తీరా మంటల్లేసినపుడు ఆర్పడానికి ‘మిల్లెనియం షోమన్’ రాజ్ కపూర్ లేడక్కడ!

(Ahmed Sheriff)
రణ్బీర్ రాజ్ కపూర్ వుర్ఫ్  రాజ్ కపూర్ – మిల్లెనీం షోమాన్.   మిల్లెనీం షో మాన్ గా ఖ్యాతి చెందిన రాజ్ కపూర్ జీవితం పూల పానుపేమీ కాదు. ఇది నిజంగా కూడా నిజం.  అంటే రాజ్ కపూర్ మంచాల మీద పానుపుల మీదా పడుకునే వాడు కాదు. నేలమీదే పడుకునే వాడు.
రాజ్ కపూర్ తండ్రి పృథ్వీ రాజ్ కపూర్ నటుడిగా బాగా పేరున్న రోజులు. రాజ్ కఫూర్ ఆయన వద్దకు వెళ్లి తనకు సినిమాల్లో నటించాలని  వుంది అన్నప్పుడు, పృథ్వీ రాజ్ కపూర్ అతణ్ణి తన మిత్రుడు రచయితా, నిర్మాతా, దర్శకుడైన కేదార్ శర్మ వద్దకు తీసుకెళ్లాడట. తీసు కెళ్లి ఏదయినా సినిమాలో చాన్సు ఇవ్వ మని అడగలేదు. అతడి వద్ద ఒక పని పిల్లవాడుగా పెట్టూకోమన్నాడట.  అలా రాజ్ కపూర్ సినీ జీవితం కేదార్ శర్మ వద్ద ఒక క్లాప్ బాయ్ గా మొదలయింది.  అయితే నిజానికి రాజ్ కపూర్ 11 ఏళ్ల వయసులోనే 1935 లో ఇంక్విలాబ్ అనే చిత్రం లో మొట్ట మొదటి సారి తెరమీద కనిపించాడట.
1947 లో కేదార్ శర్మా రచన, నిర్మ్మాణం, దర్శకత్వం వహించిన “నీల్ కమల్” సినిమా వచ్చింది. ఈ చిత్రం లో హీరో గా రాజ్ కపూర్ నటించాడు. అతడికి జంటగా మధుబాల నటించింది. ఈ చిత్రం ఇద్దరు మహా నటుల్ని సినీ రంగానికి పరిచయం చేసింది.

రాజ్ కపూర్ కి సంగీతమంటే మక్కువ ఎక్కువ.  నిజానికి రాజ్ కపూర్ మొదట సంగీత దర్శకుడు అవ్వాలను కున్నాడట. రాజ్ కపూర్ కి సంగీతం పై వున్న అవగాహననూ , ప్రేమనూ మనం అతడి సినిమాల్లో ప్రస్ఫుటంగా గమనించ వచ్చు. 1948 లో రాజ్ కపూర్ తన సొంత బానర్ ఆర్ కే ఫిలింస్ ను ఆవిష్కరించాడు. అప్పటి కాలం లో అతి చిన్న వయసులో దర్శకుడైన ప్రతిభ అతడికే దక్కింది.
ఆగ్ (1948) – (మంట) సినిమా తో  దర్శక నిర్మాత గా ఆరంగేట్రం చేసాడు రాజ్ కపూర్. దీనిలో తానే హీరో, తనకు జోడీగా నర్గిస్  నటించింది. ఇదే ఆర్. కే. బానర్ నుంచి వచ్చిన మొట్ట మొదటి సినిమా. ఇది బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందింది.
ఆగ్ సినిమా కొనడానికి డిస్ట్రిబ్యూటర్లెవరూ ముందుకు రాలేదు. పైపెచ్చు వాళ్లు రాజ్ కపూర్నే ఒక థియేటర్ కొనమన్నారట. ఎందుకని రాజ్ కపూర్ అడిగితే ఈ మంట నీ థియేటర్లొనే మండనీ, మా థియేటర్లలో  ఎందుకు అని ఎద్దెవా చేసారట.
