(CS Saleem Basha)
సరిగ్గా 45 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఒక సినిమా రిలీజ్ అయింది. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. భారతదేశ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయింది. సినిమాలు చూసే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ సినిమా ఒక్కసారైనాచూడలేదనే వాళ్లుంటే అది ఆశ్చర్యమే! అదే ఎవరైనా వంద సార్లు చూశాను (నాతో సహా)అంటే ఆశ్చర్యం కూడా లేదు.
ఆ సినిమా సాధించిన వసూళ్లను, ఒకటి రెండు సినిమాలు అధిగమించి ఉండవచ్చు. అయినా సరే ఇప్పటికీ సినిమానే గొప్ప సినిమాగా నిలబడి ఉంది. ఎందుకంటే 3 కోట్లతో తీసిన ఈ సినిమా దాదాపుగా పది రెట్లు (35 కోట్లు) వసూలు చేయడం , అది 1975 లో, పెద్ద విషయమే! ఆసినిమా ఏదో తెలుసా? 1975 బ్లాక్ బస్టర్ చిత్రం షోలే (Sholay)
బాహుబలి( రెండు భాగాలు కలిసి ) సినిమా 2460 కోట్లు వసూలు చేసింది. దానికి అయిన ఖర్చు అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 430 కోట్లు.ఈ మీడియా యుగంలో అది పెద్ద విషయమేమీ కాదు. హిందీ సినిమాల్లో షోలే రికార్డును వసూళ్ళ పరంగా, ఆడిన రోజుల, (286) పరంగా బ్రేక్ చేసింది. అయినప్పటికీ సినిమా పరంగా ఇప్పటికి షోలే నే గొప్పది. ఏది ఏమైనా షోలే సినిమా తీసినప్పుడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ అవకాశాలు చూస్తే షోలే మొదటి స్థానంలో ఉంటుంది.
ఇంతకీ ఏముంది ఈ సినిమాలో అంటే, చెప్పడానికి వీలు కాదు. చూసి తీరాల్సిందే.
ఈ సినిమా కథ కూడా గొప్ప కథ ఏం కాదు. “తన కుటుంబాన్ని బలి తీసుకున్న బందిపోటు దొంగ ను తనకు పట్టి ఇవ్వడానికి ఇద్దరు యువకులను నియమించుకున్న సబ్ ఇన్స్పెక్టర్ టాగూర్ కథ”. అంతే!
ఇలా చెప్తే ఎవరు ఆ సినిమా గురించి పట్టించుకోరు. కానీ ఆ సినిమా చూస్తే మాత్రం థ్రిల్లయిపోతారు! బొంబాయి లోని మినర్వా థియేటర్లో లో ఐదేళ్ళ పాటు (266 వారాలు) ఏకధాటిగా నడిచిన చిత్రం పేరు “షోలే” అని కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు.
భారతీయ సినిమాను షోలే కు ముందు షోలే కు తర్వాత అని చెప్పుకోవడం ఆ సినిమా గొప్పతనాన్ని సూచిస్తుంది.
రెండున్నర సంవత్సరాల పాటు బెంగళూరు సమీపంలోని రాంనగర్ అనే ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. కర్నాటక ప్రభుత్వం దీన్ని షోలే గుర్తింపుగా ఒక పర్యాటక కేంద్రం చేస్తున్నది.
షోలే సినిమా మొదటి రెండు వారాలు నిర్మాతలను దర్శకుడిని నిరాశపరిచింది. ఒక దశలో లో మార్పులు చేసి అమితాబ్ను బతికించే లారీ షూట్ చేసి సినిమాకు కలుపుదాం అనుకున్నారు, కానీ తర్వాత వసూళ్లు పెరగడంతో ఆ ప్రయత్నం మానుకున్నారు. ఇక మిగితాది చరిత్ర!
