తెలుగు దేశం ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంటకరావు ముఖ్యమంత్రి జగన్ కు రాసిన బహిరంగ లేఖ
కిమిడి కళా వెంకట్రావ్
ఆలికి అన్నంపెట్టి ఊరికి ఉపకారం చేశానని చెప్పినట్లుంది పేదలకు ఇంటి జాగాల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. వైకాపా నాయకులకు దోచి పెట్టేందుకు ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని మరో సూట్ కేసు కంపెనీల కుంభకోణంగా మార్చివేశారు. ఈ అంతులేని అవినీతి అక్రమాలపై మీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మీకు బహిరంగంగానే చెప్పినా పెడచెవిన పెడుతూ వచ్చారు. ఇంద్రుడు కూడా కుళ్లుకొనే విధంగా సఖల భోగాలతో హైదారాబాద్ లో, బెంగుళూర్ లో, ఇడుపులపాయలో వందల ఎకరాలలో రాజప్రాసాదాలు నిర్మించుకొన్న మీరు.. పేదలను శ్మ శానాలు, ముంపు ప్రాంతాలలో అందులోనూ సెంటు భూమిలో ఇళ్లు కట్టుకోమనడం దేనికి సంకేతం..? ఇటువంటి భూములలో వైకాపా నేతలు ఇళ్లు కట్టుకుని ఉండగలరా..? మీ వైఖరి చూస్తుంటే రాజధానిని మూడు ముక్కలు చేసినట్లుగా.. రానున్న రోజుల్లో ఈ సెంటు జాగాను సైతం మూడు ముక్కలు చేసి పంచినా ఆశ్చర్యపోనవసరం లేదనిపిస్తోంది.
ప్రజలు అడిగే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి..
1. కోర్టు కేసుల కారణంగా 60వేల ఎకరాలలో ఇళ్ల పట్టాల పంపిణీ ఆగిపోయిందంటున్నారు. కానీ.. వెయ్యి ఎకరాలకు సంబంధించి మాత్రమే పేదలు కేసులు వేశారు. మరి మిగతా 59వేల ఎకరాలు పంచడానికి అడ్డంకి ఏమిటి.?
2. కావలి ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి.. తన అనుచరులు, పనివాళ్ల పేరిట జులై 1న 13 ఎకరాలు కొనుగోలు చేయడం, 3వ తేదీన కలెక్టర్ కు సిఫార్సు చేయగా ఒప్పుకోకపోవడంతో మంత్రి అనిల్ కుమార్ ప్రోద్బలంతో ఆయనను బదిలీ చేసింది నిజం కాదా..? కుంభకోణానికి పాల్పడిన ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోలేదు..?
3. రాజమండ్రి భూ కుంభకోణంలో సీఎం కుటుంబ సభ్యుడు అడ్డంగా దొరికిపోయినా కూడా చర్యలకెందుకు వెనుకాడుతున్నారు..?
4. ఇళ్ల స్థలాల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఏ ఒక్కరూ సంతోషంగా లేరనడానికి మీ సొంత పార్టీ నాయకులు కోర్టులలో వేస్తున్న కేసులే నిదర్శనం. అనపర్తి నియోజకవర్గంలో మాజీ జడ్పీటీసీ, ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ప్రధాన అనుచరుడైన కత్తి భగవాన్ రెడ్డి హైకోర్టులో వేసిన పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్.. మీ అక్రమాలకు నిలువెత్తు సాక్ష్యం కాదంటారా..?
5. భూస్థలాల వేటలో మీ నాయకులందరూ రియల్ బ్రోకర్ల అవతారం ఎత్తింది వాస్తవం కాదా..? ఎందుకూ పనికిరాని భూములను తక్కువ ధరలకు రైతుల వద్ద కొనుగోలు చేసి.. ప్రభుత్వానికి అధిక ధరకు విక్రయిస్తూ రూ. కోట్ల ప్రజాధానాన్ని లూటీ చేయలేదా..? ఇది అవినీతి కాదా.? తెనాలి నియోజకవర్గంలో అధికారపక్ష నాయకులు రైతుల నుంచి రూ. 5 లక్షలకు కొన్న భూమిని.. రూ. 70 లక్షలకు ప్రభుత్వానికి అమ్మింది వాస్తవం కాదా..? చివరకు కోర్టు జోక్యంతో అసలైన రైతులకు న్యాయం జరిగింది నిజం కాదా..?
