ఆంధ్రలో రాజధాని మీద ఏకాభిప్రాయం ఎపుడూ రాదు,ఎందుకంటే…

(సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోసీ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ)
వైకాపా, టిడిపి రెండు పార్టీలూ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రత్యేక హోదా మరియు విభజన హామీల అమలుకై రాష్ట్ర ప్రజల్లోని ఫెడరల్ ఆకాంక్షలను ప్రేరేపించడంలో పరస్పరం పోటీ పడ్డాయి. ఎన్నికల తర్వాత వాటికి పాతర వేసాయి. మోడీ-షా ప్రభుత్వం గత 7 నెలల్లో తన ఫాసిస్టు పంథాలో మొన్న పాతిక చట్టాల ఆమోదంతో, నిన్న ఆర్టికల్ 370 రద్దుతో, నేడు ఎస్ఆర్ సి, సిఎఎ లతో దేశ ప్రజలపై, రాజ్యాంగంపై త్రిముఖ దాడికి దిగింది.
వైకాపా, టిడిపిలు మొన్న కట్టడాల కూల్చివేతపై, నిన్న భాషా సమస్యపై, నేడు రాజధానిపై రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్ళించాయి. ఒక వైపు రాజ్యాంగంపై, అందులోని ఫెడరలిజం, లౌకికవాదం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యాలపై ఢిల్లీ కేంద్రంగా ఫాసిస్టు దాడుల పరంపర సాగుతున్నది. మరోవైపు అదేకాలంలో అప్రధాన సమస్యలపై అమరావతి కేంద్రంగా రెండు పార్టీలు రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతున్నాయి.
ముఖ్యంగా దేశవ్యాపిత ఫాసిస్టు వ్యతిరేక ప్రజా ప్రతిఘటనకు ఢిల్లీ విద్యార్థిలోకం నాంది పలికిన 48 గంటల్లోనే జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేయడం గమనార్హం. ఈ రెండు పార్టీలను సి.బి.ఐ, ఈ.డి వంటి కొరడాలతో నియంత్రిస్తున్న ఫాసిస్టు శక్తులే తమ రాజకీయ వ్యూహం ప్రకారం దేశ ప్రజల వెల్లువ నుండి మన రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్ళిస్తున్నాయి. తద్వారా కేరళ, కర్నాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల్లో వెల్లువెత్తుతున్న ఫాసిస్టు వ్యతిరేక ప్రజా వెల్లువను మన రాష్ట్రంలోకి విస్తరించకుండా ఆపగలిగాయి.
రాజధాని సమస్యపై మా పార్టీ నిర్దిష్ట వైఖరిని రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకు కీలకమైన ఈ రాజకీయ పూర్వరంగ ప్రమాదకర పరిస్థితి గూర్చి ప్రజలనూ, ప్రజాస్వామిక సమాజాన్నీ హెచ్చరించడం చారిత్రక కర్తవ్యంగా భావిస్తున్నాం.

ఇది కూడా చదవండి

*కర్నూల్ వరద ముప్పు ప్రాంతం అనడం చంద్రబాబు దుర్మార్గం : మాకిరెడ్డి

మన రాష్ట్రంలో స్వంత బలంతో ఒక్క శాసనసభా స్థానాన్ని కూడా బిజెపి గెలవలేదు. అయినా ఫాసిస్టు రాజకీయ ప్రయోగశాలగా మన రాష్ట్రం మారుతున్నది. బిజెపి ప్రభుత్వాలు పాలిస్తున్న రాష్ట్రాలలో సైతం ప్రతిపక్షాలు పరిమితంగానైనా హిందుత్వ ఫాసిస్టు ఎజెండాను రాజకీయంగా వ్యతిరేకిస్తున్నాయి. కేరళలో అధికార, ప్రతిపక్ష కూటములు ఉమ్మడిగా వ్యతిరేకిస్తున్నాయి. చివరకు హిందుత్వ పార్టీ శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం సైతం వ్యతిరేకిస్తున్నది. కానీ బిజెపికి స్వంత పునాదిలేని ఏపిలో వైకాపా, టిడిపిల విద్రోహకర పాత్ర వల్ల వేగంగా ఫాసిస్టు రాజకీయ పరివర్తనకి ఒక ప్రయోగశాలగా మన రాష్ట్రం మారడం గమనార్హం!

