ఆ విషయాలు తెలిసుంటే, సినిమా తీసేవాడిని కాదు: చార్లీ చాప్లిన్

(CS Saleem Basha)
రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యింది వారం కూడా కాలేదు. అప్పుడు చిత్రీకరణ మొదలు పెట్టిన ‘ది గ్రేట్ డిక్టేటర్’ (1940) సినిమా చార్లీ చాప్లిన్ జీవితంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా. వ్యంగ్య, హాస్య చిత్రాల కు పేరుపొందిన చార్లీ చాప్లిన్ తీసిన వ్యంగ్య, హాస్య చిత్రమిది.
ఎంత వ్యంగ్య చిత్రాలకు చిరునామా అయినప్పటికీ ఒక రాజకీయ వ్యంగ్య చిత్రం, అది హిట్లర్ లాంటి నియంత పై తీయాలనుకోవడం చిత్రమూ, సాహసమూ కూడాను. అంతవరకూ హిట్లర్ పై డాక్యుమెంటరీలు, న్యూస్ క్లిప్పింగ్స్ మాత్రమే ఉన్నాయి.సినిమా తీసేందుకు ఎవరూ సాహిసించని రోజులు. ది గ్రేట్ డిక్టేటర్ ప్రాజక్టు మొదలయ్యాక బెదిరింపులు వచ్చినా చాప్లిన్ ఖాతరు చేయలేదు.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధమేఘాలు క్రమేణా కమ్ముకుంటున్నవాతావరణంలో కూడా ప్రజలు నీరాజనం పట్టిన ఈ సినిమా చార్లీ చాప్లిన్ కు ఎంతో ప్రత్యేకమైనది. అంతవరకూ Tramp (దేశదిమ్మరి) పాత్రను సృష్టించి ఎన్నో హాస్య వ్యంగ్య, ప్రేమ చిత్రాలు తీసిన చాప్లిన్, మొదటిసారి ప్రపంచాన్ని పెట్టిన ఇబ్బంది పెట్టిన నియంత హిట్లర్ జీవితం ఆధారంగా తీసిన సినిమా ఇది. 1940 అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం కొన్నిచోట్ల అంతగా ప్రేక్షకాదరణ పొందకపోయినా, మిగతా చోట్ల ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు.
ఈ సినిమా గొప్ప సినిమాగా నిలబడిపోయింది . 1997 లో యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో “సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా లేదా సాంస్కృతికపరంగా ముఖ్యమైనది” గా పరిరక్షణ కోసం”గ్రేట్ డిక్టేటర్”ను లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఎంపిక చేసింది. ది గ్రేట్ డిక్టేటర్, 1941లో 5 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్ పొందడం కూడా విశేషం! ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు, విశేషాలు ఉన్నాయి.
ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఆర్మీ లో పనిచేసే ఒక బార్బర్ విమాన ప్రమాదంలో గాయపడిన కమాండర్ షుల్త్జ్ ను కాపాడుతాడు. షుల్జ్ తొమానియా అనే కల్పిత దేశపు డిక్టేటర్ అడినాయ్డ్ హైంకెల్ (హిట్లర్!) దగ్గర ముఖ్యమైన పదవిలో ఉంటాడు.
credits: creative commons
కానీ బార్బర్ ప్రమాదవశాత్తు తన జ్ఞాపక శక్తిని పోగొట్టుకొని ఒక మానసిక చికిత్స ఆలయంలో 20 ఏళ్ళపాటు ఉంటాడు. తర్వాత ఘెట్టొ (అంటే యూదులు ఎక్కువగా నివసించే ప్రాంతం) లో తన సెలూన్ కి వస్తాడు. దాన్ని నడిపే ప్రయత్నం చేస్తాడు. సెలూన్ పక్కనే ఒక ఇంట్లో ఉన్న హన్నా  ప్రేమలో పడతాడు. అ ఘెట్టో కమాండర్ షుల్త్జ్ ఆధీనంలో ఉంటుంది. బార్బర్ ను బంధించటానికి హిట్లర్ నాజీలు ఘెట్టో కి వస్తే, అక్కడకు వచ్చిన షుల్త్జ్ బార్బర్ ను గుర్తుపట్టి విడిపిస్తాడు.