ఆగ్ (మంట)కథ
కేవల్ ఖన్నా (రాజ్ కపూర్)  తన పెళ్లినాటి రాత్రి వధువు దగ్గరికి వచ్చి తన ముఖాన్ని చూపించడం తో సినిమా మొదలవుతుంది. కాలి పోయిన కేవల్ ఖన్నా  ముఖాన్ని చూసి జడుసుకున్న  వధువు కి తన కథ చెబుతాడు అతడు. అక్కడనుండి ఫ్లాష్ బాక్ నడుస్తుంది. నిమ్మి తన చిన్నప్పటి స్కూలు మేటు. తామిద్దరూ కలిసి ఒక నాటకాన్ని వేయాలని అనుకుంటారు. నాటకం వేసే రోజు నిమ్మి వేరే వూరు వెళ్ళి పోతుంది. అప్పటినుంచి ప్రతి అమ్మాయిలో నూ నిమ్మిని వెతుకుతూ వుంటాడు కేవల్. కొద్ది రొజులకు అతడు రాజన్ (ప్రేం నాథ్)  అనే ఒక థియేటర్ యజమానిని కలుస్తాడు. ఇద్దరూ కలిసి నాటకాలు వేయించే ఒప్పందం కుదుర్చు కుంటారు. ఒక నాటంలో ఓ కొత్త అమ్మయిని పరిచయం చేయలనుకుంటారు ఇద్దరూ. అప్పుడు నర్గిస్ (నిమ్మీ)  ఎదురవుతుంది. నిమ్మీ కేవల్ ని ప్రేమిస్తుంది, కాని రాజన్ ఆమె అంటే ఇష్టపడతాడు. రాజన్ ను పెళ్లి చేసుకో మని నిమ్మీ తో చెబుతాడు కేవల్. ఆమె వినక పోవడం తో తాను అంద వికారంగా మారితే తప్ప ఇక కుదరదని తన ప్రేమను త్యాగం చేసి నిమ్మీ రాజన్ ను పెళ్లాడే టట్లు చేసేందుకు థియేటర్ లో ఉన్న ఒక దీపం తో తన ముఖాన్ని కాల్చు కుంటాడు కేవల్.
ఈ సినిమాకి సంగీతాన్ని అప్పట్లో  వారి ఆస్థాన సంగీత దర్శకుడు రాం గంగూలి ఇచ్చాడు. ఈ సినిమా ఎడిటింగ్   సంగీతాలతో  కలుపుకుని అన్ని రంగాల్లో ను పేలవంగా సాగింది. ఒకే అంశం చుట్టు తిరిగే బలహీన మైన కథ, భరించ లేనంతగా  ఎక్కువగా వున్న ట్విస్టులు.  ఒక చోట చెప్పిన విషయానికి మరో చోట విరుద్ధంగా చెప్పడం. ఉదాహరణకి ఒక చోట రాజ్ కపూర్, ప్రతి ఆర్టిస్టు కమర్షియల్ గా విజయం సాధించాలంటాడు. మరో చోట, సృజనాత్మకతే ఒక కళాకారుడు పొందే సరియైన ప్రతిఫలం అని బొధిస్తాడు., ఒక చోట అందమనేది చూసే వాడి కళ్లల్లో వుంటుందంటాడు, మరో చోట నిజమైన అందం ఆత్మ లో వుంటుందంటాడు. బహుశ అప్పట్లో ప్రేక్షకులకి ఈ బొధనలూ మరీ భారీ అయ్యాయేమో.
మొత్తానికి ముకేష్ పాడిన “జిందా హు ఇస్ తరా కె హమే” పాట తప్పిస్తే ఈ సినిమాలో ప్రేక్షకులు ఆనందించడానికి ఏమీ లేకుండా పోయింది. ఇంకో విచిత్రం ఏమిటంటే ఈ పాటలో రాజ్ కపూర్ కదలికల కంటే పాట లయ వేగ వంతంగా వుందని ప్రేక్షకులు గమనించారు. ఆ రకంగా ఆర్ కే ఫిలింసు  మొట్ట మొదటి సినిమా మంటలకు ఆహుతి అయింది.
ఆ తరువాత వర్షం వచ్చింది.
బర్సాత్ (వర్షం) కథ
అదే తారా గణం (రాజ్ కపూర్, నర్గిస్, ప్రేం నాథ్)తో రాజ్ కఫుర్ దర్శక నిర్మాత గా 1949 లో బర్సాత్ చిత్రాన్ని నిర్మించాడు. బర్సాత్ చిత్రానికి ముందు  దర్శక నిర్మాత మహబూబ్ ఖాన్ నిర్మిస్తున్న అందాజ్ చిత్రం లో దిలీప్ కుమార్ తో పాటు నటిస్తున్నప్పుడు షూటింగ్ చూడటానికి వచ్చిన నవాబ్ బానో అనే అమ్మాయిని చూసి ఆమెను తన బర్సాత్ చిత్రం లో నటించడానికి తీసుకున్నాడు రాజ్ కపూర్.  తనే ఆమె పేరు ను నిమ్మీ గా మార్చాడు. ఆ తరువాత నిమ్మీ గత తరపు సినిమాల్లో చరిత్ర సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పేరు ఆగ్ చిత్రం లో హీరోయిన్ పాత్ర పేరు కాదూ?
