంహరించుకోవాలి,’ శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించబోయే ఉచిత విద్యుత్ మీటర్ల బిగింపును వ్యతిరేకిస్తూ, అక్కడ నుంచే విద్యుత్ మీటర్లను పగులగొట్టే కార్యక్రమాలకు అన్ని పార్టీలు, రైతు, ప్రజా సంఘాలతో కలిసి శ్రీకారం చుడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపు నిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ మీటర్ల బిగింపునకు జీవో జారీచేస్తుందని ఎవరూ ఊహించలేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితోనే ఉచిత విద్యుత్ వచ్చిందనేదీ రాష్ట్ర ప్రజల్లో ఒక అభిప్రాయముందని, అలాంటి ఉచిత విద్యుత్ కు తూట్లు పొడిచేలా ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు.
కేంద్రం తెస్తున్న సంస్కరణలలో భాగంగానే విద్యుత్ మీటర్ల బిగింపునకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పన్నులు పెంచాలని, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని, ఈజీడూయింగ్ వ్యాపారం చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారన్నారు.
మోడీ ప్రభుత్వానికి లొంగిపోయి, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలను రాష్ట్రంలో అమలు చేస్తూ రైతులను మోసగిస్తున్నారని తూర్పారబట్టారు. జగన్ ప్రభుత్వానికి ఐదేళ్లపాటు ప్రజలు అధికారం ఇచ్చారని, 30 ఏళ్లు మేమే కొనసాగిస్తామని ప్రకటించడం తగదని, ఎవరన్నా రాసిచ్చారా? అని నిలదీశారు. ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాక, ఇక ఉచిత విద్యుత్తు ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ప్రజలను, రైతులను అమాయకులను చేసి మీటర్లు పెడతామంటూ ప్రభుత్వం మభ్యపెట్టడం తగదన్నారు. వేలాది కోట్ల రూపాయలు ఖర్చుచేసి, రైతుల ఖాతాలను తెరచడం, వారి ఖాతాల్లో డబ్బులు వేయడానికి బదులు సబ్ స్టేషన్ల దగ్గర ప్రభుత్వం మీటర్లు పెట్టవచ్చుకదా? అని రామకృష్ణ సూచించారు. ఇది ఒక్క రైతులకు చెందిన సమస్యే కాదని, కేంద్రం తీసుకొస్తున్న సంస్కరణలో భాగంగా, మిగిలినవన్నీ అమలులోకి వస్తాయని చెప్పారు. పక్కాగా ప్రజలను జగన్ మోసగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే జీవో నంబరు-22 వెనక్కి తీసుకునేంత వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.
రాజధాని తరహాగానే ఉచిత విద్యుత్తు విషయంలోనూ జగన్ మోసగిస్తున్నారని విమర్శించారు. కేంద్ర సంస్కరణలు అమలు చేశార, జగన్ చేసేదేమీ లేదని, అందరూ విద్యుత్ మీటర్ల బిగింపును వ్యతిరేకించాల్సిందేనని పిలుపునిచ్చారు.
సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ జి. లక్ష్మీనారాయణ నేతృత్వంలో జరిగిన ఈ చర్చా వేదికలో ఇందులో రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నేతలు, ప్రముఖ రైతు, సామాజిక ఉద్యమకారులు, విశ్లేషకులు హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఒకసారి ఈ సంస్కరణలకు అనుమతించాక, ఆ తర్వాత ఒకే దేశం-ఒకే కార్డు రాబోతోందని సిపిఎం కార్యదర్శి పి మధు హెచ్చరించారు.. ఈ సంస్కరణలకు వ్యతిరేకంగా సమైక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్‌కు ఈ సంస్కరణలో మంచి, చెడ్డలు అర్ధమైనట్లు లేవని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయి వ్యవహరిస్తున్నట్లుగా కన్పిస్తోందన్నారు.