ఈ లోగా ఘెట్టో లో ఉన్న ఒక బ్యాంకరు హిట్లర్ కు ఫండ్స్ ఇవ్వటానికి ఇష్టపడడు. దాంతో హిట్లర్ ఘెట్టో లో ఉన్న అందరిని తరిమేయమంటాడు. దీనికి కమాండర్ షుల్త్జ్ ఒప్పుకోడు. దాంతో హిట్లరు షుల్త్జ్ ను కాన్సన్ట్రేషన్ క్యాంపు పంపిస్తాడు. అక్కడినుంచి తప్పించుకున్న షుల్త్జ్ హన్నా కుటుంబ సభ్యుల లో ఒకరిని సూ సైడ్ బాంబ్ లాగా మారి హిట్లర్ ను చంపడానికి ప్లాన్ వేయమంటాడు. అయితే హన్నా అందుకు ఒప్పుకోదు. ఇంతలో హిట్లర్ సైనికులు వచ్చి బార్బర్ ను, షుల్త్జ్ ను అరెస్ట్ చేసి కాన్సంట్రేషన్ క్యాంప్ కు పంపిస్తారు. హన్నా కుటుంబం పక్కనే ఉన్న ఓస్తెర్లిచ్( ఆస్ట్రియా దేశమా!) అనే దేశానికి వెళ్ళిపోతుంది.
హిట్లర్ కు ఓస్తెర్లిచ్ దేశం పై ఎవరు దాడి చేయ్యాలన్న విషయం లో బ్యాక్టీరియా దేశానికి చెందిన డిక్టేటర్ “నెపోలోని”( బహుశా ముస్సొలిని ని గుర్తుచేసే పాత్ర కావచ్చు) తో వివాదం తలెత్తుతుంది. చివరకు ఓ విందులో వారు దాన్ని పరిష్కరించుకుంటారు. నెపోలోని ఓస్తెర్లిచ్ దేశాన్ని ఆక్రమించుకుంటాడు. కాకతాళీయంగా వేటకు వెళ్ళిన హిట్లర్ ను బార్బర్ గా. పొరపడి నాజీలు అరెస్ట్ చేస్తారు. అంతలో కమాండర్ షుల్త్జ్, బార్బర్ లు క్యాంపునుండి తప్పించుకుని హిట్లర్ మాట్లాడవలసిన మీటింగ్ కు దగ్గరికి వెళ్తారు. విజయాన్ని పురస్కరించుకుని. ఓస్తెర్లిచ్ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల్లొ హిట్లర్ బదులుగా బార్బర్ ను ప్రసంగించమని కమాండర్ షుల్త్జ్ అభ్యర్థిస్తాడు. బార్బర్ హిట్లర్ బదులుగా వేదికనెక్కి ప్రసంగిస్తాడు. చివర్లో హన్నా కు మెసేజ్ ఇస్తాడు . దాంతో సినిమా అయిపోతుంది
ఈ సినిమాలో నటించిన( దర్శకుడు కూడా) చాప్లిన్ ఒక బార్బర్ (మంగలి) పాత్రలో, మరో పాత్రలో డిక్టేటర్ హిట్లర్ గా కూడా కనిపిస్తాడు. సినిమా మొత్తం అద్భుతమైన నటన ప్రదర్శించిన చాప్లిన్ కొన్నిచోట్ల ప్రేక్షకులను నటనతో ప్రేక్షకులను సినిమాలో సమ్మోహనం చేస్తాడు, మరికొన్ని చోట్ల మంత్రముగ్ధుల్ని చేస్తాడు. అతనితో పాటు నటించిన ( అతని సతీమణి) పాలెటొ గోడ్డార్ద్ అమాయకత్వం, అందం పాటు