IAS దర్పాన్ని ముస్సోరిలో వదిలేసి జనం మధ్యకు వచ్చిన కలెక్టరమ్మ

(ఫీరోజ్ ఖాన్)
ఆమె ఓ జిల్లాకు కలెక్టర్.
కానీ ఆ అధికార దర్పాన్ని మరిచి సాదాసీదాగా ఉంటుంది.
ప్రజల కష్టాన్ని తెలుసుకొని వెంటనే పరిష్కారం చూపుతుంది.
ఏ క్షణమైనా అందుబాటులో ఉండి ప్రజాసేవకు అంకితమైంది.
ఆమెలో కలెక్టర్ ను అన్న గర్వం ఇసుమంత కూడా కనబడదు.
ఆమెకు భాష రాకపోయినా పట్టుబట్టి భాష నేర్చుకొని ప్రజలతో మమేకమౌతుంది..
ఆమె ఎవరో కాదు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్.
దేవరాజన్ దివ్య స్వస్థలం తమిళనాడులోని చెన్నై. ఆమె విద్యాభ్యాసమంతా చెన్నైలోనే కొనసాగింది. చెన్నై బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత పీజీలో పట్టభద్రురాలైంది. దివ్యకు ప్రజలకు సేవ చేయాలనే తపన ఎక్కువ. అందుకే సాఫ్ట్ వేర్ సైడ్ కాకుండా సివిల్స్ పై తన దృష్టి పడింది. సివిల్స్ సాధిస్తే లక్షలాది మంది ప్రజలకు సేవ చేయొచ్చన్న ఆకాంక్షతో చెన్నై నుంచి ఢిల్లీ బయల్దేరింది. అక్కడ ఓ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకొని సివిల్స్ కు ప్రిపేర్ అయ్యింది. 2009 సివిల్స్ ఫలితాల్లో దివ్య ఆలిండియా 37వ ర్యాంకు సాధించింది. 2010లో ఐఏఎస్ ట్రైనింగ్ ముగిశాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను తన సర్వీసులో భాగంగా ఎంచుకుంది.
హైదరాబాద్ లో వివిధ భాగాలలో పని చేశారు. సిజిజి ప్రాజెక్టు డైరెక్టర్ గా చేశారు. ఆ తర్వాత ఖమ్మం ఐటీడీఏ పీవోగా, జేసీగా పని చేశారు. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో ఆమె తెలంగాణ కేడర్ ను ఎంచుకున్నారు. ఆమెను తెలంగాణ ప్రభుత్వం భువనగిరి సబ్ కలెక్టర్ గా నియమించింది. సబ్ కలెక్టర్ గా తక్కువ కాలమే పని చేసిన దివ్య భువనగిరి ప్రజల మనస్సులు గెలుచుకున్నారు.
తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత దివ్య వికరాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. వికారాబాద్ కలెక్టర్ గా కూడా ఆమె తన పనితీరుతో ప్రజల మనస్సులు గెలుచుకున్నారు. పెద్దేముల్ మండలం చైతన్య నగర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, వీధి దీపాలు, నీటిఫ్లాంట్లు, వైద్య సదుపాయాలు, ఆడపిల్లల చదువుపై ప్రత్యేక శ్రధ్ద తీసుకొని అన్ని వసతులు కల్పించారు.
ఇదే సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో రిజర్వేషన్లకు సంబంధించి ఆదివాసీలకు గొడవలు జరిగాయి. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో పరిస్థితి చేజారిపోతుందని గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా ఉన్న దివ్య దేవరాజన్ ను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసింది. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి, సమస్యను పరిష్కరించగలదని తెలంగాణ సర్కార్ ఆమెను నియమించింది. బాధ్యతలు స్వీకరించిన దివ్య వెంటనే ముందుగా జిల్లాలో ఉన్న అశాంతిని తొలగించేందుకు అందరితో సమీక్ష సమావేశాలు పెట్టారు. ఇరు వర్గాలు శాంతించేలా పలు ప్రకటనలు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా అటవీ జిల్లా. ఎక్కువ మంది ప్రజలు అడవులల్లోనే నివసిస్తారు. కలెక్టర్ గా దివ్య గ్రామాల పర్యటనకు వెళ్లినప్పుడు ప్రజలెవరూ కూడా ఆమెతో మాట్లాడడానికి ఆసక్తి చూపేవారు కాదు. వారి సమస్యలు కూడా చెప్పుకునేవారు కాదు. దివ్య వారితో మాట్లాడుదామంటే భాష సమస్య. దీంతో దివ్య ప్రజలతో కలిసిపోవాలంటే వారి భాష నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. తమ ఆఫీసులో పనిచేసే గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగితో రోజు ఉదయం రెండు గంటలు ట్యూషన్ చెప్పించుకొని గిరిజన భాష నేర్చుకుంది. గ్రామాలకు వెళ్లినప్పుడు గిరిజనుల కంటే ముందు దివ్యే వారితో మాట్లాడడంతో ప్రజలు సమస్యలన్ని చెప్పుకున్నారు. ఆమె వెంటనే వాటికి పరిష్కార మార్గాలు చూపేవారు.
కలెక్టర్ కార్యాలయంలో పని చేసే గోపాల్ తన పెళ్లికి దివ్యను ఆహ్వానించాడు. కలెక్టర్ వస్తుందో రాదో అని గోపాల్ కూడా అనుమానం వ్యక్తం చేశాడట. కానీ దేవరాజన్ దివ్య ఆ అనుమానాలను పటా పంచలు చేస్తూ గుడిహత్నూర్ మండలం గోపాల్ పూర్ లో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ సాధారణ మహిళల కింద కూర్చొని పెళ్లి చూశారు. అనంతరం గిరిజనుల సాంప్రదాయ నృత్యం ధింసా చేసి అందరిని ఆకట్టుకున్నారు.
అదే విధంగా ఉట్నూర్ మండలంలో జరిగిన సమావేశంలో గిరిజనుల భాష మాట్లాడి దివ్య అందరిని ఆశ్చర్యపరిచారు. ఓ సారి వర్షాకాలంలో ఓ గర్భిణికి నొప్పులు వస్తే సకాలంలో అక్కడికి అంబులెన్స్ రాలేకపోయింది. దీంతో గర్భిణి కడుపులోని బిడ్డ చనిపోయింది. ఈ విషయం తెలుసుకొని చలించిన దివ్య ఆ గర్భిణి ఇంటికి వెళ్లి పరామర్శించి ఓదార్చారు. ఆమెకు దైర్యం చెప్పారు.
18 డిసెంబర్ 2017న ఆదిలాబాద్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన దేవరాజన్ దివ్య ప్రస్తుతం కూడా ఆదిలాబాద్ కలెక్టర్ గానే కొనసాగుతున్నారు. దేవరాజన్ దివ్య భర్త ఢిల్లీ యూనివర్సిటిలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. అనునిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ, ప్రజల మనిషిగా దివ్య పేరు సంపాదించుకున్నారు. ఆడంబరాలకు దూరంగా ఉండి నిరాడంబరతగా వ్యవహరించి ప్రజల మనస్సులు గెలుచుకున్నారు. పిట్టకూర కలెక్టర్ గా పేరు తెచ్చుకున్న దేవరాజన్ దివ్య పలువురికి “స్పూర్తి” గా నిలిచారు.
-ఫీరోజ్ ఖాన్,
సీనియర్ జర్నలిస్ట్,

(సోర్స్ సోషల్ మీడియా)