‘గాంధీ’ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ బతుకుతుందా?

ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ,సోనియా గాంధీ, రాహుల్ గాంధీ… ఇలా ఎవరో ఒక గాంధీ అండ లేక పోతే కాంగ్రెస్ పార్టీ బతక లేదా అనే ప్రశ్న కొద్ది రోజులుగా బాగా చర్చనీయాంశమయింది.
దీనికి కారణం, 2014, 2019  ఎన్నికల్లో దేశమంతా కాంగ్రెస్ పార్టీ  దారుణంగా ఓడిపోవడమే. అంతకు ముందు రెండు దఫాలు కేంద్రంలో  మిత్రపక్షాలతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ 2014 వచ్చేసరికి మిత్ర పక్షాలతో కలసి కూడా  ప్రభుత్వం ఏర్పాటు చేయలేనిపరిస్థితికి  వచ్చింది.
బిజెపికి దృఢమయిన నరేంద్ర మోదీ నాయకత్వంతో లభించడం కాంగ్రెస్ కు ఆ ఉన్న పట్టు పోయేందుకు కారణమయింది.దీనితో సోనియాగాంధీగాని, రాహుల్ గాంధీగానిపార్టీ ని నడిపే స్థితిలోలేదనే అనుమానాలు  మొదలయ్యాయి.
ప్రధాని నరేంద్రమోదీకి పోటీ ఇచ్చే శక్తి సామర్థ్యాలు సోనియాకు గాని, రాహుల్ కు గాని లేవనడం మొదలయింది. ఇదే అదను చేసుకుని కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అని, ఆ కుటుంబం వల్లే కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవుతూ ఉందని, కాంగ్రెస్ కు కుటుంబేతరులు నాయకుడిగా రావాలని బిజెపి  కూడా ఒక రాళ్లేస్తూ ఉంది. దీనితో కాంగ్రెస్ కుటుంబం ఉలిక్కి పడింది.
రాహుల్ గాంధీ సన్యాసానికి సిద్ధమయ్యారు. ఆయన ఆత్మ ప్రక్షాళన యాత్రలు చేశారు. ఇక మాకుటుంబం నుంచి నాయకత్వం ఉండదని, కాంగ్రెస్  నుంచే మరొకరిని  నాయకుడిగా ఎన్నుకోవాలని రాహుల్ గాంధీ భీష్మించుకున్నారు. ఎవరూ ముందుకురాలేదు. దానికితో ‘మీరే మాకు దిక్కు’ పిసిసిలు లేఖలు రాస్తున్నాయి. ఈ రోజు ఇక పార్టీకి నాయకత్వం వహించడం నా తరం కాదు, అని తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజీనామా చేశారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ స్వభావాన్ని అంచనావేసే ఒక ప్రయత్నం చేద్దాం.
ఎవరు అవునన్నా, కాదన్నా కాంగ్రెస్ కుటుంబ పార్టీయే. స్వభావంలో కాంగ్రెస్ లిబరల్ పార్టీ యే అయినా, నిర్మాణాత్మకంగా అది ప్రాంతీయ పార్టీలాగే కుటుంబ పార్టీ.రాజకీయాలనుకిందినుంచి పైదాకా కుటంబాలే నడిపిస్తున్నదేశమిది.అందువల్ల భారతదేశ పరిస్థితుల్లో అదేమంత నేరమనిపించదు.
దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ  కుటుంబ పార్టీలే.  అక్కడ కుటుంబాల నాయకత్వాన్ని ప్రజలు ఎలా ఆమోదిస్తున్నారు?  కాంగ్రెస్ నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ నాయకత్వాన్ని కూడా అలాగే ఆమోదిస్తూ వస్తున్నారు.
ఆర్ జెడి, సమాజ్ వాది పార్టీ, నేషనలిస్టు కాంగ్రెస్, టిఆర్ ఎస్,  వైఎస్ ఆర్  కాంగ్రెస్,  తెలుగుదేశం, డిఎంకె,నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన, బిజెడిలు  ఆ పార్టీలను ఏర్పాటు చేసిన నేతల కుటుంబాల ప్రాపర్టీలాగే నడుస్తున్నాయి. ఇక్కడ పార్టీలనుకుటుంబాలను ఎలా వేరు చేయలేమో, కాంగ్రెస్ ను, సోనియాగాంధీ కుటుంబం నుంచి వేరు చేయలేం.