అన్యాయం అంటే సహించని ” హన్నా” పాత్రలో చాప్లిన్ కి దీటుగా నటించింది. వాళ్లిద్దరి మధ్య నడిచే సన్నివేశాలు చాలా ఉన్నత స్థాయిలో చిత్రీకరించబడ్డాయి. ముఖ్యంగా చాప్లిన్ తన సెలూన్లో ఆమెకు మేకప్ చేసే సన్నివేశంలో, మేకప్ పూర్తయిన తర్వాత ఆమె అద్దంలో చూసుకుంటూ సంభ్రమాశ్చర్యాలతో “..నేనేనా” అని చెప్పే సన్నివేశంలో ఆమె నటన చాలా గొప్పగా ఉంది. మరో సన్నివేశంలో ఇద్దరూ, ఇంటి పై కప్పు పై దాపెట్టుకుని ఉన్న సందర్భంలో చాప్లిన్ కు ఉత్సాహాన్ని కలిగిస్తూ, జీవితం గురించి., భవిష్యత్తు గురించి చెప్పే సన్నివేశంలో కూడా ఆమె నటన తారాస్థాయిలో ఉంది. సినిమా ముగింపులో రేడియోలో చాప్లిన్(మంగలి పాత్ర) చెప్పిన మాటలు వింటూ ఆమె చూపిన నటన మర్చిపోలేము!
ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు దర్శకత్వ ప్రతిభకు, సృజనాత్మకతకు, సెన్స్ ఆఫ్ టైమింగ్ కు, అద్భుత నటన కి తార్కాణాలుగా నిలుస్తాయి: ముఖ్యంగా హిట్లర్ అనుచరుడు “నువ్వు ప్రపంచ విజేత అవుతావు, ప్రపంచం నీ గుప్పిట్లో ఉంటుంది” అన్నప్పుడు బెలూన్ గ్లోబుని తీసుకొని ఎగరేస్తూ హిట్లర్ ఆడుకునే సన్నివేశం, హిట్లర్ ని చంపడానికి  ఎవరో ఒకరు సూసైడ్ బాంబర్ కావాలని షుల్త్జ్ చెప్పే సన్నివేశం. అదేంటంటే ఆరు మందికి తలా ఒక కేక్ ఇస్తారు. ఏదో ఒక కేక్ లో ఒక కాయిన్ ఉంటుంది. కాయిన్ ఎవరికైతే వస్తుందో వాళ్లు త్యాగం చేయాలి. అప్పుడు ఆరు మంది కాయిన్ నాకు వస్తుందేమో భయపడుతూ కేక్ తినడం, అవతలి వాళ్ళ ప్లేట్లోకి, కొంత భాగం కేక్ వేయడం… ఆ సందర్భంలో చాప్లిన్ నటన చూసి తీరాలి. అలాంటిదే  బార్బర్ షాప్ ని నాజీలు కాల్చినప్పుడు బార్బర్, హన్నా మధ్య జరిగే సంభాషణ.
ఇలా చెప్తూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే ఈ సినిమా ముగింపు పై కొంత విమర్ష వచ్చింది. చివర్లో చాప్లిన్ స్పీచ్ చాలమందికి నచ్చలేదు. దేశ దిమ్మరి పాత్రలో అలరించిన చాప్లిన్, సినిమా అసాంతం వ్యంగ్యంగా,సరదాగా తీసి, చివర్లో సీరియస్ గా మారటం చాల మంది జీర్ణించుకోలేక పోయారు. అయినా సినిమా విజయానికి అది పెద్ద అడ్డంకి కాలేదు.
