బాల గంగాధర తిలక్ కమ్యూనిస్టు అయి వుండేవారా?

జూలై 23 బాల గంగాధర తిలక్ జయంతి
మహాత్మాగాంధీ  ముందు తరం నాయకుల్లో చాలా పాపులర్ అయిన స్వాతంత్య్రోద్యమ నేత  బాలగంగాధర తిలక్ (జూలై 23, 1856-ఆగస్టు1,1920) ఒకరు. స్వాతంత్య్రోద్యమ తొలినాయకుడయినా, భారత ప్రజలకు గాంధీ నెహ్రూల్లాగా చిరపరిచితమయిన పేరిది. నిజానికి గాంధీ ముందు తరం స్వాతంత్య్రోద్యమ నాయకుల్లో ఇంతగా ప్రజాభిమానం చూరగొన్న నాయకుడు మరొకరు లేరేమో. తల్లితండ్రులు  పిల్లలకు బాలగంగాధర తిలక్ పేరు పెట్టడం ఇటీవలి దాకా కొనసాగింది. తిలక్ రోడ్, తిలక్ మార్గ్, తిలక్ నగర్, తిలక్ జంక్షన్… ఇలా ఏదోఒక రూపంలో తిలక్ పేరు  లేని పట్టణాలు భారత దేశంలో అరుదు. ముంబై రైల్వే స్టేషన్ కు ఆయన పేరే పెట్టారు.రైళ్లకు కూడా ఆయనపేరుంది. ఆయనకు తల్లితండ్రులు పెట్టిన పేరు కేశవ్ గంగాధర్ తిలక్.
చాలా కాలం తిలక్ మీద మార్క్సిజం ప్రభావం కూడా ఉండింది. తిలక్ స్వతహాగా కార్మిక రైతు పక్షపాతి. లాంక్ షైర్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకే బ్రిటిష్ ఇండియాలో  1881 Factories Act తెస్తున్నారని విమర్శిస్తూ వ్యతిరేకించారు. ఆయన నేరుగా మార్క్స్ రచనలను చదివారో లేదో తెలియదుగాని, పరోక్షంగా కార్ల్ మార్స్ క్యాపిటల్, లేబర్ ప్రభావం ఆయన మీద పడింది.
బతికి ఉంటే తిలక్ కమ్యూనిస్టు అయి ఉండేవారా?
1881 ఎప్రిల్ 17 నాటి ’మరాఠా’ పత్రికలో నిహిలిజం (Nihilism) వ్యాసాన్ని  ఇంగ్లీష్ జర్నల్ Leisure Hour నుంచి తీసుకుని ప్రచురించారు. ఈ ఆర్టికల్ లో నిహిలిజానికి నిర్వచనం ఇచ్చారు. “… Nihilism manifests itself as radicalism in politics, as communism in it social aspect, as theism in its religious tendencies” అని చెప్పారు. తర్వాత ఇంగ్లీష్ జర్నల్ Radical నుంచి కూడా ఒక వ్యాసం తీసుకుని ‘మరాఠా’లో ప్రచురించారు. ఇందులో కార్ల్ మార్క్స్  శ్రమ, సంపద గురించిన విషయాలున్నాయి. ఈ వ్యాసాన్ని ప్రచురించడం తిలక్ అదృష్టంగా భావించారు. ఇదొక ‘prized essay’అని వర్ణించారు. మరొక ముఖ్యమయిన విషయం ఏంటే టాటా కుటుంబ వారసుల్లో  ఒక కమ్యూనిస్టు కూడా ఉన్నారు. ఆయన పేరు షాపూర్జీ సక్లత్ వాలా.ఆయన కమ్యూనిస్టు పార్టీ సభ్యుడి బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆయనకు తిలక్ అంటే చాలా ఇష్టం. తనని ‘Tilakite Extremist’ అని చెప్పుకునేవారు.  ఇండియాలో ‘ఇంటర్నేషనల్ కమ్యూనిస్టు లేబర్ పార్టీ’ని స్థాపించాలని కూడా టాటా ఆయన ఇంగ్లండు నుంచి లేఖ రాశారు. కమ్యూనిస్టు ఉద్యమం స్పూర్తితో ఆయన ఇంగ్లండులో ఎన్నో కార్మిక సభల్లో కూడా ప్రసంగించారు. ఇలాంటి ఒక సభకు  ప్రఖ్యాత రచయిన జార్జ్ బెర్నార్డ్ షా అధ్యక్షత వహించారు.