ఇది ఐదు కోట్ల మంది రాష్ట్ర జనాభాను ” శాంతియుతంగా, వేగంగా, విస్తృతంగా, వ్యవస్థీకృతంగా ఫాసిస్టు రాజకీయ కొలిమి ‘ లోకి ఈడ్చుతున్న శీతల కుట్ర! ఈ విధంగా తడిగుడ్డతో రాష్ట్ర ప్రజల గొంతులు కోస్తున్న వైకాపా, టిడిపి తోడు దొంగల కుట్ర గూర్చి మా పార్టీ హెచ్చరిస్తున్నది. ఢిల్లీలో పై రెండు పార్టీల మధ్య వ్యూహాత్మక రాజకీయ ‘ముద్దులాట’ క్రీడను వ్యతిరేకిస్తూనే, అమరావతిలో నాటకీయ ‘కుమ్ములాట’ పై మా పార్టీ నిర్దిష్ట వైఖరిని వెల్లడిస్తున్నది. ఇంటిని కలిసికట్టుగా కూల్చే వాటి రహస్య జూదగొండి రాజనీతిని వ్యతిరేకిస్తూనే, పందరి చుట్టూ బహిరంగంగా సాగించే పెనుగులాటపై మా పార్టీ వైఖరిని ప్రకటిస్తున్నాం.

 

మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర,, సీమాంధ్ర ప్రాంతాల మధ్య గరిష్ట స్థాయిలో సమతుల్యత ద్వారానే దీర్ఘకాల దృష్ట్యా రాష్ట్ర సమైక్యత, ముఖ్యంగా రాష్ట్ర ప్రజల మధ్య ‘ వర్గ ఐక్యత ‘ లను పరిరక్షించగలమని మా సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోసీ రాష్ట్ర కమిటీ భావిస్తున్నది. ఇదే వైఖరిని మా పార్టీ 2014 ఎన్నికల ప్రణాళికలో స్పష్టం చేసింది. అమరావతి రాజధాని నిర్మాణ పద్దతిని వ్యతిరేకిస్తూ కరపత్రంతో 2014లోనే విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టింది. (ఆ కరపత్రం పంపిణీ సందర్భంగా మా పార్టీ రాష్ట్ర బృందంపై అమరావతిలో భౌతిక దాడి జరిగిన విషయాన్ని గుర్తుచేస్తున్నాం)
పైన పేర్కొన్న విభిన్న భౌగోళిక ప్రాంతాల మధ్య సమతుల్యత సాధనకై అభివృద్ధితో పాటు పరిపాలనలో కూడా పూర్తి వికేంద్రీకరణ జరగాలనే వైఖరిని మా పార్టీ చేపట్టింది. ఇప్పుడు తిరిగి మా గత వైఖరిని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాం.
ఉమ్మడి ఏపి రాష్ట్ర విభజనకి ఒక ముఖ్య కారణం హైదరాబాదు కేంద్రంగా అభివృద్ధి మరియు అధికార (పరిపాలన) కేంద్రీకరణే! గత చరిత్ర నుంచి గుణపాఠాం తీసుకోకపోతే మున్ముందు నవ్యాంధ్రప్రదేశ్ సమైక్యతకు కూడా గ్యారంటీ లేదు. రాష్ట్ర విభజన సందర్భంగా అదో సార్వత్రిక గుణపాఠంగా రాజకీయ సమాజం స్వీకరించింది. దానికి భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం అమరావతి రాజధానిని చేపట్టింది.