ఈ సినిమాలో ఫోటోగ్రఫీ, చిత్రీకరణ, డైలాగులు ఒక స్థాయిలో ఉంటాయి. హిట్లరు హావభావాలూ, డైలాగ్ డెలివరీ ఒడిసి పట్టిన చాప్లిన్, మరిచిపోలేని నటన ప్రదర్శించాడు. దీనికి కారణంలెనీ రీఫెన్ ష్టా (Leni Riefenstahl) అనే మహిళా దర్శకురాలు తీసిన “ట్రయంఫ్ ఆఫ్ ది విల్” అనే సినిమా! ఈమె జర్మనీకి చెందిన మహిళ. పైగా నాజీ ఇజం సానుభూతిపరు రాలు. హిట్లర్ కు సన్నిహితురాలు. ఈమె నాజీ ప్రచారకర్త. ( 101 సంవత్సరాల వయసులో 2003 లో చనిపోయింది) హిట్లర్ అభ్యర్థనపై తీసిన సినిమా అది. ఇది అత్యంత గొప్ప ప్రచార చిత్రంగా పేరు పొందింది.
ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇప్పటికీ ఆ సినిమా చాలామంది దర్శకులకి స్ఫూర్తి. ఆ సినిమాను అనేక సార్లు చూసిన చాప్లిన్, హిట్లర్ ప్రతి కదలికను గమనించాడు. జాగ్రత్తగా పరిశీలించాడు. అందుకే హిట్లర్ గా సినిమాలో తిరుగులేని నటనను ప్రదర్శించాడు.
అంతవరకు మూకీ సినిమాలే తీసిన చాప్లిన్ ఈ సారి ఒక టాకీ సినిమా తీయటం విశేషం. ఈ సినిమా చాల చోట్ల నిషేధించారు. ఇంగ్లాండ్ లో ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే దీన్ని నిషేధిస్తామని ప్రభుత్వం చెప్పినట్లు కూడా తెలుస్తోంది. పైగా అప్పటివరకు ఇంకా నాజీల దుర్మార్గాలు వెలుగులోకి రాలేదు.
అమెరికా లో కూడా ఈ సినిమా పట్ల వ్యతిరేకత ఉండింది. చాలా యూరోప్ దేశాలు, లాటిన్ అమెరికా దేశాలు కూడా దీన్ని నిషేధించాయి. యుద్ధ సమయంలో ఈ సినిమా ఇంగ్లాండ్ లో చాలా మంది చూశారు. ఈ సినిమా ఫ్రాన్స్ లో 1945 లో విడుదలయ్యి, ఆ సంవత్సరపు ఉత్తమ చిత్రంగా నిలిచింది.
ఈ సినిమా హిట్లర్ చూశాడన్న దాని పై భిన్నభిప్రాయాలు ఉన్నాయి. హిట్లర్ ఈ సినిమా చూశాడని జర్మనీ నుండి వచ్చిన ఒక నాజి రెఫ్యూజీ చాప్లిన్ తో చెప్పినట్లు చాప్లిన్ జీవిత చరిత్ర రాసిన జెఫ్రీ వాన్స్ చెప్పాడు.
“హిట్లర్ ఈ సినిమా చూసి ఉంటే, దాని గురించి ఆయన ఏమనుకున్నాడో తెలుసుకోవటానికి నా సర్వసం ఇస్తాను” అని చాప్లిన్ చెప్పటం విశేషం!
అయితే, ‘నాజీ మారణకాాండ తెలిసి ఉంటే ‘ది గ్రేట్ డిక్టేటర్ ’ చిత్రం తీసిఉండేవాడినికాదు, నాజీల ఉన్మాాద రక్తపిపాస ఎగతాళి చేసేవాడిని కాదు, అని తన జీవిత చరిత్ర (1964 P.392)లో చాప్లిన్ అంగీకరించారు.

“Had I known the actual horrors of the German concentration camps, I could not have made ‘The Great Dictator’; I could not have made fun of the homicidal insanity of the Nazis.”

Saleem Basha CS

(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)