ఇది కూడా చదవండి
‘ఫైటర్ అచ్చన్నాయుడు’ టిడిపి-ఎపి అధ్యక్షుడవుతున్నారా?
6. కోరిన ప్రాంతాలలో ఇళ్ల స్థలాల ఇస్తామని ఆశ చూపి.. మీ పార్టీ కార్యకర్తలు పేదల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడటంలేదా..? ఇందులో పై స్థాయి నేతల వరకు రూ. కోట్ల కమీషన్లు చేతులు మారిందనడంలో వాస్తవం లేదంటారా..?
7. స్థలాల వేటలో మొదట పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అసైన్డ్ భూములపై పడ్డారు. పచ్చటి భూములపై పడి రాత్రికి రాత్రి దున్నేశారు. అవి చాలవని కొండ పోరంబోకు, గ్రామ కంఠం, బంజరు ఇలా అన్ని చోట్లా లేఔట్ రాళ్లు పాతేశారు. మీ దురాగతాలకు అంతు లేదా..?
8. రెవెన్యూ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ కు విరుద్ధంగా పశువుల మేత భూముల్లో ఇళ్ల స్థలాలను ఏవిధంగా కేటాయిస్తారని హైకోర్టు గడ్డిపెట్టినా.. ప్రభుత్వ తీరులో ఎందుకు మార్పు రావడం రాలేదు..?
9. రాజధాని భూములు విషయం న్యాయస్థానం ముందు ఉంది. కనీసం ఆ వ్యాజ్యం పరిష్కారం అయ్యేవరకు ఆగకుండా రైతుల భూములు ఇళ్ల స్థలాలకు ఇచ్చేందుకు ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటి..?
10. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో 1,307 ఎకరాల మైనింగ్ భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించడంపై హైకోర్టు స్టే విధించడం రాష్ట్ర ప్రభుత్వానికి మరో చెంపపెట్టు కాదా..?
11. పేదలకు ఇచ్చే ఇంటి స్థలాల కోసం రెవెన్యూశాఖ రాష్ట్రవ్యాప్తంగా 23వేల ఎకరాలపైనే ప్రైవేటు భూమిని సేకరించగా.. ఈ భూములలో అధిక భాగం స్ధానిక వైసీపీ నేతలకు చెందినవే అన్నదానిలో వాస్తవం లేదంటారా..?
12. పర్యావరణ చట్టాలను, నిబంధనలను కాలరాస్తూ.. కాకినాడ, మచిలీపట్నంలో తీర ప్రాంతాన్ని రక్షించే మడ అడవులను కొట్టేసి భారీ అవినీతికి పాల్పడ్డారు. తూ.గో జిల్లా కోరుకొండ మం. బూరుగుపూడి కాపవరంలో 586 ఎకరాలు ముంపు భూములు కొనుగోలు చేసి.. ఆవ భూముల్లో రూ.400 కోట్లు మింగేశారు. ఈ దురాగతాలు ముఖ్యమంత్రికి తెలియకుండానే జరుగుతున్నాయా..?
13. కర్నూలు జిల్లా నంద్యాలకు కుందూ నుంచి ఎప్పుడూ వరద ముప్పు ఉంటుంది. అటువంటి నదికి కేవలం 50 మీటర్ల దూరంలో ఉన్న భూముల్లో 7,500 మందికి స్థలాలు ఇస్తూ.. లబ్ధిదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పేదలంటే ఎందుకంత చిన్నచూపు..?
14. కొన్ని చోట్ల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండగా.. ఎక్కువ మొత్తం వెచ్చించి ప్రైవేటు భూములు కొనుగోలు చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ పెద్దలకు ముట్టిన వాటా ఎంత..?
15. గ్రామీణ ప్రాంతాల్లో కింది స్థాయి వైకాపా శ్రేణులు రూ. 10 వేలు ఇచ్చిన వారికి శ్మశానాల్లో, రూ 30 వేలు ఇచ్చిన వారికి చెరువుల్లో, 60 వేల నుంచి రూ. లక్ష ఇచ్చిన వారికి ఊరికి దగ్గరల్లో ఇళ్ల స్ధలాలు కేటాయిస్తూ జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇది దోపిడీ కాదంటారా..?
16. నిజమైన అర్హులను పక్కనపెట్టి పార్టీలు, కులాల వారీగా లబ్ధిదారులను ఎంపికచేస్తూ ప్రజల మధ్య మీరు చిచ్చు పెడుతోంది నిజం కాదా..?
17. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి భూములిచ్చిన రైతుల నుంచి వైకాపా నాయకులు రూ.1,400 కోట్లు కమీషన్లు వసూలు చేశారు. దీనికితోడు ఇళ్ల స్థలాలు ఇస్తామని పేదల నుంచి మరో రూ. 200 కోట్లు వసూలు చేశారు. ఇది కుంభకోణం కాదంటారా..?
18. పేదలకు ఇంటి స్థలాల కేటాయింపుల్లోనే కాకుండా ఆ భూమిని చదును చేసే పనుల్లోనూ భారీ దోపిడీకి తెరతీశారు. ఉపాధి పథకం కింద చేపట్టిన రూ.2,613 కోట్ల పనుల్లో.. సిమెంట్, ఇటుకలు కొన్నట్లుగానే, మట్టిని కొనుగోలు చేస్తున్నట్లు అంచనాలలో చూపించి రూ.1,560 కోట్ల మేర ఉపాధి నిధులను మింగేస్తున్నారు. ఇది కార్మిక రంగాన్ని మోసం చేయడం కాదా..?
19. ఇంటి పట్టాల పేరుతో పేద, బడుగు, బలహీనవర్గాల భూములను యథేచ్ఛగా లాక్కొంటున్నారు. బలవంతపు భూసేకరణ వల్ల నష్టపోయిన వాళ్లు దాదాపుగా 90 % బడుగు, బలహీనవర్గాల ప్రజలే. ఆఖరికి చర్మకారులకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన భూములను కూడా లాక్కుంటూ.. వారి జీవనాధారాన్ని దెబ్బతీస్తోంది వాస్తవం కాదా..?
20. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీల నుండి 6వేల ఎకరాలు పంపిణీ చేస్తే.. జగన్ రెడ్డి ప్రభుత్వం 6వేల ఎకరాలు లాక్కొంది నిజం కాదా..?
21. వైకాపా దుర్మార్గపు చర్యలతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తన 2 ఎకరాల డి-ఫారం బలవంతపు భూసేకరణ వల్ల తూ.గో. జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో బాలరాజు మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించాడు. ఇది ప్రభుత్వ హత్య కాదంటారా..?
22. కర్నూలు జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామంలో తన రెండున్నర ఎకరాల భూమిని అధికారులు, వైసీపీ నాయకులు స్వాధీనం చేసుకుని రాత్రికి రాత్రి లేఅవుట్లు వేయడంతో మదన్ మోహన్, భూలక్ష్మి దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబానికి ఎవరు సమాధానం చెబుతారు..?
23. ప్రభుత్వం చేతిలో ఉన్న భూములను బిల్డ్ ఏపీ పేరుతో బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల పేదలు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను మాత్రం దౌర్జన్యంగా లాక్కుని ఇళ్ల స్థలాల కింద పేదలకు పంచుతున్నారు. ఇదెక్కడి న్యాయం..?
24. తెలుగుదేశం హయాంలో అన్ని సౌకర్యాలతో నిర్మాణం పూర్తి గావించబడి.. గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్న 6 లక్షల ఇళ్లను నేటికీ పేదలకు ఎందుకు పంచలేదు..? నెల్లూరులో పెన్నా నది ఒడ్డున 10వేల ఇళ్లు డ్రైనేజీ సహా పూర్తి కాగా.. వాటిని ఎందుకు పక్కనపెట్టారు..? చంద్రబాబు గారిపై కక్షతోనే ఆ ఇళ్లను పాడుబెడుతోంది వాస్తవం కాదంటారా..? మీ 15 నెలల పాలనలో ఒక్క ఇంటినీ నిర్మించలేదన్న దానిలో నిజం లేదంటారా..?
ఈ అక్రమాలన్నీ ఎడారిలో ఇసుక రేణువంత మాత్రమే. రిటైర్డ్ జడ్జితోనో, సిట్టింగ్ జడ్జితోనో విచారణ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే.. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని లక్షల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయో.. ఎన్ని వేల కోట్లు ప్రజాధనం పక్కదారి పట్టిందో.. ఎన్ని వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయో.. సాక్ష్యాధారాలతో సహా లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి దుర్మార్గపు చర్యలతో సేకరించిన భూములను స్వీకరించేందుకు రాష్ట్రంలోని పేద ప్రజలు సిద్ధంగా లేరు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నిర్మాణం పూర్తయిన ఇళ్లను పేదల స్వాధీనం చేయాలి. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి, మిగిలిన ఇళ్లు కూడా శరవేగంగా పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలి.