తమ్మినేనికి స్పీకర్ గా కొనసాగే హక్కులేదు: ముగ్గురు టిడిపి ఎమ్మెల్సీలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ పదవిలో  ఉంటూ  శాసన మండలి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, వ్యాఖ్యానించడం హోదాకు తగని పని, ఆయన స్పీకర్ పదవికి యోగ్యుడు కాదని ముగ్గురు టిడిపి ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర యాదవ్,గౌరివాని శ్రీనివాసులు,బిటి నాయుడు ఒక ప్రకటన విడదుల చేశారు. ప్రకటన ఇదే:
“రాజ్యాంగ బద్ధ పదవిలో ఉంటూ రాజకీయాలు మాట్లాడుతున్న తమ్మినేని సీతారాం స్పీకర్ గా కొనసాగే అర్హత లేదు. రాజకీయాలే ముఖ్యం అని భావిస్తే స్పీకర్ పదవికి రాజీనామా చేసి మాట్లాడుకోవాలి. స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పార్టీకి రాజీనామా చేసిన వ్యక్తులను చూసిన ఈ ప్రజాస్వామ్య దేశంలో.. స్పీకర్ గా ఉండి రాజకీయాలు మాట్లాడిన వ్యక్తిని చూస్తామని అనుకోలేదు. శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకుండా మంత్రులే అడ్డుకున్నారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తర్వాత ఇతర బిల్లులు పెట్టమని టిడిపి సభ్యులు కోరితే అమరావతి, మూడు రాజధానులు బిల్లులపై పట్టుపట్టారు. ఇదంతా తెలిసి కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం శాసన మండలిలో సభ్యుల కారణంగానే ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేదని వ్యాఖ్యానించడం దుర్మార్గం. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వ్యక్తి ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యంలో చట్ట సభలు, సభ్యులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేస్తూ రాజ్యాంగ విలువలను కాపాడాలని తమ్మినేని గుర్తుంచుకోవాలి.”