సోము వీర్రాజు, జివిఎల్ ‘రాజధాని ప్రకటన’ విశ్లేషణ

(టి.లక్ష్మీనారాయణ)
బిజెపి జాతీయ అధికార ప్రతినిథి, రాజ్యసభ సభ్యులు  జి.వి.యల్.నరసింహారావు, బిజెపి, ఆ.ప్ర. రాష్ట్ర అధ్యక్షుడు  సోము వీర్రాజు గారిని ప్రక్కన కూర్చోబెట్టుకొని అట్టహాసంగా నవ్వుతూ డిల్లీలో బహిరంగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఒక ప్రకటన చేశారు.  రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డిఎ రద్దు బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపాక వారిద్దరు స్పందిస్తూ చేసిన ఆ ప్రకటన లోని  ప్రకటనలోని ముఖ్యమైన అంశాలు,వాటి అంతరంగం ఏమిటో చూద్దాం:
1. రాష్ట్ర గవర్నర్ నిర్ణయాన్ని విమర్శించం.
2. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి రు.2500 కోట్లు ఇవ్వడానికి నీతి అయోగ్ చేసిన సిఫార్సు మేరకు ఇప్పటికే రు.1500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మిగిలిన రు.1000 కోట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది.
3. రాయలసీమలో హైకోర్టు పెట్టాలని మా పార్టీ (బిజెపి) డిమాండ్ చేసింది నేటి రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో దాన్ని చేర్చింది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. మేము సహకరిస్తాం. ఆ అంశం సుప్రీం కోర్టు పరిథిలో ఉన్నది. చిక్కుముడులను ఎవరు విప్పుతారు?  అలాగయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును విభజించినప్పుడే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతితో ఎందుకు నోటిఫికేషన్ ఇప్పించలేదు? ఇప్పుడు ఈ రాజకీయ విన్యాసం ఎవరిని దగా చేయడానికి?
4. అమరావతి రైతులకు న్యాయం జరగాలి. వారికి అండగా నిలుస్తాం. రాజధాని నిర్మాణం కోసం రైతులు వారసత్వంగా సంక్రమించిన, జీవనాధారమైన భూములను త్యాగం చేసినపుడు, రాజధానిని విశాఖకు తరలిస్తే, రైతులకు న్యాయమెలా జరుగుతుందో శ్రీమాన్ జి.వి.యల్. గారే సెలవియ్యాలి.
సీఆర్డీఏ చట్టం రద్దు, వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో మనోవేధనతో తమ చెప్పులతో తమను తామే రైతులు కొట్టుకొంటున్న దృశ్యాలు ప్రసారమాధ్యమాలలో ప్రసారమౌతున్న నేపథ్యంలో అట్టహాసంగా నవ్వులొలికించడంలోని ఆంతర్యమేంటి?
5. విభజన చట్టంలో పేర్కొన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకాన్ని, కడప ఉక్కు కర్మాగారాన్ని తిరస్కరించడంతో పాటు రేణిగుంట – మన్నవరం దగ్గర నిర్మాణంలో ఉన్న బి.హెచ్.సి.ఎల్. – ఎన్.టి.పి.సి. విద్యుత్తు పరికరాల పరిశ్రమను అటకకెక్కించిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిథులకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని గురించి మాట్లాడే నైతికత ఉన్నదా! విజ్ఞతతో ఆలోచించండి.
T Lakshminarayana
(టి.లక్ష్మీనారాయణ, సామాజిక కార్యకర్త)