జూనియర్ పంచాయతీ కార్యదర్శులను మనుషుల్లా చూడండి: కాంగ్రెస్ వంశీరెడ్డి

రాష్ట్రంలో అందరు ఉద్యోగుల్లానే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 2018లో నియమించబడ్డ 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శులను మనుషుల్లా చూడాలని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ల పట్ల అనుసరిస్తున్న వైఖరి అమానుషమే కాదు, మానవహక్కుల ఉల్లంఘన కూడా అవుతుందని చెబుతూ మోయేలేనం త పని భారం మోపి, సరైన వేతనం ఇవ్వకుండా, ఇస్తున్న తక్కువ వేతనాన్ని సకాలంలో చేెల్లించకంపోవడం కనీస మానవహక్కుల ఉల్లంఘన  అవుతుందని ఆయన ‘ట్రెండింగ్ తెలుగు న్యూస్’ తో మాట్లాడుతూ చెప్పారు.
‘ప్రతీ గ్రామంలో దాదాపు 50 రకాల విధులు నిర్వహిస్తూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు పనిచేస్తూ తీవ్రమైన పని ఒత్తిడికి పంచాయతీ కార్యదర్శులు లోనవుతున్నారు. అరకొర జీతంతో బండెడు చాకిరి చేయించడం వల్ల మానసికంగా కృంగిపోతున్నారు.  ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. దానికి తోడు ప్రభుత్వం తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్ల పని భారం కూడా వీరి పైనే ప్రభుత్వం మోపింది,’ వంశీ విమర్శించారు.
గ్రామ పంచాయతీ పరిపాలన, సంక్షేమాభివృద్ధి, గ్రామ సమన్వయం, సామాజిక సంక్షేమం, పల్లె ప్రగతి ప్రణాళిక అమలు, మరుగు దొడ్ల నిర్మాణం, జనన, మరణాలు,వివాహాల నమోదు, త్రాగునీటి సరఫరా, మొక్కల పరిరక్షణ, గ్రామ రాబడులు, ఆర్థిక వ్యవహారాలతోపాటు ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లు చేసే పని కూడా పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్నారని అన్నారు.
రూ. 32 వేల పే స్కేల్ తో పనిచేసే 4వ గ్రేడ్ పంచాయతీ కార్యదర్శుల పనితో పాటు రూ.10 వేల జీతం పొందే ఫీల్డ్ అసిస్టెంట్ల పనికుడా చేస్తూ, కేవలం రూ.15 వేల కన్సాలిడేటెడ్ పే పొందుతున్నారని ఇది చాలా దారుణమని వంశీ అన్నారు. సమాన పనికి సమాన వేతనం అని చెప్పే ముఖ్యమంత్రికి ఇది భావ్యంకాదని అని ఎందుకు అనిపించడం లేదు అని ప్రశ్నిస్తూ, ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేస్తున్న శ్రమ దోపిడి అని మండిపడ్డారు.
ఈ చాలీ చాలని జీతంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంటే, వొచ్చే అరకొర జీతం కూడా 3-4 నెలలకొకసారి ఇవ్వడం భావ్యం కాదని, ఇలాంటి చర్యలవల్ల ఇది ఉద్యోగస్తుల వ్యతిరేక ప్రభుత్వమని నిరూపితమైతుందని అన్నారు.
తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లతో చర్చలు జరిపి వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పని భారం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్న పంచాయతీ కార్యదర్శుల పని వేళలను లేబర్ చట్టాల ప్రకారం 8 గంటలకు కుదించాలని కోరారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పనికి తగ్గ వేతనం అందించాలని, వారికి వొచ్చే జీతం, ప్రతీ నెల ప్రభుత్వ ట్రెజరీ నుంచి అందించాలని డిమాండ్ చేశారు.