న్యూఢిల్లీ: వైయస్ఆర్సిపి ఎంపీగా ఉంటూ రఘురామకృష్ణంరాజు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరుతో ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్ కు పిటీషన్ ఇచ్చినట్లు వైయస్ఆర్సిపి పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి. విజయసాయిరెడ్డి తెలిపారు.
లోక్‌సభ స్పీకర్ ను కలిసిన తరువాత ఆయన లోక్ సభ సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చీఫ్‌విప్ మార్గాని భరత్, ఎంపీలు నందిగం సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలసి విలేకరులతో మాట్లాడారు.
రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలి, ఆయన చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని యాంటీ డిఫెక్షన్ లా ప్రోవిజన్స్ ప్రకారం చర్య తీసుకోవాలి కోరామని తెలిపారు. అలాగే వాలంటరీ గివింగ్‌అప్ ఆఫ్ మెంబర్‌షిప్‌ను ఆయనకు వర్తింప చేయాలని విజ్ఞప్తి చేశామని వెల్లడించారు.
తాము అందచేసిన పిటీషన్ ను స్వీకరించిన స్పీకర్ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
ఏ పార్టీ టిక్కెట్టుపై, ఏ పార్టీ మేనిఫెస్టోకు కట్టుబడి, ఏ పార్టీ గుర్తుతో గెలిచారో అదే పార్టీకి వ్యతిరేకంగా ఆయన పనిచేయడం దారుణమని అన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం, పార్టీ అధ్యక్షుడిని ఇబ్బంది పెట్టేలా మాట్లాడటం, చివరికి సంస్కారవంతం కాని భాషలో ఆయన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు పార్టీ వ్యతిరేకమైనవిగా తీవ్రంగా భావిస్తున్నామని ఆయన అన్నారు.
రఘురామ కృష్ణంరాజు స్వపక్షంలో విపక్షంగా మారిపోయారని విమర్శించారు. వైయస్ఆర్సిపిలో వుంటూనే ఇతర పార్టీలతో మంతనాలు చేస్తూ, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని, ఇంతకన్నా ఆయనపై అనర్హత వేటు వేసేందుకు కారణాలు ఏమిటని ప్రశ్నించారు.
పదో షెడ్యూల్ ప్రకారం వాలంటరీ గివింగ్ఆప్ ఆఫ్ మెంబర్షిప్ ఆయనకు వర్తిస్తుందని అన్నారు. రఘురామకృష్ణంరాజు పార్టీలో వుంటూ చాలా అసహ్యకరమైన పరిస్థితిని, నైతిక విలువలు కోల్పోయి పార్టీపై వ్యతిరేకతతో, క్రమశిక్షణ లేకుండా, సొంతపార్టీలో వున్న వారినే దూషించడం అత్యంత దారుణమని అన్నారు. ఆయన కొన్ని ఊహాజనిత విషయాలను ఊహించుకుని, ప్రజల్లో తప్పుడు సంకేతాలన పంపే ప్రయత్నం చేశారని అన్నారు.
పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీస్‌ను సవాల్ చేస్తూ రఘురామకృష్ణంరాజు కోర్ట్‌ను ఆశ్రయించారని విలేరులు అడిగిన ప్రశ్నపై స్పందించారు. పార్టీ నుంచి ఇచ్చింది షోకాజ్ నోటీస్ మాత్రమేనని, దానిపైనే ఆయన కోర్ట్‌కు వెళ్లారని అన్నారు. ఇప్పుడు స్పీకర్‌కు ఇచ్చింది అనర్హతవేటు పిటీషన్ అని, దీనిపై నిర్ణయం పూర్తిగా స్పీకర్‌కే వుంటుందని అన్నారు. స్పీకర్ తీసుకునే నిర్ణయం రాజ్యాంగబద్దంగా వున్నదా లేదా అనే అంశాలను కోర్ట్లు పరిశీలిస్తాయని తెలిపారు. అంతేకాకుండా పదో షెడ్యూల్ ప్రకారం వాలంటరీ గివింగ్‌అప్ ఆఫ్ మెంబర్షిప్ కింద కూడా రఘురామకృష్ణంరాజుపై చర్య తీసుకోవాల్సి వుంటుందని స్పష్టం చేశారు.రాజ్యసభలో అనర్హత వేటుపై మూడు నెలల్లో చర్య తీసుకోవాలని చైర్మన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం లోక్‌సభ స్పీకర్ కూడా తాము ఇచ్చిన పిటీషన్ పై మూడునెలల్లో చర్యలు తీసుకుంటారనే విశ్వాసం వ్యక్తం చేశారు.
లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ... రఘురామకృష్ణంరాజు మొదటిసారి సభ్యుడు అయినప్పటికీ సీఎం వైయస్ జగన్ గారు ఆయనకు మంచి ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. సీనియర్ ఎంపీలు వున్నప్పటికీ ఆయన కోరిన వెంటనే పార్లమెంట్ కమిటీల్లో చైర్మన్ పదవికి అంగీకారం తెలిపారని అన్నారు. సీఎంగారు ఆయనకు ఏ విషయంలోనూ తక్కువ చేయలేదని అన్నారు. కానీ టిడిపి హయాంలో జరిగిన టిటిడి నిర్ణయాన్ని ఇప్పుడు వివాదం చేస్తూ, ఈ ప్రభుత్వంపై బుదరచల్లే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. నిజంగా ఎంపీగా ఆయనకు అభ్యంతరాలు వుంటే టిటిడి చైర్మన్, అధికారులతో ఏనాడు దీనిపై ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. బిజెపి, టిడిపి కలిసి వున్నప్పుడు తీసుకున్న నిర్ణయాలను, ఆ సమయంలో ఆ పార్టీలతో వున్న రఘురామకృష్ణంరాజు ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. పైకి జగన్ గారు మంచివారు అంటూనే, పార్టీని నష్టపరిచేలా, అందరినీ దూషించేలా బహిరంగంగా ఎలా మాట్లాడతారని అన్నారు. ఆయనకు పార్లమెంట్ లోనూ, బయట కూడా మంచి గౌరవం ఇచ్చామని, కానీ దానిని కాపాడుకోలేక పోయారని అన్నారు.
టిడిపి నాయకుల ప్రోత్సాహంతో, టిడిపి నుంచి బిజెపికి స్వలాభం కోసం వలస వెళ్ళిన నాయకుల ప్రోద్భలంతో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు : మిధున్ రెడ్డి