మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం కరోనా టెస్టుల ప్రాముఖ్యం గుర్తించి ఇక పెద్ద మొత్తంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. దేశంలో అతి తక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రం తెలంగాణాయే. ఇలా టెస్టులే చేయకపోత, కరోనావైరస్ ను ఎలా కంట్రోల్ చేస్తారని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెన్నెళ్ల కిందటే లేఖ రాశారు. తెలంగాణప్రభుత్వం దీన్ని పెద్ద గా పట్టించుకోనేలేదు. ఈ లేఖ అనేక అసక్తి కరమయిన అంశాలను వెల్లడించింది. తెలంగాణలో కోవిడ్ -19 పరీక్షలునిర్వహించేందుకు పదికి పైగా ప్రయివేటు ల్యాబొరేటరీలను గుర్తించారు. అయితే,తెలంగాణ ప్రభుత్వం ఒక్క లేటరేటరీని కూాడా వాడుకోలేదు.
ఇంత తక్కుగా కరోనా పరీక్షలు జరపడం పట్ల తెలంగాణ హైకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆసుపత్రులలో మృతి చెందిన వారి మీద కరోనాపరీక్షలు జరిపాల్సిన అవసరం లేదని తెలంగాణప్రభుత్వం డాక్టర్లను ఆదేశించడం పట్ల తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది కుదరదు మృతి చెందిన వారి మీద పరీక్షలు జరిపితీరాల్సిందే నని హైకోర్టు ఆదేశించింది.
ఇపుడు తెలంగాణ ప్రభుత్వం కళ్లు తెరిచే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో ఇపుడు విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. గతంలో కొన్ని జిల్లాలో కరోనా వైరస్ కనిపించనే లేదు. ఇపుడు కరోనా కేసులు లేని జిల్లా తెలంగాణలో లేనే లేదు. దానికి తోడు జిహెచ్ ఎంసి ప్రాంతం కరోనా హాట్ స్పాట్ అయిపోయింది. చివరకు టెన్త్ క్లాస్ పరీక్షలను రద్దు చేయించేందుకు కారణమయింది. కరోనా ప్రజా ప్రతినిధుల్లోకి కూాడా దూరింది. ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా పాజిటివ్ అని తేలిసింది. కరోనా మృతులు కూడా బాగా పెరుగుతున్నారు. ఒకపుడు తెలంగాణ చక్కగా కరోనాను కంట్రోలు చేసిందని, లేకపోతే, కరోనా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లాగా తెలంగాణ తనకలాడాల్సి వచ్చిందని ఆరోగ్యమంత్రి ఈటెల రాజేందర్ బహిరంగంగా ప్రకటించారు. ఆంధ్ర వాళ్లు అసంతృప్తి కూడా వ్యక్తం చేసే దాకా ఇది వెళ్లింది. ఇపుడేమయింది. ఆదివారం నాడు ముఖ్యమంత్రి కెసిఆర్ అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు.
హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
రాబోయే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి ముందు జాగ్రత్త చర్యగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలుజారీ చేశారు.
ప్రైవేటు ల్యాబరేటరీలు, ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ నిబంధలను అనుసరించి వ్యాధి నిర్ధారక పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలు, ధరలు నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు.
కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, సీనియర్ వైద్యాధికారులు, వైద్య నిపుణులు సమావేశంలో పాల్గొన్నారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని అధికారులు వివరించారు. మరణాల రేటు తక్కువగానూ, కోలుకుంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగానూ నమోదవుతున్నదని వారు చెప్పారు. ః
అయితే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలున్నాయని వెల్లడించారు. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న ఇతర నాలుగు జిల్లాలపై మరింత ఎక్కువ దృష్టి పెట్టాలని, ఈ ఐదు జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు.
‘‘ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఎక్కువ జనాభా కలిగిన నగరం. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ ప్రజల ఆరోగ్యం, నగర ప్రగతి, నగర పేరు ప్రఖ్యాతులు సుస్థిరంగా ఉండేట్లు చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ, హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజూ ఎన్నోకొన్ని పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీన్ని పూర్తిస్థాయిలో నివారించాల్సిన అవసరం ఉంది. వచ్చే వారం, పదిరోజుల్లో వైరస్ వ్యాప్తి జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లోని ఉప్పల్, ఎల్.బి.నగర్,మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేర్ లింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూర్, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, మలక్ పేట్, అంబర్ పేట్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, నాంపల్లి, కార్వాన్, గోషా మహల్, చార్మినార్, చాంద్రాయణ గుట్ట, యాకుత్ పుర, బహదూర్ పుర, సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 50 వేల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రులనే కాకుండా, ప్రైవేటు లాబరేటరీలు, ఆస్పత్రులను కూడా వినియోగించుకోవాలి. ప్రైవేటు హాస్పిటళ్లలో జరిపే పరీక్షలు, చికిత్సకు అవసరమైన మార్గదర్శకాలను, ధరలను అధికారులు నిర్ణయించాలి. పాజిటివ్ గా తేలినప్పటికీ వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేనివారికి ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలి (హోం ట్రీట్ మెంట్) ’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు.
‘‘హైదరాబాద్ ను కాపాడుకోవాలనే ముందు చూపుతో మాత్రమే 50 వేల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు ఇంట్లోనే ఉండాలి. ఇతర తీవ్ర జబ్బులు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం. రాష్ట్రంలో ఎంతమందికి పాజిటివ్ వచ్చినప్పటికీ అందరికీ చికిత్స అందించడానికి ప్రభుత్వం సర్వ సిద్ధంగా ఉంది. టెస్టు కిట్లు, పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు ఇలా ప్రతి విషయంలోనూ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతోపాటు, వైరస్ సోకినవారికి అవసరమైన చికిత్స అందించే విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో, అప్రమత్తతతో ఉంది’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.