తిరుగుబాటును రాష్ట్రపతి భవన్ దాకా తీసుకెళ్లిన వైసిపి రెబెల్ ఎంపి రఘరామ

ఢిల్లీ : వైసిపి రెబెల్ ఎంపి రఘరామకృష్ణం రాజు (నర్సాపురం) తన తిరుగుబాటు రాష్ట్రపతి భవన్ దాకా తీసుకువెళ్లారు. ఈ రోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలసి  ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతినుంచి విశాఖకు తరలించడానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. అంతేకాదు, ఈ తరలింపును అడ్డుకోవాలని కోరుతూ ఒక వినతి పత్రంసమర్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగాలని అదే ప్రజాభీష్టమని లేఖలో పేర్కొన్నారు.
ఇదే విధంగా తనకు వైసిపి నుంచి అభద్రత ఉందని చెబుతూ  ప్రత్యేక భద్రత కూడా కల్పించాలని కూడా రెబెల్ ఎంపి  రాష్ట్రపతిని కోరారు.ఈ మేరకు మరొక లేక అందించారు.
వైసిపి రఘురామను వదలించుకోవాలని ప్రయత్నం తీవ్రం చేస్తే ఆయన తన తిరుగుబాటుకు పదును పెట్టారు. లోక్ సభ నుంచి ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని ఆ మధ్య వైసిపి ఎంపిలు ఆ మధ్య స్పీకర్ ఓమ్ బిర్లాను కలిస్తే, రాజధాని తరలించాలన్న ముఖ్యమంత్రి చర్యకు వ్యతిరేకంగా ఆయన రాష్ట్రపతి భవన్ వైపు నడిచారు. ఈ మధ్యలో ఆయన బిజెపికి మరింత దగ్గరయ్యేందుకు అయోధ్య రామాలయానికి ఆగస్టు 5 ప్రధాని మోదీ శంకుస్థాపనం చేస్తున్న సందర్భంగా   తన మూడు నెలల జీతాన్ని కూడా విరాళమివ్వాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ వ్యతిరేక పాలన నడుస్తూ ఉందని ఆయన రాష్ట్రపతిని కలిశాక విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ‘శాసనమండలిలో బిల్లు పాస్ కాలేదు. ఆ బిల్లు మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించారు. కానీ  మండలి సెక్రటరీ  సభ సిఫార్సును పక్కన పెట్టారు. ఇదెలా సాధ్యం? శాసనమండలి నిర్ణయాన్నే ఒక ఉద్యోగి అయిన సెక్రెటరీ  ఒప్పుకోకపోవడం ఎక్కడయినా ఉంటుందా?  వ్యవస్థకు ఇది మంచిదా,’ అని రఘరామ ప్రశ్నించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే… 
 ‘‘అమరావతినే రాజధానిగా కొనసాగించాలి. అమరావతిని పలిపాలనా రాజధానిగా ఉంచాల్సిందే. ప్రజలంతా అమరావతే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు.
నెల రోజుల తర్వాత రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్‌కు పంపించారు. గవర్నర్ కూడా అటార్నీ జనరల్‌తో చర్చించాకే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి.
అమరావతే రాజధానిగా ఉంటుందని తాడేపల్లిలో జగన్ గృహప్రవేశం చేసినప్పుడు ఎమ్మెల్యే రోజా అన్నారు. మరి ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారు.
‘మడమ తిప్పను,మాట తప్పను’ అని ఇప్పుడెందుకు మాట తప్పారు.    దొంగ కేసులు పెడితే ప్రజలు ప్రశ్నించాలి. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19ని ఉపయోగించుకోవాలి. అమరావతే మన రాజధాని.. అమరావతే కంటిన్యూ అయ్యేలా ప్రజలు వత్తిడి తీసుకురావాలి.
 ప్రస్తుతం అమరావతి రైతులకు అన్యాయం జరిగింది. రాత్రికి రాత్రి రాజధాని విశాఖ వెళ్లిపోయినా ఫర్వాలేదు. కానీ పోరాడి అమరావతే రాజధానిగా ఉండేలా కృషి చేద్దాం.
రాయలసీమ వాసులు విశాఖ వెళ్లాలంటే బ్రతులు తెల్లారిపోతాయి. కాబట్టి అమరావతినే రాజధానిగా కొనసాగించాలి.
గత ప్రభుత్వం అమరావతి కోసం చాలా నిధులు వెచ్చించింది. అయినా ఇప్పుడు విశాఖలో రాజధాని కట్టడానికి అంత డబ్బు ఎక్కడుంది?. దీన్ని కూడా ప్రజలు ప్రశ్నించాలి.
నాకు భద్రత కావాలి
రాజధాని అమరావతితో పాటు నా వ్యక్తిగత భద్రత కోసం కూడా రాష్ట్రపతితో చర్చించాను. నా మీద ప్రభుత్వానికి కోపం వచ్చింది.  మంత్రులు, ఎమ్మెల్యేలను నామీదకు  ఉసికోల్పుతున్నారు. వారి చేత కేసులు పెట్టించడమే కాదు  దిష్టి బొమ్మలు దగ్దం చేయిస్తున్నారు. దీన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లాను. .
నాకు షో నోటీసు ఇచ్చి ముప్పు తెచ్చుకున్నారు. రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తికే పార్టీ నోటీసు ఇస్తే.. ఇప్పుడు ఆ పార్టీయే రద్దయ్యే పరిస్థితి దాపురించింది. కనీసం ఆ ప్రమాదాన్ని కూడా గుర్తించకుండా నాకు షో నోటీసు ఇచ్చారు. అది చెల్లదు.
తెలుగు భాష గురించి పార్లమెంట్‌లో మాట్లాడితే తప్పెట్లా అవుతుంది. నా ప్రసంగంపై గతంలోనే వివరణ ఇచ్చాను. కానీ షోకాజ్ నోటీసులో మళ్లీ దాన్ని పొందుపరిచారు. టీటీడీ భూములు అమ్మాలనుకోవడమేమిటి? ఇసుక, ఇళ్ల పట్టాల అక్రమాలు.. ఇలా అన్నింటిని  గురించి ప్రశ్నించనందుకు నోటీసు ఇచ్చారు.
షోకాజ్ నోటీసుకు మాధానం చెప్పినా శాంతించకుండా మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసులు పెట్టించడం. దిష్టిబొమ్మలు తగలబెట్టించడం. వీటిన్నింటి గురించి రాష్ట్రపతికి వివరించాను. రాష్ట్ర ప్రభుత్వమే ఇవన్నీ చేస్తుందన్నట్టుగా అనిపిస్తోంది.
రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాష్ట్రపతికి బాగా తెలుసు.  నేనేమి  చెప్పాలనుకుంటున్నానో అదంతా  రాష్ట్రపతి దగ్గర ఉంది.  కోర్టు ఆర్డర్ గురించి కూడా రాష్ట్రపతి విచారించారు. ఆ విషయం లేఖలో నేను  ప్రస్తావించనే లేదు. రాష్ట్రపతే అడిగి మరి తెలుసుకున్నారు.  అంటే ఏమిటి? రాష్ట్రపతి దగ్గిర రాష్ట్రంలో ఏజరుగుతున్నదో సమాచారమంతా ఉంది.