అమరావతి ఇళ్లస్థలాల మీద సుప్రీం తీర్పు ఒక పరిశీలన: మాకిరెడ్డి

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)
రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే పధకంలో భాగంగా ఏపీ ప్రభుత్వం రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
అభ్యంతరం తెలుపుతూ రాజాధాని ప్రాంత రైతుల వేసిన ఫిటీషన్ ను విచారించిన హైకోర్టు తుది తీర్పు వచ్చేవరకు ప్రభుత్వ జీఓ అమలును నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీచేసింది.
ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు వెళ్లగా హైకోర్టులొనే పరిష్కరించుకోవాలని చూచిస్తూ తుది తీర్పును త్వరితగతిన పూర్తి చేయాలని హైకోర్టుకు కూడా సలహా ఇచ్చింది.
జీఓ ఇవ్వడంలో – సుప్రీంకి వెళ్లడంలో ప్రభుత్వానికి ప్రాతిపదిక లేదు.
ప్రభుత్వ భూమిని పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అందులో భాగంగా రాజధాని ప్రతిపాదిత భూమిలో ప్రభుత్వానికి సంక్రమించే వాటాలో కొంత భూమిని పేదలకు కేటాయించాము అని ప్రభుత్వం చెప్పవచ్చు.
కానీ ప్రభుత్వం ముఖ్యమైన విషయం మరిచింది. CRDA కి అమరావతి రైతులకు మధ్య కుదిరిన అవగాహన మేరకు ప్రభుత్వ భూమి పోను 33 వేల ఎకరాల భూమి రైతులది.
భూమిని విభజించి కనీస వసతులు పోను రైతులకు దాదాపు 11 వేల ఎకరాలు ప్లాట్ల రూపంలో ఇవ్వాలి. మిగిలిన భూమి ప్రభుత్వానిది అవుతుంది.
ప్రాధమికంగా మొత్తం భూముల విభజనే పూర్తికాలేదు. అపుడు ప్రభుత్వ , రైతులకు తిరిగి ఇచ్చే భూమి తేలకుండానే పేదలకు ఇళ్లస్థలాలను కేటాయించడం ఒప్పందానికి వ్యతిరేకంగా పోవడం అవుతుంది.
రాజధానిలో మార్పులు చేర్పులు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది గానీ రైతులకు CRDA కి మధ్యన కుదిరిన ఒప్పందంలో మార్పులు చేర్పులు చేయడం ఒక ప్రభుత్వం చేతిలోనే ఉండదు.
అందులోనూ భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల సంగతి తేలకుండా ఇతరులకు భూములు కేటాయించడం సాద్యం కాదు.
పేదలకు ఇళ్లస్థలాలు కేటాయింపు రైతుల అంశం పరిష్కారం కాకుండా ఇతరులకు కేటాయించిన కారణంగా హైకోర్టు తుదితీర్పు వచ్చే వరకు ప్రభుత్వ ఆదేశాలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం తుది తీర్పు కోసం ప్రయత్నాలు చేయడం తప్ప మరో మార్గం లేదు.
సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి ప్రభుత్వానికి ఎలాంటి ప్రాతిపదిక లేదు. అందుకే సుప్రీంకోర్టు హైకోర్టులో పరిష్కారం చేసుకోవాలని తెలిపింది.
(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, కన్వీనర్, రాయలసీమ విద్యావంతుల వేదిక,తిరుపతి)