ప్రముఖ ఇంగ్లీష్ ఫ్ల్యూయెన్సీ కోచ్ బికే రెడ్డి తాజాగా ఆన్ లైన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ షురూ చేశారు. కరోనా నేపథ్యంలో క్లాస్ రూమ్ పద్ధతిలో ఇంగ్లీష్ నేర్చుకోలేని వాతావరణం ఉన్నందున ఆన్ లైన్ ద్వారా ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. యూట్యూబ్ లో 15 వీడియో లెసన్స్ ద్వారా అభ్యర్థులకు బికే రెడ్డి ఇంగ్లీష్ లో మాట్లాడే శిక్షణ ఇస్తున్నారు. గతంలో ఆయన లకిడీకపూల్ లోని సెంట్ హోటల్ లో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించేవారు. ఇప్పుడు ఆన్ లైన్ ద్వారా జరుగుతున్నది. తాజాగా బికెే రెడ్డి ఇంగ్లీష్ అభ్యర్థుల కోసం Fluency Guide విడుదల చేశారు. ఇంగ్లీష్ లో సులభంగా మాట్లాడాలంటే ఎలా అనేదానిపై ఆ గైడ్ లో వివరణ ఉంటుంది. ఆయన వెలువరించిన e-book ను యదాతదంగా దిగువన ప్రచురిస్తున్నాం. చదవవచ్చు. మరిన్ని వివరాల కోసం Shadow Tv లో బికె రెడ్డి ఇంటర్వ్యూలు చూడవచ్చు.
1
Road map to Fluency
ప్రధానంగా భాషలు రెండు రకాలుగా నేర్చుకోబడుతాయి. మొదటిది పరిసరాల ద్వారా, రెండోది అభ్యసన ద్వారా. ప్రతీ ఒక్కరూ వారి, వారి మాతృభాషలు సహజంగా నేర్చుకుంటారు. ఉదాహరణకు హైదరాబాద్ లో నివశించేవారు మాతృభాష తెలుగుతోపాటు హింది లేదా ఉర్దూలో కూడా మాట్లాడుతారు. వినే మాటలను అనుకరించడం ద్వారా పరిసరాల నుంచి భాషలు సహజంగా, సులభంగా నేర్చుకోబడుతాయి. ఈ కారణంగానే నెమలి ఈకలు అమ్ముకునే ముంబాయి యువకుడు జాతీయ, అంతర్జాతీయ భాషలు కలిపి 16 భాషలు నేర్చుకున్నాడు. అతడికి సంబంధించిన వీడియోలు మీరు యూట్యూబ్ లో చూడవచ్చు. చదవటం, రాయటం తెలియకున్నా, గ్రామర్ పరిజ్ఞానం లేకున్నా భాషలు నేర్చుకోవచ్చని మన చుట్టూ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
భాషల్ని పరిసరాల ద్వారా నేర్చుకోవడంలో వినటం (Listening) మరియు మాట్లాడటం ( Speaking) ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ ఇంగ్లీష్ ఇలా నేర్చుకునే అవకాశం మనలాంటి దేశాల్లో లేదు. కారణం మన పరిసరాల్లో ఇంగ్లీష్ వాతావరణం లేకపోవడమే. దీంతో కేవలం పుస్తకాల ద్వారానే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని కోచింగులకు వెళ్లినా, ఎంత గ్రామర్ నేర్చుకున్నా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోవడం మనందరికీ తెలిసిందే.
ప్రపంచంలో ఏ భాషనూ గ్రామర్ ద్వారా నేర్చుకోరు. గ్రామర్ ద్వారా భాష నేర్చుకోవడం సాధ్యపడదు కూడా. మీలో ఎవరైనా తెలుగు గ్రామర్ ద్వారా నేర్చుకున్నారేమో గుర్తుకు తెచ్చుకోండి. అంతెందుకు మనందరికీ సుపరిచితురాలైన బుల్లి తెర యాంకర్ సుమ తెలుగు అనర్గళంగా మాట్లాడుతారు. కానీ ఆమె మాతృభాష మలయాళం. తెలుగింటి కోడలు కావడం మూలంగానే ఆమె తెలుగు నేర్చుకోగలిగింది.
మాట్లాడటం మనసు మరియు శరీరానికి సంబంధించిన నైపుణ్యం. కేవలం మనసు ద్వారానో లేదా శారీరక ప్రయత్నం ద్వారానో భాషను నేర్చుకోవడం సాధ్యం కాదు. భాష నేర్చుకునే ప్రయత్నంలో మనసు మరియు శరీరం అనుసంధానం చేస్తేనే మాట్లాడే నైపుణ్యం సిద్ధిస్తుంది. సైక్లింగ్, స్విమ్మింగ్ పుస్తకాల ద్వారా ఎలాగైతే నేర్చుకోలేమో.. ఇంగ్లీష్ మాట్లాడటం కూడా కేవలం పుస్తకాల ద్వారా రాదు. కానీ మన విద్యా విధానంలో ఇంగ్లీష్ బోధన, అభ్యసన పుస్తకాలకే పరిమితమమయ్యాయి. ఇలా ఎంతకాలం ప్రయత్నించినా ఇంగ్లీష్ నేర్చుకోవడం సాధ్యం కాదు. L- S- R- W క్రమంలో అభ్యసిస్తేనే భాషలు నేర్చుకోగలం. మన ఇంగ్లీష్ అభ్యసనలో listening, speaking గల్లంతు కావడం మూలంగానే ఇంగ్లీష్ నేర్చుకోవడం గతి తప్పింది. ఫలితంగా ఇంగ్లీష్ పట్ల ఎన్నో అపోహలు ఏర్పడ్డాయి. ఈ అపోహలే అడుగు ముందుకు వేయనివ్వడంలేదు, నోరు తెరిచి మాట్లాడనివ్వడంలేదు.
2
Myths and Facts
(అపోహలు మరియు వాస్తవాలు)
ఊహ తెలిసిన దగ్గరి నుండి మనందరికి ఇంగ్లీష్ ఒక బ్రహ్మపదార్థం. చదవటం, బట్టీ పట్టడం, పరీక్షలు రాయటం, తరగతులు మారటం, పట్టాలు అందుకోవడం ఇదొక అంతులేని కథ. అప్పుడప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగినా గ్రామర్ గుర్తుకొచ్చి మనలాంటి వారికి అసాధ్యమని ఆగిపోతున్నాము. ఇంగ్లీష్ తప్పనిసరి అని తెలుసుకునేలోపే మనలో ఎన్నో అపోహలు నిండిపోయాయి.