కర్నూల్ వరద ముప్పు ప్రాంతం అనడం చంద్రబాబు దుర్మార్గం : మాకిరెడ్డి

(మా కి రె డ్డి పురుషోత్తమ రెడ్డి)
అమరావతి కోసం కర్నూలును ముంపు ప్రాంతంగా చిత్రీకరించే చంద్రబాబు ప్రయత్నం దుర్మార్గం.
అమరావతి ప్రయోజనాల కోసం రాయలసీమలోని జిల్లాలను కర్ణాటక , తమిళనాడులో కలపమని జిల్లా నాయకులతో మాట్లాడించిన చంద్రబాబు గారు నేడు తానే స్వయంగా కర్నూలును వరద ముంపు ప్రాంతంగా చిత్రీకరణకు పూనుకున్నారు.
కర్నూలు వరద వెనక అసలు విషయం
2009 లో రాయలసీమలోని కర్నూలు నగరం తీవ్ర వరదకు గురైయినది. సాధారణంగా వరదలు వచ్చినప్పుడు పై ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు , పై డ్యామ్ ల నుంచి ఎన్ని క్కుసెక్యుల నీరు విడుదల చేస్తున్నారు అన్న సమాచారం ప్రకారం క్రింద ప్రాంతాలను అప్రమత్తం చేసి డ్యామ్ నుంచి నీరు విడుదల చేస్తారు. నాడు జరిగింది ఏమిటి అంటే శ్రీశైలం జలాశయం పైన ఉన్న ఆల్మట్టి , నారాయణపూర్ , జూరాల నుంచి 12 లక్షల క్కుసెక్యుల నీరు విడుదల చేసారు. అదే సమయంలో జూరాల , శ్రీశైలం మధ్య రెండు రోజులు 22 సెంటిమిటర్ల వర్షం కురిసింది. పై ప్రాంతంలో కురుస్తున్న వర్షాలను , పై జలాశయాల నుంచి విడుదల అవుతున్న నీటిని అంచనా వేసి డ్యామ్ గేట్ల నిర్వహణ చేయడంలో నాటి అధికారులు విఫలమైనారు 170 అడుగులు దాటుతున్నా అధికారులు నీటిని విడుదల చేయలేదు ఫలితంగా కర్నూలు నగరం నీట మునిగి నష్టం వాటిల్లింది.

(Like this story? Share it with a friend!)

నేడు చంద్రబాబు తాను ఎంపిక చేసిన అమరావతి వరద ముంపు ప్రాంతం అన్న విమర్శలు వచ్చిపడుతున్నాయి. నిన్నటి వరకు గ్రీన్ ట్రిబ్యునల్ సర్టిఫికెట్ ఇచ్చింది అని మాటలు చెప్పి నేడు అమరావతి ముంపు అవకాశం ఉన్న ప్రాంతం అయితే విశాఖ కాదా , కర్నూలు కాదా అని విమర్శలు చేస్తున్నారు. జనానికి ఏమి తెలియదు అనుకుంటున్నారేమో తెలియదు కానీ ఒక లక్ష మందికి సాయం చేసినామని చెపుతున్నారు. నిజానికి నాడు అధికారంలో ఉన్నది రోశయ్య తర్వాత అధికారంలో ఉన్నది కిరణ్ కుమార్ రెడ్డి. తానే ముఖ్యమంత్రి అన్నట్లు మాట్లాడుతున్నారు. ముఖ్యమైన విషయం నాడు విపక్ష నేత హోదాలో చంద్రబాబు చేసిన విమర్శ ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన నష్టం కాదని మానవ తప్పిదం అని అందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండు చేశారు.
అమరావతి ప్రయోజనాల కోసం రాయలసీమను ఇతర రాష్ట్రాలలో కలపాలని వాదనలు వినిపించారు. నేడు ఏకంగా వరద ముంపు ప్రాంతంగా చిత్రీకరణ చేస్తున్నారు. ఇలాంటి విషప్రచారాన్ని రాయలసీమ సమాజం తిప్పికొట్టాలి.
(*మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, సమన్వకర్త, రాయలసీమ మేధావుల పోరం, తిరుపతి)