మరొక ఆశ్చర్యకరమయిన విషయమేంటంటే, ప్రఖ్యాత కమ్యూనిస్టు నాయకుడు శ్రీపద్ అమ్రిత్ డాంగే (SA Dange) తిలక్ అనుచరుడు. పరిశ్రమల్లో, రైల్వేలో, గనుల్లో కార్మికుల హక్కుల కోసం పనిచేయండని డాంగేని ఉత్తేజ పరిచింది కూడా తిలకే. 1919 నవంబర్ 29న తిలక్ ముంబై జౌళి మిల్స్ కార్మికులనుద్దేశించి బ్రహ్మాండమయిన బహిరంగ సభలో ప్రసంగించారు.
రష్యన్ విప్లవాన్ని, మార్క్స్ ని, లెనిన్ ని కొనియాడుతూ తన పత్రిక ‘కేసరి’లో 1918 జనవరి 29న ‘రష్యాయిచ పూధారి లెనిన్’ అని ప్రశంసించారు. మార్క్స్ ని ‘సమాజ్ సత్తేచ పురస్కర్త’ The Profounder of socialist rule) అని పొగిడారు. షాపూర్జీ నుంచి లేఖ వచ్చిన రెన్నెళ్లకే  తిలక్ చనిపోయారు. లేకుంటే ఆయన కమ్యూనిస్టు గా  మారి ఉండేవారేమో. (source: Lokamanya Tilak on Karl Marx and Class Conflict by JV Naik from Bal Gangadhar Tilak Poluar Readings. Ed.Biswamoy Pati).
అయితే, తిలక్ వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా సమర్థించారు. ఆ రోజుల్లో చిత్పవన్ బ్రాహ్మణులు సమాజంలో వస్తున్న సంస్కరణలను వ్యతిరేకించారు. కుల కట్టుబాట్లు అంతా పాటించాలనే వారు. చివరకు భారత జాతి ఉనికికి కులమే పునాది (‘The Caste and Caste Alone Has Power’ (Editorial), The Mahratta, 10 May 1891, p. 3.) అన్నారు. ఒక వైపు కమ్యూనిస్టు విలువలను బోధిస్తూ, మరొకవైపు కులాన్నిసమర్థించడం తిలక్ లో ఉన్న ఒక వైరుధ్యం. అందుకే ఆరోజుల్లో ఆయన బ్రిటిష్ ప్రభుత్వం బ్రాహ్మణేతరులకు ఇవ్వాలనుకున్న రిజర్వేషన్లను వ్యతిరేకించారు.
రేపు తిలక్ జయంతి సందర్బంగా ప్రత్యేక వ్యాసం:
(వల్లూరు ప్రసాద్ కుమార్)
బాలగంగాధర్ తిలక్ని భారతజాతీయోద్యమ పితగా పేర్కొంటారు. తిలక్ జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించాడు. దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో ఈయన చెప్పుకోదగిన పాత్ర పోషించాడు. అందుకే ఆయనను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడు (Father of India’s unrest) గా భావిస్తారు. ఆయనను ‘లోకమాన్య’ అని కూడా పిలుస్తారు..
బాలగంగాధర తిలక్ 1856 జూలై 23వ తేదీనమహారాష్ట్ర రాష్ట్రంలోని రత్నగిరిలో జన్మించారు.  తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ సంస్కృత పండితుడు. చదువు లో  తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించిగణితశాస్త్రంలో అతను విశేష ప్రతిభ కనబరచేవాడు. చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణమాయనది. నిజాయితీతో బాటు ముక్కుసూటితనం అతనుకు సహజం. కళాశాలకు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో అతను ఒకరు.