సభకు అధ్యక్షత వహించిన టి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ  ఆహార భద్రత ఉండాలన్నా, ఉపాధి అవకాశాలుండాలన్నా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుంచి బయట పడాలన్నా, ఉచిత విద్యుత్తు రైతులకు ఊరటనిస్తుందన్నారు. కౌలు, చిన్న, మధ్య తరగతి రైతులు అధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అందులో మెట్ట ప్రాంత రైతులే అధికంగా ఉన్నారని చెప్పారు. ఉచిత విద్యుత్తు వారికి అందితే వారికి వ్యవసాయ రంగంలో చేదోడు వాదోడుగా దోహదపడుతుందని సూచించారు.  డిస్కమ్ ప్రైవేటీకరణకు ఈ ప్రభుత్వం మొదటి అడుగు వేసిందని స్పష్టమవుతోందని చెప్పారు. ఉచిత విద్యుత్తు పథకాన్ని రక్షించుకునేందుకు అందరూ ఏకమై, రైతులకు అండగా నిలవాలని కోరారు.
పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.గంగాధర్ మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన హక్కులను, ప్రత్యేక హోదా, ఆర్టీసీ విభజన తదితర అంశాలపై ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థితిలో ప్రభుత్వం లేదని, పూర్తిగా మోకరిల్లే తరహాగా ఉందని ఎద్దేవా చేశారు. విద్యుత్తు మీటర్ల బిగింపు చర్యలను తక్షణమే విడనాడాలని డిమాండు చేశారు.
రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర నాయకులు ఎర్నేని నాగేంద్రనాథ్ మాట్లాడుతూ జగన్ ప్రయోగాలతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. విద్యుత్తు మీటర్ల బిగింపుతో రైతులకు పెద్ద ఉచ్చులాంటిదంటూ ఆందోళన చెందుతున్నారని వివరించారు.
ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య మాట్లాడుతూ విద్యుత్ మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా బషీరాబాగ్ తరహాగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నాడు విద్యుత్ మీటర్ల బిగింపును ఎన్టీఆర్ వ్యతిరేకించారని, ఆయన వారసుడిగా చెప్పుకుని వచ్చిన చంద్రబాబు ప్రపంచ బ్యాంకు విధానాలకు అనుగుణంగా మీటర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టారని, దానిపై పెద్దఎత్తున ఉద్యమం వచ్చిందని గుర్తుచేశారు.
రాజకీయ విశ్లేషకులు సయ్యద్ రఫీ మాట్లాడుతూ కరోనా సమయంలో ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా, విద్యుత్తు మీటర్ల బిగింపును పెట్టాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. కిసాన్సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గుర్నాథరావు మాట్లాడుతూ నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్తుకు ఆయన తనయుడు జగన్ తూట్లు పొడవడం దుర్మార్గమైన చర్యని తెలిపారు. రైతు సేవా సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కినేని భవానీ ప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్తు మీటర్ల బిగింపుతో రైతులకు వచ్చే అనరాలను వివరించారు. రైతు ఉద్యమనేత గోపాలకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రాజకీయ నేతలు పవర్ ప్లాంట్లు పెట్టడం వల్ల ఈ సంస్కరణలు చేసే సమయంలో నిజాయితీ ఉండబోదని సూచించారు.ఎంసిపీఐ(యు) నాయకులు ఉయ్యాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా రైతులు ఆత్మహత్యలతో చనిపోతున్నారని, వారికి న్యాయం జరగడం లేదని, విద్యుత్తు మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు.
ఎస్ యూసీఐ నాయకులు సుధీర్ మాట్లాడుతూ ప్రభుత్వం తెచ్చిన జీవో 22ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ నగదు బదిలీ విధానం రైతుల పాలిట పెనుశాపమంగా మారనున్నాయని చెప్పారు. ఆప్ నాయకులు వీర వరప్రసాద్ మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ విధానాలకు ఢిల్లీ పాలన ఉదాహరణని వివరించారు. విద్యుత్తు మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా చేపట్టే ఉద్యమానికి ఆప్ మద్దతిస్తున్నదన్నారు.
ఈ చర్చా వేదికలో సీపీఐ కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, ఇన్సాఫ్ రాష్ట్ర కన్వీనర్ అఫ్సర్, ప్రోగ్రెసివ్ ఫోరమ్ రాష్ట్ర నాయకులు అక్కినేని చంద్రారావు, బుడ్డిగ జమీందార్, కృష్ణాజిల్లా రైతు సంఘం కార్యదర్శి మల్నీడు యలమందరావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.