అమరావతి రాజధాని నిర్మాణం గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే, అది రాష్ట్ర ‘ రాజకీయ రాజధాని ‘ కాదు. అది కేవలం కార్పొరేట్ సామ్రాజ్యం నిర్మించుకున్న ‘ ఆర్ధిక రాజధాని ‘ మాత్రమే!

గత విఫల రాజధాని హైదరాబాదు నేపథ్య చరిత్ర అలా నిర్మాణం జరిగింది కాదు. నాలుగు శతాబ్దాల చరిత్ర హైదరాబాదుకు వుంది. అది గోల్కొండ నవాబుల కాలం నుండే రాజధాని! ఆఖరి ఐదారు దశాబ్దాలలో రాజకీయ కోణంలో అభివృద్ధి మరియు అక్కడ అధికార వికేంద్రీకరణలు జరిగి వుండొచ్చు. కానీ హైదరాబాదు ఎదుగుదలలో చారిత్రక, సాంస్కృతిక కారణాలు కూడా వున్నాయి. అయినా ఆఖరి కాలంలో హైదరాబాదు కేంద్రీకరణ ఒక గుణపాఠంగా మారింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం కనీసం అలాంటి కేంద్రీకరణ ‘రాజకీయ రాజధానిగా కూడా కాకుండా ‘ఆర్ధిక రాజధానిగా ఎందుకు నిర్మించింది? అదో ప్రశ్న!
ఇంకోమాటలో చెప్పాలంటే ఆర్ధిక పెట్టుబడి వ్యూహాత్మకంగా సామాజిక పెట్టుబడి (సోషల్ కాపిటల్)ని ప్రమోట్ చేసుకున్నది. అది రాష్ట్ర ప్రజలెన్నుకున్న చంద్రబాబు ప్రభుత్వ ఆధారంతో ప్రజాధనంతో, రైతుల పంట భూముల కబ్జా ద్వారా నిర్మించుకున్నదే అమరావతి! రాజకీయ నేపథ్య కారణాలు ఏమైనప్పటికినీ, అలాంటి కార్పొరేట్ సామ్రాజ్యపు ఆర్ధిక రాజధాని పధకం విచ్ఛిన్నమయ్యే కొత్త పరిస్థితి రావడాన్ని ప్రజలూ, ప్రజాస్వామిక శక్తులు స్వాగతించాలి.
రకరకాల వాదనలు కుంటి సాకులతో ‘ అమరావతి ‘ యదాతధపునరుద్దరణ కోసం జరిగే ప్రయత్నాలను అభివృద్ధి నిరోధక చర్యలుగా భావించాలి. రాజధాని పేరిట ఇన్ సైడర్ ట్రేడింగ్ తో రూపొందిన సుమారు రెండు లక్షల కోట్ల రూ.ల విలువగల సంపన్న సామ్రాజ్యమే నేడు ఇలాంటి అభివృద్ధి నిరోధక ప్రక్రియను తెరవెనుక వుండి ప్రోత్సహిస్తున్నది. అది ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఆధిపత్యవర్గాలన్నింటినీ తెరవెనుక నుంచి ప్రభావితం చేస్తున్నది.
నిన్న, మొన్నటి వరకూ అమరావతిని వ్యతిరేకించిన రకరకాల రాజకీయ శక్తులను కూడా పై కార్పొరేట్ సామ్రాజ్యం క్రమంగా తన వ్యూహంలోకి తెచ్చుకుంటున్నది. పాము నడుం బయట ఎన్ని వంకలు తిరిగినా పుట్టలోకి వెళ్ళేటపుడు సూటిగా వెళ్తుంది. చంద్రబాబు ప్రభుత్వ రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా నిప్పులు చెరిగిన రాజకీయ శక్తులు కూడా దాని వెనుకగల కార్పొరేట్ సామ్రాజ్యకోటను కాపాడటానికి కుంటిసాకులతో ప్రత్యక్ష్యంగానో, పరోక్షంగానో సమర్ధిస్తుండటం గమనార్హం! ఈ అవకాశవాద ధోరణుల పట్ల రాజకీయ అప్రమత్తత అవసరమని మా పార్టీ భావిస్తున్నది.