బర్సాత్ (1949) ఇద్దరు మిత్రుల తో కూడిన రెండు జంటల ప్రేమ కథ. ఒక జంట రాజ్ కఫుర్ నర్గిస్ కాగా, రెండొ జంట ప్రేం నాథ్, నిమ్మీ. రాజ్ కపూర్ నర్గిస్ ల ప్రేమ నిజమైన ప్రేమ కాగా, ప్రేం నాథ్ కు నిమ్మీ మీద వున్న ప్రేమ కేవలం వ్యామోహమే.   ఈ ప్రేమలూ స్నేహితులిద్దరూ కష్మీర్ విహార యాత్ర కు వెళ్ళినపుడు అక్కడ వున్న ఇద్దరు కొండ ప్రాంతపు అమ్మయిలతో,  మొదలవు తాయి. ప్రేం నాథ్ నిమ్మీని పట్టించుకుండా జులాయిగా తిరుగుతు ఆమెను మరిచి పోతాడు. అన్ని రకాల సినిమా కష్టాలూ, ట్విస్టులూ గడిచాక అతడు మారి పోయి నిమ్మీ కోసం వెనక్కి వస్తాడు. ఆమె చని పోతుంది. చివరికి అతడు  ఆమె చితి కి నిప్పంటిస్తాడు వర్షం వస్తుంది.
ఈ సినిమా బ్లాక్ బస్టర్. మొట్టమొదటి సారి ప్రెక్షకులు సంగీతమంటే ఏమిటొ తెలుసుకున్న క్షణాలు. సంగీత దర్శకులు శంకర్ జైకిషన్ ల మొదటి చిత్రం. సంగీత ప్రపంచం లోనే గొప్ప అలజడి రేపింది. వారు సృష్టించబోతున్న చరిత్రకు నాంది పలికింది. ఏ పాటా తీసివేయలేనంతగా పాపులర్ అయ్యయి ఆ సినిమాలో పాటలు. బర్సాత్ మె హం సె మిలె (పై వీడియో) , జియ బేక రారు హై  (కింది వీడియో) పాటలు కొత్త ఒరవడిని సృష్టించాయి. అమితంగా ప్రాశస్త్యం పొందాయి.
ఆ తరువాత రాజ్ కపూర్, ముకేష్, శైలేంద్ర, హస్రత్ జైపురి శంకర్ జైకిషన్ల టీము తయారయింది. ఈ టీమే రాజ్ కపూర్ చిత్రాల విజయానికి కారణం అనడం అతిశయోక్తి కాదు. జైకిషన్ మరణం తరువాత ఈ టీము విడిపోయింది. ఈ టీము కలిసి కట్టు గా పని చేసిన చివరి సినిమా “మేరా నాం జోకర్“. తరువాత…..తరువాత రాజ్ కపూర్ చరిత్ర సృష్టించాడు. ఇది అందరికీ తెలిసిందే. బర్సాత్ చిత్ర విజయం ఆర్. కే స్టూడియోస్ తెచ్చింది.
బర్సాత్ చిత్రం లో నర్గిస్ రాజ్ కపూర్ కుడి చేతి మీద వాలి తన ఎడమ చేతిలో వయోలిన్ పట్టుకుని వున్న  పోస్టరు ఫోటో ఆ తరువాత ఆర్. కే.  బ్యానర్ లోగో అయింది.

ఆవారా, శ్రీ  420, అనాడీ, జిస్ దేష్ మే గంగా బహతీ హై,  లాంటి సంగీత భరిత చిత్రాలు వచ్చాయి. రాజ్ కపూర్ ను “షో మాన్ “  చేసాయి.
ఆగ్  సినిమాలో ప్రేం నాథ్ థియేటర్ కి నిప్పంటుకుంటుంది. ఆ నిప్పుని ఆర్పాడానికి రాజ్ కపూర్ వున్నాడు. బర్సాత్ తెచ్చాడు.

విచిత్రం 2017 సెప్టెంబరు 16 న ఆర్. కే స్టూడియోస్ కు నిప్పంటుకుంది.విలువైన చాలా జ్ఞాపకాలు బూడిద పాలయ్యాయి. ఆ మంటల్ని ఆర్పడానికి అప్పుడు అక్కడ రాజ్ కపూర్ లేడు.
Ahmed Sheriff
Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM
Consultant, PMP Certification, Project Management, Quality
Mob: +91 9849310610