ఆలయాలను కూల్చేసినందుకు సిఎం, సిఎస్ ల మీద కేసు పెట్టాలి: కాంగ్రెస్

సచివాలయ ఆవరణలో నల్ల పోచమ్మ ఆలయం, మసీదులు కూల్చివేతలకు బాధ్యులైన సీఎం కెసిఆర్ , చీఫ్ సెక్రటరీ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలంగాణ కాంగ్రెస్  డిమాండ్ చేసింది.
 అదే విధంగా కూల్చేసిన ప్రార్థనా స్థలాలను యధా స్థానంలో నిర్మించేందుకై చర్యలు తీసుకోవాలని కూడా తెలంగాణ కాంగ్రెస్  కోరింది.
ఈ మేరకు ఈ రోజు  హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి వినతి పత్రం సమర్పించారు.
 అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రావన్ దాసోజు, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో  శుక్రవారం నాడు కాంగ్రెస్ నేతలు కలెక్టర్ ను కలుసుకున్నారు.
అనంతరం ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు మీడియాతో మాట్లాడారు.
ప్రజల మనోభావాలను, మత పరమైన విశ్వాసాలను గాయపరుస్తూ తెలంగాణ సీఎం శ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, చీఫ్ సెక్రటరీ శ్రీ సోమేశ్ కుమార్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా, అత్యంత ప్రాచీనమైన ప్రార్థనా స్థలాలను మూడో కంటికి తెలియకుండా చ కూల్చివేశారని దాసోజు ఆరోపించారు.
వీటిలోలోని మసీదు (డి. బ్లాక్ వద్ద మస్జిద్ – ఏ – హష్మీ) 1889 వ సంవత్సరంలో ఆనాటి నిజాం రాజు నిర్మించిన తెలంగాణ వారసత్వ సంపద అని, అంతేకాకుండా సి. బ్లాక్ పక్క నే ఉన్న మసీదు ఇఫ్తార్ – ఏ – ముతామాది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రార్థనా మందిరం అని శ్రవణ్ దాసోజు తెలిపారు.
శ్రవణ్ దాసోజు ఇంకా ఏమన్నారంటే…
అక్కడి  నల్ల పోచమ్మ దేవాలయం ప్రాచీనమయిందని సచివాలయంలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన పవిత్రమైన వేదిక, అలాంటి చారిత్రాత్మక ప్రాశస్థ్యం కలిగిన ప్రార్థనా మందిరాల కూల్చివేతలకు కారకులైన ప్రభుత్వ పెద్దలు చట్టప్రకారం శిక్షార్హులు. ఆరాధాన స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం, 1991 ప్రకారం భారత దేశానికి స్వాతంత్రంత్యం వచ్చినప్పటి నుంచి అనగా 1947 ఆగస్టు 15వ తేదీ నాటికి ఉన్న ప్రార్థనా స్థలాల నిర్మాణాలు ఏ విధంగానైతే ఉన్నాయో అదే విధంగా ఉండేట్టుగా అన్ని రకాల రక్షణ కల్పించే బాధ్యత ఆయా ప్రభుత్వం పైన ఉంది. అంతేకాకుండా ఆనాటి ప్రార్థనా మందిరాల స్థితిగతులను మార్చడం కానీ లేదా కూల్చివేతలు గాని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరైనా పాల్పడితే పై చట్టం ప్రకారం మూడేళ్ళ వరకు జైలు శిక్ష, మరియు జరిమానా విధించడ జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయంలోని మసీదు, నల్ల పోచమ్మ దేవాలయం కూల్చివేతలపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసినప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కుట్ర పూరితంగా తెలంగాణ పోలీసులు కనీసం ఎఫ్.ఐ.ఆర్ లు కూడా నమోదు చేయలేదు.
గతంలోని సుప్రీంకోర్టు తీర్పు గుర్తు చేస్తూ.. ఆ తీర్పు ప్రకారం (యు.పి రిట్ పిటిషన్ నెంబర్ 68-2008, లలితా కుమారి మరియు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మద్య సుప్రీంకోర్టులో జరిగిన కేసు) మరియు ప్రస్తుత చట్టాల ( క్రిమినల్ ప్రోసిజర్ కోడ్, సెక్షన్ 154 ప్రకారం) ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయకపోవడం చట్ట విరుద్ధం అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మనోభావాలను కించ పరుస్తూ తాను తెలంగాణ దొరలమన్నట్టుగా పోలీసులను తమ చెప్పు చేతల్లో పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని అగౌరవ పరుస్తూ చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతుందని తెలిపారు .
అలాగే రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ప్రజల యొక్క అభిష్టం మేరకు పరిపాలన జరపవలసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మరియు ఆయన చెప్పు చేతల్లో ఉన్న చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ గారు, రక్షకుడే భక్షకుడైనట్టు అడ్డు అదుపు లేనట్టు అనైతికంగా అక్రమంగా వ్యవహరిస్తున్నారని శ్రవణ్ మీడియాతో మాట్లాడారు .
అందుచేత వీరిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని,  కూల్చివేసిన న మసీదును, మందిరాన్ని ప్రజల పర్యవేక్షణలో పున నిర్మించాలి.”