1. ఆరోగ్య రంగంలో సంస్కరణలకు ఉపక్రమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రెండు ఉత్తర్వులు జారీ చేసింది.
2. ఆరు వైద్య కళాశాలలను నూతనంగా నెలకొల్పబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన వైద్య కళాశాలకు ఏలూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన కూడా చేశారు.
3. నూతనంగా విజయనగరం, పాడేరు, ఏలూరు, పిడుగురాళ్ళ / గురజాల, మార్కాపురం, పులివెందులలో వైద్య కళాశాలలను నెలకొల్పబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
4. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా చర్యలు చేపట్టాలని, తదనుగుణంగా నూతన కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాలకు తోడ్పాటును అందించాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా విధాన నిర్ణయం తీసుకొన్నట్లు వార్తలొచ్చాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రభుత్వ వైద్య కళాశాలలు లేని జిల్లాలలో నెలకొల్పడానికి పూనుకోవడం మంచిదే.
5. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యా రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షోభంపై తక్షణం దృష్టి సారించాలి.
6. వైద్య విద్యా ప్రమాణాలను పరిరక్షించడంలో, పెంపొందించడంలో యన్.టి.ఆర్.వైద్య విశ్వవిద్యాలయం, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పోషిస్తున్న పాత్ర ఏంటో అంతు చిక్కదు.
7. ఒక్కో తరగతి గదిలో 200 – 250 మంది విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తే ఎంతటి బోధనా నైపుణ్యం ఉన్న అధ్యాకులులైనా విద్యార్థుల మెదళ్ళలోకి విజ్ఞానాన్ని ఏ మేరకు చొప్పించ గలరు ? 200 – 250 మంది విద్యార్థులు కూర్చొన్న సమావేశ మందిరం తరగతి గదా? బహిరంగ సభా?
8. యన్.టి.ఆర్. వైద్య విశ్వవిద్యాలయం కేవలం డిగ్రీ (ఎం.బి.బి.ఎస్.) మరియు పోస్టు గ్రాడ్యుయేట్(పి.జి.) పరీక్షలను నిర్వహించే బాధ్యత వరకే పరిమితమైనదా? వైద్య విద్యా రంగంలో పరిశోధన చేయాలన్న ఉత్సుకతను విద్యార్థుల్లో పెంపొందించక పోగా “రీసర్చ్” పట్ల ఆసక్తి కనబరుస్తున్న విద్యార్థులను నిరుత్సాహ పరిచే వాతావరణం ఉన్నదన్న విమర్శలు ఉన్నాయి. ఔత్సాహికులైన విద్యార్థులను “గైడ్” చేయడానికి విశ్వవిద్యాలయం చేత గుర్తించబడిన “గైడ్స్” కొరత తీవ్రంగా ఉన్నదంటున్నారు.
9. రాష్ట్రంలో ఉన్న వైద్య విద్యా కళాశాలల్లో ప్రమాణాలు దారుణంగా పడిపోయాయన్న తీవ్ర ఆందోళనను వైద్య నిపుణులే వ్యక్తం చేస్తున్నారు. వైద్య విద్యా కళాశాలల్లో నాణ్యమైన మౌలిక సదుపాయాలను, బోధనా వసతులను కల్పించకుండా, తద్వారా విద్యా ప్రమాణాలను పెంపొందించకుండా నాణ్యమైన వైద్యులు ఎలా తయారవుతారు?
10. అధ్యాపకుల కొరత ఒక సమస్య. మరొక వైపు పని చేస్తున్న అధ్యాపకుల్లో పని సంస్కృతి కొరవడిందన్న భావన బలంగా ఉన్నది. నైపుణ్యం ఉన్న బోధనా సిబ్బందిని నియమించడం, అధ్యాపకుల్లో బోధనా ప్రమాణాలను పెంపొందించడం ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగాలి.
11. అధ్యాపకుల ప్రమోషన్ల వ్యవస్థను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ కాలంలో భ్రష్టు పట్టించారు. దాన్ని సరిదిద్దుతామని 2017 అక్టోబరు 16న కారియర్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ (TBPS) కు సంబంధించి G.O.Ms.No.163 ను జారీ చేశారు. దాని అమలు ప్రక్రియ అస్తవ్యస్థంగా కొనసాగుతున్నది. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వరకు అమలు చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్స్ కు వచ్చే సరికి కొన్ని విభాగాల్లో పని చేస్తున్న అధ్యాపకుల విషయంలో ఉత్తర్వులు జారీ చేశారు. అత్యధిక విభాగాల్లో పని చేస్తున్న వారికి సంబంధించి ఆ సమస్య త్రిశంక స్వర్గంలో ఊగీస లాడుతున్నది.
