(సలీమ్ బాష*)
షెహన్ షా , యాంగ్రీ యంగ్ మాన్, స్టార్ ఆఫ్ ది మిలీనియం … ఇలా ఎన్నో బిరుదులు పొందిన “బిగ్ బి” అనబడే ఇంక్విలాబ్ శ్రీ వాత్సవ్ , అమితాబ్ బచ్చన్ ఐదు దశాబ్దాల ఎత్తుపల్లాల, గెలుపు ఓటముల అలుపెరుగని జీవన ప్రస్థానం 1969 నవంబర్ 7న “సాత్ హిందుస్తానీ” తో మొదలై ఇంకా జోరుగానే సాగుతోంది!
అమితాబ్ బచ్చన్ ఒక ఐకాన్. నాకు మా అందరికి కూడా. ముఖ్యంగా మా చిన్న చెల్లెలు అమితాబ్ బచ్చన్ అంటే పడి చచ్చేది. నాకింకా బాగా గుర్తు. మా ఇంట్లో వసారా లో అమితాబ్ ఫోటో ఫ్రేమ్ ఉండేది. దాన్ని ఆమె చాలా జాగ్రత్తగా చూసుకునేది. ఆ ఫోటో ఫ్రేమ్ కోసం జరిగిన పోరాటాలు ఎన్నో ఉన్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయ్.
తమాషా ఏంటంటే మా ఇంట్లో అమితాబ్ అంటే అందరికీ అభిమానమే. నాకు ఎంత అభిమానం అంటే 24 జనవరి 1975 లో రిలీజ్ అయిన ” దీవార్” సినిమా చూసి బాంబే కు పారిపోయేంత! బాంబే లో అమితాబ్‌ను చూడకపోయినా అష్టకష్టాలు పడి మూడు రోజులకు ఇంటికి తిరిగి వచ్చాను. దానికి కారణం బొంబాయిలో మంచితనం మూర్తిభవించిన ఓ టాక్సీ డ్రైవర్!
ఓ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాన్ని వదిలేసి జేబులో అమాయకంగా ఓ రికమండేషన్ లెటర్ పెట్టుకొని సినిమాల్లో వేషాల కోసం తిరిగిన అమితాబచ్చన్ సినీ ప్రస్థానం ఒక సినిమాకు తక్కువేంకాదు. అమితాబచ్చన్ గొంతును ఎందరో వెక్కిరించారు. “డబ్బాలో గులకరాళ్లు వేసి గడగడలాడించినట్లు” ఉందని వెక్కిరించి బడిన ఆ గొంతు కే లాగాన్ సినిమాలో అమీర్ ఖాన్ కొన్ని కోట్లు చెల్లించాడు.
అమితాబ్ షోలే సినిమాలో చెప్పిన, “ అగర్ కిసినేభి హిల్నెకీ కోసిశ్ కి తో భూంద్ కే రక్ దూంగ” అనే డైలాగు అమితాబ్ గొంతులోని గొప్పతనాన్ని చాటి చెప్పింది. కేవలం అమితాబ్ కోసమే ఈ డైలాగులు రాసారేమో అన్నట్టుగా సలీమ్ జావేద్ లు డైలాగులు రాశారు.
కొన్ని రోజుల తర్వాత సాత్ హిందుస్తానీ సినిమాల్లో ఏడు మంది లో ఒకడి గా ఒక చిన్న పాత్రలో నటించిన బిగ్ బి, జంజీర్ సినిమా విడుదల అయ్యేంతవరకు ఎవరికి తెలియదు. జంజీర్ సినిమాలో అమితాబ్ కు వేషం రావడం చిత్రంగా జరిగిన విషయం. అంతకుముందు దర్శకుడు రిషికేశ్ ముఖర్జీ అమితాబ్ ను రెండు సినిమాల్లో తీసుకున్నాడు. ఒకటి ఆనంద్, రెండోది ” నమక్ హరామ్”.
రాజేష్ ఖన్నా అప్పటికే సూపర్ స్టార్. దిలీప్ కుమార్ లు, దేవానంద్ లు, షమ్మీకపూర్ ల రొమాంటిక్ యుగము అప్పుడప్పుడే కనుమరుగవుతున్న కాలమది.
రాజేష్ ఖన్నా మొట్టమొదటిసారి సూపర్ స్టార్ గా సినీ రంగాన్ని ఏలుతున్నాడు. అందుకే అమితాబ్ కు పెద్దగా గుర్తింపు రాలేదు.
అదే సమయంలో దర్శకుడు ప్రకాష్ మెహ్రా జంజీర్ సినిమా చేయాలనుకుని దేవానంద్, ధర్మేంద్ర, రాజ్ కుమార్ లను సంప్రదించగా వారు నిరాకరించడంతో అమితాబ్ ను తీసుకున్నాడు.
అలా మొదలైన ఓ యాంగ్రీ యంగ్ మ్యాన్ శకం కొన్ని ఏళ్లపాటు కొనసాగింది. అప్పుడు “విజయ్” అనే పేరును అమితాబ్ 20 సినిమాల్లో కొనసాగించారు!
అలా రాజేష్ ఖన్నాను ఓవర్ టేక్ చేసి అమితాబ్ దశాబ్దం పాటు సినీ రంగం లో తనకే ప్రత్యేకమైన ఒక శకాన్ని సృష్టించాడు.
