పాత సినిమాలు మాసి పోయినా, పాత పాటలింకా సజీవమే, ఎందుకో తెలుసా….?

( C Ahmed Sheriff)
సినిమా అంటే పాట. సినిమా అశాశ్వతం. పాట శాశ్వతం. సినిమాని మర్చిపోయినా మాటను మర్చిపోవడం కష్టం.సినిమా చూడకపోయినా పాట మనల్నివెంటాడుతుంది.అందుకే మనం చూడని సినిమాపాటలెన్నింటినో ఇష్టపడుతుంటాం.వింటూంటాం, పాడుతుంటాం, దరువేస్తుంటాం. అందుకే చిత్రలహరి వంటి రేడియో కార్యక్రమాలు విజయవంతమయిందీ, సినిమా పాటల సేల్స్ కోట్ల రుపాయల బిజినెస్ అయిందీ.
పాట ఎందుకంత గొప్పగా తయారయింది? పాటలో ఉన్న సంగీతం, సాహిత్యం కారణమంటారా? కొంతవరకు నిజమే. అయితే మన పాతపాటలకు ఉన్న మరొక వశీకరణ శక్తి సినిమా కథని ముందుకు మోసుకెళ్లడం. నాటి సినిమాకు ఒక మర్యాద ఉండింది.అందుకే  సినిమాలో చూపలేని,  చూపకూడని, చూప వీల్లేని విషయాలెన్నో ఉండేయి. ఈ కనిపించని దృశ్యాల  వూసులెన్నింటినో ఆడుతూ పాడుతూచెప్పి మనల్ని మత్తులోకి తీసుకెళ్లేది పాటయే.
పాటలో గమ్మత్తు గురించి నాటి గేయరచయితలకు బాగా తెలుసు.అందుకే మన మీద మత్తు మందు చల్లేసి తప్పుకున్నారు.  పాట గురించి ఆత్రేయ ఏమన్నారో తెలిస్తే పాట అర్థమవుతుంది.
“పులకించని మది పులకించు… వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల వించు… మనసునే మరపించు…గానం
మనసునే మరపించు…”
మ్ముమ్ముద్దంటే చేదా, ఇపుడా ఉదేశం లేదా అనే పాట విన్నారా. ఇది ముద్దు సినిమా తెర మీద వూహించని రోజులలో ముద్దు పాట. ముద్దంటే ఏమిటో ముద్దు ముద్దుగా చెప్పి సినిమాల్లో ముద్దుల్లేని కొరతను హద్దు మీరకుండా తీర్చిన పాట ఇది. ఇపుడు సినిమాల్లో నిషేధాలంటూ ఏవీ లేవు. దానితో పాట డ్యూటీ దిగిపోయింది. పాట ఒక డొల్లగా కనిపిస్తుంది.
వెనుకటి తరం లో సినిమా పాటలు కేవలం వినోదాన్ని పంచడానికే కాకుండా ఆసినిమా కథలో భాగమయ్యేవి.
అప్పట్లో సినిమాల్లో ముద్దులూ కౌగిలింతలూ లేవు. ఈ లోటు భర్తీ చేయడానికి,  ప్రేయసీ ప్రియుల, సున్నితమైన శృగారం ప్రతి బింబించడానికీ ప్రత్యామ్నాయంగా సినిమా పాటలు పనికి వచ్చాయి.
ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/entertainment/a-tribute-to-kumkum-hindi-actress-of-yester-years-aar-paar/