12. అధ్యాపకుల సర్వీసుకు సంబంధించిన వివరాలు, పరిశోధనా పత్రాల ప్రచురణ, తదితర సమాచార సేకరణ, పదోన్నతులకు అర్హులైన అధ్యాపకుల జాబితా తయారీలో అలసత్వం, లోపభూయిష్టంగా వ్యవస్థ నడుస్తున్నదని, ప్రభుత్వ ఉత్తర్వులు అమలుకు నోచు కోవడం లేదని అధ్యాపకులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
13. కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సంఘం నివేదికను ఆమోదించి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న అధ్యాపకులకు 2016 జనవరి 1వ తేదీ నుంచి పెంచిన వేతనాలను చెల్లిస్తున్నది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న అధ్యాపకులకు పెంచిన వేతనాలను చెల్లిస్తున్నారు. కానీ, యు.జి.సి. వేతనాలు పొందుతున్న వైద్య విద్యా కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులకు మాత్రం ఎప్పుడు చెల్లిస్తారో తెలియని అగమ్యగోచరమైన దుస్థితి నెలకొన్నది. ఈ సమస్యపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గానీ, సంబంధిత మంత్రి గానీ పట్టించుకొన్నట్లు కనబడడం లేదు. పర్యవసానంగా వైద్య కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులు “యు.జి.సి. లైక్ స్కేల్స్ – 2006” మేరకే వేతనాలు పొందుతున్నారు.
14. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి “ఇంటర్యూ” కోసం ప్రయత్నిస్తే అనుమతి లభించలేదని ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకుల సంఘం ప్రతినిథులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. కడకు అధ్యాపకులు వ్యక్తిగతంగా విజ్ఞాపన పత్రాలను “స్పందన” ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించే కార్యాచరణకు పూనుకోవాలని సంఘం సమావేశంలో నిర్ణయించుకొన్నట్లు తెలిసింది.
15. అస్తవ్యస్థ, అసమర్థ పాలనకు వైద్య విద్యా శాఖ ప్రతిబింబంగా ఉన్న పూర్వరంగంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యా వ్యవస్థను ముందు ప్రక్షాళన చేయకుండా, ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించ కుండా నాణ్యమైన వైద్యులను తయారు చేసి, నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించగలదా! అన్నదే మౌలికమైన ప్రశ్న.
16. ఆరోగ్య రంగంలో సంస్కరణలకు సంబంధించి నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల అమలును పర్యవేక్షిచడానికి, సహకరించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఛేర్మన్ గా, శ్రీమతి కె.సుజాతారావు కో- ఛేర్మన్ గా ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
17. బోధనాసుపత్రులు, వైద్య కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులు ప్రయివేటు ప్రాక్టీస్ చేయకుండా నిషేధించి, వారికి నాన్ ప్రాక్టీస్ అలవెన్స్(వేతనంలో 30%) మంజూరు చేయాలన్న సిఫార్సు కూడా నిపుణుల కమిటీ నివేదికలో ముఖ్యమైనది. దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన పూర్వరంగంలో ఆ సిఫార్సును అమలు చేస్తారో! లేదో! వేచిచూడాలి.
18. బోధనాసుపత్రులను స్వయం ప్రతిపత్తి సంస్థలుగా మార్చే అంశాన్ని పరిశీలించి, ముసాయిదా బిల్లును తయారు చేయడం కోసం సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ మరొక ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జీ.ఓ.ఆర్.టి.నెం.558 ను జారీ చేసింది.
19. ఆరోగ్య రంగంలో అమలు చేయబోతున్న సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య విద్యా వ్యవస్థను మెరుగుపరచి, విస్తరించి, పటిష్టపరుస్తాయా! అన్నదే ప్రశ్న.
20. ఆరోగ్య రంగంలో సంస్కరణల పేరిట ప్రయివేటీకరణ విధానాల అమలు, బోధనాసుపత్రులను మరియు జిల్లా ఆసుపత్రులకు స్వయం ప్రతిపత్తి కల్పించి చికిత్సలకు ప్రజలు రుసుములు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతున్నదా! అన్న అనుమానం వస్తున్నది.