ఇక ఈ సినిమా రివ్యూ ల గురించి చెప్పాలంటే “ఇది ఒక మామూలు సినిమా”. ఇంకా ఒక ప్రముఖ విమర్శకుడు KL Amladi “ఇది ఆరిపోయిన నిప్పురవ్వ”’! సింబాలిక్ గా చెప్పాడు. ఎందుకంటే షోలే అంటే “నిప్పురవ్వలు” అని అర్థం! తర్వాత ఇది ఎప్పటికి ఆరిపోని నిప్పురవ్వలు గా ఉంటుందని ఆయన ఊహించకపోవటంలో తప్పు లేదు.
ఈ సినిమాకు ఎన్నో విశేషాలు ఉన్నాయి. 9 ఫిలింఫేర్ అవార్డ్స్ కి నామినేట్ అయిన షోలే సినిమా కి కేవలం ఒకే ఒక అవార్డు వచ్చింది! అది కూడా బెస్ట్ ఎడిటింగ్ కి( ఎం ఎస్ షిండే)! సాధారణంగా చరిత్ర సృష్టించిన సినిమాలే అయినా సరే, వ్యక్తులైనా సరే , మొదట్లో సాధారణంగా ఉండటమనేది మనం చరిత్రలో చూస్తూనే ఉన్నాం.
నేను ఈ సినిమా ఎన్నిసార్లు చూశానో చెప్పలేను, కానీ ఎన్ని సార్లు చూడలేదో చెప్పగలను! నన్ను ఇంతగా ప్రభావితం చేసిన సినిమా మరొకటి లేదు. నాకు నచ్చిన సినిమాల లిస్టు లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. మా ఊర్లో( కర్నూలు) అప్పట్లో ఉన్న ప్రతి థియేటర్ లో ఈ సినిమా వచ్చింది, బాగా ఆడింది. ప్రతి రంజాన్ పండగ కి సరికొత్త కాఫీ(!) అని ఈ సినిమా పోస్టర్లు వేసేవాళ్ళు.
అప్పట్లో నేను షోలే సినిమా డైలాగులు పెళ్లిళ్లలో, పుట్టిన రోజు వేడుకల్లో చెప్పి పదో పరకో సంపాదించుకునే వాణ్ణి. షోలే సినిమాతో నాకు చాలా అనుబంధం ఉంది. ఇప్పటికి నేను షోలే సినిమా టీవీలో వస్తే, సౌండ్ ఆఫ్ చేసి డైలాగులు చెప్పి మా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను.
ఈ సినిమాకు సంబంధించి ఒకటి రెండు విషయాలు మాత్రం ప్రస్తావిస్తాను. మొదటిది గబ్బర్ సింగ్ కు సంబంధించినది. అది ఎంత పాపులర్ అయిందో అందరికి తెలుసు. కానీ మొదట ఆ పాత్ర కోసం డానీ ని సంప్రదించారు. కానీ అతను ఆఫ్ఘనిస్థాన్లో ” ధర్మాత్మ” షూటింగ్ లో ఉండటం వల్ల కుదరలేదు. ఆ పాత్ర గబ్బర్ సింగ్ కు దొరికింది. నిజానికి గబ్బర్ సింగ్ కొంచెం భయస్తుడు. ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేట్! 1951 లో Nanjeen సినిమాలో బాల నటుడిగా వేషం వేసిన అంజాద్ ఖాన్ ఉరఫ్ గబ్బర్ సింగ్ 1973 లో హిందుస్థాన్ కి కసం లో చిన్న వేషం వేశాడు! తర్వాత షోలే. గబ్బర్ సింగ్ పై చిత్రీకరించిన మొట్ట మొదటి సన్నివేశం ” “కిత్నే ఆద్మీ థే..”!
ఈ సినిమాలో ఠాగూర్ గబ్బర్ సింగ్ ని చంపేసినట్లు మొదట త్రీకరించినా, సెన్సార్ వాళ్ళు ఒప్పుకో నందున ( పోలీస్ అయిన ఠాగూర్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సెన్సార్ వాళ్లకి నచ్చలేదు) ఠాగూర్ గబ్బర్ సింగ్ చంపకుండా బతికించారు. ఇంతకుముందు చెప్పినట్టు అమితాబ్ పాత్రనే బతికించాలి అనుకున్నారు, కానీ అలా చేయలేదు. సరదాగా చెప్పాలంటే, అంజాత్ ఖాన్ బతికి, అమితాబచ్చన్ చచ్చి, ఈ సినిమాను శాశ్వతంగా బతికించారు!
షోలే సినిమా గురించి ఎన్నో విశేషాలు ఇప్పటికే వచ్చి ఉన్నాయి. నేను ఒక పుస్తకం కూడా రాయగలను. అయితే రివ్యూ రైటర్ గా ఈ సినిమా ఎందుకంత హిట్ అయిందో నేను కొంచెం చెప్తాను.
ఈ సినిమాకు ప్రధాన బలం కథ కాదు. ఎందుకంటే కథ సాధారణమైంది. అకిరా కురసోవా ” సెవెన్ సమురాయ్స” ఆధారంగా అల్లిన కథ ఇది. ఈ సినిమాకు ఆయువుపట్టు డైలాగులు, స్క్రీన్ ప్లే, చిత్రీకరణ! నటన గురించి చెప్పాలంటే ఠాగూర్ గా సంజీవ్ కుమార్ సినిమాకు ఊపిరి పోశాడు. అతనికి పోటీగా గబ్బర్ సింగ్ పాత్రలో అంజాద్ ఖాన్ సినిమాను భుజాలమీద మోశాడు. గబ్బర్సింగ్ పాత్ర ఎంత పాపులర్ అంటే ఎవరైనా కొంచెం కఠినంగా ఉంటే ” గబ్బర్ సింగ్ లా ఉన్నావు” అని చెప్పేంత! గబ్బర్సింగ్ వొక్కొక్క సీన్ ఒక ఆణిముత్యం. ఈ సినిమాలో విశేషమేమంటే అతి చిన్న పాత్రధారి కూడా ఈ సినిమాలో తన వంతు పాత్ర పోషించడం. ఉదాహరణకి రామ్ లాల్ పాత్ర, జయబాధురి తండ్రిగా సీనియర్ నటుడు ఇఫ్తెకార్, కట్టెల అంగడి ఓనర్ surma bhopali, జైలర్ పాత్ర, కాలియా పాత్ర లో విజ్జు కోటే, మౌసీ పాత్ర …, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.
ఆర్.డి.బర్మన్ మ్యూజిక్ ఒక మ్యాజిక్! సినిమాలో టైటిల్స్ వచ్చేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంటుంది. తర్వాత గబ్బర్ సింగ్ కనిపించిన ప్రతి సీన్ లో వచ్చే నేపథ్య సంగీతం. పాటల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి పెళ్లి లో ( డైలాగులతో ఒక ఎల్ పి రికార్డు కూడా ఉంది) వినిపించే ” మహబూబా..” పాట.
ఈ సినిమాలో ఒక్క సీన్ కూడా తీసేయడానికి కుదరదు. అలాగే ఒక్క డైలాగ్ కూడా. ఎక్కువ లేదు తక్కువ లేదు! కొన్ని సీన్లు అయితే ఇప్పటి కూడా యూట్యూబ్లో జనం చూసుకుంటూ ఉంటారు! ఒకటీ, రెండు చెప్తాను. అమితాబచ్చన్ ధర్మేంద్ర పెళ్లి గురించి మాట్లాడడానికి హేమా మాలిని మోడీ దగ్గరికి వెళ్లి మాట్లాడే సీను.
