ఒక రాజ్యసభ సభ్యుడి పేరును వాడుకుని సెటిల్ మెంట్లు చేస్తున్నాడని విశాఖ సీనియర్ నాయకుడు కొయ్యా ప్రసాదరెడ్డిని వైసిపి సస్పెండ్ చేసింది. అంతనేరం చేసిన వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయడంలేదని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకుడు నాటుబాంబులు సుధాకర్ రెడ్డి. అసలు విశాఖలో భూగొడవ లేంటి, ఏందుకు సీనియర్ నాయకుడు కొయ్యా ప్రసాదరెడ్డి ఇలా సస్పెండయ్యారు? విశ్లేషణ చూడండి.
పార్టీలో నెంబర్ టులాగా కనిపించే నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేరు చెప్పి ఎవరైనా సెటిల్ మెంట్లకు పాల్పడవచ్చా. అవును విశాఖలో అదే జరిగిందని స్వయాన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. ఈ పని పూనుకుంటున్నదెవరో అనామక నాయకుడు కాదు, ఎప్పటినుంచో పార్టీకి అక్కడ అండగా ఉన్న కొయ్యా ప్రసాద్ రెడ్డి.
ప్రసాదరెడ్డి చాలా సీనియర్ నాయకుడు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆ ఏరియాలో ముఖ్య అనుచరుడు. అందుకే సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ ఛెయిర్మన్ పదవి దక్కింది. ఇలాంటి వ్యక్తి ఇపుడు కొత్తగా భూ సెటిల్ మెంట్లలో పాల్గొనడమేమిటి? ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నాడు? ఆయన ఒక్కరే ఇలా చేస్తున్నారా? లేక ఆయనకు పోటీ తయారయిందా? ఈ పోటీలో వోడిపోయినందునే కొయ్యా ను సస్పెండ్ చేశారా? ఇాలాంటిప్రశ్నలకు సమాధానాలు ఇంకా పార్టీ నుంచి రాలేదు.
అయితే, ఆయన అధికారులను బెదిరించి భూ వివాదాల సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారనే అభియోగం మీద కొయ్య ప్రసాదరెడ్డిని పార్టీ సస్పెండ్ చేశారు. దీని మీద వైసిపి నుంచి బుధవారం నాడు ఒక ప్రకటన వెలువడింది.
విశాఖ కలెక్టరేట్, విజయసాయి రెడ్డి పేర్లను వాడుకుని అక్రమ కార్యకలాపాలకు పాల్పడడాన్ని పార్టీ క్రమశిక్షణా సంఘం తీవ్రంగా పరిగణించి ఈ కఠిన చర్య తీసుకున్నట్లు ప్రకటించింది.
ఇలాంటి అక్రమాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని ప్రకటనలో వైసిపి హెచ్చరించింది. ప్రసాదరెడ్డి, వైఎస్ సీఎంగా వున్నప్పటినుంచి చక్రం తిప్పుతూనే ఉన్నారు వైసీపీ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. కొయ్య ప్రసాదరెడ్డి భూకబ్జాల దాకా వెళ్లాడంటే సమస్య లోతుగా ఉందంటుని ప్రముఖ జర్నలిస్టు నాటుబాంబుల సుధాకర్ రెడ్డి విశ్లేషిస్తున్నారు.