(Dr EAS Sarma)
కరోనా వ్యాధిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం గత నాలుగు నెలలుగా లాక్డౌన్ విధించవలసి వచ్చింది. దేశవ్యాప్తంగా వ్యాధిగ్రస్తులైన వారి సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతున్నదే కాని, తగ్ గడం కనిపించడం లేదు. ఇందుమూలంగా లాక్డౌన్ ఇంకా కొన్నివారాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లాక్డౌన్ మూలంగా నష్టపోయినవారు సామాన్య ప్రజలు, చిన్నకారు వృత్తుల ద్వారా ఉపాధిని పొందేవారు. నాలుగు నెలలుగా వారికి ఉపాధులు లేవు. మీ ప్రభుత్వం కొంతవరకు సహాయం అందించినా, వారి కష్టాలు పూర్తిగా నివారించబడలేదు. ఇటువంటి వారిలో పెద్ద ఎత్తున కష్టాల పాలైనవారు ఆటో రిక్షాలు నడిపే వారు, మూడు నాలుగు వరకు టాక్సీ లను నడిపే వారు.
ఇందుకు ఉదాహరణగా, “కదలని కారు చక్రం .. సీ ఎం కు లేఖరాసి ట్యాక్సీ డ్రైవర్ ఆత్మ హత్య” అనే వార్తను జత పరుస్తున్నాను.
ఆత్మహత్య చేసుకున్న ట్యాక్సీ డ్రైవర్ పేరు చోడిశెట్టి శివ మల్లేశ్వర రావు, కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం ముళ్ళపూడి గ్రామానికి చెందిన వ్యక్తి. ట్యాక్సీ కొనడానికి ఒక ఫైనాన్స్ కంపెనీ నుంచి ఋణం తీసుకున్నాడు. కాని, లాక్డౌన్ సమయంలో కిరాయిలు లేక, ఋణం కిస్తీలు కట్టలేకపోయాడు. ఫైనాన్స్ కంపెనీ ఒత్తిళ్లను భరించలేక ఇతరుల వద్దనుంచి ఇంకా అధికమైన వడ్డీకి అప్పులు తీసుకొని, ఫైనాన్స్ కంపెనీ కిస్తీలను చెల్లించడానికి ప్రయత్నించాడు. కాని విఫలుడయ్యాడు. ఏ గతీ కనిపించక ఆత్మహత్య చేసుకున్నాడు. అయన రాసిన విషాదకరమైన లేఖను మీ అధికారులు మీకు చుపించారో లేదో తెలియదు.
చోడిశెట్టి శివ మల్లేశ్వర రావు వంటి వేలాదిమంది ఆటో రిక్షా డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు మనరాష్ట్రం లో ఇదే పరిస్థితులలో ఉన్నారనేది మీరు గమనించవలసిన విషయం. వారి సంక్షేమం గురించి మీ ప్రభుత్వం త్వరిత గతిలో ఆలోచించాలి. క్రింద, ఈ విషయంలో సూచించిన విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం చోడిశెట్టి శివ మల్లేశ్వర రావు కుటంబాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలి. ఫైనాన్స్ కంపెనీ బారినుంచి తప్పించాలి. భార్యకు పిల్లలకు మంచి భవిష్యత్తును ఇచ్చే విధంగా సహాయం చేయాలి
లాక్డౌన్ సమయంలో ఫైనాన్స్ కంపెనీలు ఇచ్చే రుణాలమీద కేంద్ర ప్రభుత్వం, RBI వాయిదాలు ఇచ్చినా, అందువలన ఎటువంటి లాభం కలుగలేదు. వాయిదా పేరులో ఫైనాన్స్ కంపెనీలు పెద్ద ఎత్తున వడ్డీలను ఛార్జ్ చేస్తున్నాయి. ఒక వైపు లాక్డౌన్ కారణంగా ఉపాధులను కోల్పోయిన వారు, EMI లు, అధికమైన వడ్డీలు కట్టే పరిస్థితి లేదు. వారు ఇంకా అప్పులపాలు అయి, ధైర్యాన్ని కో ల్పోయే అవకాశం ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిగారికి తెలియచేసి, ఫైనాన్స్ కంపెనీల వాయిదాలను ఆపడమే కాకుం డా, వడ్డీ విషయంలో కూడా మాఫీ ఇవ్వాలని విజ్ఞప్తి చేయాలి. అటువంటి మాఫీలను ఉపాధికోల్పోయిన వారికి, సబ్సిడీ రూపంలో ఇవ్వాలి.
ఉపాధికోల్పోయిన ఇటువంటి చిన్నకారు ప్రజలకు లాక్డౌన్ సమయం లోనే కాకుండా ఇంకొక మూడు నెలల వరకు కనీస వేతనం వంటి సహాయం అందించాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఈ విషయంలో సహాయం అందించాలి.
ట్యాక్సీలమీద రాష్ట్ర ప్రభుత్వం చాలా అధికంగా టాక్సులను విధించారు. లాక్డౌన్ సమయంలో టా క్సులను మాఫీ చేయాలి. అదేకాకుండా, చిన్నకారు ట్యాక్షీ డ్రైవర్ల మీద అంత అధికంగా ట్యాక్సులను విధించకూడదు.
పరిస్థితి విషమించే ముందే మీ ప్రభుత్వం మీద సూచించినట్లు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను
(ఇది డాక్టర్ ఇఎఎస్ శర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ)