అమరావతి డ్రామాలు ఆపండి: చంద్రబాబుకు రాయలసీమ కార్మిక కర్షక సమితి వినతి

(Yanamala Nagireddy)
రాజకీయ ప్రయోజనాల కోసం అమరావతి పేరుతో చంద్రబాబు, ఆయన మద్దతుదారులు ఇప్పటివరకూ చేసిన, ప్రస్తుతం చేస్తున్న అనవసర రాద్ధాంతాన్ని ఇకనైనా నిలిపివేయాలని, రాయలసీమతోపాటు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల అభివృద్ధి కొరకు ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు ఇవ్వాలని  రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు సి. హెచ్ చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎస్. రమణయ్య విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేయడానికి ముందుకు వస్తే ప్రజలు హర్షిస్తారని, ఈ విషయం గుర్తించాలని   టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక  బహిరంగ లేఖ రాస్తూ  విజ్ఞప్తి చేశారు.
ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలోనూ, వ్యక్తిగత లబ్ది కోణంలోనూ  మాత్రమే చూడటం మానుకోవాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలపై సమాన ప్రేమ చూపాలని వారు చంద్రబాబును కోరారు.
అమరావతి 5కోట్ల ఆంధ్రుల రాజధాని అంటూ చేస్తున్న రాజకీయ రాద్ధాంతం నేపధ్యంలో కొన్ని చారిత్రక వాస్తవాలను టిడిపి దృష్టికి తెస్తూ ఈ లేఖ రాస్తున్నట్లు వారు చెప్పారు.
టిడిపి సేవ్ అమరావతి ఆందోళన
అమరావతి రాష్ట్ర ప్రజలు అంగీకరించిన రాజధానా? లేక మీ రాజకీయ ప్రయోజనాలకోసం ఏర్పాటు చేసిందా అనే విషయం    స్పష్టం చేస్తే తెలుసుకునేందుకు  ఈ లేఖ వ్రాస్తున్నామని వారు వివరించారు.
‘2014లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండుగా చీలి తెలంగాణ ఏర్పడినప్పటి నుండి “ పోలవరం,- అమరావతి మాత్రమే” మీ రెండు కళ్లుగా చెప్పుకుంటూ, ముఖ్యమంత్రిగా మీకున్న అధికారాలను 5సంవత్సరాలపాటు ఈ రెండు ప్రాజెక్టులపై కేంద్రీకరించి, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను (విశాఖపట్టణం నగరం తప్పా) పూర్తిగా విస్మరించారు.  అమరావతిని గ్రాఫిక్స్  రాజధానిగా మార్చారు.  పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు రాయలసీమకు వరప్రసాదిని అని, పోలవరం ఆంధ్ర ప్రజల జీవనాడీ అని ప్రకటనలు చేసి ఆచరణలో సీమకు మొండి చేయి చూపారు.  రాయలసీమకు కానీ, ఉత్తరాంధ్రకు కానీ చేసింది  శూన్యమని చెప్పకతప్పదు,’ అని వారు లేఖలో పేర్కొన్నారు.
లేఖలోని విశేషాలు
చంద్రశేఖర్ రెడ్డి(రాయలసీ కర్షక కార్మిక సమితి నేత, కడప)
అమరావతి రాష్ట్ర ప్రజలు అంగీకరించిన రాజధానా? మీ రాజకీయాల కోసం ఏర్పాటు చేసిందా? 
మద్రాసు రాష్ట్ర నుండి తెలుగు రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ముందు ’’రాయలసీమ నాయకులు కోస్తా ప్రాంతంతో కలిసి ఉండడం కంటే మద్రాసులోనే ఉండడం మేలని అభిప్రాయపడిన’’ విషయాన్ని, ప్రాంతీయ విభేదాలు తీవ్రంగా ఉన్న నేపధ్యంలో తెలుగురాష్ట్రాన్ని సాధించుకోవాలన్న సంకల్పంతో రాయలసీమ, కోస్తాంధ్ర నాయకులు 1937లో కుదుర్చుకున్న శ్రీభాగ్‌ ఒప్పందం మీకు తెలుసు. అయితే 1952లో ఆంద్ర  రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ఒప్పందానికి కోస్తా నాయకులు సీమ నాయకుల(మీతో సహా)   ద్వారానే తిలోదకాలిíప్పించి, అన్ని రంగాలల్లో రాయలసీమను నాశనం చేసిన విషయం మీకు తెలుసు. శ్రీభాగ్‌ ఒప్పందం మేరకు రాయలసీమ ప్రజలు కోరుకున్న విధంగా సీమలో ‘‘రాజధాని లేదా హైకోర్టు’’ ఏర్పాటు చేయవలసి ఉంది. అప్పట్లో రాజధానిని కర్నూల్‌లో ఏర్పాటు చేసిన తర్వాత హైదరాబాదుకు తరలించారు.  సాగునీటి కేటాయింపుల విషయంలోనూ, ప్రాజెక్టు నిర్మాణంలోనూ సీమకు జరిగిన అన్యాయం తమరికి పూర్తిగా తెలుసు కూడా.
