(C S Saleem Basha)
అవసరాలు, సౌకర్యాలు, సుఖాలు, కోరికలు, విలాసాలు వంటి వాటి మధ్య తేడాను బాగా అర్థం చేసుకోవడమే సంతోషానికి మొదటి మెట్టు. నిజానికి మొదటి రెండు దాదాపు అందరికీ ఉంటాయి, ఉండాలి కూడా! అవి తీరినతర్వాత మిగతావి. అందులో విలాసాలు ప్రత్యేకమైనవి.
అయితే ముందు అవసరాలు తీరాలి. తర్వాత సౌకర్యాల వైపుకి అడుగు వేయాలి. కోరికలు అన్నవి రెక్కల గుర్రాలు లాంటివి. గుర్రం వేగంగా పరిగెడుతుంది., ఇక రెక్కల గుర్రం అంటే? ఒకప్పుడు సౌకర్యాలు, కోరికలు, సుఖాలు అనుకునేవి ఇప్పుడు అవసరాలుగా మారిపోయాయి.
ఉదాహరణకి ఇప్పుడు సెల్ ఫోన్ ఒక అవసరం, ఒక సౌకర్యం. అలాగే ఒక వాహనం. మన అవసరాలను ముందుగా గుర్తించి ప్రాధాన్యత క్రమంలో వాటిని తీర్చుకోవడం వల్ల చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలో అన్నీ మారిపోయాయి.అది వేరే విషయం.
ఇందాక చెప్పిన సెల్ ఫోన్ విషయానికి వస్తే, అది ఒక అవసరం, సౌకర్యం కూడా. అయితే అనేక ఫీచర్స్ ఉన్న ఖరీదైన ఫోన్ ఉంటే “సుఖంగా” ఉంటుందన్న “కోరిక” వల్ల అనేక అవసరాలను పక్కన పెట్టి సెల్ ఫోన్ కొనటం , సంతోషాన్ని వదిలేసి ” విలాసాల” వైపుకి వెళ్ళటమే! తద్వారా ఉత్పన్నమయ్యే అనేక సమస్యలు, సంతోషం మాట దేవుడెరుగు, జీవితం మొత్తం అతలాకుతలం అయ్యే అవకాశం ఉంది. ఒక్క కోరిక వల్ల జీవితంలో దీంతో అశాంతి కలగవచ్చు. ఖరీదైన సెల్ఫోన్ కొనడం తప్పు కాదు, కొనగలిగే స్తోమత ఉన్నప్పుడు. అక్కడే చాలామంది తప్పటడుగు వేస్తారు.
అందుకే బౌద్ధం ” మొదటి కోరికను అణచుకోవడమే సులభం, దాని తర్వాత ఉత్పన్నమయ్యే కోరికలను అణుచుకోవడం కన్నా” అని చెబుతుంది.
విలాసవంతమైన జీవితం కోరుకోవడం తప్పు కాదు. అయితే అంతకన్నా ముందు అవసరాలు, విలాసాలు మధ్య తేడాను అర్థం చేసుకోవడం అవసరం. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాలి. ఒక చిన్న స్థాయి ఉద్యోగి భార్యతో సహా పెళ్లి కి వెళ్లాలని అనుకుంటాడు. అయితే భార్య ” అంత పెద్ద వాళ్ల పెళ్లికి వెళ్తున్నాము, నాకు కనీసం ఒక నెక్లెస్ కూడా లేదు.” అని బాధపడుతూ ఉంటుంది.