తిలక్ కు పదేళ్ళ వయసున్నప్పుడు అతను తండ్రికి రత్నగిరి నుంచి పుణెకు బదిలీ అయింది. ఇది తిలక్ జీవితంలో పెనుమార్పు తీసుకువచ్చింది. అతను అక్కడ ఆంగ్లో-వెర్నాకులర్ పాఠశాలలో చేరి కొందరు ప్రసిద్ధి చెందిన ఉపాధ్యాయుల వద్ద విద్యనభ్యసించాడు. ఐతే పూణెకు వచ్చిన కొంతకాలానికే అతను తన తల్లిని, పదహారేళ్ళ వయసులో తన తండ్రిని కోల్పోయాడు.మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడే అతనికి తాపిబాయ్ (తర్వాత  సత్యభామ అయింది) అనే పదేళ్ళ అమ్మాయితో పెళ్ళయింది. మెట్రిక్ పాసయ్యాక అయన దక్కన్ కళాశాలలో చేరాడు.1877లో అతను గణితశాస్త్రంలో ప్రథమశ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. కొంతకాలం తిలక్ పూణే ఫెర్గుసన్ కాలేజీలు లెక్కలు బోధించారు.
ఆ తర్వాత అతను తన చదువును కొనసాగించి ఎల్.ఎల్. బి పట్టా  పొందారు.తిలక్ 1890లో కాంగ్రెస్ లో సభ్యుడుగా చేరాడు. కానీ త్వరలోనే అతనికి కాంగ్రెస్ మితవాద రాజకీయాలపై నమ్మకం పోయింది. స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గమని అతను నమ్మాడు. అప్పటివరకు కాంగ్రెస్ ప్రతి సంవత్సరం డిసెంబరు చివరి వారంలో మూడు రోజులపాటు సమావేశమై బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను “pray, petition, protest” చెయ్యడానికే పరిమితమైంది. తిలక్ దాని గురించి చాలా ఘాటైన విమర్శలు చేశారు. “మీరు సంవత్సరానికొకసారి మూడు రోజులపాటు సమావేశమై కప్పల మాదిరి బెకబెకలాడడం వల్ల ప్రయోజనం లేదు.” అని, “అసలు కాంగ్రెస్ సంస్థ అడుక్కునే వాళ్ళ సంఘం (begging institution)” అన్నారు.
తిలక్ మతానికి,సంప్రదాయాలకు ప్రాముఖ్యం ఇచ్చే వాళ్లు. స్వాతంత్య్ర పోరాటాం మతసంబంధ ఉత్సవాలతో కలగలిసే ఉంటుంది. అందుకే వ్యక్తిగతంగా బాల్యవివాహాలను వ్యతిరేకించినా,  బ్రిటిష్ ప్రభుత్వం బాలికల వివాహ వయసును 10 నుంచి 12 సం. కు పెంచుతూ తీసుకువచ్చిన  1891 age of consent bill ను వ్యతిరేకించారు.  ఇదిహిందూ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమేనన్నారు.
కాంగ్రెస్ సమావేశాలను 3-డే తమాషాగా అభివర్ణించాడు. “స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని నేను పొంది తీరుతాను.” అని గర్జించాడు.1907లో మహారాష్ట్రలోని సూరత్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది.
మితవాదులు కాంగ్రెస్ పై తమ పట్టును నిలబెట్టుకున్నారు. అతివాదులుగా పిలవబడే తిలక్, అతను మద్దతుదారులు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. తిరిగి 1916లో లక్నోలో జరిగిన సమావేశంలో అంతా ఒకటయారు. అదే సమావేశంలో కాంగ్రెస్ కు, ముస్లిం లీగుకు మధ్య లక్నో ఒప్పందం కుదిరింది.
తిలక్ పాశ్చాత్య విద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు – అది భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అగౌరవపరచి భారతీయ విద్యార్థులను చిన్నబుచ్చేవిధంగా ఉందని. ప్రజలకు మంచి విద్యను అందించడం ద్వారానే వాళ్ళను మంచి పౌరులుగా మార్చవచ్చనే ఉద్దేశం అతనిది. ప్రతి భారతీయుడికి భారతీయ సంస్కృతి గురించి, భారతదేశపు ఔన్నతాన్ని గురించి బోధించాలని అతనికి ఆశయం. అందుకే అగార్కర్, విష్ణుశాస్త్రి చిప్లుంకర్ లతో కలిసి “దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ”ని స్థాపించాడు.
ఆ తర్వాత తాను నడిపిన పత్రికలు “మరాఠా (ఆంగ్ల పత్రిక)”, “కేసరి(మరాఠీ పత్రిక)” లలో మొద్దు నిద్రపోతున్న భారతీయులను మేల్కొల్పడానికి పదునైన భాషలో బ్రిటిష్ పాలనలోని వాస్తవ పరిస్థితుల గురించి వివరంగా రాశాడు. బాల్యవివాహాలను నిరసించివితంతు వివాహాలను స్వాగతించారు.
జాతీయ స్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ అవకాశాన్నీ అతను వదిలిపెట్టలేదు. మొట్ట మొదటిసారిగా శివాజీ ఉత్సవాలను, గణపతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజలను సమీకరించడం, వారిని జాతీయోద్యమం వైపు నడిపించడం  మొదలుపెట్టాడు. తన పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే రాతలు రాసినందుకు 1897లో అతనుకు ఒకటిన్నరేళ్ళు కారాగారశిక్ష పడింది. విడుదలయ్యాక అతను స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1906లో దేశద్రోహం నేరం క్రింద అతనుకు ఆరేళ్ళు ప్రవాసశిక్ష విధించారు. కారాగారంలో ఉన్నప్పుడే అతను “గీతారహస్యం” అనే పుస్తకం రాశాడు. అతను చరిత్రకారుడు కూడా. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని అతను అభిప్రాయం.
1914 లో మాండలే జైలునుంచి వచ్చాక ఆయన మొత్తబడ్డారు. జైలు కష్టాలు, షుగర్ వ్యాది ఆయన పట్టదులను బలహీన పర్చాయి. ప్రపంచయుద్ధానికి మద్ధతుగా బ్రిటిష్ రాజు లేఖ రాశారు. యుద్ధంలో చేరాలని ఆయన యువకులను ఉత్తేజ పరుస్తూ ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. 1916లో మళ్లీ జాతీయోద్యమంలో చేరారు. తర్వాత రష్యా విప్లవాన్ని, వ్లదిమీర్ లెనిన్ కూడా  ప్రశంసించారు. ఇపుడు గణేష్ ఉత్సవాలు ఇలా భారీ హిందూ శక్తులు సమీకరణగా  జరిగేందుకు కారణం తిలకే.దానిని ఆయన జాతీయోద్యమ సమీకరణ గా భావించారు.
1916 ఏప్రిల్ లో హోంరూల్ లీగ్ స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ మధ్యభారతదేశంలో గ్రామగ్రామానా తిరిగాడు. అనీబిసెంటు అదే సంవత్సరంసెప్టెంబర్లో మొదలుపెట్టి హోంరూల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది. ఆ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ఒక కోర్టుకేసులో అతనులండనుకు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే, అంటే 1917ఆగస్టులో అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటేగు “బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైన భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి వీలుగా అన్ని పాలనాంశాల్లో భారతీయులకు అధిక ప్రాధాన్యాన్నివ్వడమే ప్రభుత్వ విధానమని” బ్రిటిష్ ప్రభుత్వం తరపున ప్రకటించాడు. బాధ్యతాయుత ప్రభుత్వమంటే ఎవరికి బాధ్యత వహించే ప్రభుత్వమో, అధిక ప్రాధాన్యమంటే ఎంత ప్రాధాన్యమో, అసలు అది ఎప్పుడిస్తారో ఏదీ స్పష్టంగా లేదు. కానీ బ్రిటిష్ ప్రభుత్వ నిజాయితీని నమ్మిన అనీబిసెంటు ఆ ప్రకటనతో ఉద్యమాన్ని అపేసి ప్రభుత్వానికి తన మద్దతు ప్రకటించింది. అలా ఇద్దరు నాయకులదీ చెరొకదారీ కావడంతో హోంరూల్ ఉద్యమం చల్లబడిపోయింది. కానీ ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది. అందుకే 1920లో ఆగస్టు 1 న తిలక్ చనిపోయినప్పుడు జాతీయోద్యమంచుక్కాని లేని నావ అవుతుందని చాలా మంది భయపడ్డారు.

If you like this article, please share it with a friend!