రాయలసీమ సిద్ధేశ్వరం అలుగు కోసం సాగుతున్న రైతు యాత్ర
2014లో రాష్ట్ర విభజన తర్వాత 1952 నాటి ఆంధ్ర రాష్ట్రం మిగిలింది. శ్రీభాగ్‌ ఒప్పందం మేరకు రాయలసీమకు రాజధాని రావాలి. ఈ చారిత్రక ఒప్పందాన్ని పట్టించుకోకుండా,రాజధానిని ఎంపిక చేయడం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీ శివరామకృష్ణన్‌ కమిటీ చేసిన సిఫార్సులను అసలు ఖాతరు చేయకుండా రాజధాని ప్రాంతాన్ని మీ ఇష్టారాజ్యంగా ఎంపిక చేసి, అది 5కోట్ల ఆంధ్రుల రాజధాని అని మీరు ఎలా అంటారు? ‘‘అప్పటి ముఖ్యమంత్రిగా మీ రాజకీయ ప్రయోజనాల కోసం’’ ఆడిన రాజధాని ఎంపిక నాటకంలో సీమ ప్రజలే బలిపశువులైనారు…
‘‘హైదరాబాదు లాగా సూపర్‌ రాజధాని వద్దని, రాజధానిని ప్రభుత్వ స్థలాలున్న ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మంచిదని, విజయవాడ–గుంటూరు మధ్య రాజధాని వద్దని, శివరామకృష్ణన్‌ కమిటీ స్పష్టంగా చెప్పినా మీరు ఏ ప్రాతిపదికన అమరావతిని ఎంపిక చేశారో ప్రజలకు ఇప్పటికైనా వివరించాలని వారు చంద్రబాబును  కోరారు.  రాజధాని ఉన్న ప్రాంతంలోనే హైకోర్టు ఉండాల్సిన అవసరం లేదని, పారిశ్రామికంగా విశాఖను, విద్యారంగాన్ని అనంతపురంలో ఏర్పాటు చేస్తే మంచిదని, డైరెక్టరేట్లు, పాలనాకేంద్రాలను అన్ని జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసి, అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని కమిటీ సూచించినా మీరు మీ స్వంత రాజకీయాల  కోసం ఎవరినీ ఖాతరు చేయకుండా నిర్ణయాలు తీసుకున్నారు. వికేంద్రీకరణను పక్కన పడవేసి  కేంద్రం మంజూరు చేసిన అన్ని ప్రధాన సంస్థలను అమరావతి చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఏర్పాటుచేసి రాష్ట్రంలోని అన్నివెనుకపడిన ప్రాంతాలకు, రాయలసీమకు తీరని అన్యాయం చేయడంతో పాటు ప్రాంతాల మద్య  విభేదాలు రెచ్చగొట్టారు.
రాజధాని ప్రాంతంలో ‘అమరావతి పరిరక్షణ’ క్యాంపెయిన్
రాయలసీమ ఉద్యమకారులు తమ శక్తి మేరకు రాజధాని రాయలసీమకే కేటాయించాలని అరిచినా, హైకోర్టు ఇవ్వాలని గగ్గోలు పెట్టినా, చివరకు హైకోర్టు బెంచీ అయినా కేటాయించాలని కోరినా మీరు విన్పించుకోలేదు. రాయలసీమ వాసులు హైకోర్టు కోసం ఎప్పటికైనా గట్టిగా పట్టుపట్టగలరనే అనుమానంతో మీరు, మీకున్న పరిచయాలు, అధికారం ఉపయోగించి హైకోర్టును కూడా ఆగమేఘాల మీద అమరావతి ప్రాంతంలోనే తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేయించారు. అన్నీ తెలిసి చెవిటివాడిలా నటిస్తున్న మీ ముందు రాయలసీమ వాసులు శంఖం ఊదినా ఫలితం లేదని తెలిసి 4ఏళ్లుగా మౌనం పాటించి 2019 ఎన్నికలల్లో ఓటు శంఖం పూరించి మీకున్న చెవుల త్రుప్పును వదలగొట్టారు. 2019 ఎన్నికలలో సీమతోపాటు ఉత్తరాంధ్ర వాసులు, కోస్తాంధ్ర ప్రజలు ఐక్యంగా మిమ్ములను,  మీ వ్యవహారశైలిని పూర్తిగా తిరస్కరించారు.
