విజయవాడ: 108, 104 వాహనాలను ఏపి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. బెంజ్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జెండా ఊపి అంబులెన్స్‌లను ప్రారంభించారు. రూ.201 కోట్లతో 1088 కొత్త వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.
కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్సులలో 282 బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్ఎస్)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్ లైఫ్ సపోర్టు (ఏఎల్ఎస్)తో తీర్చి దిద్దారు. మరో 26 అంబులెన్సులను చిన్నారులకు (నియో నేటల్) వైద్య సేవలందించేలా తయారు చేశారు.
ఏయే సదుపాయాలు?
బీఎల్ఎస్ అంబులెన్సులలో స్పైన్ బోర్డు, స్కూప్ స్ట్రెచర్, వీల్ ఛైర్, బ్యాగ్ మస్క్, మల్టీ పారా మానిటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయగా, ఏఎల్ఎస్ అంబులెన్సులలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. ఇక నియో నేటల్ అంబులెన్సులలో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను కూడా అమర్చారు.
ఎంత వేగంగా సేవలు?:
పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో అయితే 25 నిమిషాల్లో అంబులెన్సులు చేరే విధంగా ఆ స్థాయిలో సర్వీసులు ప్రారంభిస్తున్నారు.
ఎలా సాధ్యం?: ప్రతి అంబులెన్సును ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్సీ)తో అనుసంధానం చేయడం ద్వారా, ఫోన్ చేసిన వారిని వేగంగా ట్రాక్ చేసే వీలు కలుగుతుంది. అదే విధంగా ప్రతి అంబులెన్సులో ఒక కెమెరా, ఒక మొబైల్ డేటా టెర్మినల్ (ఎండీటీ), మొబైల్ ఫోన్‌తో పాటు, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్‌టీ) బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ఇందులో కొోవిడ్ రోగులకు ప్రత్యేక ఏర్పాట్లున్నాయి ఇదిగో వీడియో చూడండి
ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఆరోగ్య శ్రీ అధికారులు పాల్గొన్నారు. వాహనాలను సీఎం ప్రారంభించాక.. కొత్త వాహనాలు జగన్ ముందు ప్రదర్శనగా సాగాయి.
ఈ సందర్భంగా 108 సిబ్బంది జీతాలు పెంచుతూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. డ్రైవర్లకు సర్వీసుకు అనుగుణంగా 18 నుంచి 28 వేల వరకు పెరగ నుంది. టెక్నీషన్స్ కు 20 నుంచి 30 వేల వరకు పెరిగే అవకాశం ఉంది.