ఫ్యామిలి మైనస్ పార్టీలు బతక లేవు. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ నుంచి నాదెండ్ల వేరయి పార్టీ పెట్టారు.బతకలేదు. కారణం అది ఎన్టీయార్ కుటుంబానికి దూరంకావడమే. ఎన్టీయార్ టిడిపి అని లక్ష్మీ పార్వతి పెట్టిన పార్టీ బతకలేదు కారణం ఎన్టీయార్ కుటుంబ నాయకత్వం లేకపోవడమే. ఇలా కుటుంబ పార్టీ లనుంచి చీలిపోయిన వారు పెట్టిన పార్టీలు చాలా వరకుసక్సెస్ కాలేదు. కొద్ది రోజులు అవి బతకవచ్చు.బతకాలంటే శరద్ పవార్ లాంటి బలమయిన మరొక కుటుంబం అండ అయినా కావాలి.
 ఏమయినా సరే, కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోవాలంటే, పార్టీని, గాంధీ కుటుంబాన్ని వేరు చేయడమే మార్గమని బిజెపి బాగా రెచ్చగొడతూ ఉంది.
ఈ ఉచ్చులో రాహుల్ పడ్డట్లు అర్థమవుతుంది. అందుకే ఆయన బిజెపి సలహా పాటిస్తూ ‘గాంధీ’ కుటుంబేతర నాయకులు ముందుకురావాలని పిలుపు నిచ్చారు. ఇది సాధ్యమా? సాధ్యం కాదు.  ‘గాంధీ’ కుటుంబ లేని కాంగ్రెస్ బతకలేదు. అసలు వాళ్ళ ప్రాతినిధ్యం లేకుండా కాంగ్రెస్ నిలబడ లేదు.
కాంగ్రెస్ పార్టీ ‘గాంధీ’ కుటుంబ నీడ నుంచి బయటకు లాగేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీలోనే ప్రముఖులే ఈ తిరుగుబాటు కు నాయకత్వం వహించారు. ఒక్కొక్క సారి  పార్టీ ని చీల్చి తమదే  అసలయిన కాంగ్రెస్ అనే ప్రయత్నంచేశారు. మరికొందరు పార్టీ నుంచి బయటకొచ్చి, నలుగురిని పోగేసి ‘గాంధీ’లు లేని పార్టీ పెట్టి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కావాలని ప్రయత్నించారు.
ఈ రెండురకాల ప్రయత్నాలు విఫలమయ్యాయి. మళ్లీ అంతా గాంధీ చెట్టు కిందికి వచ్చి చేరారు. ఇపుడు మరొక సారి పాత ప్రయోగమే జరుగుతూ ఉంది. కాంగ్రెస్ కు నాయకత్వం వహించేందుకు ఎవరైనా ముందుకు రావచ్చని పిలుపునిచ్చారు.
‘గాంధీ’ల నుంచి పార్టీ ని వేరుచేసేందుకు జరిగిన ప్రయత్నాలకు పెద్ద చరిత్ర ఉంది. దీనిని చూద్దాం.

నిజానికి కాంగ్రెస్ పార్టీ నుంచి నెహ్రూ-కుటుంబ నుంచి లాక్కునే ప్రయత్నాలకు అరశతాబ్దం చరిత్ర ఉంది. మొదటి ప్రయత్నం 1969లో జరిగింది. అపుడు పార్టీలో ఉన్న పెద్దమనుషుల ముఠా (దానికి సిండికేట్ అనిపేరు) ప్రధాని ఇందిరా గాంధీని పార్టీ నుంచి బహిష్కరించింది.  రాష్ట్రపతి పదవి మధ్యంతర ఎన్నికలలో నీలం సంజీవరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. అపుడు  పార్టీ అధ్యక్షుడు నిజలింగప్ప. సంజీవరెడ్డిని ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ వ్యతిరేకించారు.  ఆమె ఉప రాష్ట్రపతి గా ఉన్న  వివిగిరి చేత ఇండిపెండెంటుగా నామినేషన్ వేయించి గెలిచే పథకం వేసి పారించారు. ఇది క్రమశిక్షణకు వ్యతిరేకంమని ఆమెను బహిష్కరించారు.
కాంగ్రెస్ పార్టమెంటు సభ్యులందరూ ఆత్మ ప్రబోధానుసరాం వోటేయండని ఆమె  సైగ చేసి గిరిని గెలిపించారు. ఇది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘణ అంటూ సిండికేట్ నాయకత్వంలోని  పార్టీ ఆమెను బహిష్కరించింది.