గతంలో ప్రతిపక్షనేతగా ఉండి, అమరావతికి మద్దతు పలికిన వైఎస్సార్‌సీపీ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తప్పులను సరిదిద్ది అందరికి న్యాయం చేస్తానని బహిరంగంగా అనేక సార్లు ప్రకటించారు.’’ అందులో భాగంగా పాలనా వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ చర్యలు చేపట్టారు. మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చి చట్టం చేసి, అమలుకు ప్రయత్నిస్తున్నాడు. నేటి రాజకీయ పరిస్థితుల్లో ప్రాంతీయ రాజకీయాల నేపధ్యంలో రాయలసీమకు పూర్తిగా న్యాయం చేయలేక హైకోర్టు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించారు. కానీ మీరు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను  మీ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యతిరేకిస్తూ, టీడీపీకి చెందిన సీమ నాయకుల చేత కూడా అమరావతి భజన చేయిస్తున్నారు.
అలాగే అమరావతి పరిరక్షణ కమీటీలు, సమితిల పేరుతో మీరు, మీ భజన బృందం, మీకు, మీ ఆలోచనలకు సంపూర్ణ మద్దతు పలుకుతున్న మీడియా చేస్తున్న ఆర్భాట ప్రచారం తోపాటు  హైకోర్టు, సుప్రీంకోర్టులలో అనేక మందితో కేసులు వేయించడం, ఈకేసులు వాదించడానికి అత్యంత పేరు ప్రఖ్యాతులున్న న్యాయవాదులను, అత్యంత ప్రముఖుల బంధువులను న్యాయవాదులుగా నియమించడం చూస్తే మీలో ఏమాత్రం మార్పు లేదని, “మీ స్వంత ప్రయోజననాలు తప్ప” ప్రజల ఆకాంక్షలు, వారి కోరికల గురించి, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి గుర్తించి మీకు పట్టదని తేలుతున్నది.
Amaravati farmers
 రాయలసీమలో పుట్టి పెరిగిన మీకు, 1978లో మీరు రాజకీయాలలో ప్రవేశించినప్పటి నుండి ఇప్పటి వరకూ సీమ  ప్రజలు బ్రహ్మరథం పట్టి, ఒక్కసారి మినహా అన్నీ సార్లు మిమ్మల్ని గెలిపించారు. అయితే మీరు 1995లో ఎన్టీయార్‌ను పదవీచ్యుతుడ్ని చేసి 1995 నుంచి 2004 వరకు, 2014 నుంచి 2019 వరకూ 14 సంవత్సరాలు పాటు ముఖ్యమంత్రిగాను, 2004 నుండి 2014 వరకూ 10 సంవత్సరాలు ప్రతిపక్షనేతగా పనిచేసైన  కాలంలో  మీరు అన్ని రంగాలల్లో వెనుకబడిన రాయలసీమలో  ఎలాంటి అభివృద్ధి  చేయలేదు. ప్రస్తుతం రాయలసీమకు ఏంతో  కొంత చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను  మీరు అడ్డుకోవడం శోచనీయం. . ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన కోస్తాంధ్రతోపాటు, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలున్నాయన్న విషయాన్ని గుర్తు చేసుకొని  ఎన్నో దశాబ్దాల తర్వాత వెనుకబడిన ప్రాంతాలల్లో చోటుచేసుకుంటున్న అభివృద్ధి యత్నాలను అడ్డుకోకండి. అమరావతి రాజధాని పేరుతో మీరు ఆడుతోన్న దిగజారుడు రాజకీయాలు ఆపాలని,మీకున్న అపారమైన తెలివి, రాజకీయ అనుభవాలను ఉపయోగించి  రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేయండి.

(Yanamala Nagiredd is a senior journalist from Kadapa)