తిరుపతి చుట్టూర ఉన్న వింతల్లో వింత ఈ శిధిలవైభవం

పెరిగినపొదల, తుప్పల మధ్యన ఎత్తయిన శిఖరంతో గంభీరంగా అగుపించే ఈ మహా గుడి గోపురం ఒకపుడు ఎంతో వైభవంతో పరిఢవిల్లింది.
చంద్రగిరి-శ్రీనివాస మంగాపురంల మధ్య ఎగువ రెడ్డి గారి పల్లె దగ్గిర  ఈ ఆలయ సముదాయం ఆశ్చర్యపరుస్తూ కనిపిస్తుంది. చాలా విశాలమయిన ఈ దేవాలయం ప్రస్తుతం ఈ శిఖరగోపురంతో సరిపెట్టుకుంది.

ప్రహరీ గోడలన్నీ నామ రూపాల్లేకుండా పోయాయి. గుప్త నిధుల తవ్వకాలతో  గాయపడి ఈ ప్రాంతం చూపరుల గుండెల్ని పిండేస్తుంది. పక్కన ఉన్న కోనేరు ఆనవాలు లేకుండా పోయింది.

దాదాపు 60 అడుగుల ఎత్తు ఉన్న ఈ గాలిగోపురం, కోటగోడలను తలపించే శిధిల ప్రాకారం, ప్రసాద వంటకాల పోటు శాల, గిలకబావి చూపరుల్ని చికితులు చేస్తాయి.నేల మట్టమయిన ముఖమంటపం, అర్ధమండపం, అంతరాళం, గర్భగుడి ఆనవాళ్లు న్నాయి.

స్థానికులు దీన్ని నరసింహ ఆలయంగా పిలుస్తున్నారు. విజయనగర రాజుల కాలాన కట్టిన ఈ గుడి ‘కొట్టాల స్థలం’గా ప్రసిద్ధి కెక్కింది. తిరుమల వేదపారాయణదారుల కోసం రెండవ దేవరాయలు విప్రులకు శ్రోత్రియంగా ఈ స్థలాన్నిచ్చినట్లు 1433 సంవత్సరం నాటి శాసనం చెబుతున్నది.

 ఈపాడుబడ్డ అద్వితీయ దేవాలయం తిరుపతి నుంచి శ్రీనివాస  మంగాపురం వెళితే, నేరుగా మదనపల్లె రోడ్డు, గుడిపక్క శ్రీవారి మెట్ల రోడ్డు ఉంటాయి. మనం ఎడమ పక్క చంద్రగిరి రోడ్డు పట్టుకుంటే 2 కి.మీదూరం వెళ్లి కుడివైపు తిరిగితే ఒక కి.మీ దూరంలో  ఈ శిధిల వైభవాన్ని చూడవచ్చు.

-pictures:Bhooman, Tirupati