ఇక్కడొక విషయం. నెహ్రూ చనిపోయినప్పటినుంచి ఈ సిండికేట్ (మొరార్జీ దేశాయ్, ఎస్ కె పాటిల్, వై.విచవన్, కామరాజ్, సంజీవరెడ్డి,నిజలింగప్ప, అతుల్య ఘోస్ వగైరా) కాంగ్రెస్ ను, ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తూ వచ్చింది. లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయాక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రధాని అయ్యే అవకాశం తలుపుతట్టింది.  అయితే, వీళ్లంతా నెహ్రూ కుటుంబ పెత్తనానికి వ్యతిరేకులేకాని,ఒకరంటే ఒకరికి సరిపోదు. అందువల్ల ఏకాభిప్రాయం కుదర్లేదు.చివరకు ఇందిగాంధీనే ముందుకు తెచ్చారు.  అనుభవం లేని మూగ బొమ్మ లాంటి ఇందిర  తమ చెప్పుచేతల్లో ఉంటుందనిభావించారు.  అనేక తర్జన భర్జనల తర్వాత ఇందిరాగాంధీకే పట్టం కట్టాలనుకున్నారు. దీని వెనక మరొక ఆలోచనకూడా ఉంది. నెహ్రూ కూతురిగా  1967 ఎన్నికల్లో ఆమె ఉంటేనే ఓట్లు పడతాయని కూడా వాళ్ల ఆశ. అంటే కాంగ్రెస్ ను తామెవరం బతికించలేమని వాళ్లలో కూడా ఒక శంక ఉంది. అందుకే ఆమెకే ఓటేశారు.   పార్టీ అంతర్గత ఆమె మీద   మొరార్జీ పోటీచేసినా 355-169ఓట్ల తేడాతో  ఓడిపోయారు. జనవరి 19, 1966న ఇందిరా గాంధీ మూడో ప్రధానిగా ఎన్నియ్యారు.
కాంగ్రెస్ ను నెహ్రూ-గాంధీకుటుంబ నుంచి లాగే తొలి ప్రయత్నం ఇలా ఓడిపోయింది. అయితే,  ప్రధాని కాలేకపోయినా  ప్రధానిని అదుపుచేసే ప్రయత్నం సిండికేట్  చేసింది. అయితే,  1967 ఎన్నికల్లను ఇందిరాగాంధీ చక్కగా వాడుకున్నారు.  ఆమె తననే నాయకురాలి ప్రచారం చేసుకుని పార్టీని గెలిపించారు.
అయితే, తనను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పసిగట్టి, సిండికేట్ ను చెక్ చేసే పనిలో పడ్డారు. సీనియర్లలో ఆక్రోషం లోలోన ఉడికిఉడికి వివిగిరి రాష్ట్రపతి ఎన్నిక తర్వాత బయటపడింది.
ఇందిరా గాంధీని బహిష్కరించే స్థాయికి వచ్చింది. 1969 నవంబర్ 12న  కాంగ్రెస్ పార్టీ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది.
ఈ సిండికేట్ తమదే అసలయిన పార్టీ (ఐఎన్ సి-ఒ) అని ప్రకటించుకుంది. ఇందిరాగాంధీ పార్టీ ఐఎన్ సి (ఆర్) అయింది. ఇలా మొదటి సారి  నెహ్రూ-గాంధీ వాసన లేని కాంగ్రెస్ పార్టీ ఆరోజు పుట్టింది. అయితే, ఇది ఎక్కువ బతకలేదు.
1971 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చినసీట్లు కేవలం 16(10శాతం ఓట్లు), ఇందిరా గాంధీ కాంగ్రెస్ ( కాంగ్రెస్ ఆర్ )కు వచ్చిన సీట్లు352 సీట్లు ఓట్లు 44 శాతం. ప్రజలు నెహ్రూ కుటుంబం లేని పార్టీ ని కాంగ్రెస్  పార్టీని గుర్తించడం లేదనేందుకు ఇదొక సూచన.
మొరార్జీ దేశాయ్
మరొక ప్రయత్నం  1975 ఎమర్జన్సీ తర్వాత జరిగింది. ఎమర్జన్సీ దురాగతాలు బాగా ప్రచారంలోకి రావడంతో కాంగ్రెస్ కు చెడ్డ పేరు వచ్చిందని చెబుతూ చాలా మంది పాత కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కు దూరంగా జరిగి ఇతర పార్టీలతో కలసి జనతా పార్టీని ఏర్పాటుచేశారు.  మొత్తానికి 1977 ఎన్నికల్లో గెలిచారు. ఎపుడో 1966లో కాంగ్రెస్ తరఫున ప్రధాని కావాలనుకున్న మొరార్జీదేశాయి ఇపుడు జనతా పార్టీ తరఫున ప్రధాని అయ్యారు. అయితే ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు.
ఈలోపు కాంగ్రెస్ లో లుకలుకలు మొదలయ్యాయి. 1977 ఎన్నికల్లో ఓటమితర్వాత చాలామంది ఇక ఇందిరాగాంధీ పనికిరారని కొత్త కాంగ్రెస్ పెట్టుకోవాలని నిర్ణయించారు. పార్టీని చీల్చి కర్నాటకకు చెందిన దేవరాజ్ అర్స్ నాయకత్వంలో కాంగ్రెస్ (యు) పెట్టారు.