మాటలాడే నటీ నటులతో సినిమా తీసే ప్రయత్నం లో 1931 లో భారత దేశపు మొట్టమొదటి టాకీ ఆలం అరా వచ్చింది. అయితే ఈ సినిమాలో సంగీతం (మూడు వాయిద్యాల సంగీతం హార్మోనియం, తబలా, వయోలిన్) తో పాటు, 7 పాటాల్ని రికార్దు చేయటం  ఊషించనిది. ఈ 7 పాటలూ హిట్లు కావడం, చాలా మంది ప్రేక్షకులు, పాటల కోసమే ఈ సినిమాని చూడటం తో  ఈ సినిమా రాబోయే సినిమాల స్వరూపాన్ని నిర్వచించింది. ఈ విషయాన్ని గుర్తించిన భావి నిర్మాతలు సంగీతానికీ పాటలకూ వున్న ప్రాధాన్యతని గుర్తించారు.   ఈ చిత్రం తరువాత వచ్చిన అన్ని సినిమాల్లోను పాటలు  అనివార్యమై పోయాయి. సినిమా లకు పాటలు ప్రాణ మై పోయాయి.
సినిమాల్లో పాటలు  ముఖ్యంగా ప్రేయసీ ప్రియులు, తమ భాగ స్వామి గుణ గణాల్నీ, లేదా అంద చందాల్నీ తెలియ చేయడానికీ, తమ మధ్య  వున్న ప్రేమ గాఢత  వ్యక్తం చేయడానికీ పాడే వారు. వినోదానికీ, నృత్యాలకీ వాడినా. వాటికి చాలా బాధ్యతలుండేవి. అవి కథలో ఇమిడి పోయేవి లేదా ఒక సందేశాన్నిచ్చేవి . లేదా ఒక సంఘటనకి వుపమానంగా వుండేవి.
‘సూరజ్’ సినిమాలో   మహమ్మద్ రఫీ పాడిన “బహరో ఫూల్ బరుసావో మెర మహబూబ్ ఆయా హై”  పాట అందరికీ తెలిసిందే. శంకర్ జైకిషన్ స్వర పర్చిన ఈ గీతా న్ని   హస్రత్ జైపురి రాసాడు. ఈ పాట సదరు ప్రేయసి ఎంత గొప్పదో తెలియ జేస్తుంది.. ఈ పాట పాడిన మహమ్మద్ రఫీ కి 1966  ఉత్తమ గాయకుడి గా  ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది. అది వేరే సంగతి.
మాయా బజార్ సినిమాలో లాహిరి లాహిరి లాహిరి లో పాట
(రచన: పింగళి, సంగీతం: ఘంటసాల, పాడిన వారు : ఘంటసాల,  లీల) ప్రాధాన్యత ఎంతవుందో ఈ తరం వారికి తెలియక పోవచ్చు ,కానీ వెనుకటి తరం వారికి ఇది ఒక మధురమైన  అనుభూతిని కల్గించివుంటుంది అనడం లో సందేహం లేదు.  హీరో, హీరొయిన్లు (నాగేశ్వర రావు, సావిత్రి) కనీసం తాకనైనా తాకకుండా   ఓ నావలో ఎదురెదురుగా కూర్చుని పాడే ఈ పాట హుందా శృంగారాన్ని సునిశితంగా స్పృశించింది.
అలల ఊపులో తీయని తలపులూ…
చెలరేగే ఈ కలకలలో… మిలమిలలో…
మైమరపించే ప్రేమ  నౌకలో హాయిగ చేసే విహరణలో
రసమయ జగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో.. మధురిమలో……
లాహిరి లాహిరి లాహిరి లో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా
అప్పట్లో “సినిమా బావుంది కానీ పాటలే బాగా లేవు”  అని ఎప్పుడైనా విన్నారా? కాక పోతే “సినిమా బాగా లేదు కానీ పాటలు బాగున్నాయి” అని విని వుండవచ్చు.  అదీ సినిమా పాటల గొప్పతనం.
సిగ్గు తెరలలో కనులు దించుకుని, తలను వంచు కునిబుగ్గ మీద పెళ్ళి బొట్టు ముద్దులాడా,ఒ.. ఒ.. ఒ.. ఒ.. ఒ.. ఒ..
నన్ను వదిలి నీవు పోలేవులే
తోలినాటి రేయి తడబాటు పడుతూ
మెలమెల్లగా నీవు రాగా
నీమేని హొయలు
నీలోని వగలూ నాలోన గిలిగింతలిడగా …………
మంచి మనసులు చిత్రం లో దాశరధి రాసిన ఈ పాటని కె. వి మహదేవన్ స్వరపరిచాడు. ఘంటసాల , పి.  సుశీల పాడారు. ఇది అందమైన అనురాగాన్ని అతి సున్నితమైన శృంగారాన్ని తెలియజేసే మరో పాట.
ఇవి 90 దశకానికి ముందు సంగతి. రాను రాను పాటలు వినోదాన్ని మాత్రం వుంచుకుని కథ కు దూరం కాసాగాయి.
గతం లో పాట రాయడానికి ముందు, ప్రతి గీత రచయితకూ సినిమా సన్నివేశాన్ని ఆకళింపు చేసుకునే అవసరం వుండింది. పాత తరపు సినిమాల్లో కొన్ని సార్లు కొన్ని పాటలు సన్ని వేశానికి జోడీ కుదరలేదని తీసివేయడమో లేక మార్చడమో  జరిగింది. అప్పుడు సన్నివేశానికి ఇమిడే పాట రాయడానికి పేరు మోసిన రచయితలు కూడా టైం తీసుకునేవారు.   ఇక్కడ ఆత్మ బలం సినిమా పాట గురించి చెప్పక తప్పదు రచయిత అచార్య ఆత్రేయ గురించి అప్పట్లో అందరూ, “రాయక నిర్మాతల్నీ, రాసి ప్రెక్షకుల్నీ ఏడిపిస్తాడు” అని సరదాగా అనే వారు.
అత్మ బలం సినిమాలో ఒక వర్షపు సన్ని వేశానికి సరి పోయే పాట గురించి చిత్ర బృందం చాలా కాలం   వేచి వుండాల్సి వచ్చిందిట. ఎప్పుడడిగినా రాస్తానుండండి మూడ్ కుదరట్లేదు అనేవాడుట ఆత్రేయ.  ఒక రోజు ఒక మీటింగు తరువాత “ఇక బయలు దేరుదాం చినుకులు పడేటట్లున్నాయి” అన్నారట ఎవరో అంతే అప్పటికప్పుడె  ఆత్రేయ కలం నుంచి “చిటపట చినుకులు పడుతూ వుంటే” పాట జారింది.
ఇలాంటిదే హిందీ సినిమా “ఆన్ మిలో సజనా” (రాజేష్ ఖన్నా, ఆశా పరేఖ్, 1970) పాట కు సంబంధించి ఒక సంఘటన గురించి చెప్పుకుంటారు. హీరొ హీరొయిన్లు దొంగాచాటుగా కలుసుకుంటూ వుంటారు. ఈ దరిమిలా వాళ్లు కలుసుకున్నప్పుడు ఒక పాట వుంటీ బా వుంటుందని అనుకున్నారు. సంగీత దర్శకులు లక్ష్మి కాంత్ ప్యారేలాల్ జోడీ. ఈ పాట ఆనంద్ బక్షీ రాయాలి. అయనకీ తోచలేదు. చివరికి ఒకరోజు సన్ని వేశపు చర్చ ముగిసాక  సరే నేనూ వెళ్ళొస్తాను (అచ్చా తొ హం చల్తే హై) అన్నాడట ఒకాయన. అంతే చిత్రానికే హైలైట్ అయిన పాట “అచ్చా తొ హం చల్తే హై” కుదిరింది.
అప్పట్లొ గీత రచయితా, సంగీత దర్శకుడు, సినిమా దర్శకుడు, గాయకులూ కుర్చుని ఒక పాట గురించి, దాని చిత్రీకరణ గురించీ చర్చించే వారు. రిహార్సల్సు (కొన్ని సమయాల్లో చాలా సార్లు) జరిగేవి. అప్పుడొచ్చి పాట తయారయ్యేది. ప్రముఖ గాయకూడు మహమ్మద్ రఫీ పాట పాడే ముందు తాను ఆ పాట ఎవరికోసం పాడుతున్నాడో అడిగి తెలుసుకునే వాడట. పాడేటప్పుడు ఆ నటుల్ని ప్రతిబింబించే వాడు. తెలుగులో ఘంటసాల కూడా తన పాటల్ని అక్కినేని నాగేశ్వర రావు, ఎన్ టి రామారావు ల గళాలకు అనుగుణంగా పాడే వాడు. అప్పట్లో ప్రతి పాట వెనుక ఎంతో నిష్ట, శ్రమా వుండేవి. మిస్సమ్మ చిత్రంలో ఈ పాట ఎంత వొదిగిపోయిందో చూడండి.
 
