లక్సెంబర్గ్ రైళ్లలో, బస్సుల్లో, ట్రామ్స్ లో ఇక ఫ్రీ ట్రావెల్ , ప్రపంచంలో ఫస్ట్

ఆర్టీసి వంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థలలో నష్టాలకు కారణం నువ్వంటే నువ్వు అని తెలంగాణాలో ప్రభుత్వం, ట్రేడ్  యూనియన్లు గొడవ పడుతూ ఉంటే ఒక దేశం అసలు దేశంలో రైళ్లు, బస్సుల్లో , ట్రామ్ లలో టికెట్ లు ఎత్తేయ బోతున్నది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్ లెస్ ట్రావెల్ అన్నమాట
యూరోప్ లోని లక్సెమ్ బోర్గ్ లో 2020 వేసవి నుంచి ఎవరైనా, ఎక్కడి కైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.
దేశమంతా ఉచిత ప్రయాణ వ్యవస్థ (టికెట్ లెస్ ట్రావెల్ ) ను ప్రవేశపెట్టాలని అక్కడి సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించింది. లక్సెమ్ బర్గ్ యూరోప్ అత్యంత చిన్న దేశం, అత్యంత సంపన్నదేశం కూడా.అందువల్ల మంచి ఆర్థిక వ్యవస్థ ప్రయోజాలను ప్రజలకు అందించాలని ప్రభత్వం నిర్ణయించింది.
లక్సెంబెర్గ్ లో డెమోక్రటిక్ పార్టీ, వామపక్ష సోషలిస్టు వర్కర్స్ పార్టీ, గ్రీన్స్ పార్టీ కలసి ప్రధాని జేవియర్ బెటెల్ (Xavier Bettel) నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఈ సంకీర్ణానికి గ్యాంబియా సంకీర్ణం అని పేరు. కారణం, ఈ మూడు పార్టీ జండాల పక్కన బెడితే, ఆ రంగులు ఆఫ్రికన్ దేశం గ్యాంబియ (Gambia)దేశం జండాలాగా కనిపిస్తాయి.
ఈ నిర్ణయానికి కారణం, నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ జామ్ లు కాలుష్యం.
ప్రపంచమంతా నగరాలలో కాలుష్యం ఎంత ప్రమాదకరంగా వేరే చెప్పాల్సిన పనిలేదు.
వూపిరి తిరగక భారతదేశ రాజధాని ఢిల్లీ విలవిలలాడుతూ ఉంది. ఢిల్లీలో ఎక్కువ కాలం నివసిస్తే  అనేక జబ్బులు వస్తాయని అక్కడి అఖిలభారత వైద్య శాస్త్రాల సంస్థ (AIIMS) డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా హెచ్చరించారు.
జబ్బు పడినవారిని ఇంకా కృంగదీయడమేకాదు, అన్ని విధాల ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా ఢిల్లీ గాలి కొత్త జబ్బులు తెప్పిస్తుందని ఆయన హెచ్చరిస్తున్నారు.
‘ఇపుడున్నకాలుష్యంలో ఢిల్లీ గాలి ఎక్కువ కాలం పీల్చుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చేలా మనుషి ఆరోగ్యాన్ని దిగజారుస్తుందని, బ్రాంకైటిస్ ఆస్తమా వంటి జబ్బులు తెస్తుందనిఆయన హెచ్చరించారు.
అంతేకాదు, సాధారణ ఇన్ ఫెక్షన్లు తీవ్రమవుతాయనిచెబుతూ ఇక ప్రజలు సొంతకార్ల, ఇతర వాహనాలను నడపం మానేసి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను వాడటమో లేదా నడవమో చేయాలి,’ అని ఆయన హెచ్చరించారు.
ఇలాంటి పరిస్థితి వస్తుందని లక్సెంబర్గ్  చాలా ముందే పసిగట్టింది.  ఆందుకే ఆర్థికంగా బరువైనా, ప్రజల ఆరోగ్యం, దీర్ఘకాలిక ప్రయోజనం దృష్టిలోపెట్టుకుని  ఈ దేశం టికెట్ లెస్ ట్రావెల్ ప్రవేశపెడుతూ ఉంది.
