సొంతంగా వ్యాక్సిన్ కొనొద్దు: రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

కరోనా వ్యాక్సిన్ లు మార్కెట్లోకి వచ్చే సమయం  ఆసన్నమవడంతో రాష్ట్రాలేవీ తమంతకు తాము వ్యాక్సిన్ ను కొనుగోలు చేయవద్దని  కేంద్రం హెచ్చరిక జారీ చేసింది.
వ్యాక్సిన్ ఎడ్మినిస్ట్రేషన్ మీద ఏర్పాటుచేసిన నేషనల్ ఎక్స్ పర్ట్ గ్రూప్ తొలి సమావేశం తర్వాత ఈ రాష్ట్రాలకు ఈసూచన  చేశారు.
మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్ (స్పుత్నిక్ 5) తయారయిందని, వాడేందుకు అనుమతించామని  రష్యా ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.  దేశీయంగా పరీక్షల్లో ఉన్న వ్యాక్సిన్లతో పాటు, అంతర్జాతీయంగా సిద్ధమవుతున్న వ్యాక్సిన్ల ఎలా సేకరించాలనే దాని మీద సమావేశంలో చర్చ జరిగింది.  వ్యాక్సిన్ ను భారత దేశంలో పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవసరమయిన నిధుల సమీకరణ గురించి కూడా సమావేశంలో చర్చించారు.
ప్రపంచవ్యాపితంగా ఇపుడు 24 వ్యాక్సిన్లు మానవ పరీక్షల్లో ఉన్నాయి. ఇందులో మూడు వ్యాక్సిన్లు ఇండియాలో పరీక్షలలో ఉన్నాయి.  అవి:  ఆక్స్ ఫోర్డ యూనివర్శిటీ- సీరమ్ ఇన్ స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ (Covishield), భారత్ బయోటెక్ –ఐసిఎం ఆర్ లు రూపొందిస్తున్న కోవ్యాక్సిన్ (Covaxin),జైడస్ క్యాడిలా తయారు చేస్తునన జైకోవ్-డి (ZyCov-D).
వ్యాక్సిన్ ను సేకరించి, పంపిణీ చేసేందుకు అవసరమయిన డిజిటల్ మేనేజ్ మెంట్ వ్యవస్థను రూపొందించే విషయాన్ని నిన్నటి సమావేశంలో చర్చించారు. వ్యాక్సిన్ సరఫరా కేంద్రీకృతంచేసేందుకు అన్ని రాష్ట్రాలకు సమానంగా అందుబాటులోకితెచ్చేందుకు ఈ ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల ఏ రాష్ట్రంలో తనంతకు తాను వ్యాక్సిన్ కొనుగోలుచేయవద్దని  కేంద్ర ఎక్స్ ఫర్ట్ గ్రూప్ పేర్కొంది.
భారతదేశంలో కూడా ప్రజలు విపరీతంగా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. దేశంలో కేసులు పెరిగిపోతూ ఉండటంతో వ్యాక్సిన్  ఒక్కటే మార్గమనే భావన ప్రజల్లోకి వచ్చింది. అందుకే వ్యాక్సిన్ పరీక్షల్లో పాల్గొనేందుకు చాలా ఉత్సాహంగా వలంటీర్లు ముందుకు వస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దేశంలో తొందరగా వ్యాక్సిన్అందుబాటులోకి రావాలన్న ఆదుర్దాతో పాటు, వ్యాక్సిన్ వేయించుకున్న తొలి వ్యక్తి  కావాలనే ఉబలాటంతో వలంటీర్లు ముందుకు వస్తున్నారు. హైదరాబాద్ నిమ్స్ వర్గాల కథనం ప్రకారం ఇక్కడ 32 వలంటీర్లకు సెకండ్ డోస్ కోవ్యాక్సిన్ (Covaxin)ఎక్కించారు. మొదటి విడతలో 50 మందికి ఈ వ్యాక్సిన్ ఎక్కించారు. అయితే, ఎవరూ దుష్ప్రభావాలను చూపలేదు. నిమ్స్ లో కోవాక్సిన్ ట్రయల్స్ జూన్ 20వ తేదీనుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే.
సాధారణంగా నాలుగు డబ్బులొస్తాయని పేద వర్గాల ప్రజలు ఇలాంటి ఔషధాల పరీక్షలకు ఒప్పుకుంటుంటారు. అయితే, ఈ సారి బాగా చదువుకున్నవారు వ్యాక్సిన్ పరీక్షలకు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
  భారతదేశంలో కేసులు 23,29,638 కి చేరుకున్నాయి. గత 24గంటలలో 60,963 కేసులు నమోదయ్యాయి.  మృతి చెందిన వారి సంఖ్య 40,091కి చేరింది.  గత 24 గంటలలో 834 మంది చనిపోయినట్లు కేంద్రం ప్రకటించింది.