చిత్రంగా జంజీర్ ఒక నూతన ఒరవడిని సృష్టించి సంచలనం వచ్చి రేపినా, బిగ్ బి కి గుర్తింపు రాలేదు. 1975 లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ “దీవార్” అమితాబ్ కు తిరుగులేని ఇమేజ్ తో పాటు విజయ మార్గాన్ని నిర్మించింది. సలీమ్ జావేద్ ల జోడి అమితాబ్ ను ఒక స్థాయికి తీసుకెళ్లింది. 1973 -84 మధ్య కాలంలో అమితాబ్ నటించిన 19 సినిమాలు “గోల్డన్ జూబిలీ” జరుపుకున్నాయంటే బిగ్ బి ప్రభంజనాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఇక “షోలే” గురించి చెప్పేదేముంది? అయితే షోలే లో అమితాబ్ వేసిన వీరూ పాత్ర నిజానికి ధర్మేంద్ర చేయాలి. కానీ చిత్రంగా అది అమితాబ్ కు వచ్చింది. సినిమా లో మొదట అమితాబ్ పాత్ర చనిపోదు. కానీ సలీమ్ జావేద్ రమేష్ సిప్పీ ని ఒప్పించి ఆ పాత్రను చంపేశారు! ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. షోలే సినిమా నేను ఎన్నిసార్లు చూశానో అనేదానికన్నా, ఎన్నిసార్లు చూడలేదన్నది గుర్తు పెట్టుకోవటం సులభం. మా ఊర్లో ప్రతి థియేటర్లో వచ్చిన సినిమా అదొక్కటే! (రంజాన్ పండగ సందర్బంగా సరికొత్త “కాఫీ” అని వేసేవారు) దీనికి విరుద్ధంగా ” కూలి” సినిమాలో అమితాబ్ పాత్ర మొదట చనిపోవాలని నిర్ణయించిన దర్శకుడు మన్మోహన్ దేశాయ్, అమితాబ్ గాయపడి పునర్జన్మ పొందిన నేపథ్యంలో దాన్ని బతికించాడు! దానికి చెప్పిన కారణం ఏంటంటే నిజజీవితంలో చావును జయించిన అమితాబ్ ను కూలిలో బతికించడం సమంజసం!
ఇంతవరకు అత్యధికంగా ద్విపాత్రాభినయం చేసిన నటుడు అమితాబే! నాలుగు సార్లు జాతీయస్థాయిలో అవార్డులు పొందిన బిగ్ బీ మొత్తం మీద మూడు వందల పైచిలుకు అవార్డులు సాధించడం విశేషం. మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం స్థాపించబడిన మొట్ట మొదటి బాలీవుడ్ నటుడు అమితాబ్!
సినిమాల్లో తిరుగులేని నాయకుడిగా విజృంభించిన విజయ్ దీనానాథ్ చౌహాన్ రాజకీయాల్లో మాత్రం ఇప్పుడు లేకపోవడం విశేషం1984 పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పటికీ విజయ్ కి రాజకీయాలు సరిపోలేదు. అందుకే తెలివిగా రాజకీయాల నుండి తప్పుకోవడం అమితాబ్ కే చెల్లింది.
అమితాబ్ వ్యాపారంలో కూడా రాణించలేకపోయాడు. ఏ బి సి ఎల్ అనే సంస్థను స్థాపించి నష్టాల పాలవడం బిగ్ బీ ని కుంగదీసింది. అయినా తన సెకండ్ ఇన్నింగ్స్ లో కౌన్ బనేగా కరోడ్ పతి తొ మళ్లీ విజయపథంలో కి వచ్చాడు. మయస్తీనియ గ్రేవిస్ అనే కండరాల క్షీణత జబ్బు, ఆస్తమా వంటి రుగ్మతల నుండి కూడా అమితాబ్ విజయవంతంగా బయటపడడం విశేషం!
ఎన్నిసార్లు పడినా మళ్లీ పైకి లేవడం అమితాబ్ కు వెన్నతో పెట్టిన విద్య. 1990 లో మొదటి సారి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు పొందిన బిగ్ బి సినీ గ్రాఫ్ పడిపోయినా మళ్లీ 15 సంవత్సరాల తర్వాత “బ్లాక్” సినిమాకు రెండవసారి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు పొందటం విశేషం! తర్వాత పా(2009 ), పీకూ (2015 ) కు కూడా జాతీయ స్థాయిలో అవార్డు లు పొందటం మామూలు విషయం కాదు. దీన్ని బట్టి అమితాబ్ పోరాట పటిమ అర్థమవుతుంది.ఎనభయ్ ఏళ్లకి దగ్గరవుతున్నా ఎనర్జీ తగ్గకుండా అప్రతిహతంగా ముందుకు సాగుతున్న బిగ్ బి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం!.
ఈ మధ్యనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి ఎంపికైన బిగ్ బీ జీవితం మొత్తం పడిలేచే కెరటం లాంటిది. 1999 లో బిబిసి అలైన్ ఓటింగ్ లో హాలీవుడ్ దిగ్గజాలైన చార్లీ చాప్లిన్, మార్లన్ బ్రాన్దో. లారెన్స్ ఆలివర్ లను కాదని ప్రజలు “స్టార్ ఆఫ్ ది మిలీనియం” గా అమితాబ్ ను ఎన్నుకోవటం అతని పాపులారిటీ నిదర్శనం. అయితే “అది కంప్యూటర్ చేసిన తప్పిదం. నేనొక మామూలు నటుడ్ని” అని చెప్పటం బిగ్ బి హుందాతనాన్ని సూచిస్తుంది..
జాతీయస్థాయిలో పద్మ భూషణ్ పద్మ విభూషణ్ బిరుదులు పొందిన అమితాబ్ కు ఇక మిగిలింది భారతరత్నే! అందుకు బిగ్ బి అర్హుడు కూడాను! (Photo Facebook timeline నుంచి)
(సిఎస్ సలీమ్ బాష, ఫిల్మ్ క్రిటిక్, మోటివేషనల్ స్పీకర్, రచయిత 9393737937)