దరిమిలా Tank పైన ధర్మేంద్ర సీన్ క్రియేట్ చేసిన సీను! ఇక గబ్బర్ సింగ్ ఒట్టి చేతులతో తిరిగి వచ్చినా అనుచరులతో మాట్లాడే ” కి తినే ఆహారం మీదే” సీన్. జైల్లో అమితాబ్ ధర్మేంద్ర తప్పించుకునే సీన్,
Surma Bhopali పై చిత్రీకరించిన రెండు సీన్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే సీన్ల గురించే ఒక పుస్తకం రాయాల్సి వస్తుంది.
ఇక డైలాగులు. సలీమ్ జావేద్ జంట మాటలతో ఆడుకున్నారు. గబ్బర్ సింగ్ కు రాసిన ప్రతి డైలాగు ఆ పాత్రకు క్రూరత్వాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసింది. “సంజో జో డర్ గయా ఓ మర్ గయా” ఇప్పటికీ పాపులర్ డైలాగ్. ” అరె ఓ సాంబ” అన్నమాట ఇప్పటికీ ఆ తరం వాళ్ళు వాడతారు. అలాగే అమితాబచ్చన్ సిగ్నేచర్ డైలాగ్” “అగర్ కిసినే భీ హిల్నే కీ కోషిష్ కీ తో భూంద్ కే రక్దూంగా..” ఇప్పటికీ చాలామంది నోళ్లలో నానుతోంది.
” వీరు” గా ధర్మేంద్ర చిలిపి చిల్లర వేషాలు, “జై” గా అ మరో స్థాయికి తీసుకెళ్లాయిమితాబ్ సీరియస్ యాటిట్యూడ్ రచయితలు చక్కగా మలిచారు. ఠాకూర్ గా సంజీవ్ కుమార్ నటన, పలికిన డైలాగులు సినిమాకు అదనపు బలం. బసంతి పాత్రలో హేమమాలిని ఒక అదనపు ఆకర్షణ. బడ బడ తనదైన శైలిలోవాగటం బసంతి పాత్రకు సరిపోయింది.
ఈ సినిమాలో “Train Robbery” చిత్రీకరణ ఒక హైలైట్. క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. సాంకేతికపరంగా ఈ సినిమా స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టం లో రికార్డ్ చేశారు. ఈ రికార్డింగ్ లండన్లోని Twickenham రికార్డింగ్ స్టూడియోలో చేశారు. పైగా 70 mm లో తీసిన సినిమా! అందుకే ఇది స్టీరియో ఫోనిక్ 70mm లో తీసిన మొట్టమొదటి సినిమా!
ఇక దర్శకుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. తన క్రియేటివిటీతో సినిమాను ఓ లెవెల్ కి తీసుకెళ్లాడు. ఈ సినిమా 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అతని మాటల్లోనే చెప్పాలంటే,” ఈ సినిమాను బాగా ప్లాన్ చేసి ఉంటే ఇంత బాగా తీసి ఉండేవాణ్ణి కాదు. కొన్ని సీన్లు అసలు ప్లాన్ వేయకుండా చేశాం . ఒక కోటి రూపాయలు అనుకుంటే బడ్జెట్ మూడు కోట్లు దాటింది. ముందే తెలిస్తే భయపడి సినిమా తీసే వాణ్ణి కాదు. ఈ సినిమా చిత్రీకరణ లో ఎన్నో సమస్యలు వచ్చినా బెదరకుండా ముందుకెళ్లడం వల్ల ఇప్పుడు మంచే జరిగింది అనిపిస్తుంది. ఈ సినిమా 50 సంవత్సరాల వేడుకను నిర్వహించాలని ఆసక్తితో ఎదురు చూస్తున్నా!”
షోలే సినిమా 50 సంవత్సరాలు ఏంటి, ఇంకో 100 సంవత్సరాలు కూడా మాట్లాడుకునే, చర్చించుకునే సినిమా అన్నది చూసినవాళ్లు, చూడని వాళ్ళు కూడా చెప్తారు!
(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)
Like this story? Share it with a friend!