సరే, పక్కనే ఉన్న ఒక ధనవంతురాలి దగ్గర నెక్లెస్ తీసుకొని పెళ్లి కి వెళ్తారు. దురదృష్టవశాత్తు పెళ్లిలో ఆ నెక్లెస్ పోగొట్టుకుంటుంది. దాంతో ఏం చేయాలో దిక్కుతోచక అప్పు చేసి అలాంటి నెక్లెస్ ఒకటి కొనుక్కుని ధనవంతురాలు కి ఇచ్చేస్తారు. తర్వాత అప్పు తీర్చడానికి ఇద్దరూ కలిసి పని చేసినా 10 సంవత్సరాలు పడుతుంది. అప్పటికే ఆ ధనవంతురాలు ఆ వూరు వదిలి వెళ్లిపోయి ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఆమె వీళ్లకు కనపడుతుంది. అయితే ఆమె వీళ్ళని గుర్తు పట్టదు. అప్పుడే ఉద్యోగి భార్య ఆమెకు గుర్తుచేస్తుంది. ధనవంతురాలు ఈమెను చూసి ఆశ్చర్యపోయి ఆమె ఎందుకిలా తయారయ్యిందో అడుగుతుంది. అప్పుడు ఉద్యోగి భార్య నెక్లెస్ కొన్న విషయం గుర్తు చేస్తుంది. స్థానిక ధనవంతురాలు ఆశ్చర్యపోయి ” అది ఖరీదైన నెక్లెస్ కాదు డూప్లికేట్ అని చెప్తుంది. ఫ్రెంచి రచయిత ” Guy de Maupassant నెక్లెస్ (The Necklace or The Diamond Necklace) అన్న కథ ఇది. విలాసవంతమైన కోరిక వల్ల వచ్చిన సమస్య గురించి చాలా చక్కని కథ ఇది. ఈ విషయంపై చాలా తెలుగు సినిమాలు వచ్చాయి.
విలాసవంతమైన జీవితం కోసం జీవితం అప్పులపాలైన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అవసరాలకి, విలాసాల కి మధ్య తేడా తెలుసుకోలేని ” మధ్యతరగతి మనస్తత్వం” ఉన్నవాళ్లే వాళ్ళందరూ. మిడిల్ క్లాస్ మెంటాలిటీ, అన్న పదం వినని వారు ఎవరూ ఉండరు.ఏంటీ మెంటాలిటీ అని తెలుసుకునే ముందు దీనితో జంట పదం ఉంది. అదే ” false prestige”! ఈ రెండు పదాల కలయిక పేరే ” మిడిల్ క్లాస్ మెంటాలిటీ” సమాజంలో ఇది సహజం! ఈ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, ఇతరులతో పోల్చుకుని తమ జీవితాలను సమస్యలమయంచేసుకుంటారు. స్తోమతకు మించి, ఇతరుల కోసం గొప్పలు పోవడం అన్నది ఈ మెంటాలిటీ ప్రధాన లక్షణం. ఈ మెంటాలిటీ ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండటం అనే దానికీ ప్రాధాన్యతను ఇవ్వరు. అవసరాలకు మించి అప్పులు చేసైనా సరే, విలాసవంతమైన జీవితాన్ని(ఇతరుల కోసం) జీవించడం అన్నది వీళ్లు వేసే తప్పటడుగు.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. సాధువుల లాగా, సన్యాసుల్లాగా బతకడం కాదు సంతోషకరమైన జీవితం అంటే. ఉన్నదానితో తృప్తి పడడం కూడా కాదు. సంతోషం అంటే డబ్బు సంపాదించకుండా కూడా ఉండటం కాదు. సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకోవడమే సంతోషం అంటే!
“Science Of Getting Rich”- అన్న పుస్తక రచయిత, Wallace D. Wattle ” డబ్బులు ఎందుకు సంపాదించాలో తెలుసుకోవడమే” సంతోషానికి మూలం అంటాడు.
డబ్బులు సంపాదించడం, వాటిని ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకోవడం వల్ల సంతోషం కలుగుతుంది అంటాడు. ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలను సౌకర్యాలను విలాసాలను అనుభవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని చెబుతుంది ఈ పుస్తకం. డబ్బులను మూడు కారణాల కోసం సంపాదించాలి. భౌతికమైన సుఖాల కోసం, జ్ఞాన సముపార్జనకు ఖర్చు పెట్టడం కోసం , ఆత్మ సంతృప్తి కోసం(దానధర్మాలు) డబ్బు సంపాదించాలి అన్నది ఈ పుస్తకం యొక్క సారాంశం. అప్పుడే డబ్బు సంపాదన సంతోషానికి దారితీస్తుంది అంటాడు.
(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)