జగన్ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనలో ప్రజాస్వామిక వికేంద్రీకరణ లక్ష్యం లేదు. దీని వెనుక ప్రధానంగా రెండు రాజకీయ లక్ష్యాలున్నాయి. 1) అమరావతి కేంద్రంగా టిడిపి నిర్మించుకున్నదాదాపు రెండు లక్షల కోట్ల రూ.లకిపైగా విలువైన ఆర్ధిక, రాజకీయ, సామాజిక నాడీ మండలాన్ని దెబ్బతీయడం! 2) అమరావతికి బదులు విశాఖలో అదే ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా ప్రత్యామ్నయ ఆర్ధిక, రాజకీయ నాడీ మండల వ్యవస్థను నిర్మించుకోవడం! నిన్నటి కేంద్రీకృత ఆర్ధిక నాడీ మండల వ్యవస్థను దెబ్బకొట్టి, రేపు అదే పంథాలో మరో ఆర్ధిక నాడీ మండల వ్యవస్థను నిర్మించాలంటే, ఈ రోజు అట్టి నాడీ మండల వ్యవస్థ పట్ల ప్రజా వ్యతిరేకతను ఒక సాధనంగా మార్చుకోక తప్పదు. నిన్నటి కేంద్రీకరణకూ, రేపటి కేంద్రీకరణకూ మధ్య సహజంగానే వికేంద్రీకరణను జగన్ ప్రభుత్వం ఒక రాజకీయ సాధనంగా మలుచుకుంటున్నది.
దోపిడీ పాలకవర్గాల మధ్య కుమ్ములాటల్లో ఇలాంటి వెసులుబాటు అవకాశాలు సాధరణ ప్రజలకు లభిస్తుండటం చరిత్రలో సహజమే! మూడు రాజధానుల ప్రతిపాదనలో కూడా వికేంద్రీకరణ అనే వెసులుబాటు సౌకర్యం వుందని మా పార్టీ భావిస్తున్నది. దాన్ని ఆధారం చేసుకొని శాస్త్రీయ వికేంద్రీకరణ ప్రతిపాదనతో రాజధాని నిర్మాణంకై ఉద్యమించాల్సి వుందని మా పార్టీ భావిస్తున్నది.

రాజధాని ఎక్కడ నిర్ణయం చేసినా, ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆమోదం అభించదు. మూడు విభిన్న ప్రాంతాల ప్రజలందరి సర్వామోదం సాధ్యం కాదు. వికేంద్రీకరణ పంథాలో నిర్మించినా, రాష్ట్ర ప్రజలందరి ఏకగ్రీవ ఆమోదం పొందడం ఎప్పటికీ సాధ్యం కాదు.

ఏ నిర్ణయాలు చేసినా, అవి కొన్ని ప్రాంతాలకు సౌలభ్యంగా, సౌకర్యంగా వుంటాయి. మరికొన్ని ప్రాంతాలకు అసౌలభ్యంగా, అసౌకర్యంగా వుంటాయి. ఆయా ప్రభుత్వ కేంద్రాలు లేదా కార్యాలయాలు ఆయా ప్రాంతాలలో వికేంద్రీకరించినందున కూడా మిగిలిన ప్రాంతాల ప్రజలకు దూర ప్రయాణాల సమస్య వస్తుంది. కానీ భౌగోళికంగా దూరాలు ముఖ్య సమస్య కారాదు. విభిన్న ప్రాంతాల ప్రజల మధ్య మానసిక విభజనను నియంత్రించడం ముఖ్యమైనది. ఆయా ప్రాంతాల మధ్య మానసిక దూరాన్ని పెంచే భౌగోళిక సమీపత కంటే; రాష్ట్ర ప్రజలందరి మధ్య మానసిక సమైక్యత సాధనకై భౌగోళికంగా భౌతిక దూర భారాలను భరించాల్సిన కర్తవ్యం ముఖ్యమైనది. ఆ వూరికీ, ఈ వూరికీ మధ్య పరస్పర అవసరాలు వుండే విధంగానే సమైక్యతను సాధించగలం. అప్పుడు ఆ వూరుకు ఈ వూరెంత దూరమో; ఈ వూరుకు ఆ వూరు కూడా అంతే దూరమౌతుంది. ఇదే నిజమైన రాష్ట్ర సమైక్యతకు గ్యారంటీనిస్తుంది.
ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అధికార వికేంద్రీకరణలు అవసరమైనవి. ఇందులో అభివృద్ధి ప్రధానాంశం. అధికార వ్యవస్థ ద్వితీయం! అధికార వ్యవస్థ కంటే, అభివృద్ధి ప్రక్రియ వికేంద్రీకరణ ద్వారానే ఎక్కువ ఫలితాలుంటాయి. అదే సమయంలో అభివృద్ధి ప్రక్రియ కంటే ముందు జరగకుండా తక్షణమే అధికార వికేంద్రీకరణ ముందుకొచ్చినప్పుడు నిర్దిష్ట వైఖరిని చేపట్టక తప్పదు. నిన్నటి వరకూ అభివృద్ధితోపాటు అధికార వికేంద్రీకరణ కూడా జరగాలని ఆందోళన చేసిన కొన్ని రాజకీయ శక్తులు నేడు అమరావతి పునరుద్దరణ వుద్యమాన్ని చేపట్టడం విస్మయం కలిగిస్తున్నది. మెల్లకన్నులోని దృష్టి దోషాన్ని విమర్శించాల్సిందే! దానికి శస్త్ర చికిత్స చేయాల్సిందే! కానీ అట్టి మెల్లకన్నును వ్యతిరేకించే పేరుతో గుడ్డికన్నును బలపరడం క్షమించరాని నేరం!
లోపభూయిష్టమైన మూడు రాజధానులను వ్యతిరేకించే పేరిట కార్పొరేట్ సామ్రాజ్యపు ఆర్ధిక రాజధాని అమరావతి పునరుద్ధరణకి పూనుకోవడం చారిత్రక, రాజకీయ అపరాధమే!
కార్పొరేట్ వర్గాల నేతృత్వంలో ఆర్ధిక, రాజకీయ, సామాజిక ప్రాబల్యవర్గాలు నేడు వ్యూహాత్మకంగా ‘ అమరావతి ‘ పునరుద్ధరణోద్యమాన్ని కీర్తిస్తున్నాయి. నిన్నటి వరకూ దాన్ని వ్యతిరేకించిన కొన్ని రాజకీయ శక్తుల్ని కూడా అందులోకి తెలివిగా ఈడ్చుతున్నాయి. ‘ అభివృద్ధి వికేంద్రీకరణ ‘ సరైనదేననీ, అధికార వికేంద్రీకరణ మాత్రం అవసరం లేదని అవి కొత్త రాగం తీస్తున్నాయి. రాజధాని ఒకే ప్రాంతంలో వుండాలనే వినసొంపు ప్రచారం నేడు సాగుతున్నది. అందుకు భావజాల రంగం ఆధిపత్య వర్గాల ఆధ్వర్యంలో వుండటమే ప్రధాన కారణం! అమెరికాలో వున్నా, ఇక్కడ కుగ్రామంలో వున్నా అనుసంధానం చేసే అంతర్జాల వ్యవస్థ (ఇంటర్నెట్) రాజ్యమేలుతున్న కాలమిది. ఆధునిక శాస్త్ర, సాంకేతిక వ్యవస్థ పరిపాలనను ప్రజల చెంతకు తెస్తుందని ఇంతకాలం ఇవే ఆధిపత్య వర్గాలు ప్రచారం చేసాయి. అవే ఇప్పుడు హఠాత్తుగా ప్లేటు ఫిరాయించాయి.