ఇందిరాగాంధీ తన కాంగ్రెస్ (ఆర్) ను ఈ సారి కాంగ్రెస్ (ఐ) గా  మార్చారు. విబేధాలతో  జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోయింది. 1980ఎన్నికలొచ్చాయి. గాంధీ నీడపడకుండా కాంగ్రెస్ ను నడపాలనుకున్న కాంగ్రెస్ (యు)కు కేవలం 13 లోక్ సభ సీట్లొచ్చాయి. ఇందిరాగాంధీకి 353 సీట్లొచ్చాయి. ఇలా గాంధీ కుటుంబ నుంచి దూరంగా జరిగిన పార్టీని ప్రజలు తిరస్కరించారు.
‘గాంధీ’ కుటుంబం మీద మరొక తిరుగుబాటు 1988లో రాజీవ్ హాాయంలో  వచ్చింది. ఈ సారి బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలులో అవినీతి పేరుతో బయటకు వచ్చి రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా జనతా దళ్ పెట్టారు. 1989లో కాంగ్రెస్ ను ఓడించారు.అతికష్టం మీద  విపి సింగ్  ప్రధాని అయ్యారు.ఈ జనతాదళ్ కూడా ఎక్కవ కాలం బతకలేదు.ఫలితంగా మధ్యంతర ఎన్నికలొచ్చాయి. 1991 లో ఎన్నికల ప్రచారం మధ్యలో  రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఎన్నికల్లోకాంగ్రెస్ కు పూర్తి  మెజారీటీ రాలేదు.
Picture credits: DH Ronak wikimedia commons
  పివి నరసింహారావు నాయకత్వంలో కాంగ్రెస్  మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయన కాంగ్రెస్ పార్టీ మీద ‘గాంధీ’ కుటుంబం నీడ పడకుండా చూశారు. ప్రధానిగా కొనసాగారు గాని, పార్టీని పటిష్టం చేయకలేకపోయారు.
దీనితో ఎన్ డి తివారి,విపి సింగ్ వంటి  కాంగ్రెస్ నేతలు మరొక కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఈ పార్టీకి కూడా గాంధీ కుటుంబ ఆశీస్సులు దొరకలేదు. రెండు కాంగ్రెస్ పార్టీలు 1996 ఎన్నికల్లో ఓడిపోయాయి.
తర్వాత నరసింహారావు  స్థానంలోకి కాంగ్రస్ అధ్యక్షుడిగా సీతారాం కేసరి వచ్చారు. ఆయన కూడా  పార్టీని పటిష్టం చేయకలేకపోయారు.
చివరకు పార్టీ నేతలు సోనియాగాంధీని బతిమాలి 1998 ఎన్నికల నాటికి పార్టీ లోకి తీసుకువచ్చారు. ఆ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ కి  గౌరవప్రదమయిన హోదా కల్పిస్తూ 141 స్థానాలు వచ్చాయి. తర్వాత 2009, 2009 లో కాంగ్రెస్ పార్టీ  సోనియాగాంధీ నాయకత్వంలోనే  యుపిఎ పేరుతో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటుచేసింది.  అంటే కాంగ్రెస్ పార్టీకి ఓడినా గెల్చినా ’గాంధీ’లు అవసరమని మరొక సారి రుజువయింది.
ఇదంతా ఏంచెబుతుంది? ఎన్నికల్లో గెల్చాలంటేకాంగ్రెస్ పార్టీకి ‘గాంధీ’ కుటుంబమే దిక్కు.  నరేంద్ర మోదీ నుంచి ఎదురవుతున్న కొత్త సవాళ్లను  అధిగమించేలా ఎదుగుతుందా కాంగ్రెస్ పార్టీ లేదా అనేది వేరే అంశం. కాంగ్రెస్ అంతరించిపోకుండా కనీసం ఒక పార్టీగా నైనా మనగలగాలి అంటే ‘గాంధీ’ కుటుంబం అవసరం.
ఒక వేళ విమర్శలు భరించలేక గాంధీ కుటుంబేతరులెవరినైనా అధ్యక్షుడిని చేసినా పగ్గాలు మాత్రం ఆకుటుంబం చేతిలోనే ఉంటాయి. అలాంటపుడు బిజెపి కవ్వింపుకు జడిసి కాంగ్రెస్ పార్టీ ని ‘గాంధీ’ ల నుంచి దూరంచేయాలనుకోవడం వల్ల నష్టమే గాని లాభం ఉండదు. కాంగ్రెస్ పార్టీ అంటే ‘గాంధీ’కుటుంబమే. ఈ రెండింటిని ఈ దశలో వీడదీయడం సాధ్యపడదు. వీడిదీస్తే రెండింటికి కవలలిద్దరికి ప్రమాదమే.