 ప్రజలు సొంత కార్లను బయటకు తీయకుండా ఉండేందుకు, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను వినియోగించుకునే ప్రయాణాలు చేసేలా చేసేందుకు దేశాన్ని మొత్తం టికెట్ లెస్ ట్రావెల్ దేశంగా మార్చాలని నిర్ణయించింది.
లక్సెంబర్గ్ జనాభా 602,000. చిన్నదేశమయినా ట్రాఫిక్ సమస్య చాలా పెద్దది. అందువల్ల దీనికి పరష్కారం ఒక్కటే.2020 మార్చి నుంచి రైల్లు, బస్సులు, ట్రామ్ లలో ప్రజలంతా ఉచితంగా ప్రయాణించేలా చేయడమే అని ప్రభుత్వం భావించింది.
యూరోప్ లో అత్యధిక పర్ క్యాపిటా ఉండే దేశం లక్సెంబర్గ్ .లక్సెంబర్గ్ వైశాల్యం 2586 చకిమీ. రాజధాని లక్సెంబర్గ్ నుంచి బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీలకు కార్ లో గంటలో వెళ్ల వచ్చు.
దీనితో ఈ మూడు దేశాలనుంచి రోజూ ఉద్యోగం పనిమీద 1,80,000 మంది లక్సెంబర్గ్ నగరానికి వస్తుంటారు. లక్సెంబర్గ్ ఆర్థిక ప్రగతి రాకెట్ లా దూసుకుపోతూ ఉంది. అందుకే అక్కడ ఉద్యోగాలెక్కువ.
లక్సెంబర్గ్ సరిహద్దు ఉన్న ఈమూడు దేశాల ప్రజలు ఉద్యోగాలకోసం లక్సెంబర్గ్ నగరానికే వస్తుంటారు. దీనితో కార్లతో నగరం కిటకిటలాడిపోతూ, ట్రాఫిక్ సమస్యతో, కాలుష్యంతో సతమతమయిపోతూ ఉంది.
2016 లెక్కల ప్రకారం ప్రతి 1000 మందిలో 662 మంది కి ఈ నగరంలో కార్లున్నాయి.అంతా కార్లు తీసుకునే రోడ్డక్కుతూ ఉంటారు.
యూరోప్ నగరాలల్ బాగా ట్రాఫిక్ జామ్ లున్న నగరాలలో లక్సెంబర్గ్ ఒకటి. ఇక్కడ నడిపే డ్రైవర్లు ఏడాదిలో 33 గంటలు ట్రాఫిక్ లో చిక్కుకుని ఉంటారని ఆ ప్రభుత్వమే చెబుతూ ఉంది.
దాదాపు ఆమాత్రమే జనాభా ఉన్న కోపెన్ హేగ్, హెల్సెంకీ నగరాలలో డ్రైవర్లు 24 గంటలు మంచి ట్రాఫిక్ లో చిక్కుకుపోవడం లేదు.
లక్సెంబర్గ్ లో అన్ని రకాల రవాణా సదుపాయలను నడిపేందుకు ప్రభుత్వానికి ఏడాదికి 562 మిలియన్లు డాలర్లు ఖర్చవుతున్నాయి. ఇందులో టికెట్ సేల్స్ వల్ల వచ్చేది కేవలం 46 మిలియన్ డాలర్లే. ఇపుడు దేశం ఆర్థికంగా మంచిగా ఉంది. అందువల్ల ఈ మొత్తాన్నిభరించగలదు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగున్నపుడు ప్రజలకు దాని ప్రయోజనం దక్కాలిగా అని అక్కడి రవాణ, పబ్లిక్ వర్క్స్ శాఖ ప్రతినిధి డాని ఫ్రాంక్ చెప్పారు.
ఉచిత ప్రయాణాల ఖర్చు గురించి లక్సెంబర్గ్ ఆలోచించడం లేదు. ఎందుకంటే, ప్రజలు కార్లొదిలేసి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ తగ్గిపోయి ప్రయాణిస్తే జీవితం సుఖవంతమవుతుంది. కాలుష్యం తగ్గిపోతుంది.
ఇలాంటి విధానాలు అక్కడక్కడా ఉన్నాయి. అమెరికాలోని కొన్ని కౌంటీస్ లలో బస్ ప్రయాణం ఉచితం. ఒక దేశంగా ఉచిత ప్రయాణాలు ఎక్కడా అమలు కావడం లేదు. లక్సెంబర్గ్ తొలిదేశమవుతుంది.