ప్రభుత్వ పాలనా వ్యవస్థల కార్యాలయాలన్నీ ఒకేచోట వుండాలని కొత్త పల్లవి అందుకోవడంలో వ్యూహాత్మక కుట్ర దాగి వుంది. ఇది వట్టి బూటకం! పెద్ద నాటకం! ఆధునిక ఆన్లైన్ సమాచార, సాంకేతిక వ్యవస్థ రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియకు పెద్ద వూపునిచ్చింది. ఈ చేదు నిజాన్ని మారేడుకాయగా మసిపూసే ఆధిపత్య వర్గాల కుట్రను అర్ధం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
జగన్ ప్రభుత్వం చంద్రబాబు నమూనా ఇన్ సైడర్ ట్రేడింగ్ తరహాలో మరో కేంద్రీకృత రాజధాని నిర్మాణం చేపట్టే ప్రమాదం వుందని మా పార్టీ అభిప్రాయపడుతున్నది. అలాంటి ఆరోపణలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. విశాఖ ప్రాంతం ఇప్పటికే నిర్వాసిత సమస్యను ఎదుర్కొంటున్నది. అదే జరిగితే ఏడెనిమిది లక్షల మంది నిరుపేదలు నివసిస్తున్న మురికి వాడలతో పాటు లక్షలాది మత్స్యకారులు, పరిసర గ్రామీణ రైతాంగాలకు ముప్పు వుంది. కార్పొరేట్ వ్యవస్థ రాజధాని పేరిట వారి నివాసాలను దౌర్జన్యంగా ఖాళీ చేయించే ముప్పు వుంది. పర్యావరణ ప్రమాదం మరింత పెరుగుతుంది. కేంద్రీకృత రాజధాని నిర్మాణాలకు విశాఖ సరిపడదని హుదూద్ తుఫాన్ కూడా నిరూపించింది. వికేంద్రీకరణలో భాగంగా కొంతమేరకు తప్ప జగన్ ప్రభుత్వ వ్యూహం ప్రకారం విశాఖను ఎంపిక చేయడాన్ని మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అవి మరో అమరావతికి దారితీస్తుందని భావిస్తున్నది.
రాజధాని నిర్మాణంపై మా పార్టీ ఈ క్రింది నిర్దిష్ట డిమాండ్లతో కూడిన నిర్మాణాత్మక వైఖరిని ప్రకటిస్తున్నది.
1) శాసన రాజధానిగా అమరావతిని కొనసాగించాలి. విశాఖ, రాయలసీమలో ఏటా ఒక్కొక్కసారి శాసన సభా సమావేశాలను నిర్వహించాలి. రాష్ట్ర గవర్నర్ కార్యాలయం అమరావతిలోనే కొనసాగాలి. ఆ
2) న్యాయ రాజధానిగా కర్నూలును కొనసాగించాలి. హైకోర్టు బెంచీలను అమరావతి, ఉత్తరాంధ్రలలో ఏర్పాటు చేయాలి.
3) కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను కొనసాగించాలి. ఉప సచివాలయాలను అమరావతి, రాయలసీమలలో ఏర్పాటు చేయాలి.
4) ప్రభుత్వం ప్రకటించిన నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళకు తగిన నిధులు, విధులతో పాటు రాజకీయ జోక్యం లేకుండా చట్టబద్ధ స్వయంప్రతిపత్తి కల్పించాలి. ముఖ్యంగా వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళకు బుందేల్ ఖండ్, కోరాపుట్ ప్రాంతాల తరహా ప్యాకేజిని ప్రకటించాలి.