ఇప్పుడా బాధలేదు. ఇన్ స్టాంట్ కాఫీ, ఫాస్ట్ ఫుడ్ లాగా ఎప్పుడైనా పాట రెడీ గా తయారయి పోతుంది. పాటల రచయితలు సినిమా సన్నివేశాన్ని వినే అవసరం లేకుండానే పాటలు తయారు కావచ్చు. పాటకు ఇపుడు ఒక సందర్భం లేదు. పాటకు మెసేజ్ ఏమీ లేకుండా పోయింది. కథకు సంబంధం లేకుండా ఎక్కడైనా ఇమిడిపోతుంది. ఎందుకంటే ఇప్పటి పాటలు కలల్లోనో లేక ఊహల్లోనో వుంటాయి. పైపెచ్చు, హీరో హీరోయిన్లు పాట అమలాపురం లో మొదలెట్టి,,  మొదటి చరణం  ఆం స్టర్ డాం లో పాడి , రెండో చరణానికి పారిస్ లో స్టెప్పులేసి, మూడో చరణాన్ని మారిషస్ లో ముగించ  వచ్చు.  కొంతకాలం డబ్బు మీద బెంగ పెట్టుకున్న నిర్మాతలు సినిమాల్లో ద్వంద్వార్థాల   పాటలు గుప్పించి సొమ్ము చేసుకోవాలనుకున్నారు. అప్పుడు పాటల స్వరూపమే మారిపోయింది.
మనకు సంగీతమంటే సినిమా సంగీతమే. సినిమాను, లేదా సినిమాలోని సన్నివేశాలను, గుర్తు చేయిస్తూ, మనసుకు ఆహ్లాదాని కలిగించే సంగీతం మనకు సినిమా పాటల ద్వారానే తెలుసు.  గతం లోని సినిమా పాటలు అన్ని రకాల రసాలతో నిండి వున్నాయి. అతే కాదు అవి కథలో భాగంగా కూడా వుంటూ వచ్చాయి. పాటలో దాగిన రహస్య శక్తి గురించి  కింది పాట చాలా గొప్పగా చెప్పింది. (పెళ్లికానుక-1960 సంగీతం ఏఎం రాజ,స్వరం: జిక్కి, గేయం: ఆత్రేయ)

ఇపుడు పాట దారి పాటది, కథ దారి కథది. గత రెండు దశాబ్దలుగా పాట కథ నుంచి దూరం కావడం మొదలుపెట్టింది. అందుకే ఇంకా పాత పాట బతికుంది. వాటి గొప్పతనాన్ని గౌరవిద్దాం, మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం
Ahmed Sheriff
(Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM, Consultant, PMP Certification, Project Management, Quality, Mob: +91 9849310610)

Like this story? Share it with a friend!