5) గత ఒప్పందాలు, హామీల ప్రకారం రాయలసీమకు నీటిని కేటాయించాలి.
6) అధికార వికేంద్రీకరణతో పాటు ముఖ్యంగా ప్రజల కేంద్రంగా అభివృద్ధి వికేంద్రీకరణను కూడా చేపట్టాలి. వ్యవసాయరంగ సమస్యలు పరిష్కరించి వ్యవసాయాధారిత పరిశ్రమలను నెలకొల్పి వాటికి తగిన రాయితీలు ఇవ్వాలి.
7) అమరావతి నిర్మాణాలకు ఉపయోగించిన భూములకు ‘ భూసేకరణ చట్టం – 2013 ‘ ప్రకారం నాలుగు రెట్ల ధరతో నష్టపరిహారం రైతులకు చెల్లించాలి. నిర్మాణాలు జరగని భూములను తిరిగి సాగు భూములుగా మార్చి ఇవ్వాలి. వాటిని సంబంధిత రైతులకు అప్పగించాలి. వారికి ఎకరానికి ఐదు లక్షల రూ.లు నష్టపరిహారం కూడా చెల్లించాలి. అసైన్డ్ భూములను తిరిగి వాస్తవ దళితులకే అప్పగించి, వీరికి కూడా ఇతర రైతుల మాదిరిగానే నష్టపరిహారం ఇవ్వాలి.
8) ప్రభుత్వ యంత్రాంగంలోని నలభైకి పైగా శాఖల ప్రధాన కార్యాలయ కేంద్రాలను (హెచ్.ఓ.డి) పైన పేర్కొన్న
ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళ వారీగా, వాటిలో కూడా తిరిగి జిల్లాల వారీగా నెలకొల్పాలి.
9) పైన పేర్కొన్న వికేంద్రీకరణ పంథాలో ఆయాచోట్ల పరిమిత కార్యాలయాల నిర్మాణాలే వుంటాయి. వాటిని కూడా ప్రజలను నిర్వాసితుల్ని చేయకుండా చర్యలు చేపట్టాలి.
10) ఏ ప్రాంతంలో ఏ ఏ రాజధాని విభాగాలను నిర్మించినా, వాటి అన్నింటి మధ్య ‘ ఆన్లైన్ ‘ అనుసంధానం చేయాలి. ఆయా పాలనా కేంద్రాలు ఎంత దూరంలో వున్నా ప్రయాణాలను నియంత్రించే విధంగా మెరుగుపర్చాలి.
11) రాష్ట్ర ప్రత్యేక హోదా మరియు విభజన హామీల అమలుకై కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమించాలి. ముందుగా దీనిపై కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానించాలి.
12) ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై వెంటనే సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ కమీషను నియమించాలి.
13) రాజధాని నిర్మాణాల పేరిట వ్యవసాయ భూములను సేకరించరాదు. మురికివాడలలో నివసిస్తున్న పేదలను విస్తాపనకు గురిచేయరాదు.
ప్రియమైన ప్రజలారా! పై న్యాయమైన డిమాండ్ల ప్రాతిపదికపై రాజధాని నిర్మాణంకై వుద్యమించాల్సిందిగా రాష్ట్ర ప్రజలకు మా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది. ఒకవైపు ఫాసిస్టు శిబిరంలోకి మన రాష్ట్ర ప్రజలను ఈడ్చుతున్న వైకాపా, టిడిపి తోడుదొంగల దుర్నీతిని – బహిర్గత పరుస్తూనే, మరోవైపు పై ప్రజాతంత్ర డిమాండ్ల సాధనకై ఉద్యమిద్దాం!
(*సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోసీ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ
ప్రచరుణకర్త, వై.సాంబశివరావు, సి.సి.ఐ (ఎం.ఎల్) రాష్ట్ర అధికార ప్రతినిధి
సెల్ : 9440019965, విజయవాడ, 1-1-2020)